రచయిత్రులం మా గోదావరి ప్రయాణం ముగించుకొని, ‘గోదావరి’ ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ చేరుతుండగా సుజాత పట్వారి “పుప్పొడి”ని నా చేతికిచ్చింది. పుప్పొడిలాగే కనిపించిన పుస్తకాన్ని ఉషోదయం చల్లగాలికి ఎక్కడ రాలిపోతుందోనని సుతారంగా పట్టుకొని పేజీలు తిప్పుతూ కవితా శీర్షికలు చదివాను. కొత్తగా, తాజాగా, గమ్మత్తుగా నా హృదయాన్ని మెత్తగా తాకాయి. ఇంటికొచ్చి అరగంటలో తయారై ‘అన్వేషి’కి వెళ్ళి కవితలు చదవడం ప్రారంభించాను. ఒక్కో కవిత ఒక్కో అనుభూతిని కలిగించాయి. ఈ కవితల నిండా సుజాత గుండెలోని ఆర్థ్రత, ఆలోచన, అమాయకత్వం, వ్యంగ్యం, వివేచన పరుచుకొని వున్నాయి. విరగబూసిన గడ్డి చామంతిపూలు నిండిన పచ్చని మైదానంలో పండువెన్నెట్లో తడిచినట్లు అనుభూతి చెందాను.
ఆమె మనసు పరిసరాలకు తీవ్రంగా స్పందిస్తుంది. అందుకే ఆమె ఆలోచనలు, భావాలు మారుతుంటాయి. పిల్లగాలికి గడ్డిపూలు తలాడించినట్టు ఆమె భావాలు అలలు అలలుగా సుతారంగా కదలిపోతూ ఆనందం పంచుతాయి. ఆలోచనల్ని పెంచుతాయి. నిశ్చల నిశ్చితాలు వున్నవారే కళకళ కోసమే అనగలరు. ఇందులో కవిత్వం మాత్రమే వుందనగలరు. జీవితం ప్రతిఫలించే భావాల్లో వైరుధ్యం, సంఘర్షణ వుంటాయి. జీవితాన్ని వున్నదున్నట్లు తీసుకోవడంలో ఈమె కవిత్వంలో సంఘర్షణ, వైరుధ్యం వున్నాయి. పురుషులను గురించి “పాపం మగవాళ్ళు” అని జాలిపడగలదు. “ఒసేవ్ కోడలుపిల్లా వసంతసేనా! వీడికెందుకు వెన్నెల గంధాలు, శొంఠి కాషాయం చాలు” అని చెప్పగలదు. “తూర్పేపు గది” కవితలో “ నిండు అమావాస్య రోజు చంద్రుడు కావాలన్నా, నాకోసం మా నాన్న మబ్బుల్ని తవ్వి వెన్నెల జల పుట్టించేవాడు” అని ఒక తండ్రిగా తననెంత ప్రేమించాడో చెబుతుంది. అదే కవితలో తండ్రిని ‘మానవాకారంలో వున్న పులి’ అనగలదు. ఆయన ఎవరినీ కన్నెత్తి చూడనివ్వని తూర్పేపు గదిలో “రెండు పాతకాలపు భోషాణప్పెట్టెలు|| ఒకదాన్ని తెరిచి చూస్తే|| తపస్సు చేస్తూ తెగిపోయిన ఓ త్రేతాయుగపు తలకాయ|| మరోదాంట్లో|| ద్వాపర యుగం నాటి విలుకాడి బొటనవ్రేలు||” అని చెప్పడంలో ఆయన కుల కట్టుబాట్లను కూడా అంత తీవ్రంగానూ నిరసించింది.
“ప్రవక్త” కవితలో జోస్యం చెప్పే చిలుక, యజమాని గురించి చాలా ఆర్ధ్రతగా వర్ణించింది. “ఓ కల చాలు…!” కవితలో కల కోసం సుజాత పలవరింతతో మనలో చాలామందిమి గొంతు కలుపుతాం.
‘నాక్కాస్తా కల కావాలి!…. కలలన్నీ కాపిటలిస్ట్ పెట్టుబడులై|| సైన్బోర్డుల్లో బంధించుకుపోయాయేమో!|| లేక|| కలల్ని ఎవరైనా దేశం నుండి బహిష్కరించారా?|| ఏమో….|| ఎంతకూ ఓ కలయినా వచ్చి|| కంటి కొమ్మ మీద వాలదు||”
“ఇల్లు మారడం” కవితా శీర్షిక చూడ్డానికి చాలా సింపుల్గా వుంది. కాని తాను పుట్టి పెరిగి, ఆటలు ఆడి, పాటలు పాడి ఎన్నెన్నో మమకారాల్ని చూపించిన ఇంటిని వదిలి వెళ్ళినపుడు పడే ఆవేదనను హృద్యంగా కవిత్వీకరించింది. “నా ఫ్యూడల్ సంస్కృతికి తగిన|| సౌందర్య రూపాన్నివ్వలేదని ఈసడించుకున్నా|| అదంతా నీమీద కోపం కాదు సుమీ!|| నేనూఅప్పుడప్పుడు|| మనిషినని చాటుకోవడమే!|| నిన్నాసరాగా చేసుకొని|| తప్పటడుగులు వేసే రోజుల్లో|| నీలో కొంతని జీర్ణించుకున్నందుకేమో|| వదిలి వెళ్ళాలంటే|| ఇక్కడో పేగు మమకారమై|| గుండెకడ్డం పడుతోంది”
“చెట్టు (ఇస్మాయిల్)” “ప్రవహించే వాక్యం” రాసిన కవితల్లో ఇస్మాయిల్గారిని చెట్టుగానూ, ఎ.కె. రామానుజన్గారిని ఒక జానపద గాథగా వర్ణించిన తీరు చాలా కొత్తగా వుంది.
50 కవితలతో పొందుపర్చిన కవితా సంపుటి “పుప్పొడి” లో “చల్నేదో”, “మామూలుగా”, “వాడు”, “చిలక”, “వాక్యం” – ఇలా చాలా కవితా శీర్షికలు చాలా మామూలుగా వుంటాయి. కాని ఆమె వ్యక్తిత్వం, ఆలోచనల తీవ్రతను బలంగా వ్యక్తీకరిస్తాయి. ఆమె చాలా కవితల్లో అమాయకత్వం తొంగి చూస్తుంది. పైకి కనిపించేది అమాయకత్వమే కానీ, రాజకీయాల్ని సున్నితంగా వెల్లడించుకుంది. సుజాతలో వున్న నిరాడంబరత ఇదే. అదే సమయంలో జీవితంలోని వైరుధ్యాన్ని చెప్పడం ద్వారా కవిత్వంలో గాఢతను సాధించింది. సుజాతను వ్యక్తిగతంగా చాలా సభల్లో కలిశాను. మాట్లాడుకున్నది చాలా తక్కువ. అయితే రకరకాల సభల్లో కలవడం వల్ల ఆమెలో ఒక ప్రజాస్వామిక వాదిని చూశాను. ఈ కవితల్లో ఆమెలోని ప్రజాస్వామిక ప్రేమి చాలా శక్తిమంతంగా, సౌందర్యంతో బయటకు వచ్చింది. చాలా కవితల్లో సుజాత అనేక స్థాయిల్లో ఆధిపత్య వ్యతిరేకతకు దోహదం చేసే న్యాయబద్ధమైన ఆలోచనల్ని ప్రకటించింది. అయితే ఏ ఒక ధోరణికి మాత్రమే కట్టుబడలేదు. అయితే తెలుగు సాహిత్యంలో నేడు ప్రతిఫలిస్తున్న అన్ని రకాల భావజాలాలను సుజాత అవలోకిస్తున్నది. అవి తనలో కలిగిస్తున్న స్పందనలతో తన చుట్టూ పరిసరాలను, సంఘటనలను, సమస్యలను కవిత్వీకరించింది. ఈమె ఇంగ్లీషు లెక్చరర్గా పనిచేస్తున్నా ఈమె కవిత్వంలో తెలుగు భాషా వ్యక్తీకరణ పచ్చని చేల మీద వీచే పైరుగాలిలాగా ఆహ్లాదకరంగా వుంది.
– పుప్పొడి, రచన సుజాత పట్వారీ
వెల. రూ. 40