– కత్తి పద్మారావు
నీ పరిసరాలను, నీ మనోగతాన్ని
నీ సౌజన్యాన్ని, నీలోని శిల్ప ఔన్నత్యాన్ని
ప్రభావితం చేస్తున్న సమాజం పట్ల
నీవు మౌనం వహిస్తున్నావు
గాఢమైన అనురక్తి నుంచి నీవు విముక్తమై
పెదాల సవ్వడితో జీవిస్తున్నావు
నీ మెళ్ళో వున్న హారాన్ని
నీవు అద్దంలో చూసినంతసేపు
నీ కనురెప్పల వేపు చూడు
అవి ఏ ఏ దృశ్యాలకు
ప్రతి స్పందితమౌతున్నాయో!
నీవు లిప్తమాత్రం యోచించు
అవును! నిజమే నీ సమయాన్ని ఎక్కువ
సాంప్రదాయాలకే వెచ్చిస్తున్నావు
నీవు వ్రతాలు చేసే సమయానికి
మూసీనది పొంగింది
తుఫాను తాకిడికి గోదావరి ఒడ్డున
మామిడితోటలు కూలాయి
నీవు బొమ్మల్ని అలంకరిస్తున్న కొద్ది
నీలో అచలత్వం ప్రబలమౌతుంది
నీవు పాత బంగారం మార్చి
కొత్త సువర్ణన్నాన్ని కొంటూనే వున్నావు
శరీరం మకిలబడుతున్న కొద్ది
సువర్ణం అవసరం పెరుగుతూనే వుంది
నీ పండ్లు దోరకాయలు కొరకడానికి
అనువుగా లేవు
అవి రసగుల్లా పాకంలో నాని
కొన్ని సజీవ చరాలు అందులో జీవిస్తున్నాయి
ఎన్ని పర్ఫ్యూమ్లు కొట్టినా
నీ శ్వేద బిందువుల గంధం ఆధిక్యంలోనే వుంది
ప్రతిరోజు సూర్యోదయంలో
భాగ్యనగర మార్కెట్టు నీకోసం స్వాగతిస్తుంది
వస్త్రశాలల్లోని రంగులకు
సూర్యకాంతిలోని రంగులకు మధ్య వైరుధ్యాన్ని
నీవు అంచనా వేస్తున్నావు
నిన్ను జిగేలుమనిపిస్తున్న
ప్రతి తళుకు వెనుకనున్న శ్రమ గురించి నీకు పట్టదు
నీ నెమలి అంచు పవిట చెంగును కత్తిరించి
నీవు అంటించుకొన్న చిత్ర దృశ్యం
వెనుక కొందరు వెంబడిస్తున్నారు
నీ మాటల చాకచక్యం చూసి వస్తువులు అమ్మేవారు
నీవు రాకముందే అంకెలు పెంచుకొంటున్నారు
ఎంత పెంచారనేది నీకు ముఖ్యం కాదు
ఎంత తగ్గించారనేదే నీ లెక్క
నీవు నీ వంటతిని ఎంత కాలమయ్యిందో!
నీ సింబల్ బిజీ అవును
ఆడవాళ్ళు ఒంటింటి కుందేళ్ళు ఏమి కాదు కాని
మీ వంట మనిషి కూడా ఆడమనిషే
ఆమెకు చేతులు పాశాయి
మీరు ఎవరు ఫోన్ చేసినా ‘బిజీగా’ ఉన్నానంటారు
మీకు పనేమి లేదంటారేమోనని మీ భయం
అవునూ
ఆ ఎ.టి.ఎం కార్డు నుండి నిత్యం తీసే
డబ్బులో మీ శ్రమ ఏమైనా వుందా?
డబ్బు ఎవరు సంపాదించారనేది
మీ దృష్టిలో ముఖ్యం కాదు
అవును మీకు సి.ఆర్.ఎం వాళ్ళు
బెస్ట్ కస్టమర్ అని అవార్డు ఇచ్చారు కదూ!
ఎస్,
మీ గోల్ మీరు రీచయ్యారు
అవును
మీరు గొప్ప కొనుగోలుదారు
ఇవ్వాళ ప్రపంచ మార్కెట్టుకు
కావలసింది మీరే!
ఎన్ని వరదలు రానివ్వండి
ఎన్ని శవాలు లేవనివ్వండి
ఎన్ని పంటలు మునిగిపోనివ్వండి
మీరు అటువైపు చూడవద్దు
అయితే ఆ వరద మీదాక వస్తుంది
అప్పుడు మీరు ఎటువేపు చూసినా
ఎవరూ కనబడరు
(కేంద్ర సాహిత్య అకాడమీ వారు తిరుపతిలో 9-8-2006 నిర్వహిస్తున్న కవిసమ్మేళనానికి రాసిన కవిత)