మహిళా జర్నలిస్టుల్ని విస్మరించిన అంతర్జాతీయ సదస్సు

నవంబర్ 16-17 తేదీలలో, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో “ప్రపంచీకరణ నేపథ్యంలో జర్నలిజమ్ ఎథిక్స్ అండ్ సొసైటి ఇన్ ద ఏజ్ ఆఫ్ గ్లోబలైజేషన్” అనే అంశం మీద అంతర్జాతీయ సింపోజియమ్ జరిగింది. నవంబరు 16న ప్రతి సంవత్సరం ‘నేషనల్ ప్రెస్ డే’ గా జరుపుకుంటున్నాం. ఇదే రోజున 1966లో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆవిర్భవించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సింపోజియమ్ను ఏర్పాటు చేయడం జరిగింది.

15 వ తేదీన “ఎ ట్రిబ్యూట్ టు ఫోటో జర్నలిజమ్” పేరుతో ఫోటో ఎగ్జిబిషన్ జరిగింది. ఈ ఎగ్జిబిషన్ను ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ ప్రారంభించారు. ఆ తర్వాత జరిగిన సమావేశంలో లోక్సభ స్పీకర్ శ్రీ సోమనాథ్ ఛటర్జీ, ప్రభాత ఫోటోగ్రాఫర్ రఘురాయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఎగ్జిబిషన్లో బ్రెజిల్కి చెందిన సెబాష్టియో సాల్గాడో, బంగ్లాదేశ్కి చెందిన షాహిదుల్ అలామ్, శ్రీలంకకు చెందిన డోమిన్క్ సాన్సోని, సింగపూర్కి చెందిన వాంగ్ హుయ్ ఫెన్లు, ఇండియాకి చెందిన రఘురాయ్, జోగీందర్ చావ్లా, నారాయణన్ త్యాగరాజన్ ఎస్.ఎన్. సిన్హా ల ఫోటోలు ప్రదర్శనలో వుంచారు. ఈ ఫోటో ఎగ్జిబిషన్ చూడగలగడం ఓ అద్భుతమైన అనుభవం. ప్రధానమంత్రి పాల్గొన్న సమావేశం కావడం వల్ల కెమెరాలను అనుమతించకపోవడం వల్ల ఫోటోలు తీసుకోలేకపోయాం. ప్రెస్ కౌన్సిల్ వాళ్ళు ఈ ఎగ్జిబిషన్ మీద చిన్న బుక్లెట్ మాత్రం పంచిపెట్టారు.

16న 10.30 కి విజ్ఞాన్ భవన్లో సింపోజియంను ప్రెసిడెంట్ శ్రీ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ఉపన్యాసం ప్రతినిధుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఆయన మాట్లాడుతూ, “నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సమావేశాల్లో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా వుంది. జర్నలిస్ట్లుగా మీరు సమాజంలో ఒక ప్రధాన పాత్రలో వున్నారు. ఈ సందర్భంగా నేను సందర్శించిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 6,00,000 లక్షల గ్రామాల్లోను, 2,00000 పంచాయితీల్లోను నివసిస్తున్న 700 మిలియన్ల ప్రజలు నా కళ్ళకు రూపుకడుతున్నారు. ఆ పరిస్థితిని నేను ‘A scene of sweat’ అని పిలుస్తాను. పొలాల్లో రైతులు, సముద్రంలో జాలరులు, కర్మాగారాల్లో కార్మికులు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు, లాబరేటరీల్లో నాలెడ్జి వర్కర్లు, ఫార్మా కంపెనీల్లో శ్రామికులు- వీళ్ళని, నిజంగా వీళ్ళనే మీడియా కమ్యూనిటి గుర్తుంచుకోవాలి.

ఇటీవలే నేను ఖరీస్వామినాథం రిసెర్చి ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ‘National fellows’ కలిసే సమావేశంలో 143 మంది fellows ని కలిసాను. వీళ్ళేమీ అకాడమిక్ వ్యక్తులు కారు. వీరంతా గ్రామీణ ప్రాంతాలనించి వచ్చిన రైతులు, జాలర్లు, చేతి వృత్తుల కళాకారులు, వీళ్ళంతా గ్రామ ప్రాంతాల అభివృద్ధికి కంకణం కట్టుకున్న వారు. వీరిలో నాకు బాగా నచ్చినవాళ్ళు, గుజరాత్లోని ఒక మారుమూల గ్రామానికి చెందిన పుష్పాబెన్, మహారాష్ట్ర నుంచి విద్యా రావత్, రాజస్థాన్కి చెందిన నరసింగ్, తమిళనాడు నుంచి దీనదయాళన్. ఈ సమావేశంలో పాల్గొన్న జర్నలిస్ట్లందరికి ఒక సిఫారసు చేయదలిచాను. “మీరంతా ఇలాంటి గ్రామీణ సామాజిక సంస్కర్తలతో కలవండి. వారిలోని నైపుణ్యాలను ప్రపంచానికి చాటండి.” అంటూ పిలుపునిచ్చారు.

మిషన్ ఫర్ మీడియా అంటూ ఎనిమిది అంశాలను జర్నలిస్ట్ల ముందుంచారు.
1) మీడియా ఉద్యమం- 2020 నాటికి అభివృద్ధి చెందిన ఇండియా.
2) PVRAC – Providing urban amenities in rural areas కార్యక్రమంలో మీడియా భాగస్వామ్యం వహించాలి.
3) గ్రామీణ ప్రాంతాల ప్రజల విజయాలను సెలబ్రేట్ చెయ్యడం,
4) 2015 నాటికి అవినీతి రహిత భారత్ ఆవిర్భావం,
5) విద్య, విలువల వ్యవస్థను ప్రమోట్ చెయ్యడం
6) భారత స్త్రీత్వానికి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా గౌరవాన్ని, హుందాతనాన్ని పెంపొందించడం.
7) మీడియా తనకు తాను ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ ను తయారు చేసుకుని, ప్రతి రిపోర్ట్ని ప్రచురణకు ముందు పరిశీలించి, విశ్లేషించి చూసుకోవాలని రాష్ట్రపతి కోరారు. ఈ ప్రారంభ సమావేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, సమాచార శాఖ మంత్రి పాల్గొన్నారు.

మధ్యాహ్నం మొదటి సెషన్ జరిగింది. “మీడియా మరియు ఎథిక్స్’ అనే అంశం మీద పత్ర సమర్పణలు, చర్చ జరిగాయి. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అనితా ప్రతాప్ Journalism,Media Ethics and Society in the age of Globalization అంశం మీద పత్ర సమర్పణ చేసారు.

మర్నాడు “స్వీయ నియంత్రణ” మీద పత్ర సమర్పణ చర్చ జరిగాయి. మధ్యాహ్నం వరకు రెండో సెషన్ కొనసాగింది. భోజన విరామం తర్వాత రికమండేషన్స్, తీర్మానాల మీద చర్చ జరిగింది. ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ వ్యాస రచయిత్రి మీడియాలో జండర్ సెన్సిటివిటీ పెరగాలని, జర్నలిస్ట్లకు జండర్ సెన్సటైజేషన్ కార్యక్రమాన్ని శిక్షణలో భాగం చెయ్యాలని, పత్రికల్లో వాడే భాష గురించి విచక్షణతో ప్రవర్తించాలని, ఈ అంశాలు తీర్మానాల్లో చేర్చాలని కోరారు. ప్రతినిధులు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించాక సభాకార్యక్రమం ముగిసింది.

ఈ అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడానికి భూమిక లాంటి స్త్రీవాద, ప్రత్యామ్నాయ పత్రికకు ఆహ్వానం అందడం నాకు గర్వంగానే ఉన్నా, నేను తప్ప డెలిగేట్గా మరే యితర మహిళా జర్నలిస్ట్ ఇంత ప్రతిష్టాత్మకమైన సదస్సులో పాల్గొనకపోవడం చాలా వెలితిగా అన్పించింది. విదేశీ డెలిగేట్లుగా మహిళలు పాల్గొన్నారు కానీ, దేశంలోని ఒక్క మహిళా జర్నలిస్ట్ ఆహ్వానం పొందకపోవడం వెనక “వివక్ష” స్పష్టంగా కన్పడింది. నేను ఆంధ్రప్రదేశ్ నుండే కాక యావత్ దేశాన్ని రిప్రజెంట్ చేసినట్లయ్యింది. పత్ర సమర్పణ చేసిన అనితా ప్రతాప్, శకుంతలా రావ్ల్ని మినహాయిస్తే మహిళా జర్నలిస్ట్లెవ్వరూ సదస్సులో పాల్గొనలేదు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి ప్రతినిధిగా హాజరయ్యారు, ఒక సెషన్లో మాట్లాడారు కూడా.

ప్రపంచీకరణ నేపథ్యంలో జర్నలిజమ్, మీడియా,ఎథిక్స్ సెల్ఫ్ రెగ్యులేటరీ సిస్టమ్స్ వంటి ముఖ్యమైన అంశాల మీద జరిగిన ఈ అంతర్జాతీయ సదస్సులో ఎక్కువమంది మహిళా జర్నలిస్ట్లు పాల్గొనివుంటే బావుండేది. నాకు ఆహ్వానం పంపిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ జస్టిస్ జి.ఎన్.రే, సెక్రటరీ విభా భార్గవ గార్లకి కృతజ్ఞతలు తెలియచేస్తూనే మరింత మంది మహిళల్ని ఆహ్వానించి వుండాల్సిందనే విమర్శను వారిమీద పెడుతున్నాను.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.