ఆ మధ్య పూనాలో జరిగిన అంతర్జాతీయ రచయితల సదస్సులో తెలుగునుంచి రచయిత్రుల్లేరు. వేదికమీద చేతులు కలుపుకుని జేకొట్టిన తెలంగాణా ఉద్యమ రథసారధుల్లో ఆడవాళ్ళు లేరు. బెంగుళూరులో జరిగిన జాతీయ సమ్మేళనంలో తెలుగు కవయిత్రుల్లేరు. ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ విలేఖరుల గోష్టిలో తెలుగునుంచి కె. సత్యవతి తప్ప మరే మహిళా జర్నలిస్టుల్లేరు.
-ఇది చాలా చిన్న చిట్టా. తల్చుకుంటే ఇంతకంటే పెద్ద చాంతాడు ఇప్పటికిప్పుడు మీకూ గుర్తొస్తుంది.
ఒక మనిషి లేక సంస్థ ఒకసారి, పదిసార్లు వందసార్లు చేసిన తప్పును కూడా పొరబాటు అని సమర్థించుకోవచ్చు. కానీ పదిమందీ పదిసంస్థల ద్వారా పది వందల సార్లు చేసిన తప్పు ఒక సంస్కృతి అవుతుంది. కుట్రపూరిత రాజకీయం అవుతుంది. అంధత్వమూ, బధిరత్వమూ ఒక నాగరికత అయిపోతే దాన్ని గురించి మాట్లాడినపుడు భరించడానికి ప్రధాన స్రవంతి దూరం జరిగితే మరి వేదిక ఎక్కడ కట్టుకోవాలి?
ప్రపంచాన్ని మొదటినుంచీ ప్రత్యామ్నాయ పత్రికలూ, వేదికలూ, సాహిత్యమూ, మనుషులూ, దారులూ నడిపిస్తుంటే ప్రజాస్వామ్య బద్ధంగా రాజబాటమీద జరుగుతున్న దొంగాటని ఎవరు దెబ్బ కొట్టాలి?
తెలుగు సాహిత్యంలో వున్నన్ని సాహిత్యేతర శక్తులు ఇతర భాషల్లో లేవు. సాహిత్య వేదికలు నిర్వహించే వారి భూమిక ఏమిటి? జరగబోయే కార్యక్రమాలకు ఆహ్వానించడానికి ఎవర్ని సంప్రదిస్తారు? ఆయా పేర్లను సూచిస్తున్న వారి అర్హతలేమిటి? ఏ నిబద్ధతతో అతడు లేక ఆమె నిర్ణయాలు చేస్తారు? స్థానిక పత్రికల్లో కూడా కనిపించని రచయితలు/ కవులు అంతర్జాతీయ బహుమతులు ఎలా అందుకుంటున్నారు? ఏ ప్రయోజనాలు ఎవర్ని శాశిస్తున్నాయి? ఏ బలహీనతలు ఎందర్ని మౌనంగా వుంచుతున్నాయి? పరిశోధన చెయ్యదల్చుకుంటే ఇంతకంటే రసవత్తరమైన ఘట్టం ఇంకోటి లేదు.
ఈ నేపథ్యంలో అందరితో బాటు కొంత అందరి కంటే ఎక్కువగా మరికొంత పక్కకి నెట్టబడుతున్నది స్త్రీలే. రచయిత్రులుగా, పాత్రికేయులుగా, కళాకారులుగా మనం కలుసుకున్న ప్రతిసారీ ఎన్నో సమస్యల మీద మాట్లాడుకుంటున్నాం. ఎన్నో ప్రతిపాదనలు చేసుకుంటున్నాం. కొత్త ఆలోచనలు కలబోసుకుంటున్నాం. మళ్ళీ కొన్ని నెల్లపాటు కమ్యూనికేషన్ గ్యాప్. కలిసిన చేతులు విడిపోతాయి. ఎవరి ప్రపంచంలో వారు కూరుకుపోతున్నాం. మన శక్తిసామర్థ్యాలు, ప్రతిభ అన్నింటిలోనూ ఒంటరివాళ్ళమైపోతున్నాం. వాటికి సామూహిక స్పందన లేకుండా పోతోంది.
ఓ పక్క ప్రపంచీకరణ మనల్ని ఎడాపెడా వాయిస్తోంది. సమాచారాన్ని సూపర్ బజార్ చేసి చూపెడుతోంది. తెలుగునుంచి ఇతర భాషల్లోకి తక్షణమే తర్జుమా కావాల్సిన యుద్ధ ప్రాతిపదికమీద, అంతర్జాతీయ అవసరం మీద మన రచనలు వున్నాయి. జరగాల్సిన ప్రయత్నం జరక్కపోగా ఏ మాత్రమూ ప్రాతినిధ్యానికి అర్హతలేని నాసిరకం రచనలు తెలుగు వారసత్వం పేరిట ఇతర భాషల్లోకి వెళుతున్నాయి. ఇవి ఇటు తెలుగువారినీ అటు ప్రపంచ సాహిత్య అంచనాల్నీ మోసం చేస్తున్నాయి.
ఇవాళ మనం నిలబడ్డ ఈ భూమిక ఇన్ని సమస్యల్లో ఇరుక్కుపోయింది. నిజమే. తల్చుకుంటే అనాసక్తిగానే వుంటుంది. ఏ ప్రోత్సాహమూ లేని వాతావరణంలో రాయడం, అచ్చెయ్యడం, చేసిన పాపం మాదిరి నెత్తిని పెట్టుకుని అమ్ముకోలేకపోవడం- ఇదంతా దుఃఖంగానే వుంటుంది. ఈ నేపథ్యంలో రచన ఒక బాధ్యతగా కాక బాధగానూ, స్పందన ఒక సృజనగా కాక సలపరంగానో కూడా వుండొచ్చు.
అయినప్పటికీ మనం కలవాలి. మాట్లాడుకోవాలి. మన కోసం మనమే అయినా రాసుకోవాలి. ఏ అణచివేత వర్గాన్ని చూసినా మంచి రచన ఇలాగే పుడుతుంది. కొత్త సంకలనం వెయ్యడానికి మీ సూచనలు చెప్పండి. గతంలో చేసుకున్న నిర్ణయాలు గుర్తు చేసుకుందాం. అనువాదాల్ని వేసే ప్రయత్నం చేద్దాం. అన్నిటినీ మించి మనం ఒంటరివాళ్ళం కాదు అనే విషయాన్ని పదే పదే తల్చుకుందాం.