సి. రఘుపతిరావు
తెలంగాణ ప్రాంతంలో ఉన్నన్ని కళారూపాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలోను లేవు. రాగం పుట్టింది రామచిలుక నోటి, పాట పుట్టింది నా పల్లెతల్లి ఇంటా అనే పాటలో అక్షరసత్యం ఉంది. పల్లెలోని జనం తమ బ్రతుకుదెరువుకోసం జానపదుల నోళ్ళ వెంబడి అలవోకగా వచ్చిన పలుకునే జానపదాలు. చెట్టూ పుట్టా తిరిగి కాయకష్టం చేసి అలసి, సొలసిన శ్రమజీవులు మానసిక విశ్రాంతిని, పొందడానికి పాడుకున్న పాటలను, గేయాలని, చెప్పుకున్న కథలు, వారు ప్రదర్శించే కళారూపాలు కళలకు ఆనవాళ్ళు. నృత్యం అనేది పాట కంటే ప్రాచీనమైనది. మానవుడు ధార్మిక సంబంధమైన ప్రతి పనిలో నృత్యం చేసి ఆడిపాడేవాడు. ఆటవికుల ఆటపాటల్లోని పదాలు, అంగవిన్యాసాలు, సంగీత నృత్యాలకు బీజరూపాలయ్యాయి. తెలంగాణ పల్లెల్లో జనం చేలల్లో, పంట పొలాల్లో, పల్లె కూలీలు, పాడే పాటలతో పల్లెతల్లి పరవశించిపోతుంది. పుడమి తల్లి మురిసిపోతూ పాట పాడే తల్లులను దీవిస్తుంది.
గతకాలంలో మనిషి రూపంలో జన్మించి సత్యనిష్ఠతో ఉన్నవారిని దేవతలుగా కొలిచి ఆరాధించారు. వారి యొక్క జీవిత చరిత్రని గ్రామీణ ప్రజలు వీధి నాటకాల రూపంలో ప్రదర్శించేవారు. ఏ చరిత్రకైనా, నాగరికతకైనా, పునాది విజ్ఞానమే. ఈ కళారూపాల్ని తెలంగాణ సాంస్కృతిక సామాజికతను చాటడానికి దోహదపడతాయి. జీవిత సత్యాలను తెలుపడంతో పాటు, వినోదాన్ని, విజ్ఞానాన్ని అందిస్తాయి. మానవ అభివృద్ధికి దోహదపడే ప్రాచీన గ్రామీణ కళారూపాలు, వీధినాటకాలు అనేకం ఉన్నాయి. వాటిలో గొల్లసుద్దులు, కోలాటం, తోలుబొమ్మలాట, హరికథ, గంగిరెద్దులాటలు, తప్పట్లు, పగటివేషగాళ్ళు. అలాగే వీధినాటకాల్లో శ్రీ చెన్నకేశవ మహత్యం, మహాభారతం, రామాయణం, భక్తప్రహ్లాద, తదితర వీధి నాటకాలు నాడు తెలంగాణ పల్లెల్లో విలసిల్లాయి.
ప్రాచీన కళారూపమైన తోలుబొమ్మలాటలో పదాలు, దరువులు, పదనిసలు, సంభాసణలతో ఒక్కటి అభినయం ప్రదర్శించి ఆనందాన్ని కలిగించేవారు. బైండ్లవారు సిందులు తొక్కుతూ ఆనందింపజేసేవారు. పగటివేషగాళ్ళలో పులివేషం, దొరవేషం, దొరసానివేషం ధరించి హావభావాలతో జనాన్ని పరవశింపజేసేవారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో బ్రహ్మంగారి చరిత్ర, సిద్దయ్యగారి చరిత్ర, సత్యహరిశ్చంద్ర, తదితర వీధి నాటకాలు ప్రజలను ఉర్రూత లూగించినాయి.
55 సం|| క్రితం ప్రజా జీవితంలో పూర్తి స్థానాన్ని సంపాదించిన సినిమారంగం, అంతకు 100 సం||రాలకు పూర్వమే ఏర్పడి అజరామరంగా వెలుగొందిన నాటకరంగానికి పూర్వరూపాలైన కళలు ఆయా రాజుల పరిపాలనలో తెలంగాణ ప్రజా సామాన్యన్నంతా ఆలరించి, వారిని సాంఘిక ఆర్థిక వైజ్ఞానికంగా తీర్చిదిద్ది వారి జీవితాలలో పెనవేసుకుపోయినవి నాటినేటి జానపద కళారూపాలే. ఈ కళలను నమ్ముకొని వేలాది మంది కళాకారులు బ్రతుకు బండిని కొనసాగించేవారు. చదువురానివారు సైతం వీధినాటకాలు, హరికథలు, బుర్రకథల ద్వారా వీరుల సాహసాల గాథలు వివరిస్తూ పాడిన పాటలు, ఆడిన ఆటలు, మనలోని భావతరంగాలను కలిగించాయి. ఇలాంటి ప్రాశస్త్యం కల్గిన విశిష్ఠ కళలతో పరవశించే తెలంగాణ పల్లెలు నిర్మానుష్యంగా మారిపోయినాయి.
తెలంగాణలో మనం చూస్తుండగానే గ్రామీణ ఆటలు, పాటలు, బతుకమ్మ పండుగ, కోలాట పాటలు, భజన కీర్తనలు, మద్దెల మోతలు, బైరాగుల కిన్నెర తత్త్వంబులు, అంతరించిపోయినాయి. హరిశ్చంద్ర పద్యనాటకాల పంతులు యొక్క హార్మోనియం చెదలు పట్టిపోయింది. యక్షగానం నేర్పే పంతులు ఉప్పరిపనిలో తట్టపట్టి పనిచేస్తున్నారు. యాచకులు, బుడుగజంగాలు, పల్లెలను వదిలిపెట్టి పాతబట్టలను గల్లీల్లో అమ్ముతున్నారు. ఈ కళారూపాలను నమ్ముకొని జీవిస్తున్న ఎంతోమంది కళాకారులు నేడు తాపీ మేస్త్రీలుగా, హమాలీలుగా, కూలీలుగా మారినారు. వేలాది మంది కళాకారులకు ఉపాధి లేక దుర్భర పరిస్థితిని అనుభవిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు.
తమ జీవితాలను కళలకోసం అంకితం చేసిన కళాకారులు, నేడు కన్నీళ్ళతో కుములుతూ చావలేక, బతుకలేక నలిగిపోతున్నారు. వారి పొట్ట నింపుకోవడం కూడా గగనమైపోయింది. కళలను ఆదరించి, పోషించేవారు, తగ్గిపోవడంతో తెలంగాణ పల్లెల్లో ఉండే అనేక కళారూపాలు అంతరించి పోతున్నాయి. నేడు జానపద కళలతో పరవశించే పల్లెలు నిర్మానుష్యంగా మారిపోయినాయి.
ప్రజలు సృష్టించుకున్న జానపద కళాసంపదను, సామ్రాజ్యవాద విషసంస్కృతి నాశనం చేస్తుంది. సామ్రాజ్యవాదం అరాచకాన్ని ఆదర్శంగా అందలమెక్కించి అదే వాస్తవంగా నమ్మింపజేస్తుంది. తన దోపిడిని నెరవేర్చుకోవడానికి ఉపరితలరంగంలో శక్తివంతమైన సాంస్కృతిక రంగాన్ని ఆవహించింది. అన్ని రకాల ప్రచార ప్రసార సాధనాలను, పీడిత ప్రజల కళారూపాలను, బాణీలను నిర్లజ్జగా వాడుకుంటూ, తన సరుకుల మార్కెట్ ప్రచారాన్ని కొనసాగుతుందిగిస్తోంది. కళారూపాలు మరియు వాయిద్యాలను ఆంధ్ర టి.వీల ద్వారా ప్రసారమయ్యే సామ్రాజ్యవాద ప్రచారాలు, ప్రకటనలు నాశనం జేసినాయి. ఆంధ్ర పత్రికలు తమవంతుగా తానతందాన ఆడినాయి.
పాశ్చాత్యదేశాల విషసంస్కృతి తోడవ్వడంతో శాస్త్రీయ సంగీతానికి బదులు పోప్ సంగీతం, నృత్యానికి బదులుగా క్యాబ్రే డాన్సులు, బూతు సాహిత్యంతో కూడిన ఆటపాటలు రాజ్యమేలుతున్నాయి. ఈ క్రమంలోనే చేతివృత్తుల కళాకారులు, ప్రజలు సామ్రాజ్యవాదుల తాకిడికి తట్టుకోలేక తల్లడిల్లిపోతున్నారు. శాస్త్రీయ సాంస్కృతిక సంప్రదాయాన్ని చాటిచెప్పిన ఎన్నో కళారూపాలు వరుసగా క్రమక్రమంగా అంతరించిపోతున్నాయి.
ఆధునికత పోకడల పొగమంచు కురుస్తున్న, పాశ్చాత్య సంస్కృతి పగబట్టి కరుస్తున్న, నా తెలంగాణ సంస్కృతి జనం గుండెల్లోని జానపదం ఇప్పటికీ… ఉద్యమాలకు ఊపిరై…, చైతన్యపు రాగమై…, ఆటై…, పాటై…, ఆవేదనల జీవితానికి ఆయుధమై…, సజీవ గీతమై – డోల్ దెబ్బల సంగీతమై సాగుతున్న నిజజీవితం నా పల్లెపదం. ఒగ్గుకథ, డోల్‌దెబ్బ, సిందుభాగోతం, కోలాటం, జెడకొప్పు, డప్పులాట, దూలపాట, బతుకమ్మపాట, గంగిరెద్దులాట ఇట్లా ఒక్కటేమిటి, పల్లె పల్లె నిండా ఉన్న కళాకారుల పాదాల ముద్రల్ని కండ్లకద్దుకుంటూ, ప్రజాకళలు, కళారూపాలు వర్ధిల్లాలంటూ నేడు తెలంగాణ సాంస్కృతిక కళాకారులు ఊరురా తిరిగి ప్రదర్శన నిర్వహిస్తున్నారు. తెలంగాణ కళలు, సంస్కృతి మనముందు మధురజ్ఞాపకాలుగా మిగుల నీయకుండా, మనమే వాటికి పునరుజ్జీవం పోయాలి. పాడిపంటలతో పరవశించే తెలంగాణ కళలను బతికించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాశ్చాత్యదేశాల విషసంస్కృతిని పారద్రోలాల్సినపుడే తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకొంటాము.
కోస్తాంధ్ర పాలన కింద ఎన్నాళ్ళనీ బతుకుదాము. సంప్రదాయ వాయిద్యాలు, ఆటలు, పాటలతో అందరమొక్కటై, తెలంగాణ వీరయోధుల జీవితాలను నెమరేసుకుందాం.
చావును చిరునవ్వుతో ఆహ్వానించే నవతరం నేడు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోయాలి. ఈ ఆంధ్ర వలస పాలకులతో పోరాడుతూ వీరోచిత మరణాలకు సిద్ధపడాలే తప్ప, ఆత్మహత్యలు చేసుకోవడం ద్వారా తెలంగాణ రాష్ట్రం రాదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వీరోచితంగా పోరాడి ప్రాణాలు ధారపోసిన చాకలి అయిలమ్మ నుండి బెెల్లి లలిత వరకు ఎంతోమంది అమరవీరులు చిందించిన నెత్తురు సాక్షిగా వాళ్ళ ఆశయాలను స్మరించుకుంటూ, వారి బాటలోనే పునరంకితం కావాలి. శ్రీకాంత్‌చారి నుండి యాదయ్య సాయిప్రసాద్ వరకు 200లకు పైగా అమరుల ఆత్మ బలిదానాల సాక్షిగా వాళ్ళ కళలను సాధించుకుందాం. కన్నీటి తెలంగాణలో నవ్వులు కురిపించేందుకు విద్యార్థి, యువతరం మేధావులు, ప్రజలు కల్సి పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
-
Recent Posts
- జనవరి – ఫిబ్రవరి, 2025
- తన మార్గంలో నడవాలని తపన పడిన బోయి విజయభారతి – కొండవీటి సత్యవతి
- ప్రాచీన తెలుగు సాహిత్య విమర్శకు అంబేద్కర్ ఆలోచనను పరికరంగా అందించిన బోయి విజయభారతి – ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే
- సనాతన వర్ణవ్యవస్థ అధర్మంపై సాహిత్య ఖడ్గం ఝుళిపించిన క్రాంతిజ్యోతి – బి.ఎం. లీలాకుమారి
- మృదువుగా మాట్లాడటం ఆమె ప్రత్యేకత – కె.లలిత
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
March 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags