ఉంగుటూరి శ్రీలక్ష్మి
భారతదేశ స్వాతంత్య్రం కోసం ముమ్మరంగా ఉద్యమాలు జరుగుతున్న రోజులు. నవంబర్ 27 తేదీ 1919 సం||లో శ్రీమతి సుగుణమణి కాకినాడలో జన్మించారు. వారి తండ్రిగారు గురుజు వెంకటస్వామి, తల్లి సూర్యనారాయణమ్మ. వారిది సమిష్టి కుటుంబం. ఆరుగురు ఆడపిల్లలు, నలుగురు మగపిల్లలు. ఆడపిల్లలలో పెద్దది సుగుణమణి. ఆ రోజులలోనే మగబిడ్డలతో సమానంగా ఆమెను మహారాజావారి కాలేజీలో డిగ్రీ చదివించారు. చిన్నప్పటినుండీ సత్సాంగత్యంలో పెరగటంవల్ల సుగుణమణి గారికి సేవాభావం అలవడింది.
ఆమె చదువుకునే రోజులలోనే భూకంపాలు, వరదలు, ఉప్పెనలు వచ్చినప్పుడు, ఇంటింటికీ వెళ్ళి విరాళాలు సేకరించి కాలేజీ యాజమాన్యానికి అప్పగించేవారట. తనలోని తపనను అక్షరాలతో పొదిగి గృహలక్ష్మి, భారతి వంటి పత్రికలకు వ్యాసాలు వ్రాసేవారుట.
సుగుణమణి వివాహం గాంధేయ వాది శ్రీ కంచర్ల భూషణం గారితో జరిగింది. ఆ రోజుల్లోనే కట్నకానుకలు వద్దని, చదువు, సంస్కారం వున్న అమ్మాయి కావాలని సుగుణమణి గారిని వివాహం చేసుకున్నారు. భూషణం గారి ఉద్యోగరీత్యా దంపతులు ఢిల్లీ వెళ్ళారు. అప్పటికే ఆకాశవాణి ప్రారంభించారు. సుగుణమణి తొలి తెలుగు ప్రసంగం ఢిల్లీ నుండి ప్రసారమయింది. 1944 సం||లో భూషణం గారికి మద్రాసు బదిలీ అయింది.
”చిన్నప్పటినుండీ శ్రీమతి దుర్గాబాయమ్మ గారి ధైర్యసాహసాలు, సేవానిరతి వింటూ వుండటం వల్ల, ముఖ్యంగా ఆమె స్త్రీలకు ప్రత్యేక సభను ఏర్పాటుచేసి మహాత్మాగాంధీతో ఉపన్యాసం ఇప్పించటం, నెహ్రూ అంతటి వాడిని టిక్కెట్టు చూపించమని నిలదియ్యటం, ఉప్పు సత్యాగ్రహంలో లార్డ్ కన్నింగు హామ్‌నే ఎదిరించిన ధీరవనితని కలుసుకోవాలని కలలు గన్నాను” అన్నారు సుగుణమణి చిరునవ్వుతో అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.
భర్త భూషణం గారి ప్రోత్సాహంతో, సుగుణమణి, దుర్గాబాయమ్మ గారిని కలసి మీతోపాటుగా సేవ చెయ్యాలని వుంది అని చెప్పారుట. దానికామె ”డబ్బు ఎంతయినా సంపాదించవచ్చు – కాని నిస్వార్థంగా సేవ చేసే వ్యక్తులు దొరకటం చాలా కష్టం” అంటూ సంతోషంగా సుగుణమణిని దగ్గరకు తీసుకున్నారట. వారి తల్లిగారు చెన్నూరి కృష్ణవేణమ్మ గారిని, తమ్ముడు నారాయణరావుని పరిచయం చేశారుట. అంతేకాకుండా ”ఆంధ్రమహిళ” పత్రిక పూర్తి బాధ్యతను సుగుణమణి గారికే వప్పగించారట.
అక్కడే బులుసు సాంబమూర్తిగారు, భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, టంగుటూరి ప్రకాశం పంతులు గారు మొదలైన ప్రముఖుల సాంగత్యంతో ఆమె ఎన్నో విషయాలు తెలుసుకోగలిగారుట. దుర్గాబాయమ్మ గారితో కలిసి ”కస్తూరిబానిధి”కి విరాళాలు ఒక సంవత్సరంలో 6 లక్షలు ప్రోగు చేశారుట. ఆ రోజుల్లో 6 లక్షలంటే సామాన్యం కాదు.
1945 సం||లో విరాళాలు సేకరించిన అన్ని రాష్ట్రాల సెక్రటరీలను సేవాగ్రాం రమ్మని గాంధీజీ ఆహ్వానించారు. అక్కడ మహాత్ముడు ఉపన్యసిస్తూ ”మీరు ‘బా’ గురించి విరాళాలు సేకరించారు కాబట్టి, మీ రాష్ట్రాలలో, ముఖ్యంగా గ్రామీణ స్త్రీల విద్యా, వైద్యసేవలకు, వారిలో సామాజిక చైతన్యానికి, స్వయం ఉపాధి కార్యక్రమాలకు వినియోగించండి!” అని ఆదేశించారుట.
మహాత్ముని ఆజ్ఞ ప్రకారం దుర్గాబాయమ్మ గారు సుగుణమణితో కలసి, రాష్ట్రమంతా పర్యటించి, ”కస్తూరిబా సేవా సంఘాలు” స్థాపించి అనుభవజ్ఞులైన సేవికలను ఏర్పాటుచేశారు. ఈనాటికీ అవి నిర్విరామంగా సేవలు చేస్తున్నాయంటే వాటి వెనుక సుగుణమణి గారి కృషిని మనం అభినందించాలి.
భూషణంగారి ఉద్యోగరీత్యా అరకు వెళ్ళినప్పుడు అక్కడి గిరిజనుల పూరిళ్ళు, ఆహారం, భాష, కట్టుబాట్లు విచిత్రంగా వుండటం ఆమె గమనించారుట. అక్కడి అనారోగ్యాలూ, విషజ్వరాలూ, కొండదేవతలకిచ్చే నరబలులు, జంతుబలులూ చూసి చలించిపోయి, మద్రాసులోని స్త్రీ శిశు సంక్షేమ అధికారి పారిజాతం నాయుడికి లేఖ వ్రాశారుట. ఆమె సహకారంతో ఒక సంక్షేమ కేంద్రాన్ని స్థాపించి, తమ కాలనీలోని స్త్రీల సహకారంతో పిల్లలకు చదువు, ఆటపాటలు, కుట్లు, పారిశుధ్యం నేర్పుతూ సుగుణమణి ఐదు సంవత్సరాలు వారికి సేవ చేశారుట. ఇప్పటికీ అక్కడ ఆ కేంద్రంలో స్త్రీలకు, పిల్లలకు చదువు, వృత్తివిద్యలు, ఆరోగ్యసూత్రాలు నేర్పుతున్నారుట.
శ్రీమతి దుర్గాబాయమ్మ గారి కోరిక మేరకు 1957 సం|| అక్టోబర్‌లో హైదరాబాదు వచ్చి ఇక్కడే స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు.
”ఆంధ్రమహిళాసభ” హైదరాబాద్ శాఖను అప్పటి రాష్ట్రపతి శ్రీ బాబూ రాజేంద్రప్రసాద్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అప్పుడు విద్యానగర్‌లో ప్రారంభించిన ”ఆంధ్రమహిళాసభ” మెటర్నిటీ హాస్పిటల్, హేండీక్రాఫ్ట్స్ ఇన్‌స్టిట్యూట్, హైస్కూల్, హాస్టల్, అసెంబ్లీహాల్‌లతో నిండిపోతే, ఉస్మానియా యూనివర్సిటీలో కూడా స్థలం తీసుకుని ఆర్ట్స్, సైన్స్, లా కాలేజీలు, కంప్యూటర్ కోర్స్, సంగీతం క్లాసులు, లిటరసీ భవన్, గాంధీభవన్, హాస్టల్, వికలాంగుల స్కూలు, ఫిజియోథెరపీ, నర్సింగు హాస్టల్ అలా ఎన్నో ఏర్పాటు చేశారు. 260 మంది పిల్లలు ఎన్నో వృత్తి విద్యలు నేర్చుకుంటున్నారు.
మెడ్రాస్, హైదరాబాద్‌లలోనే కాకుండా, కర్నూలు, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఇబ్రహీంపట్నంలలో కూడా ఆంధ్రమహిళాసభ ఎంతో కృషి చేస్తున్నది. ఎడల్ట్ ఎడ్యుకేషన్ రూరల్ ఏరియాలలో లిటరసీ హౌస్ దక్షిణ భారతంలో ”ఆంధ్రమహిళాసభ”లో మాత్రమే వున్నది. వాలంటరీ సెక్టార్‌లో కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఇచ్చే మొదటి సంస్థ యిదే.
ఇన్ని సంస్థలు దుర్గాబాయమ్మ గారి తదనంతరం కూడా అంత ఘనంగానూ నడుస్తున్నాయంటే, శ్రీమతి సుగుణమణి గారి ఓర్పు, నేర్పు, సహనం, సమయపాలనల వల్లనే.
”దుర్గాబాయమ్మ గారిని కలిసిన వేళావిశేషం వల్లే ఆమె నాకు తోడూ, నీడా, గురువూ అయి ఇన్నేళ్ళుగా నన్ను నడిపిస్తున్నారు. రక్తసంబంధాన్ని మించిన, ఆత్మీయతానుబంధం మాది. నా రజత, స్వర్ణ, వజ్రోత్సవాలు ఇక్కడ సభతో పాటే జరుపుకున్నాను. వీటి వెనకాల ఎన్నో తీయని అనుభూతులు, అనుభవాలు, వాటి వెనుక ఎంత అవిశ్రాంత శ్రమ వున్నదో మా ఇద్దరికే తెలుసు. ఆమె సంకల్ప బలం, అచంచల విశ్వాసం మాచేత సేవారంగంలో ఘనవిజయాలు చేయించి, సాధించగలిగే లాగా చేశాయి. దుర్గాబాయమ్మ గారు భౌతికంగా మన మధ్యన లేకపోయినా, ఆమె యిచ్చిన మనోధైర్యంతో ఎందరి కన్నీళ్ళో తుడవగలిగాము. ఈ వటవృక్షం నీలో ఎందరికో ఆశ్రయం కల్పించగలిగాము. ఆమె దీవెనల వల్లే ఈనాటికీ, ఈ వయసులో కూడా తెలియకుండా నలుగురికీ సేవచేసే అదృష్టం కలిగింది”. సుగుణమణి గారి మాటల్లోనే, ఎంత ఎదిగినా, వొదిగివుండే ఆమె తత్వం గోచరిస్తుంది. అందుకే అందరూ ఆమెను ‘అమ్మ’ అనే సంబోధిస్తారు.
”ఆంధ్రమహిళ” పత్రిక పూర్తి బాధ్యత శ్రీమతి సుగుణమణి వహించారు. అందులో కనుపర్తి వరలక్ష్మమ్మ, ఆచంట రుక్మిణమ్మ, కాంచనపల్లి కనకాంబ, మొదలైన ఆనాటి ప్రముఖ రచయిత్రుల వ్యాసాలను ప్రచురించటమే కాదు, తనూ స్వయంగా వ్రాసి పత్రికను తీర్చిదిద్దారు.
ప్రూఫులు దిద్దటం దగ్గరనుంచీ, స్టాంపులు అంటించి నడిచివెళ్ళి పోస్ట్ చెయ్యటం దాకా అన్ని బాధ్యతలూ సుగుణమణి గారే చేసేవారు. ఆమె పనితీరు చూసి శ్రీమతి దుర్గాబాయమ్మగారు 1947 జూన్ ”ఆంధ్రమహిళ”లో సంపాదకీయం వ్రాశారు.
”ఆంధ్రమహిళ” సంపాదకురాలిగా ఇంకనూ నాపేరే ప్రకటింపబడుతున్నప్పటికీ, నా బాధ్యత తక్కువనీ నా సోదరి సుగుణమణియే కార్యభారమంతా మోస్తున్నదనీ ఇదివరలో విన్నవించాను.
పత్రికా ప్రచురణ ఎంత కష్టసాధ్యమో తెలియని వారుండరు. అందులోనూ ప్రజాదరణ తప్ప సొత్తులేని ‘ఆంధ్రమహిళాసభ’ వంటి సంస్థ పత్రికా నిర్వహణలో ఎన్ని కష్టాలు, అవాంతరాలు ఎదుర్కోవలసి వుంటుందో ఊహించవచ్చును. ఈ పరిస్థితులలో సుగుణమణి రెండు సంవత్సరాలు ‘ఆంధ్రమహిళ’ను పెంచి, భూషణంగారికి, బెజవాడ బదిలీ అవటంతో నాచేతుల్లో పెట్టింది. ప్రస్తుతం ‘ఆంధ్రమహిళ’కు ఆమెలేని లోటు ఏర్పడిందనటంలో అతిశయోక్తి లేదు.
ఆంధ్రనారీలోకానికి సేవచేసే ఆదర్శము, అభిలాష, ప్రజ్ఞ గల సుగుణమణి వంటి సోదరీమణి యొక్క సేవ త్వరలోనే లభ్యం కాగలదని నేనూ, ఆంధ్రమహిళాసభా ఆశిస్తున్నాము అని వ్రాశారు.
”నాకు వచ్చిన అవార్డుల కంటే, దుర్గాబాయమ్మ గారు నామీద చూపించిన ఈ అభిమానం, ఆత్మీయత నాకు ఎంతో అపురూపమైన బహుమానం” అంటారు అది తలచుకొని సుగుణమణి.
అటు ‘ఆంధ్రమహిళాసభ’లో స్త్రీ సంక్షేమంతో పాటుగా, యిటు ‘బాలానంద సంఘం’లో శిశుబాలల సంక్షేమానికీ అంకితమయ్యారామె. ‘బాలానంద సంఘం’లో మొదటి నుంచే ఉపాధ్యక్షురాలిగా ఆమె ఎంతో సేవ చేశారు. రేడియో అన్నయ్య రాఘవరావుగారికి, అక్కయ్య కామేశ్వరి గారికి సుగుణమణి గారు ఎంతో ఆత్మీయురాలు.
అన్నయ్యగారు చనిపోయినప్పుడు, అక్కడి కార్యక్రమాలన్నీ అయిపోయాక, జనరల్ బాడీ మీటింగు పెట్టారుట. అన్నయ్యగారి మేనకోడలు కమల, అన్నయ్య గారు యిచ్చారంటూ ఒక కవరు తెచ్చి యిచ్చారుట. అందులో అన్నయ్యగారు తన తదనంతరం ‘బాలానంద సంఘాన్ని’ శ్రీమతి సుగుణమణి గారి అధ్యక్షతన నడపవలసినదిగా వ్రాశారుట. ఆనాటినుంచీ, ఈనాటివరకు ‘బాలానంద సంఘం’ సుగుణమణి గారి అధ్యక్షతన దినదిన ప్రవర్ధమాన మయింది.
అన్నయ్యగారు 1984 సంవత్సరంలో దివంగతులయ్యారు. అప్పటినుండీ పూర్తిగా ‘ఆంధ్ర బాలానందం’ బాధ్యత కూడా శ్రీమతి సుగుణమణి స్వీకరించారు. ”ఆంధ్ర బాలానంద సంఘం” 1990 సంవత్సరంలో స్వర్ణోత్సవాలను దిగ్విజయంగా జరుపుకున్నది.
అక్కడ ‘ఆంధ్రమహిళాసభ’లో కూడా దుర్గాబాయమ్మ గారు దివంగతులయ్యాక పూర్తి బాధ్యతలను చేపట్టారు. ట్రస్ట్ బోర్డ్‌కి యిప్పటికీ తన సహాయ సహకారాలను అందిస్తున్నారు. ఈ మధ్యనే శ్రీమతి దుర్గాబాయమ్మ గారి సెంటినరీ సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరిపించారు.
”ఆంధ్రమహిళాసభ” పెట్టిన కొత్తలో శ్రీమతి దుర్గా బాయమ్మగారు, సుగుణమణి గారు ఇంటింటికీ తిరిగి బేడా, పావలా కూడా విరాళాలుగా సేకరించారు. అలా మొదలైన సేవ ఇప్పటికీ లక్షలలో విరాళాలు సేకరిస్తూ ”ఆంధ్రమహిళాసభ”ను శాఖోపశాఖలుగా విస్తరిస్తూ, కొన్ని శాఖలకు కార్యదర్శి గాను, సలహాదారుగాను సేవలు చేస్తూ, 6 ఏళ్ళు అధ్యక్షురాలిగా సమర్ధ వంతంగా ఆ పదవిని నిర్వహించారు. ఇప్పటికీ ఆమె లేకుండా ‘సభ’లో ఏ కార్యక్రమం జరగదు.
1944 నుంచీ ఆలిండియా రేడియోలోనూ, టి.వి. వచ్చిన తరువాత అన్ని ఛానల్స్‌లోను ఎన్నో స్త్రీల సమస్యల గురించి తన నిశ్చితాభిప్రాయాలను వెలిబుచ్చుతూనే వున్నారు. శిశువుల నుంచీ వృద్ధుల దాకా స్త్రీలను ఆదుకోవాలనే దుర్గాబాయమ్మ గారి ఆశయాన్ని కూడా సుందర్‌నగర్‌లో వృద్ధాశ్రమం ఏర్పాటుచేసి పూర్తిచేశారు. ‘ఆంధ్రమహిళాసభ’కు అవసరమైన భవనాలను తను సేకరించిన విరాళాలతో నిర్మించారు. సమయపాలనకు ఆమె చాలా విలువ యిస్తారు. నిగర్వి, నిరాడంబరంగా వుంటారు. ఆమెను చూస్తే ఈమేనా యిన్ని పనులు చేసింది అని ఆశ్చర్యపోతాము. చాలా సాదాసీదాగా వుంటారు. గేట్‌కీపర్ దగ్గరనుంచీ హాస్పిటల్ సూపరింటెండెంట్ దాకా అందరినీ ఎంతో ఆత్మీయంగా యోగక్షేమాలు నుక్కుంటారు. అందుకే దుర్గాబాయమ్మ గారి జీవితాశయాలకు సుగుణమణి గారు వారసులై నిలువగలిగారు. ఆమె అందరికీ ‘అమ్మే’.
ఈ వయసులో కూడా ‘సభ’కు వెళ్తూ అందరికీ ఉత్సాహాన్ని యిస్తున్న సుగుణమణి ఆయురాగ్యోగాలతో వుండాలని, ఎందరో ఆమె చల్లని నీడలో సేదదీరాలనీ కోరుకుందాం.
సుగుణమణి గారిని ఎన్నో అవార్డులు, రివార్డులు వరించినాయి. 1991 సంవత్సరం ఛైల్డ్ వెల్ఫేర్‌కి గాను నేషనల్ అవార్డు అప్పటి ప్రెసిడెంట్ చేతులమీదుగా అందుకున్నారు. అదే సంవత్సరం శిరోమణి ఇన్‌స్టిట్యూట్, న్యూఢిల్లీ వారి వికాసశ్రీ అవార్డు, 1993లో భరతముని కళా అవార్డు, 1994లో రాజీవ్‌రత్న నేషనల్ అవార్డు, మిలీనియమ్ అవార్డు, 2000 సంవత్సరంలో లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్ రామకృష్ణమఠ్ ద్వారా, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా 2001 మార్చి 8న హైదరాబాద్ పెరల్ సిటీ జూనియర్ ఛాంబర్ వారు హైదరాబాద్ పెరల్ అవార్డు, గాంధీగారి మనుమరాలు, తారాగాంధీ చటర్జీ ద్వారా ఫిబ్రవరి 6, 2002న సర్వోదయా సంస్థ అవార్డు అందుకున్నారు.
ఇన్ని అవార్డులు, రివార్డులూ వచ్చినా, ఆమె సాదాసీదాగా వుంటూ ఎప్పుడూ నవ్వుతూ అందరినీ పలకరిస్తుంటారు. కీర్తికాంక్ష లేకపోవటమే ఆమెకున్న విశిష్టగుణం. ఈ వయసులో కూడా తను పనిచేస్తూనే అందరిచేత పనిచేయించటం ఆమెలోని గొప్ప వ్యక్తిత్వం.
అందుకే సుగుణమణి గారిలో అందరికీ ఆత్మీయంగా చూసే ”అమ్మే” కనబడుతుంది.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags