శిలాలోలిత
వనజలేదన్నది మింగుడుపడని నిజం
ఆమె అనేక చేతుల మానవహారం
కష్టాలలో కన్నీళ్ళలో ఆమె ఒక ఓదార్పు
ఊహ తెలిసిన వయసునుండే ఆమె ఒక ఉద్యమం, పోరుబాట
న్యాయవాదం ఆమె నిజాయితీకి మొక్కింది
ఆపన్నులకోసం, హక్కులకోసం ఆమె గొంతు పదునెక్కింది
వనజంటే స్నేహం
వనజంటే అభిమానం, ఆశ, ఊరట, సంకల్పం
వనజకు సరిసాటి వనజే
పట్టువదలని ధృడచిత్తంతో పదిమంది నడిచే పల్లేరుబాటను పూలబాటగా మలచాలనుకున్న ఆచరణశీలి
???
అన్నీ సరే!
ఇంత యుద్ధసంరంభంలో అదనంగా ఆమె
దేహంతోనూ పోరాటానికి నడుం కట్టింది.
ఒంట్లోకి జొరబడ్డ అనేక రుగ్మతలతో
గుండె దిటవుతో తలపడింది.
శరీరాన్ని కోసి కోసి
ఎన్ని కుట్లు కుట్టినా, మందు మాకుల్తో నిద్ర పుచ్చినా
మళ్ళీ మళ్ళీ నిద్రలేచే దేహం
శస్త్రచికిత్సల విచికిత్సల మధ్య,
దేహానికీ సందేహానికి నడుమ
ఆమె పోరాడింది తన దేహంతో మాత్రమే కాదు,
తన సంకల్పంతో కూడా-
కడకు, చిర్నవ్వునే తన సమాధానంగా మలుచుకుంది
కలిసినప్పుడు అస్థిపంజరంలా కన్పించినా
మాటలకు మాత్రం ఎక్కడా బలహీన స్వరాన్ని తొడగలేదు
కళ్ళలోంచి వెలుగును మాత్రం ఎప్పుడూ పంపలేదు
వాడని మాటలు, వాడి తగ్గని లక్ష్యం
నిరాశను తన నిఘంటువులోంచి తుడిపేసిన చిత్తంతోనే ఆమె
వైద్యుల ఓపికను పరీక్షకు పెట్టినట్లు
ముసురుకున్న, ముంచెత్తిన వైద్యంమధ్య
ఏ క్షణంలోనో ఆమె ఆలోచించడం మొదలుపెట్టింది శరీరం చికిత్సకు లొంగని క్షణంతో
ఆమె సంభాషించింది.
తన దేహపోరాటంతో ‘ములాఖత్’ జరిపింది.
తన ఆలోచనలకు తన ముంగిట పరుచుకుని
వాటితో ముచ్చటించింది
కడసారి లేఖగా తనతో తాను మాట్లాడుకుంది.
”పిరికితనమూ, ఇదే పరిష్కారమూ” కాదని తెలుస్తున్నా
అన్నీ తెలిసి తెలిసి
అన్నిటినీ తెలుసుకున్న వనజ
దేహంతో జరిపిన సుదీర్ఘ సంభాషణకు మాత్రం
విరామం ఇవ్వాలనుకుంది.
విరమణ దేహంనుంచి తప్ప
ఆశయంతో మాత్రం కాదనుకుంది
అందర్నీ ఆదరించే వనజ, ప్రేమించే ఆమె
తన దేహానికీ సాయం చేద్దామనుకుందేమో!
తన దేహానికి రాసిన లేఖ
బహుశా అది ఏళ్ళుగా తనకూ ప్రపంచానికి/దేహానికి
సామరస్యం’ కుదరక రాసిన ప్రేమలేఖ
”తనతో ముడిపడివున్న పనులాగకూడదని” అభ్యర్ధన
కడసారి కోర్కెలోనూ
ఆమె ప్రకటించుకున్న ఉదాత్తతే ఆమె అసలైన వ్యక్తిత్వం.
వనజంటేనే మొక్కవోని సంకల్పం
ఆ సంకల్పం మరణానికి మాత్రం లొంగదు
కాకపోతే ఈమె మరణం
ఒక విరామం మాత్రమే.