– కె. శోభాదేవి
ఆ ఉదయం సువిశాలమైన హాలులో ఇరవై, ఇరవై మూడుమంది విద్యార్థినులు గుండ్రంగా నిలుచుని బంతిని విసురుకుంటూ ఆడుతున్నదేమిటో చూచేవారికి అంతుపట్టదు. అసలు చూచేవారంటూ అక్కడ లేరు. అందరూ చేసేవారే. వారేం చేస్తున్నారు? ఎందుకక్కడ చేరారు? ఈ ప్రశ్నలకు సమాధానమే, అమ్మాయిల శక్తులను మేల్కొలపడానికి, వారేమిటో వారికి వారే తెలుసుకొనేట్టు చేయడానికి ‘క్లేర్’ వారి మధ్య ఉండడం. సెప్టెంబర్ 22, 23 తేదీలు ఆ విద్యార్థినులతో వుండి, ఆ కొద్ది వ్యవధిలో వారిలో ఆలోచనని ప్రజ్వలింపజేసిన ‘క్లేర్’ వారిమధ్య ఉండడం అత్యంత ఉద్విగ్నభరిత సన్నివేశం. ఈ సంఘటనని సుసాధ్యం చేసింది డి.కె. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బి. నవీనాదేవి. మహిళా విభాగం సభ్యులు శోభాదేవి, సుబ్బలక్ష్మి, మేరీ జయభారతి, మెర్సీ ఇవాంజిలిన్లు, నాటక నైపుణ్యాల ద్వారా స్త్రీలలో చైతన్య స్పృహ, సాధికారికత తీసుకురావడం కోసం ఏర్పాటైన శిక్షణ అది.
క్లేర్ ఒక నాటక కళాకారిణి (theater artist) తనకిష్టమయిన సోషియాలజీలో ఆమె డిగ్రీలు పొందారు. పదిహేను సంవత్సరాలపాటు తమిళనాడు గ్రామాల్లో పేదలకోసం పనిచేసి అణగారిన వారి ఉద్యమాల్లో పాల్గొని వారితో కమ్యూనికేషన్ బాగా వుండాలనే ఉద్దేశంతో, చెప్పదలచుకొన్న భావం స్పష్టంగా, గాఢంగా వాళ్ళ మనసులకందాలనే ఆశతో అందుకు బలమైన సాధనంగా నాటక ప్రక్రియవైపు ఆకర్షితు లయ్యారు. కలకత్తాలో వీధి నాటకానికి పితామహునిగా చెప్పబడే బాదల్ సర్కార్ని కలిసి అతని దగ్గర వీధినాటకంలో శిక్షణ పొందారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, అమెరికా లలో శిక్షణ పొందడమేకాక, ఇతర దేశాల్లో శిక్షణ ఇవ్వడానికి వెళుతుంటారు. భారత దేశంలో ఇప్పటికి మూడువందల వరకూ శిక్షణా తరగతులు, వర్క్షాపులు నిర్వహించారు. దళిత స్పృహ, అణచివేయబడుతున్న అశేష ప్రజానీకం పట్ల బాధ్యత, పనిలో నిజాయితీ పునాదిగా ఆమె ప్రయాణిస్తున్నారు. చిన్న పిల్లల నుండి, వృద్ధులవరకు అన్ని వర్గాలవారు ఈమెనించి శిక్షణని పొందుతున్నారు. ఒకచోటు నుండి మరోచోటుకి, అలుపెరుగని, ఎడతెరిపిలేని ప్రయాణం ఆమెది.
ఆమెతో కలిసి శిక్షణలో పాలు పంచుకోవడం ఒక మరపురాని అనుభవం. హాస్యం పుట్టించే ఆమె శరీరవిన్యాసాలు అందరిలోనుంచి వాళ్ళ శరీర స్పృహను దూరం చేసి స్వేచ్ఛగా ఆడిపాడేట్లు చేస్తాయి. ప్రతి నాటక నైపుణ్యం (theater skill) ఓ యదార్థ విలువవైపు ప్రయాణిస్తుంది. ఆ విలువ పాఠం చెప్పకుండానే, ఉపన్యాసం ఇవ్వకుండానే ఓ అందమైన విన్యాసంలో వొదిగి శిక్షకుల గుండెల్లో తిష్ఠవేస్తుంది.
భయం, బిడియం- స్త్రీని ఏం చేస్తున్నాయి? ఎక్కడ వుంచుతున్నాయి? ఎంత అశక్తురాలిని చేస్తున్నాయి? ఆమె ఆమెకి తెలియకుండానే శరీరాన్ని, శరీరాన్నించి మనసుని దాచేస్తుంది. శరీర భాష (body language) మనని పట్టి ఇవ్వదా? నీ నడక, నీ నవ్వు, నువ్వు కూచునే తీరు, నిలబడే తీరు, మాట్లాడే విధానం, చూసే చూపు అన్నీ నిన్ను తెలియజేస్తాయి. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థినులు తమలోకి తాము చూసుకున్నారు. తామేంటో తెలుసుకొనే ప్రయత్నం చేసారు.
ఒకే విధంగా ఆలోచించడానికి అలవాటుపడిన మెదడును అందుకు భిన్నంగా మారిస్తే ఏమవుతుంది. మరో నటవిన్యాసంలో, మనం అనునిత్యం చేసేపనులు కేవలం అలా అలవాటవడం చేతనే అని, మన మెదడు కూడా ఒకే విధంగా ఆలోచించడానికి అలవాటు పడిందని ఆ అలవాటుని వొదిలించుకుంటే మరోవిధంగా ఆలోచించవచ్చని తెలిసిపోయిన అమ్మాయిలు పునరాలోచనలో మునిగారు. ఆలోచనల్లో హేతుబద్ధతని వివరించారు క్లేర్.
చిన్న పిల్లలు ఎట్లా నిర్భయంగా, నిస్సంకోచంగా వారి భావాలను వ్యక్తం చేస్తారో అలా కాసేపు ఒక ‘రైమ్’ ని నటిస్తూ బాలలమైపోవడం ఆహ్లాదంగానే వుంటుంది. నక్క, కుందేలు ఆట సరదానే. బాల్యానికి దూరమై యవ్వనంలో అడుగుపెట్టిన యువతులకి మరింత సరదానే. కుందేలును వెంటాడే నక్కలు మూర్త అమూర్త రూపాల్లో ఎన్నో! వెనక్కి నెట్టే పెద్దవాళ్ళు, అమాంతం మింగివేసే టి.వి. ఛానెళ్ళా, చదువుకునే వయసులో దరి చేరకూడని సోమరితనం! వీటన్నింటినీ రూపకల్పన(personify) చేసి నక్కరూపంలో ఆవిష్కరించడం ఓ నవ్యత. ఇక సత్య సాక్షాత్కారమే కదా! నక్కని తప్పించుకొంటూ పరిగెత్తడం ఉత్తేజభరితం. నిజజీవితంలో నక్కలని తప్పించుకోవడం అంత సులభమా?
నమ్మకపు ఆట (trust game) ఒక ఛాలెంజే. ఈ సంక్లిష్ట సమాజంలో ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మకూడదు. అడుగడుగునా ఎదురయే పరిస్థితుల నెట్లా ఎదుర్కోవాలి? స్త్రీల పరిస్థితి ఏంటి. ఇట్లా అమ్మాయిలు ఎంతో నేర్చుకున్నారు. నమ్మకంగా… కళ్ళకు గంతలతో నిర్భయంగా పరిగెత్తమంటే… ఛాలెంజే కదా!
స్ట్రాలతో గట్టివైన, అందమైన, కళాత్మక మైన ఇళ్ళు నిర్మించడంలో అమ్మాయిలు ప్రతి గ్రూపులోనూ ఒకరికొకరు సహకరించు కొన్నారు. ప్రతి గ్రూపులోనూ ప్లాన్ చెప్పేవారుగా, సలహాలిచ్చేవారుగా, ఇల్లుకట్టేవారుగా, సహాయకులుగా రకరకాల పాత్రలు పోషించారు. ఇల్లు తయారవడంలో ప్రధానపాత్ర పోషించినవారు నాయకులు. నాయకులు నియమితులు కారు, వారినెవరూ ఎన్నుకోలేదు. నాయకులని ఎన్నుకోవడం కాదు, వంశపారంపర్యం అంతకన్నా కాదు. వారు రూపొందు(evolve) తారు అన్న సత్యం అనుభవంలో పిల్లలకు స్పష్టమైంది.
‘అమ్మమ్మ ముల్లె’ లో ముల్లెని అందుకోవాలని ప్రతివొక్కరి ప్రయత్నం! ప్రయత్నించడం, ఓడిపోవడం, తిరిగి ప్రయత్నించడం – ప్రతిఒక్కరి వ్యక్తిత్వానికి సంబంధించిన ఈ ఆటలో వ్యక్తిత్వ విశ్లేషణ వుంది. ‘ముల్లె’ జీవిత లక్ష్యం. లక్ష్యాన్ని చేరుకోవడంలో పదే పదే రిస్కు తీసుకుంటారు కొందరు. అసలు రిస్కే తీసుకోరు కొందరు. మానవ మనస్తత్వాల గురించిన చర్చ అత్యంత ఆసక్తికరంగా సాగింది.
“గొన్నా… గొన్నా…” అనే ఆస్ట్రేలియా దేశపు పాటని నటించేటప్పుడు పొట్ట చెక్కలవడమే జ్ఞానవంతం, క్రమశిక్షణ ఈ కార్యక్రమానికి గీటురాయి. గుండ్రంగా కూచోవడంలో కూడా ఎవరూ ఎవరినీ సర్దరు, సలహాలివ్వరు.ఎవరిని వారు గమనించుకోవడమే. తాము సరిగా ఉన్నామా అని, సమాజంలోనూ అంటే ఒక బాధ్యత తమని తాము సరిచేసుకోవడం, ఆ ఎలర్ట్నెస్ ఆరోగ్యకర సమాజానికెంతో అవసరం! ఏ కార్యక్రమంలోనూ పోటీలు లేవు. పరీక్షలు లేవు, గెలుపు ఓటములు లేవు. హెచ్చుతగ్గులు లేవు. ప్రతివొక్కరూ ముఖ్యులే. అందరికీ వారి వారి అవకాశం వస్తుంది. అందరూ విజయులే. ఈ సెన్సిటివిటీని అక్కడి వాతావరణం కల్పించగలిగింది.
ఈ భయాలు మనని వీడవా? ఎవరేమ నుకొంటారోనన్న భయం పెద్దలనుంచి, తోటి విద్యార్థులనుంచి, చుట్టూ సమాజం నుంచి, ఇన్ని భయాలు పెట్టుకున్న స్త్రీకి విముక్తి ఎక్కడిది? తన జీవితం తనది. దాన్ని ఏం చేసుకోవడానికైనా తనకే హక్కు వుంది. ఇతరులు దానిమీద పెత్తనం చెలాయించడం తాను సహించదు. సర్వ నిర్ణయాధికారాలు తనవే… అన్న ఆత్మవిశ్వాసం పురివిప్పుతుంటే, సంకోచాలన్నీ ఒక్కోటీ విడిపోతుంటే… జ్ఞానదర్శనమైన అనుభూతి ప్రతి అమ్మాయిలోనూ… భయానికి కారణాలు తెలియడం కూడా సగం విజయమేగా!
సెలవులిచ్చినా వెళ్ళక శిక్షణా కార్యక్రమానికి వుండిపోయిన అమ్మాయిలని రెండు రోజుల్లో శిక్షణ పూర్తవడం నిరాశపరచింది. వాళ్ళ స్పందనని అందరి ముందూ వ్యక్తం చేశారు. ఈ రెండు రోజులూ తమకు మరపురాని అనుభూతిని మిగిల్చిందన్నారు. ఓ థియేటర్ ఆర్టిస్ట్, ఓ సైకో ఎనాలిస్ట్, ఓ ఫ్లవర్ థెరపిస్ట్ (flower therapist) అయిన ‘క్లేర్’ సాధించిన విజయమిది.
నటవిన్యాసాల్లో నవ్వుల్ని పండిస్తూ మరుక్షణమే చర్చాగోష్ఠుల్లో అతి సీరియస్గా మారిపోయే ‘క్లేర్’ అందరి హృదయాల్లో చెరగని ముద్రవేసారు.
“పురులు విప్పిన కొత్త చేతన
రూపు కట్టిన నవ్య భావన నేటి వనితా…
విప్పుచున్నది కొత్త చరితా… నేటి వనితా… భవ్యచరితా…” (స్తీ మేళా)
అన్న బృందగానంతో శిక్షణ పూర్తయింది. బరువెక్కిన గుండెలతో ఇంటిదారి పట్టాము అందరం.
దేశంలో మరో మూల మరో గ్రూపుని ఉత్తేజితం చేయడానికి ‘ పెట్టే బేడా’ సర్దుకుని ప్రయాణమయ్యారు ‘క్లేర్’…