– ఎన్.అరుణ
విమానమెక్కి ఆకాశంలోనో
రైలులో భూమ్మీదనో కాదు
సముద్రం అలలమీద ప్రయాణం
అలలకీ ఒక లయవుంది
వచ్చేవాటికీ వెళ్ళేవాటికీ
శ్రుతి కుదిరినప్పుడు
నీటికింద చేపల్నీ అలలపైన పక్షుల్నీ
సమాదరిస్తున్నప్పుడు
సముద్రం ఒక సమన్వయ వ్యవస్థ
సాగర మధ్యాన
ఉబికిన భూఖండం ఎలిఫెంటా!
గుహల్లోకి
లలిత కళలు నడిచివచ్చి
నిశ్శబ్దాన్ని చెక్కినట్టు.
ఇవి ఏ ఉలి
గిలిగింతలు పెట్టిన భావాకృతులు?
ఇదొక రస సమాధి
అనుభూతుల పరమావధి
తిరిగి వస్తుంటే
గుండెనిండా
అరేబియా కెరటాలు
కళ్ళల్లో
అలల వొంపుల్లోని
కాంతులు నిండినట్టు.