జనవరి 22న విశాఖ జిల్లా భల్లుగూడలో వాకపల్లి పునరావృతమైంది. మావోయిష్టులకు ఆశ్రయమిస్తున్నారనే నెపాన్ని చూపించి గ్రౌహౌండ్స్ పోలీసులు గిరిజన గ్రామాలమీద దాడి చేసి, పురుషుల్ని హింసలకి గురి చేయడం, అరెస్టులు చెయ్యడం, స్త్రీల మీద లైంగిక అత్యాచారాలకి పాల్పడడం సాధారణమైపోయింది. వాకపల్లిలో 11 మంది గిరిజన స్త్రీల మీద అత్యాచారం చేసిన పోలీసులు ఎలాంటి శిక్ష లేకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. వాకపల్లి స్త్రీల గుండెఘోష ఆ కొండల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే వుంది. తమపై అత్యాచారం చేసిన పోలీసుల్ని శిక్షించమని గొంతెత్తుతూనే వున్న వారి న్యాయమైన డిమాండ్ పట్టించుకునే వ్యవస్థే కరువైంది. వాకపల్లి ఉదంతం మరవక ముందే అదే బీభత్స సంఘటన భల్లుగూడాలో జరిగింది. నలుగరు ఆదివాసీ స్త్రీల మీద పోలీసులు అత్యాచారం చేసారనే వార్త నిర్ఘాంతపరిచింది.
ఫిబ్రవరి ఇరవై ఆరున కొంతమంది రచయిత్రులం కలిసి విశాఖ బయలు దేరాం. భల్లుగూడలో అత్యాచార బాధిత స్త్రీలను కలవాలని, వారి దు:ఖాన్ని పంచుకోవాలన్నదే మా ప్రయాణ కారణం. పాడేరుకి 80 కిలోమీటర్ల దూరంలో భల్లుగూడ వుంది. ఆ ఊరికి చేరాలంటే పది కిలోమీటర్లు కొండలు ఎక్కి, అడవి దాటి కాలినడకన వెళ్ళాలని ముందే హెచ్చరిక అందింది. మేము వెళ్ళడం కష్టం అవుతుందని, బాధిత స్త్రీలు పాడేరుకి వస్తారని, అక్కడ వారిని కలవొచ్చని అడ్వకేట్ లక్ష్మి చెప్పింది.
మేము విశాఖ నుంచి రెండు టాటా సుమోల్లో పాడేరు బయలు దేరాం. అప్పటికీ సమయం 9.30 అయ్యింది. లంచ్ టైమ్‌కి పాడేరుచేరాం. అయిదే మేము భల్లుగూడ వెళ్ళాల్సి వుందని, తొందరగా బయలు దేరితే మంచిదని చెప్పారు. చిన్న హోటల్ మీద పడి, వేడి వేడి అన్నం తిని, పాడేరు నుంచి భల్లుగూడా బయలు దేరాం. నాలుగ్గంటలకి ఒక ఊరి దగ్గర వాహనాలు ఆగి పోయాయి. అక్కడి నుండి భల్లుగూడ దాదాపు పది కిలోమీటర్లు వుంటుందని, వాహనాలు వెళ్ళవని, రెండు కొండలెక్కి ఓ అడవి దాటి వెళ్ళాలని మాతో వచ్చిన లక్ష్మి చెప్పింది. సగం దూరం నడిస్తే మధ్యలో భల్లుగూడ బాధిత స్త్రీలు కలిసే అవ కాశం వుందని కూడా తను చెప్పడంతో అందరం నడక మొదలు పెట్టాం. మొదటి కొండ ఎక్కి దిగేసరికి మాలో సగం మంది వెనక్కి వెళ్ళిపోయారు. కేవలం ఏడుగురం మాత్రం పట్టువదలకుండా నడక సాగించాం. దారంతా రాళ్ళు, రప్పలు. దట్టంగా అల్లుకున్న చెట్లు తీగెలు. వాకపల్లి ప్రయాణాన్ని మించిన ప్రయాస పడ్డాం. చుట్టూ కొండలు, లోయలు ఎంతో అందమైన ప్రాంతం. నిర్మానుష్యమైన ప్రదేశం. ఇలాంటి నిశ్శబ్ద ప్రాంతంలో తమ బతుకు తాము బతుకుతున్న ఆదివాసీలను ఇటు మావోయిస్టులు, అటు పోలీసులు కల్లోల పరచడం, పోలీసులు అత్యాచారాలకు తెగబడ్డం చాలా అన్యాయం.
సూర్యాస్తమయమై, చిరు చీకట్లు కమ్ముకుంటున్న వేళ మేము భల్లుగూడ చేరాం. ఊరంతా మా కోసం ఎదురు చూస్తోందా అన్నట్టు గ్రామస్తులంతా ఒక చోట గుమి గూడారు. దారిద్య్రం తాండవిస్తున్న చిన్న గూడెం అది. మేము ఒక ఇంటి ముందు కూర్చున్నాం. మా చుట్టూ ఊరంతా చేరారు. చంకల్లో పిల్లలతో అత్యాచారానికి గురైన ముగ్గురు స్త్రీలు వచ్చి కూర్చున్నారు. వాళ్ళ ముఖాల్లోని అమాయకత్వం, ఏ భావమూ లేని ముఖ కవళికలు నన్ను చాలా కలవరపెట్టాయి. ఏడ్చి ఏడ్చి అలసిపోయినట్టు, మా దు:ఖాన్ని మీరెవ్వరూ తీర్చలేరు అన్నట్టు నిరామయంగా కూర్చున్నారు. వాళ్ళతో మాట్లాడటానికి ప్రయత్నించాం. వాళ్ళకి తెలుగు రాదు. తమ దు:ఖగాధని మాతో పంచుకునే భాష కరువైంది. రాంబాబు అనే ఆయన మాకు దుబాసీగా వ్యవహరించాడు. ఒకరి తర్వాత ఒకరు పోలీసులు తమ పట్ల ఎంత దారుణంగా వ్యవహరించింది వివరించారు. వంతల డోమిని, వంతల రామి, వంతల ముక్తలు తోడికోడళ్ళట. అందులో ఒకరి చేతుల్లోని పసిగుడ్డుని తుప్పల్లోకి విసిరేసారని, ఇద్దరి భర్తల్ని బాగా కొట్టి, అరెస్ట్ చేసారని, ప్రస్తుతం విశాఖ జైలులో వున్నారని రాంబాబు చెప్పాడు.
జనవరి 22న తెల్లవారు ఝూమున దాదాపు 80 మంది గ్రేహౌండ్స్ పోలీసులు, స్థానిక ఎస్.ఐతో సహా భల్లుగూడ గ్రామం మీద దాడి చేసి మగవాళ్ళని, మగపిల్లల్ని దగ్గరలోని స్కూల్‌లో పెట్టి తాళం వేసారు. ఆ తర్వాత ఆదివాసీల ఇళ్ళల్లోకి జొరబడి నలుగురు స్త్రీల మీద అత్యాచారానికి పాల్పడ్డారు. ఏడుగురు మగవాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళుతూ ఇక్కడ జరిగిన విషయాలను బయట పెడితే పరిణామాలు దారుణంగా వుంటాయని బెదిరించారని చాలా భయపడుతూ గ్రామస్తులు వివరించారు. తమకి పోలీసులంటే చాలా భయమని, పదేళ్ళ క్రితం ఇలాగే తమ గ్రామం మీద పడి ఊళ్ళోని పెద్ద వాళ్ళని దారుణంగా కొట్టారని, ఆ సంఘటనని తాము ఎప్పటికీ మర్చిపోలేమని, తమకు మావోయిష్టుల గురించి ఏమీ తెలియదని గద్గద స్వరాలతో వివరించారు.
డోమిని, రామి, ముక్తలతో మాట్లాడాలని ఎంతగా అన్పించినా భాష అడ్డం వచ్చింది. వారి ముఖాల్లో, కళ్ళల్లో 22 నాటి భయానక సంఘటన తాలుకూ భయం స్పష్టంగా కనబడుతోంది. నిశ్శబ్దంగా దు:ఖాన్ని అనుభవిస్తున్న ఆ ముగ్గురు స్త్రీలను చూస్తుంటే మా కళ్ళల్లో నీళ్ళొచ్చాయి.
రెండేళ్ళ క్రితం ఇదే విధమైన దారుణ సంఘటన వాకపల్లిలో జరిగినపుడు ఆ మహిళలు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ”భూమి చెప్పితే ఆకాశం నమ్మదా” అంటూ సభ్య సమాజాన్ని నిలదీసారు. భల్లుగూడ డోమిని, రామి, ముక్తలు కన్నీళ్ళను సైతం కోల్పోయారా అన్నట్లు అన్పించారు. మేము కూడా మౌనంగానే వారి దు:ఖాన్ని పంచుకుని, వారికి న్యాయం జరిగేలా కృషిి చేస్తామని, ఈ మారు మూల ఆదివాసీ గ్రామంలో పోలీసులు జరిపిన భీభత్స కాండ గురించి ప్రపంచానికి తెలియచెబుతామని వారికి చెప్పి తిరుగు ప్రయాణమయ్యాం. చిక్కటి చీకటిలో చుక్కలే తోడుగా ఆ కొండలెక్కి, అడవిదాటి నడక సాగించాం. నేను భల్లుగూడ నుంచి తెచ్చుకున్న కర్రసాయంతో నడుస్తూ, రెండుసార్లు పడబోయి నిలదొక్కుకున్నాను. పాములు తిరుగుతాయని ఎలుగుబంట్లు దాడి చేస్తాయని చెబుతుంటే భయమన్పించలేదు. కౄరమృగాలకు సౖౖెతం భయపడని ఆదివాసీలు పోలీసు మృగాల ముందు భయకంపితులవ్వడం, వారి అత్యాచారాలకు గురవ్వడం ఆశ్చర్యమే. మృగాలు వారి నేస్తాలే. పోలీసు మృగాలు మాత్రం వారి పట్ల పరమ శతృవులై ప్రవర్తించడం శోచనీయం.
అలిసిపోయి, అన్నాలు తినకుండానే అర్ధరాత్రి వైజాగు చేరాం. భల్లుగూడ మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన గ్రేహౌండ్స్ పోలీసులను అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. వైజాగు జైలో వున్న వారికి బెయిల్ దొరికిందని, షూరిటీల కోసం చూస్తున్నామని ఆ తర్వాత రాంబాబు ఫోన్ చేసి చెప్పాడు. భల్లుగూడ బాధిత స్త్రీలకు న్యాయం జరిగేలా కృషి చేయమని పౌరసమాజాన్ని, రచయితల్ని, మేధావుల్ని కోరుతున్నాం.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
” మృగాలు వారి నేస్తాలే. పోలీసు మృగాలు మాత్రం వారి పట్ల పరమ శతృవులై ప్రవర్తించడం ” కడు బాదాకరం. ఎన్నో పనికిమాలిన వార్తలను ప్రచారం చేసే వార్తా చానల్లు ఇలాంటి దారుణమైన సంఘటన చోటు చేసుకున్నప్పుడు ఎం చేస్తున్నాయి. దయచేసి పోలీసుల్ని “మృగాలతో” పోల్చవద్దని మనవి. వాళ్ళు మృగాలకంటే దారుణమైన వారు / నిష్ఠ దరిద్రులు. అయితే ఈ భావన అక్కడో ఇక్కడో, వేలల్లో ఒకరుగా ఉండే మంచి పోలీసులకు వర్తించదు.
గోవా లో జరిగే మానభంగాలకి మొదటి పేజి లో స్థానం కల్పించే దిన పత్రికలు ఈ వార్తకి పెద్ద ప్రాముఖ్యాన్ని ఇవ్వక పొవడం నిజనం గా చాలా విచారకరం. మాన భం గానికి కొత్త న్యాయార్ధలు నిర్ధారిస్తున్న ఈ రోజుల్లొ ఈ వార్త అందరూ ఖండించాల్సిన దుర్ఘటన.
భూమిక లఓ వార్త అనగానే ఒక బయాస తో చూసే వాళ్ళకి ఈ వార్త ఎలా చేర్చడం? ద్రౌపది అవార్దు గురించి చర్చలు చేసే వాళ్ళకి ఇంకా పెద్ద గుండె మండించే విషయాలున్నాయని చెప్పాలనుంది. సలహా చెప్పగలరా?
రమాదేవి గారూ
భూమిక వెబ్సైట్ సందర్శించి మీ అభిప్రాయం రాసినందుకు ధన్యవాదాలు.
నిజమే మీరు పేర్కొనినట్టుగా భల్లుగూడా అత్యాచారాల గురించి ప్రధాన స్రవంతి మీడియా పెద్దగా పట్టించుకోలేదు.నానా చెత్త విషయాలమీద గంటల తరబడి ప్రోగ్రాములు చేసే ఎలక్ట్రానిక్ మీడియా అస్సలు పట్టించుకోలేదు.
ఆదీవాసీ మహిళలు అబద్దాలు చెబుతున్నారని విష ప్రచారం చేసే పోలీసుల దుశ్చర్యల గురించి అందరూ గొంతు విప్పాలి.
దీని మీద విస్త్రుతంగా రాయాలి,చర్చించాలి.
భూమిక లో కాకపోతే మరో పత్రిక.
దయచేసి మీరు మానభంగం,చెరచడం,అనుభవించడం లాంటి పద ప్రయోగాలు చెయ్యొద్దని నా మనవి.దుర్మార్గమైన లైంగిక అత్యాచారాన్ని అత్యాచారంగానే పిలవాలి.