అనువాదం: వై. కృష్ణ జ్యోతి,
గుజరాత్‌లోని ఇటుక బట్టీలలో కుటుంబాలన్నీ కలిసి పనిచేస్తాయి. అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో పనిచేసే ఈ మహిళలకు తమ సంపాదనపై ఎటువంటి అధికారం ఉండదు. తన తల్లిదండ్రులతో కలిసి ఒక ఇటుక బట్టీలో పనిచేయడం మొదలుపెట్టినప్పుడు రజని కురే వయసు కేవలం 12 ఏళ్ళే.
అలాగే, తన చేతులతో మొదటిసారి మట్టితో ఇటుకను తయారుచేసే నాటికి ఆమె భర్త రాజేశ్ కురే వయసు కూడా 12 ఏళ్ళే. ఈరోజున, ఈ దంపతుల 11 ఏళ్ళ కూతురు రాగిణి, తన తల్లిదండ్రులతో కలిసి ప్రతిరోజూ సుమారు 150 ఇటుకల్ని తయారుచేస్తోంది. “మేం తెల్లవారుజామున ఏ మూడో నాలుగో గంటలకు నిద్రలేచి పని మొదలుపెడతాం. చలిలో నిరంతరాయంగా పని చేయడం వల్ల మా చేతులు మొద్దుబారిపోతాయి,” గుజరాత్‌లోని గాంధీనగర్ జిల్లాలో ఉన్న ఉవార్‌సాద్ గ్రామం దగ్గర తాము చేసే రోజువారీ పని గురించి రజని వివరించారు.
భారతదేశమంతటా ఇటుకల తయారీ దాదాపు పూర్తిగా మానవ శ్రమపైనే ఆధారపడి ఉంది. మట్టిని నిరంతరం అచ్చుల్లో వేయడం, ఇటుకల్ని మోయడం, ఎండటం కోసం వరుసలుగా పేర్చడం లాంటి పనులు రోజంతా చేస్తూనే ఉండాలి. తమ కుటుంబాలు చేసిన అప్పులు తీర్చడంలో సహాయం చేయడానికి తరచూ పిల్లలు కూడా ఈ ఇటుక బట్టీలలో పనులు చేయాల్సి వస్తోంది. అలా ఇది చిన్న వయసులోనే మొదలై, తరతరాలుగా కొనసాగే ఒక వలయంగా మారుతుంది. ఇది అప్పులతో ముడిపడి, ఒక తరం నుండి మరో తరానికి కొనసాగే శ్రమ. ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గీర్-చంపా ప్రాంతానికి చెందిన రజని, 2025 చివరలో తన భర్త, నలుగురు పిల్లలతో (ముగ్గురు కూతుళ్ళు, ఒక కొడుకు) కలిసి గాంధీనగర్‌కు వలస వచ్చారు. “మేం అక్టోబర్-నవంబర్ సమయంలో ఇక్కడికి వచ్చి, ఐదు నుండి ఆరు నెలల వరకు ఉంటాం,” అంటూ, ప్రతి ఏటా నడిచే తమ వలస గురించి 28 ఏళ్ళ రజని తెలిపారు. “ఏప్రిల్ మొదటి వారానికల్లా మేం మా గ్రామానికి తిరిగి వెళ్ళిపోతాం. విపరీతమైన ఎండలున్నప్పుడు, తయారుచేసిన వెంటనే ఇటుకలకి పగుళ్ళు ఏర్పడతాయి. అందుకే, ఎండలు అధికంగా ఉండే నడి వేసవి కాలంలో బట్టీలలో పని చేయడం కుదరదు.”
ఛత్తీస్‌గఢ్‌లో ఈ కుటుంబానికి కొంత భూమి ఉంది. వర్షాకాలంలో వాళ్ళు అందులో వరి పండిస్తారు. కాని, దాని వల్ల వచ్చే దిగుబడి వాళ్ళ అవసరాలకి సరిపోదు. “నా భర్త (రాజేశ్) గ్రామంలో పెయింటర్‌గా పనిచేస్తాడు. కాని వాళ్ళకి నిరంతరం పని దొరకదు,” అన్నారు రజని. “ఇటుక బట్టీలలో పనిచేయడానికి మేం ప్రతి ఏటా కుటుంబాలతో సహా వలస వస్తుంటాం. పని, మెరుగైన వేతనాలు ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళక తప్పదు కదా.” నెలల తరబడి వలస వెళ్ళే కొన్ని కుటుంబాలు, సొంతూరులో తమ పిల్లల బాగోగులను చూసుకునేవాళ్ళు ఎవరూ ఉండరు గనుక పిల్లలను కూడా తమతో తీసుకువెళ్తాయి.
సాధారణంగా, పని సీజన్ మొదలయ్యే కంటే ముందే ఈ కుటుంబాలు కాంట్రాక్టర్ దగ్గర బయానా రూపంలో కొంత డబ్బు తీసుకుంటాయి. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించేంత వరకు వాళ్ళు ఆ ఇటుక బట్టీలోనే పని చేయాల్సి ఉంటుంది. “ఇటుకల తయారీ నడుస్తూనే ఉంటుంది. కాని, నా భర్త కాంట్రాక్టర్ దగ్గర ఎంత బయానా తీసుకున్నాడో మాత్రం నాకు అస్సలు తెలియదు,” PARIతో అన్నారు రజని. ఆవిడ మాటలు, ఈ వ్యవస్థలో అంతర్లీనంగా వేళ్ళూనుకున్న తీవ్రమైన అధికార అసమానతలను స్పష్టం చేస్తున్నాయి.
ఇక సీజన్ ముగిసే సమయానికి, తీసుకున్న బయానా, ఖర్చీ (వారపు భత్యం) లాంటివి మినహాయించిన తరువాత, ఠేకేదార్ (కాంట్రాక్టర్), ఆమె భర్త కలిసి ఎలా హిసాబ్ (తుది చెల్లింపు) తేల్చుకుంటారో కూడా ఆమె వివరించారు. ఈ చెల్లింపు ఎప్పుడూ నిర్దిష్టంగా ఉండదనీ, తయారుచేసిన ఇటుకల సంఖ్య, సీజన్ నిడివి, అలాగే ఇతర మినహాయింపుల మీద ఆధారపడి ఉంటుందనీ రజని చెప్పారు.
వారపు భత్యాలు ఒక పద్ధతేమీ లేకుండా, కేవలం బతకడానికి మాత్రమే సరిపోయేలా చిన్న మొత్తంగా ఉంటాయి. “మాకు ప్రతి శుక్రవారం ఖర్చీ వస్తుంది. అయితే అది జీతం కాదు, రోజువారీ ఖర్చుల కోసం ఇచ్చే బయానా. దాన్ని తరువాత, అంటే మా తుది చెల్లింపులో సర్దుబాటు చేస్తారు,” చెప్పారు రజని. గుజరాత్ ప్రభుత్వ కనీస వేతనాల నిబంధనల ప్రకారం, ఇటుక బట్టీ శ్రామికులకు ఒక్కో ఇటుకకు రూ.0.87 చొప్పున, ప్రతి 1,000 ఇటుకలకు రూ.870 చెల్లించాలి. అయితే వాస్తవానికి, శ్రామికులకు తరచూ ఈ మాత్రం కూడా దక్కడం లేదని అహ్మదాబాద్‌కి చెందిన ఈఁట్ భట్టా మజ్దూర్ యూనియన్ ప్రతినిధులు అన్నారు.
ఈ వ్యవస్థ మొత్తం ఏదీ రాతపూర్వకంగా లేకుండా, నోటిమాటగా నడుస్తుండటంతో శ్రామికులు తాము వాస్తవంగా ఎంత సంపాదించాం, లేదా తాము తీసుకున్న బయానాలో ఇంకా ఎంత చెల్లించాలి అనే విషయాలు చాలా అరుదుగా మాత్రమే తెలుసుకుంటారు. దానివల్ల వాళ్ళు అప్పులు, అనిశ్చితి అనే చక్రబంధంలో చిక్కుకుంటున్నారు. అకాల వర్షాలు, తీవ్రమైన వేడి కారణంగా గత ఏడాది పని సీజన్ ఎక్కువ కాలం సాగలేదు. దాదాపు ఆరు నెలల శ్రమ తర్వాత, కుటుంబానికి వారి సొంత ఊరిలోని బ్యాంకు ఖాతాలోకి సుమారు రూ.50,000 నుండి 60,000 వరకు జమయ్యాయి. గుజరాత్‌లోని అడాలజ్ పట్టణం నుండి గాంధీనగర్‌కి వెళ్ళే మార్గంలో, ఎన్నో ఇటుక బట్టీల సమూహాలు కనిపిస్తాయి. ఒక్క అడాలజ్‌లోనే చిమ్నీ-ఆధారిత పెద్ద బట్టీలు 50 వరకు ఉన్నాయి. ఒక్కో బట్టీలో సుమారు 40, లేదా అంతకంటే ఎక్కువ జోడీల (జతల) శ్రామికులు రోజుకి 12-14 గంటలు పనిచేస్తుంటారు.
“చాలా వరకు కూలీలు ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, ఇంకా ఇతర రాష్ట్రాల నుండి వలస వస్తుంటారు. ఈ పని కుటుంబ శ్రమ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి, ఈ సీజన్‌లో కుటుంబం మొత్తం వలస వస్తుంటుంది,” రాజేశ్ కురే తెలిపారు.
రోజువారీ ఉత్పత్తి కొనసాగించడానికి పెద్ద సంఖ్యలో, నిరంతరం పనిచేసే శ్రామికశక్తి అవసరం కావటంతో ఇటుక బట్టీల నిర్వహణలో ఈ వలస కుటుంబాలు కీలకమైన పాత్రను పోషిస్తాయి. సాధారణంగా, పథాయ్ (ఇటుకలు అచ్చుపోయడం) పని అక్టోబర్ చివరిలో మొదలై, ఏప్రిల్ మధ్య వరకూ కొనసాగుతుంది. ఏప్రిల్ రెండవ వారం తరువాత తీవ్రమైన ఎండవేడిమి కారణంగా పచ్చి ఇటుకలు పగిలిపోతాయి. దాంతో, తదుపరి ఉత్పత్తి కష్టమవుతుంది. ఎండబెట్టిన ఇటుకలను చిమ్నీలలో కాల్చే ప్రక్రియ మాత్రం జూన్ మధ్య వరకు కొనసాగుతుంది. ఆపైన గుజరాత్‌లో వర్షాకాలం మొదలవుతుంది. దాంతో, బట్టీల కార్యకలాపాలు చాలా వరకు ఆగిపోతాయి. రజనీ కుటుంబం పనిచేసే చిమ్నీ-ఆధారిత ఇటుక బట్టీలో 40 నుండి 50 జోడీల శ్రామికులు ప్రతిరోజూ 50,000 నుండి 80,000 పచ్చి ఇటుకల్ని ఉత్పత్తి చేస్తుంటారు. “ఇక్కడ చాలా కుటుంబాలు పనిచేస్తాయి,” అన్నారు రజని. “ఇది ఒక పెద్ద భట్టా (బట్టీ),” గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లోని బట్టీలలో ఎన్నో ఏళ్ళు పనిచేసిన అనుభవమున్న ఈ ఇటుకల తయారీదారు తెలిపారు.
కొన్నేళ్ళ క్రితం ఆమె అత్తగారు అనారోగ్యం పాలైనప్పుడు, ఈ కుటుంబం ఆవిడ చికిత్స కోసం ఒక ఇటుక బట్టీ యజమాని దగ్గర బయానా తీసుకుంది. ఆ అప్పు తీర్చడం కోసం రజని కుటుంబమంతా — మరుదులు, వాళ్ళ భార్యలు, ఇంకా రాజేశ్ మేనమామ కుటుంబం — కలిసి ఉవార్‌సాద్ దగ్గర్లో ఉన్న ఇటుక బట్టీలలో పనిచేయాల్సి వచ్చింది. దురదృష్టవశాత్తు, అదేమంత అరుదైన విషయం కాదు. అనారోగ్యం, వివాహాలు, ఇంటి ఖర్చులు, అలాగే గ్రామాల్లో నెలకొన్న నిరుద్యోగ సమస్య లాంటి అనేక కారణాలు వలస కుటుంబాలను ఈ అప్పుల ఊబిలోకి నెట్టివేస్తున్నాయి. ఇటుక బట్టీల శ్రామికులు ఎక్కువ గంటలు పనిచేస్తారు. 50 జతల శ్రామికులు పనిచేసే ఒక బట్టీలో రోజుకి 50,000 నుండి 80,000 వరకు పచ్చి ఇటుకలు తయారవుతాయి.
గంటల తరబడి కష్టపడినప్పటికీ, రజనికి తన జీతమెప్పుడూ నేరుగా చేతికి అందదు. ఇది అసాధారణమైన విషయమేమీ కాదు. దేశవ్యాప్తంగా చాలా అరుదుగా మాత్రమే వలస మహిళా శ్రామికులకు వేతనాలు దక్కుతాయి. ఇటుక బట్టీల యజమానులు నిర్వహించే రికార్డులలో ఒక్క మహిళ పేరు కూడా ఉండదు. కూలి చెల్లింపులు మగవాళ్ళకే జరుగుతాయి, బయానాలు కూడా మగవాళ్ళే తీసుకుంటారు. మహిళల శ్రమను కనిపించనివ్వరు. వారి కృషిని విస్మరిస్తారు. వారి అత్యంత ప్రాథమిక అవసరాలను కూడా పట్టించుకోరు. “ఇక్కడ స్నానం చేసేందుకు చోటు ఉండదు,” రజని వాపోయారు. “మేం నీళ్ళ ట్యాంకు దగ్గర బట్టలు ఉతుక్కుంటాం. బహిరంగంగానే స్నానం చేస్తాం. ఇక్కడ మరుగుదొడ్లు కూడా ఉండవు, అందుకే పొలాల్లోకి వెళ్ళాల్సి వస్తుంది.” మహిళలకి నెలసరి వచ్చినప్పుడు సమస్యలు ఇంకా పెరుగుతాయి. “నెలసరి వచ్చినప్పుడు కూడా మేం పనిచేస్తూనే ఉంటాం,” రజని చెప్పారు. “మైల బట్టలు ఉత్తుక్కోవడానికి, లేదా విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడ సరైన చోటే ఉండదు.”
మహిళలకు పనిప్రదేశాలలో చాలా అరుదుగా మాత్రమే తగినంత విశ్రాంతి, సంరక్షణ, అనారోగ్యం లేదా ప్రసవ సమయంలో కూడా దొరుకుతాయి. 2023లో, ఒడిశాలోని ఇటుక బట్టీలలో పనిచేసే 400 మంది వలస మహిళా కార్మికులపై చేపట్టిన ఒక అధ్యయనంలో, 44 శాతం మంది మహిళలు వృత్తి సంబంధిత ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారని, మూడింట ఒక వంతు మంది లైంగిక, పునరుత్పత్తి సంబంధిత సమస్యల్ని ఎదుర్కొంటున్నారని తేలింది. చాలా మంది మహిళలు బలహీనత, పోషకాహార లోపం, రక్తహీనతతో బాధపడుతున్నారని కూడా తేలింది. “మాకు వారపు ఖర్చీ కింద సుమారు రూ.2,000 నుండి 2,500 వరకు ఇస్తారు. బియ్యం, పిండి, పప్పులు, వంట చెరకు కొన్న తరువాత మాకు మిగిలేది చాలా తక్కువే,” రజని వివరించారు. “మేం చాలా రోజులు రోటీలను బంగాళాదుంపలు, లేదా దాల్ (పప్పు)తో తింటాం. పైగా, మార్కెట్ ఇక్కడికి చాలా దూరంగా ఉండటం, పరిమితమైన రవాణా సౌకర్యాల కారణంగా మేం ప్రతిరోజూ అక్కడికి వెళ్ళలేం కూడా.” పాలు సులభంగా దొరకవు గనుక, టీ కూడా పాలు లేకుండా (బ్లాక్ టీ) తాగుతారు. అలాగే పిల్లలకు అల్పాహారం, పండ్లు వంటి వాటిని చాలా అరుదుగా మాత్రమే పెడుతుంటారు.
హలీమా హుస్సేన్ (పేరు మార్చబడింది), ఇటుక బట్టీలలో పనిచేయడానికి ప్రతీ ఏటా తన కుటుంబంతో కలిసి ఉత్తరప్రదేశ్ నుండి గుజరాత్‌కి వలస వస్తుంటారు. “మేం సాధారణంగా అక్టోబర్ చివరిలోనో, నవంబర్ మొదట్లోనో ఇక్కడికి వస్తాం,” 28 ఏళ్ళ హలీమా తెలిపారు. “పని అప్పుడే మొదలవుతుంది మరి.” తన భర్తతో కలిసి ఇటుకల్ని ఎక్కించడం, దించడం లాంటి పనులు చేస్తూనే, ఏడాది నిండని పసిబిడ్డతో సహా తమ నలుగురు పిల్లల బాధ్యతల్ని ఆవిడ చూసుకుంటారు. అయితే, 2025 శీతాకాలంలో, ఆ పసిబిడ్డ పదేపదే అనారోగ్యం పాలయ్యాడు. “నేను వాడిని పదేపదే ఆసుపత్రికి తీసుకువెళ్ళాల్సి వచ్చింది,” ఆందోళన చెందిన ఆ తల్లి PA=Iతో అన్నారు. దీని తరువాత, గర్భిణి అయిన ఆమె ఆడపడుచు ప్రసవానికి గాంధీనగర్ వచ్చినప్పుడు, ఆమె బాగోగులు కూడా హలీమానే చూసుకోవాల్సి వచ్చింది. ఒకపక్క ఇటుక బట్టీలో కూలి పని చేస్తూనే, మరోపక్క నిరంతరాయంగా ఈ సంరక్షణ బాధ్యతలు చేపట్టడంతో ఆమె తీవ్రంగా అలసిపోయేవారు. ఈ కనిపించని శ్రమను ‘పని’గా పరిగణించనప్పటికీ, మహిళల రోజులో అధిక భాగాన్ని ఇది ఆక్రమిస్తుంది. టైమ్ యూజ్ సర్వే 2024 ప్రకారం, వేతనం లేని ఇంటి పనుల కోసం మహిళలు రోజుకి దాదాపు ఐదు గంటలు వెచ్చిస్తోంటే, మగవాళ్ళు కేవలం 88 నిమిషాలే వెచ్చిస్తున్నారు. అంతేకాకుండా, మహిళలు ప్రతిరోజూ కుటుంబ సంరక్షణ బాధ్యతలపై రెండు గంటల కంటే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు; ఇది మగవాళ్ళు వెచ్చించే సమయానికి దాదాపు రెండింతలు. సంరక్షణ పనులు ఇప్పటికీ అత్యధికంగా మహిళలకే పరిమితమై ఉన్నాయని ఇది స్పష్టం చేస్తోంది.
“మేరీ బేటీ రాగిణి భీ స్కూల్ జానా చాహ్తీ హై (నా కూతురు రాగిణి కూడా బడికి వెళ్ళాలనుకుంటోంది). కాని, బడి ఇక్కడికి చాలా దూరంలో ఉంది. పైగా, మాకు రాని గుజరాతీలో పాఠాలు చెబుతారు,” రజని వాపోయారు. “మేం ఆమెను ఒంటరిగా పంపలేం. అందులోనూ, ప్రతిరోజూ మా పనిని పక్కనబెట్టి ఆమెను బడికి తీసుకువెళ్ళడమనేది కుదిరే పని కాదు.” మా సంభాషణ నడుస్తుండగా, 11 ఏళ్ళ రాగిణి తనకి రీల్స్ చేయడం, సంగీతం వినడం, నృత్యం చేయడం కూడా ఇష్టమని నవ్వుతూ చెప్పింది. అయితే, ఆమె రోజులో ఎక్కువ భాగం ఇటుకల బట్టీ దగ్గరే ఉంటూ, వయసులో తనకంటే చిన్నవాళ్ళైన తోబుట్టువులను చూసుకోవడంలోనో, ఇటుకలు తయారు చేయడంలోనో తన తల్లిదండ్రులకి సహాయం చేస్తుంటుంది.
“ఈసారి మేం గ్రామానికి తిరిగి వెళ్ళినప్పుడు అతన్ని బడిలో చేర్పించాలనుకుంటున్నాం. రాగిణి కూడా తన చదువు అక్కడే పూర్తి చేసేలా ఆమెకి సహాయపడటానికి ప్రయత్నిస్తాం. మిగిలిన ఇద్దరమ్మాయిలు ఇంకా చిన్నపిల్లలే కాబట్టి, వాళ్ళు నాతో పాటే ఇంట్లో ఉంటారు. మేం చదువుకోలేకపోయాం, కానీ మా పిల్లలు చదువుకోవాలని కోరుకుంటున్నాం. వాళ్ళు కూలీలుగా మిగిలిపోవడం మాకు ఇష్టం లేదు,” దృఢంగా చెప్పారామె. “ఈఁటోన్ కే భట్టీ పర్ జీవన్ ఆసాన్ నహీ హై (ఇటుక బట్టీల దగ్గర బతకడం ఏమంత సులభం కాదు),” 60ల వయసులో ఉన్న హలీమా అత్తగారు అన్నారు. బట్టీ దగ్గర పిల్లల సంరక్షణ, ఇంటి పనుల నిర్వహణలో ఆవిడ హలీమాకు, ఆమె భర్తకు సహాయం చేస్తుంటారు. చలికాలంలో ఉష్ణోగ్రతలు పడిపోయి బయట పడుకోవడం కుదరనప్పుడు, తొమ్మిది మంది సభ్యులున్న తమ కుటుంబం ప్లాస్టిక్ పట్టాలతో కప్పిన ఒక ఝుగ్గీ (తాత్కాలిక గుడిసె)లో ఇరుక్కొని పడుకుంటామని ఆవిడ PARIకి తెలిపారు. “రెండో ఝుగ్గీ నిర్మించుకోవడానికి యజమాని మాకు తగినన్ని ఇటుకలు ఇవ్వలేదు మరి!”
(ఈ వ్యాసం (https://ruralindiaonline.org/article/stuck-between-a-brick-and-a-wall-of-debt-te) ఆగష్టు 11, 2026 లో మొదట ప్రచురితమైనది.)
