– డా|| ఎన్.గోపి
యాధృచ్చికమే కావొచ్చు
ఆశ్చర్యం కూడా
ఆనందమని వేరే చెప్పాలా!
యాభై ఏడేళ్ళక్రితం
ఈ ఆవరణలోనే
జన్మించిన ఓ పసిపాప
ఇవాళ హఠాత్తుగా అడుగుపెట్టింది
ఇప్పుడామె నాయనమ్మ
ఒకప్పటి సున్నా
పక్కన అంకెలతో
పెద్ద సంఖ్యగా మారిన సన్నివేశం.
గోడలు ఒక్కసారి ఉలిక్కిపడ్డాయి
గేటు కిర్రుమని గొణుక్కుంది.
పొన్నూరులోని
అమెరికన్ ఆసుపత్రి
వృద్ధాప్య కళల్తో అలరారుతుంది.
ఆసుపత్రిలో చేర్చకముందే
చెట్టుకింద పుట్టింది ఈమె.
ఎప్పుడూ తొందరే!
బహుశా తొందరగా పెరిగి
నా సహచరి కావాలనేమో!
హాస్పటల్ బోర్డుపైన అక్షరాలు
గుడ్లు మిటకరించి చూస్తున్నాయి.
ఆనాటి శిశువును పోల్చుకున్నాయా!
అవీ వెలిసిపోయి
సూక్ష్మశరీరం
స్థూలంగా మారుతున్న స్ఫురణ!
పొన్నూరంటే
బంగారు గడ్డ కదా!
బంగారమే పుట్టిందక్కడ
మూడు వందల మైళ్ళ దూరంలో
ఒకేసారి రెండు ఊపిరులు
పురుడు పోసుకుంటున్నప్పుడు
ఆ రెంటినీ
ఒకే ప్రాణవాయువుగా మార్చింది మాత్రం
కవిత్వమే!