చారితక్ర సంఘటనలు – స్తీవ్రాద కవిత్వం

కోరు సుమతీ కిరణ్‌
సకల విజ్ఞాన శాస్త్రాలకూ గణితం మాతృమూర్తి అయితే, సకల సామాజిక శాస్త్రాలకూ కేంద్రబిందువు చరిత్ర. సామాజిక శాస్త్రాల్లో భాగమైన సాహిత్యం కూడా చరిత్రమయం. చరిత్ర ప్రమేయం లేకుండా మానవశాస్త్రం లేదు, మానవ వికాసం లేదు. చరిత్రనుండి, చారిత్రక అనుభవాలనుండి పాఠాలు నేర్చుకుని లోపాలు సరిచేసుకోవడానికి ఇష్టపడని ప్రజలు, పాలకులు ప్రపంచ చరిత్రలో అనేకమంది వున్నారు. ఈ తరహా పాలకుల్లో నెపోలియన్‌, హిట్లర్‌ లాంటి వాళ్ళనుండి నేటివరకు ఎందరో కన్పిస్తారు.
ఈ కంప్యూటర్‌ యుగంలో సామాజిక శాస్త్రాల్ని, మానవాళి ప్రగతికి వాటి అవసరాల్ని టెక్నాలజీ మోజులో పాలకులు విస్మరించడం మిక్కిలి విచారకరం. ”చరిత్రను విస్మరించినవాడు చరిత్రను సృష్టించలేడు” అని డా.అంబేద్కర్‌ మానవాళి పరిణామ వికాసానికి, ప్రగతికి చరిత్ర యొక్క అవసరాన్ని నొక్కి చెప్పారు. అయితే నేడు సామాజిక శాస్త్రాల్ని ఆదరించకపోగా, చరిత్రలు మార్చి ఏకపక్షంగా రాసుకోవడం తిరోగమనానికి నిదర్శనం.
సాహిత్యం చరిత్రకారులకు అధిక ప్రాధాన్యమిస్తూ వస్తున్నట్లే స్త్రీ వాద సాహిత్యంలో కూడా ప్రముఖంగా చారిత్రక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రముఖ స్త్రీ వాద కవయిత్రి, రచయిత్రి అయిన ఓల్గా గారి ‘నీలి మేఘాలు’ సంకలనంలో 1988 సం||లో మెహందీ స్త్రీలపై జరిగిన సంఘటనకు స్పందిస్తూ కవితను రాశారు. మెహందీలోని ఓ అమ్మాయి దగ్గరకు ఒక యువకుడు 15 రూపాయిలిచ్చి తనకేం బాగోలేదంటూ పడిపోతాడు. ఆ అమ్మాయి ఆటోలో అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్ళి తన అడ్రసిచ్చి చేర్పిస్తుంది. అతను విషం తినడంవల్ల చనిపోతాడు. పోలీసులు మెహందీతోపాటు మరో ముగ్గుర్ని అరెస్టు చేసి, వాళ్ళను కొట్టి వారి సామాన్లను ధ్వంసం చేస్తారు. వారం రోజులపాటు వాళ్ళను బజారులోనే నిలబెడతారు. వానలో చలితో, ఆకలితో వాళ్ళు అల్లాడిపోతారు. ఆ తర్వాత వాళ్ళు వెయ్యి రూపాయలు జామీను కట్టి బైటికొస్తారు. ఈ సంఘటన ఇతివృత్తంగా ఓల్గా గారు ‘మెహందీ స్త్రీల విజ్ఞప్తి’ అనే శీర్షికతో కవిత రాశారు.
”లోకం మిమ్మల్ని నిర్ధాక్షిణ్యంగా
నేల రాసిన వేళ
ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని
మీ వికృత వాంఛాగ్నుల్ని
మా ఒడిలో చల్లార్చుకుని
ఎన్నిసార్లు తృప్తిగా తేన్చారు…..”
అంటూ చనిపోవాలనుకున్నవారు వారి ఇళ్ళలోనో, భార్యలవద్దనో, తల్లుల దగ్గరో ఎక్కడైనా దేశంలో స్థలాలెన్నో వున్నాయి. మెహందీ స్త్రీలకు బతికించడం సుఖపెట్టడమే తెలుసునని చావడానికి తమ వద్దకు రావొద్దని వేడుకుంటారు. తామే బతకడానికి నానా చావు చస్తున్నవాళ్ళమంటూ మెహందీ స్త్రీల దుర్భర వ్యధల్ని కవిత్వీకరించారు.
ఆడపిల్లగా పుట్టిన వెంటనే గుడివెనక విషమిచ్చి చంపే రాజస్థాన్‌ గ్రామాల్లోని దుష్టాచారం విని శ్రీమతి గారు ‘నిషిద్ధ స్వప్నం’ అనే కవితలో –
”అక్కడ భగవంతుడు కూడా
నా మరణానికి మౌనంగా సిగ్నలిచ్చేస్తున్నాడు
నే పుట్టినట్టు అమ్మ కలగన్న పాపానికి
తిండిలేకుండా కృశింప చేసినప్పుడు
అమ్మ మౌనంగా కుళ్ళిపోయినప్పుడు
నేననుకున్నా… నేనొక నిషిద్ధ జీవినే కాదు
నిషిద్ధ స్వప్నాన్ని కాదు….” అంటూ పుట్టబోయేది ఆడపిల్లని తెలియగానే వారి మరణానికి భగవంతుడు కూడా సిగ్నలిచ్చేస్తున్నాడు. తల్లి తనను కోరుకుంటుంటే తండ్రి తనను నిషిద్ధజీవిగా చూడడం జరుగుతుంది. పుట్టే పాపను గూర్చి కలలుగనే స్వేచ్ఛ తల్లికి లేదని నిషిద్ధ స్వప్నాన్ని అయ్యానని ఆడపిల్లగా పుట్టడం వల్ల ఎదురయ్యే కష్టనష్టాల్ని గూర్చి ఇందులో వ్యక్తీకరించారు.
బోస్నియా హెర్జిగోచినాలోని ముస్లిం క్రోషియన్‌ జాతుల్ని నిర్మూలించి తమ ఆధిపత్యాన్ని నెలకొల్పడం కోసం సెర్బ్‌లు వేలాదిమంది స్త్రీలను చిత్రహింసలు పెట్టి నిర్భంద మాతృమూర్తులుగా మార్చారు. ఈ సంఘటనకు స్పందిస్తూ కొండేపూడి నిర్మలగారు ‘బాధాశప్తనది’ అనే కవితలో –
”మానానికి సంబంధించినదంతా
అవమానాల భాషే అయిన చోట
చెప్పుకున్నకొద్దీ చొప్పకట్టలా ఎటో కొట్టుకుపోయే
మారోదన ”  అంటూ తల్లులు తమ బిడ్డల్ని రక్షించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. తిరస్కరించిన తల్లుల్ని నిర్భంద మాతృమూర్తులుగా చేయడంతో ఆ తల్లుల ఆత్మఘోష అతికఠోరంగా వుంటుంది. తన బిడ్డల మృదు చరణాల్ని పుట్టుకతోనే చంపడంతో జాతుల్ని నిర్మూలించడం జరుగుతుంది. ఆడదాన్ని అవమానించడానికి కారణాలెన్ని తీసినా, చిత్తశుద్ధిలేని విచారణలెన్ని జరిగినా అంతిమ తీర్పు ఏమి వస్తుందని నిర్భంద మాతృమూర్తులు అడగడాన్ని ఈ కవితలో వివరించారు.  దాదర్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఓ బాలిక అత్యాచారానికి గురైన సంఘటనకు స్పందనగా బి. పద్మావతిగారు ‘గాయపడ్డ పనిముట్టు’ అనే కవితలో
”కొత్తగా గాయపడ్డావా పనిముట్టు
నెత్తురూ, కన్నీళ్ళూ చిమ్ముతున్న ఓపాల బుగ్గా
ఓమంట మండిన తరువాత
కాలిన చమురు కంపుల మధ్య
వెక్కిరింతగా నిలిచిన వీర్యపు చుక్కల్ని
ఒక ధిక్కారపు ఛీత్కరింపుతో
బహిష్టు స్రావంలా తుడి – చెయ్యలేక….” అని ఆడదంటే పడకఎక్కే పనిముట్టుగా, పిల్లల్నికనే యంత్రంగా భావించడం జరుగుతుంది. తెలిసీ తెలియని పసిపిల్లల్ని, యౌవనుల్ని కొందరు రాక్షసులు తమ ప్రవర్తనతో ఒళ్ళు తెలీని మత్తులో అమానుషంగా అనుభవిస్తుంటారు. దానివల్ల జరిగే విపరీత పరిణామాల్ని ఎదుర్కొనే వారంతా ఆ గుండెకోతను తట్టుకోలేక దారుణమైన పరిస్థితుల్లో చిక్కుకుంటారు. ఇలాంటి అభాగ్యుల జీవన స్థితిగతుల్ని ఈ కవితలో వ్యక్తీకరించారు.
జూపాక సుభద్రగారి అయ్యయ్యో దమ్మాక్కా… సంపుటిలో వాకపల్లిలోని గిరిజన స్త్రీలపై జరిగిన అత్యాచారానికి రుజువుల్లేవని కేసును కొట్టివేసినందుకు స్పందిస్తూ ‘మా అడివి పంచకురాండ్రి’ అనే కవితలో –
”కాకి రెట్టేస్తే కడుక్కున్నట్లు
కమిలిన మాగుండె గాయాల్ని యెట్లా కడుక్కుందుము
మా అవమానపు అక్షరాలు
మీ కండ్ల కాయితాల నిండా ఎగరేసిన సంచలన జెండాలైనయి
……” అంటూ ఆదివాస స్త్రీలు అయ్యా… సారూ… బాంచెన్‌ అని ధనవంతుల్ని, నోరున్నోల్లని పిలుస్తారు. దానికి పర్యవసానంగా వారు తమ అవసరాల్ని తీర్చుకుని వదలి వెళ్తారు. నష్టపోయిన స్త్రీలంతా కన్న తల్లిదండ్రులు కూడా అక్కువ చేర్చుకోకపోవడంతో అవమానం తట్టుకోలేక కొంతమంది చావుకు గురౌతుంటారు. సత్యం జయిస్తుందనుకున్న కోర్టు తీర్పుల్ని కూడా బడాబాబులు సాక్షాధారాలు లేకుండా చేస్తారు. అడవికెళితే అక్కడి చెరువులు, చెట్లు సత్యాన్నే పలుకుతాయని ఏదో ఒకరోజు అన్యాయమనే పందిని పొడిచే రోజు వస్తుందనే ఆవేదన ఈ కవితలో వ్యక్తమైంది.
డా|| తుర్లపాటి రాజేశ్వరి గారి ‘మనసైన చెలి’ అనే కవితా సంపుటిలో డిసెంబరు 5, 1998 సం||లో ఏలూరు వేలంపాటను గూర్చి ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ లో చదివి కథనానికి స్పందిస్తూ ‘ఒంటరి ద్వీపం’ అనే కవితలో –
”భూమినీ ఇండ్లనూ తనఖాలకు ఉంచుకున్నట్లే
ఇచ్చట
పదివేలకు… పదమూడు వేలకు
సంవత్సరకాలం సర్వహక్కులూ పొంది
ఆమెను పశువులా తోలుకెళుతున్నారు.

నువ్వొక ఆషాడమేఘావి…. సుప్తశిలవి
అని భారతదేశంలోని ఏలూరులో ఒక ఆమెను భూమిని, ఇండ్లను అద్దెకిస్తున్నట్లే పదివేలకు, సంవత్సరకాలంపాటు సర్వహక్కులున్నట్లు వేలంపాటలో పాడుకున్నారు. ఆమె యౌవనం వున్నంతవరకు వాడుకొని ఎండిపోయాక ఆమెకై కరుణామృతాన్ని పంచె వారెవరూ వుండరు. అలాంటి సమయంలో ఆమె మోడైన వృక్షంగా ఒంటరి దీపంగా మిగులుతుందని ఈ కవితలో వ్యక్తీకరించారు.
సుహాసినిగారి ‘రెక్కలు పొదిగిన చూపు’ అనే కవితా సంపుటిలో జూలై 28, 2002 సం||లో కుటుంబ హింసకి బలైపోయిన కావలికి చెందిన మహిళావేదిక సభ్యురాలు ‘విశ్వభారతి’ కి సాశ్రునయనాలతో ‘హత్యా!! ఆత్మహత్యా??’ అనే కవితను రాశారు.
”నిన్ను చూసి మెత్తబడిన మనసునాది
వెంటబడి పెళ్ళిదాకా నడిపించిన కర్తవునువ్వు
శరీరమూ, మనసేకాక…
అల్లెంతిన్న పెళ్ళి కొడుకులా అన్నీ అందుకుని
అధిపత్యాన్ని ప్రదర్శించిన భర్తవు నువ్వు …”
అంటూ అనుమానమున్న భర్తలతో విసిగిపోయిన భార్యలంతా మానసిక ఒత్తిడికి గురౌతారని తేల్చి చెప్పారు. తమ కన్నబిడ్డల కోసం తాము మానసికంగా కుంగిపోతున్నా లెక్కచేయకుండా, తన ప్రయత్నాల్ని, ఉపాన్యాసాల్లోనేగాని తనకు వర్తించకుండా చేసే భర్తలకు బుద్ధి చెప్పడం కోసం రైలుకింద తలపెట్టి చనిపోయే స్థితికి తెచ్చిన పెద్దతలది తన భర్తదేనంటూ ఈ కవితలో స్త్రీలు ఎదుర్కొనే ఆవేదనల్ని బలవన్మరణాల్ని గూర్చి విశ్లేషించారు.
పాటిబండ్ల రజనిగారి ‘ఎర్ర జాబిళ్ళ ఎరీనా’ అనే సంపుటిలో బాల వేశ్యల సంఖ్యలో భారతదేశం రెండో స్థానంలో వుందనే వార్తాకథనం. కేవలం బాల వేశ్యలకోసమే ‘సెక్స్‌ టూరిజం’ పేరిట మనదేశానికొచ్చే విదేశీవింత పశువుల వికృతానందానికీ ప్రతిస్పందనగా ‘ఎర్ర జాబిళ్ళ ఎరీనా’ అనే కవిత రాశారు. ఈ కవితలో          ”రండి బాబూ రండి!
మీ విదేశీ వికృతానందాల కోసం
అల్లుకుపోయే వేళ అల్లల్లాడే
అమాయక అరవిందాలు!
నాణాల కోసం ప్రాణాలు తూచే
విపణుందా ఇంకెక్కడైనా?….”అంటూ ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో బాల్యంలోనే వేశ్యలుగా మారినవారు విదేశాలనుండి వచ్చే దొరబాబుల చేతిలో వికృతానందాలకు బలౌతున్నారు. అ ఆ లు దిద్దాల్సిన వయసులో అవయవాలకు పౌడరద్ది తల్లి పక్షికోసం ఎదురుచూసే గువ్వ పిల్లలా తమ తనువులారబోసి వెక్కిళ్ళనే నవ్వులుగా మార్చుకుంటున్నారు. ఇంతటి విపరిణామం మరెక్కడా వుండదని ఆనందాన్ని పంచడానికి బాధల ఓడలెక్కుతున్నారని బాల్యవేశ్యల్ని, వారి ఆవేదనను గూర్చి ఈ కవితలో వ్యక్తీకరించారు.
శీలా సుభద్రాదేవి గారి ‘తెగిన పేగు’ అనే కవితాసంపుటిలో ‘తెగినపేగు’ అనే శీర్షికలో సేలం జిల్లాలోని ఒకానొక గ్రామంలో పుట్టిన ఆడశిశువుల్ని బతకనివ్వరన్న వార్త చదివి స్పందిస్తూ రాసిన కవితలో
”అక్కడ వడ్లగింజ
అణుక్షిపణికంటే విధ్వంసకారి
క్షణాల్లో ఆడపిల్ల ఊపిర్నాపగలదు…”  అని ఆడపిల్లల్ని శాపంగా భావించడం, భవిష్యత్తును భూతకాల కళ్ళద్దాల్లో నుండి ముందే చూసి వడ్లగింజసాయంతో క్షణాల్లో ఊపిరాడకుండా చేయడం జరుగుతుంది. జిల్లేళ్ళతో ఆడపిల్లల్ని ఊపిరితో బైటపడకుండా చేస్తుంటాయి. మగపిల్లాడు అమృత భాండాలిస్తుంటే ఆడపిల్ల విషబిందువులు చిలకరిస్తుందని, స్త్రీలింగ శబ్ధాలు గొంతువిప్పకూడదని, ప్రకృతికూడా పులకరించకూడదని పై కవితలో ఆడపిల్లల్ని నిషిద్ద వస్తువుగా భావించేవారిని సంకుచిత స్వభావాన్ని నిశితంగా విమర్శించారు.
జయప్రభగారి ‘చింతల నెమలి’ కవితాసంపుటిలో 1995 సం||లో బంగ్లాదేశ్‌ కాందిశీకురాలు అయిన పదేళ్ళ హమీదా మీద పోలీసులు  చేసిన లైంగిక హింసగూర్చి ‘మానుషి’ అనే పత్రికలో చదివి స్పందిస్తూ రాసిన మీ మగచట్టాల మధ్య…’ అనే కవితలో –
”బతికినన్నాళ్ళూ…లోతు తెలియని దుర్మార్గాలతో/
కటిక చీకటి బిలాలు వాళ్ళు/ కడుపుమండ….”
అంటూ పోలీసులు చేసే అకృత్యాల్ని గూర్చి వివరించారు. లేత వన్నెల దేహాల మీద హింసాన్మాదంతో ప్రవర్తించడం వల్ల పోలీసుల శవాల్ని రాబందులు కూడా వెలివేస్తాయి. అనేక దుర్మార్గాలతో బతికినన్నాళ్ళూ పశువుల్లా ప్రవర్తిస్తూ భూమ్మీద పున్నామ నరరూప రాక్షసులుగా జీవిస్తారని పోలీసుల్ని వారి అనుచిత ప్రవర్తనల్ని వారు చేసే లైంగిక వేదింపుల్ని గూర్చి ఈ కవితలో ఆగ్రహాన్ని ప్రదర్శించారు.
ఈ విధంగా స్త్రీ వాద కవయిత్రులు నిత్యం జరిగే దారుణ సంఘటనలకి మిక్కిలి వేగవంతంగా ప్రతిభావంతంగా ప్రతిస్పందిస్తూ విలువైన, విలక్షణమైన, ప్రబోధాత్మకమైన సంస్కరణాభిలాషతో కూడిన కవిత్వాన్ని సృష్టిస్తున్నారు. ఈ దృక్కోణంతో వెలువడే సాహిత్యం కొంతవరకైనా సామాజిక మార్పుకు తోడ్పడగలదని ఆకాంక్ష.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.