శైలజామిత్ర
”నీకెన్నిసార్లు చెప్పాను… ప్రేమలు దోమలు వద్దే… ఇవన్నీ నిలబడవే… అని… చిలక్కు చెప్పినట్టు చెప్పానుకదే… విన్నావా…? నేను లేకపోతే చచ్చిపోతాడటమ్మా… అన్నావు… అప్పుడు వాడు చచ్చిపోయి వుంటాడో లేదో తెలియదుకానీ… ఇప్పుడు మాత్రం నిన్ను చావనీయక, బతకనీయక జీవచ్ఛవాన్ని చేస్తున్నాడు… అవ్వ… ఎవరైనా వింటే నవ్విపోతారు… పెళ్ళయి ఏడాది కాలేదు… మీ అమ్మాయి ఎవరినో ప్రేమించిందంట కదా…? అయినా ఆడపిల్లల్ని అదుపులో వుంచుకోవాలి… లేకుంటే ఇలాంటివే జరుగుతాయి… అంటూ అనని వారులేరు… వీధిలో తలెత్తుకోలేకుండా చేసావు. ఇప్పుడేమో తిరిగి వచ్చావు. వాడు నాకు వద్దు అంటూ. ఏం జరిగిందో చెప్పవు. పోనీ వట్టిమనిషివా అదీ కాదు… ఈరోజో రేపో పురుడు వచ్చేలా వుంది. ఈ లోకంలో ఇంకా ఎన్నిమాటలు వినాల్సి వస్తుందో కదా! పుట్టేది మగపిల్లవాడు అయితే పర్వాలేదు. ఎలాగోలా బతుకుతాడు. అదే ఆడపిల్లయితే? ఇంకేమయినా వుందా? అదీ తండ్రిని వదిలిన తల్లికి పుట్టిన పిల్లని సమాజం బతకనిస్తుందా? అంటూ కన్నీళ్ళు తుడుచుకుంటోంది మాటిమాటికి తల్లి కామేశ్వరి…!!
‘అబ్బ…ఊరుకోవే… ఎందుకే అంత హైరానా పడతావు. వచ్చి వారం కూడా కాలేదు… అసలే వట్టిమనిషి కాదు… విషయం అంతా అదే చెబుతుందిలే… రేపోమాపో పిల్లోపాపో పుడితే ఎక్కడికిపోతాడు. వాడే వస్తాడు. నువ్వు ఏడిచి దాన్ని ఏడిపించకు. ప్రేమలు వద్దురా అంటే వినరు. అది వాళ్ళిష్టం అంటారు. సర్దుకుని బతకండిరా కూడా వినరు అదీ వాళ్ళిష్టమే అంటారు. ఈ కాలం పిల్లల్ని ఏమి అనలేం. ఏదో దానికెలా బావుంటుందో అదే నిర్ణయించుకుంటుందిలే. ముందు దాన్ని విశ్రాంతి తీసుకోనివ్వు… ఇప్పుడు దానికి విశ్రాంతి ఎంతో అవసరం అన్నాడు రామశర్మ… స్నానానికి వెళుతూ…”
”మీకేం…తెలుస్తుందండీ… నా బాధ…! మగమహారాజులు మీరెన్ని చేసినా ఎవరూ ఏమీ అనరు… అంతా తప్పు మా ఆడవారికే కట్టపెడతారు… ఉన్న ఒక్కగానొక్క కూతురు ఇలా రావడం నేను భరించలేకపోతున్నాను… రేపు ఒంటరిగా అలా వుండిపోతే పాడులోకం దాన్ని బతకనిస్తుందా? అంటూ మళ్ళీ రాగాలు అందుకుంది… అది గమనిస్తున్న దివ్య ఇక లాభం లేదని గ్రహించి ”అమ్మా… నువ్వేమీ నాకోసం దిగులుపడక్కరలేదు… ఎవరి జీవితం వారిది. అయినా నాకులేని బాధ నీకెందుకు? ఇది నా జీవితం. ఈ డెలివరీ అయ్యేవరకు వుంటాను. ఆ తర్వాత నా దారి నేను చూసుకుంటాను. కాదు ఇలాగే ప్రతిరోజు ఏడుస్తాను అని నువ్వంటే ఇప్పుడే వెళ్లిపోతాను. ఏదో తల్లివి. ఈ సమయంలో నువ్వుకాక నాకు ఎవరు చేస్తారు అని వచ్చానే కానీ నిన్ను ఏడిపించడానికి కాదు. మిమ్మల్ని తలవొంచుకునేలా చేసాను అని నువ్వనుకుంటే నా గురించి ఇక బాధపడకండి” అంది ఖచ్చితంగా…
”చూసారా చూసారా ఎంతలేసి మాటలంటోందో… నేను ఒకవైపు దానిగురించేకదా బాధపడుతుంది… దానికి ఏమైనా భర్తకు దూరం అవుతున్నానే అనే దిగులు వుందా? అంది కోపంగా…”
”కామేశ్వరీ… నిన్ను ఊరుకోమన్నానా? ఏది ఎలా జరుగుతుందో అలా జరగనీయి. మనదేముంది అంతా విధి అంతే… దాని ముఖంలో అలా రాసిపెట్టివుంటే అలాగే జరుగుతుంది. వదిలేయి… అంటూ భార్యను ఓదార్చేడు.
వయసు ఎంతున్నా బతికే విధానం, తగిలిన దెబ్బలు మన జీవితాన్ని రాటుదేల్చు తాయి అన్నట్లు వాతావరణం ఉదయమంతా వేడిగా వున్నా రాత్రి చల్లని గాలికి ఉదయపు వేడిని మరిచిపోతాము కానీ… దివ్యకు వాతావరణం చల్లగా వున్నా తన గుండెమాత్రం వేడిగా ఆవేదనగానే వుంది… రవి ఎంతో ప్రేమించానన్నాడు… తను లేకపోతే బతకలేనన్నాడు… తను నవ్వితే నవ్వాడు తన కంట్లో నీళ్లువస్తే తాను కన్నీరు కార్చేడు… తను బిడ్డను మోసేదాకా తనను బిడ్డలా చూసుకున్నాడు… అంతలో అంతమాట అనడానికి ఎలా మనసొచ్చింది? అర్థం కావడంలేదు… అనుకుంటూ వస్తున్న చిరుజల్లులతో పాటు కంట్లో కూడా వస్తున్న నీటిని తుడుచుకుంది… అంతలో ‘ఏమ్మా… పడుకోలేదా? అనే తండ్రి మాటకు ఉలిక్కిపడి… లేదు నాన్నా… బయట బావుంటేనూ అని మాటమార్చినా కంట్లో తడిని పూర్తిగా తుడవలేకపోయింది… అది గమనించినా ఏమాత్రం బయటపడనీయక దివ్యా… ఇది జీవితం… పొరపాటు ప్రతి చోట జరుగుతుంది… అది సరిదిద్దుకునే దయితే సర్దుకోవడంలో తప్పులేదు… సరిదిద్దుకోలేనిదయితే మాత్రం ఎంత తొందరగా సమాధానపడితే అంత మంచిది… నువ్వేం చిన్నపిల్లవు కావు. ఆలోచించుకో. జరిగేది జరుగుతుంది అంటూ వెళ్లిపోయాడు…
నిజమే… నాన్న కదా! ఆయన అలాగే మాట్టాడతారు… అమ్మ ఏడుస్తుంది. నా దురదృష్టాన్ని తలుచుకుని ఆవేదన చెందుతుంది. అంతకంటే ఎవరికి ఎవరు మిగులుతారు? అనుకుంటూ నాన్న అన్నట్లు జరిగేది జరుగుతుంది తప్పదు. ఇంతకీ నాకు పుట్టేది బాబా పాపా? పాపయితేనే రవికి ఇష్టం. కానీ నాక్కూడా పాపే ఇష్టం. ఎవరైతేనేం? నా కడుపున పుట్టి ఎంత బాధపడతారో. నా ఒంటరిజీవితానికి తోడయితే కొన్నాళ్ళు అవుతారు కదా అనుకోగానే నిద్రపట్టేసింది… తనకు తెలియకుండానే…
‘ఆంటీ… దివ్య…?’ అంది మెల్లగా ఉష…
”లోపలుందమ్మా… ఆడపిల్ల పుట్టింది” అంది దిగులుగా… కామేశ్వరి.
”పాపా… ఓగాడ్… నాకెంత ఇష్టమో ఆంటీ” అంటూ ఒక్క ఉదుటున లోపలికి వెళ్లింది…
”అన్నీ సక్రమంగా వుంటే నాకూ ఇష్టంగానే వుండేది… కానీ… ఏంచేద్దాం” అనుకుంటూ లోలోపల గొణుక్కుంది కామేశ్వరి.
”అరెరె… ఏంటే… అంతా నీలానే వుంది” అంది నవ్వుతూ.
”అబ్బ… వచ్చావా? ఇంకా తుఫాను రాలేదేమిటా అని అనుకుంటున్నా… నేను వచ్చి పదిరోజులవుతోంది. నీగురించి అడిగితే మీ అమ్మ ఒకలా ముఖంపెట్టి అదివస్తే నీకేంటి అని విసుక్కుంది… సరే… ఈ ఉషోదయం ఎప్పుడొస్తే అప్పుడే నాకు వెలుగు కదాని వచ్చేసా… కానీ ప్రతిరోజూ డాబాపైనుండి మీఇంటివైపుకే చూసేదాన్ని వచ్చివుంటావేమోనని… అంది నిర్లిప్తంగా… దివ్య…
”ఊరుకోవే… పెద్దవారు అంతే వారికి వయసొకటే వుంటుంది కానీ బుర్ర వుండదు… ఏదో అందరి జీవితాలు ఒకేలా వుండాలి అనుకుంటారు. అయినా పెద్దాళ్ళు చేసిన పెళ్లిళ్లు మాత్రం అన్నీ సక్రమంగా వుంటున్నాయా అని… నేను చూడు. పెళ్లయింది. పిల్లల్లేరు. దాంతో మా అత్త మరో పెళ్లి చేయడానికి సిద్ధపడుతోంది. నా మొగుడు ఏదో అమ్మ చెబుతోంది అని అమ్మ మాటవినే బుద్ధిమంతుడిలా తయారయ్యాడు. నేను ఊరుకున్నానా? అసలు లోపం తనలోనే వుందని నమ్మించాను. దాంతో పెళ్లి చేసు కోలేదు. ఏమనుకుంటున్నారో నేను అమాయకురాలినా? ఆహా…!! అంది నాటకఫక్కీలో…
ఆ మాటలకు నవ్వాపుకోలేక పోయింది… ఇలా ఎంతకాలమే… అయినా నీమాటలువిని ఎంతకాలమయిందే అంటూ చాలాసేపు నవ్వింది… హాయిగా… దివ్య.
‘దివ్యా…’
”చెప్పు ఉషా”
”రవి నిన్నంటే ఎంతో ఇష్టపడేవాడు కదా!”
”మరి ఇపుడేమయింది?”
”ఏమోనే… తనకే తెలియాలి అంది నిరాశగా.”
”అలా అని నువ్వు ఊరుకుంటావా.”
”ఊరుకోక ఏమి చేయమంటావు? నీలా లోపం తనలోవుంది అని చెప్పమంటావా?” అంది నవ్వుతూ.
”దివ్యా… బి సీరియస్” అంది ఉష.
”అమ్మో… ఉష కూడా సీరియస్… ఒకె… అంటూ సరదాగా నవ్వుతూ అడిగినా దివ్య కూడా విషయంలోకి వచ్చిందని అర్థమవుతూనే వుంది.
”అదికాదు దివ్యా…! రవి… అని ఆగింది.
”రవి అంటే నాకు మొదట్లో అంతగా నచ్చేదికాదు… ఆ దూకుడు, మాట తొందరతనం, ఇవన్నీ నచ్చేది కాదు. కానీ రాను రాను తను నాకోసం పడే ఆరాటం నేను మాట్లాడాలని తనుచేసే ప్రయత్నం ఇవన్నీ చూసాక. మనిషి తనకోసం అంతగా తపించే వ్యక్తి భర్తగా దొరకటంకంటే ఆనందం ఏముంటుంది అనిపించి, అదీ తాను నిన్ను పెళ్ళి చేసుకుంటాను అన్నాడని నేను ఎంతో విలువ ఇచ్చాను… తాను రమ్మంటే ఆమ్మనాన్నను కూడా కాదని తనను పెళ్ళి చేసుకున్నాను. అయితే చాలాకాలం బాగానే వుంది. అంటే దాదాపు ఒక నెల ముందు వరకు… కానీ, ఏమయిందో ఏమో నాకు అర్థం కావడం లేదు… నెలనుండి సూటిపోటిమాటలు, దెప్పడాలు ఎక్కువ య్యాయి అనేకంటే అవే జీవితంగా మార్చేసాడు. ఆఖరికి తాను అన్న ఒక్క మాట నేను భరించలేకపోయాను ఉషా అంది కన్నీళ్ళతో…”
ఉష మెల్లగా దివ్య భుజంపై చేయి వేస్తూ… ”దివ్యా… ఆ మాట చెప్పకూడని దయితే వద్దులే… కానీ నాకు నువ్వు, నీకు నేను అన్నట్లు చిన్నతనంనుండి చదువు కున్నాం… కష్టమయినా సుఖమయినా పంచుకున్నాం… కాబట్టే నేను నీ దగ్గర ఈ సమయంలో అతని మాట తీయచ్చునా లేదా అని కూడా ఆలోచించలేదు.” అంది చేతికి మంచినీళ్లు అందిస్తూ…!
”అదేంలేదులే ఉషా… నీకు తెలియదు… ఆ మాట తలుచుకుంటేనే నన్నునేను తగలపెట్టుకోవాలన్నంత ఆవేశం దుఃఖం కలుగుతోంది. ఒక మనసుని సంపాదించు కోవడానికి ఎన్నేళ్ళు పడుతుందో తెలియదుకానీ, అదే మనసును విరిచేయ డానికి ఒక్క మాట చాలు అనేలా చేసాడు… ఎప్పుడు తాను బయటకు వెళ్ళి ఆలస్య మయినా నేను ఫోనుచేసి ఇంతసేపయితే ఎలా వుండాలి? అని తపించే నాకు తన ముఖంకూడా చూడాలని లేనంతగా చేసు కున్నాడు… ఛీ…” అంది.
”దివ్యా… ప్లీజ్ అలా అనకే… మగవాళ్ళంతా అంతే అని నేను అనను… కానీ భార్యాభర్తల గొడవలో మాత్రం నూటికి ఎనభైశాతం మగవారిదే తప్పు వుంటుందని మాత్రం అనగలను. కానీ… ఒక్కసారి క్షమిస్తే… తాను ఇకపై ఏమీ అనడేమో అని…”
”ఒక్కసారి అన్నవాడు మరోసారి ఇంతకన్నా పెద్దమాటయినా అంటాడు ఉషా… అదేమన్నా చిన్నమాటా…? ఒకరోజు తాను తొందరగా ఇంటికి వచ్చాడు… నేను ఆశ్చర్యపోయాను…ఏదో గబగబా వెదు క్కుంటున్నాడు…ఏంకావాలి అని అడిగాను… నీకెందుకు నువ్వుండు అసలే నేను తొందరలో ఉంటే అంటూ ఏదో పేపరు తీసుకుని బయటకు వెళ్లాడు… ఆ తర్వాత నాకు మెడికల్ చెక్‌అప్ అయింది. అప్పటిదాకా చాలా కంగారులో వున్నాడు… ఆ రోజు రాత్రి నీ మెడికల్‌రిపోర్ట్సు వచ్చాయి యు ఆర్ పర్‌ఫ్యక్ట్‌లీ ఆల్‌రైట్ అన్నాడు. అదే నాతో మాట్టాడిన ఆఖరుమాట. ఉదయం లేచి కాఫీ ఇస్తుంటే నన్ను పక్కనే కూర్చోమన్నాడు… సరే అని కూర్చుంటే నేను ఒక మాట అడుగుతాను చెబుతావా? అన్నాడు… నే ఏమిటా అని తన వంక చూస్తుంటే…
”దివ్యా… ఇప్పుడు నీకు పుట్టబోయే బిడ్డ నా బిడ్డేనా?” అని అడిగాడు… నాకేమీ తోచలేదు… నేను కూర్చున్నచోటే భూమి క్రుంగిపోతే బావుండేది అనిపించింది. వెంటనే నేను ఏమీ మాట్లాడలేదు… ఆరోజంతా ఆలోచించాను తొమ్మిదోనెల వచ్చింది కదా అనుకుని ఇలా అమ్మదగ్గరకొచ్చేసా… వచ్చేముందు ఒక్క మాట అన్నా… నేను ఇక నీతో కలిసి వుండనని… అంతే… చెప్పు దివ్యా… నాకు మాత్రం విడిపోవాలని వుందా? ఇదివరకు ఎన్ని మాటలకు నేను సర్దుకుపోలేదు? అంతెందుకు పాప పుట్టి రెండు రోజులయ్యింది. కబురు పంపినా చూడడానికి రాలేదు అంది ఆవేదనగా కళ్ళు తుడుచుకుంటూ… అంతా విన్న కామేశ్వరి లోనికి వచ్చి ఎప్పటికీ తానున్నాననే రీతిలో ఆర్తిగా దగ్గరకు తీసుకుంది… దివ్యను…
‘అమ్మా… నేను ఆఫీసుకు వెళ్తున్నా’. అంది యథాలాపంగా దివ్య.
”వెళ్తున్నా కాదురా తల్లి వెళ్ళొస్తా అనాలి అంది ముద్దుల మనవరాలిని ఎత్తుకుని ఆడిస్తూ…
”అలాగేమ్మా… వెళ్ళొస్తా… అంటూ కూతురిచే టాటా చెప్పించుకుని మరీ వెళ్ళింది…
కామేశ్వరి మనవరాలితో కాసేపు ఆడుకుని ఆ తర్వాత నిద్రపుచ్చి, తన పనిలో తాను నిమగ్నమయింది…
రామనాథం ఇటీవలే రిటైరై ఇన్నాళ్లూ టీచింగు వృత్తిలో వున్నందువల్ల తోచక మళ్ళీ పక్కనే వున్న ప్రైవేట్ స్కూల్లో చేరాడు… దాంతో పిల్లలు, పాఠాలు అవే తన లోకంగా మార్చుకున్నాడు. సాయంత్రం అయ్యేసరికి మనవరాలితో ఆటలు ఇలా కాలాన్ని నడిపిస్తున్నాడు.
స్నేహితురాలు ఉషకు కూడా ఇద్దరు పిల్లలు. తాను సంతోషంగానే ఉంది… కానీ వచ్చినప్పుడల్లా దివ్యను తన కూతురు శ్రీజను పలకరించకుండా వెళ్ళదు… అప్పుడప్పుడు తనకు తోచినంత అల్లరిని పిల్లలతోసహా చేసి విసిగించి మరీ వెళుతుంది…
దివ్యకు ఆఫీసు, ఇంటికి రాగానే తన కూతురి ఆగడాలు అల్లరి ఏకరువు పెడుతూన్న తల్లిని చూస్తూ సంతోషపడటం అలవాటు చేసుకుంది…
ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఇలా నాలుగు పార్శ్వాలు ప్రకృతిలో జరుగుతూనే వున్నాయి. పండగలు వస్తున్నాయి. కొత్త సంవత్సరాలు గడిచి పోతున్నాయి. మనుషులు పుడుతున్నారు… కొందరు చనిపోతున్నారు. ఇలా కాలచక్రం తన విధులు తాను నిర్వర్తిస్తూనే వుంది.
కానీ… దివ్యకు ప్రతిరోజూలానే నిద్ర రావటం లేదు… తాను కోల్పోయింది తెచ్చుకోలేకపోతోంది… నమ్మించి మోసగించిన రవిని మరచిపోలేకపోతోంది… ఆ నమ్మకద్రోహం వలన ఎవరినీ నమ్మలేక పోతోంది… జీవితంలోకి ఎవ్వరినీ ఆహ్వానించ లేకపోతోంది. తిండి తప్పదు. వస్తే నిద్ర తప్పదు… ఏదో జీవచ్ఛవంలా జీవితం గడపక తప్పదనే గడిచిపోతోంది… అలాగని తనను ఎవరు నిత్యం ఓదార్చుతారు?
సమాజం దివ్యను భర్తను వదిలిన, బరితెగించిన స్త్రీగానే చూస్తున్నారు… కొందరు నవ్వుతూ పలకరిస్తారు. మరికొందరు నీ భర్త కనబడ్డాడా? ఆడవారం కదా సర్దుకుపోవాలి ఇలా వుంటే నీ బిడ్డకు అన్యాయం జరుగుతుందని, లోకంలో విలువలేదని నీతులు బోధిస్తూనే వున్నారు. కానీ ఒక్కరు కూడా… తన మనసును గూర్చి తెలుసుకోలేకపోతున్నారు… ఒక స్త్రీ భర్తను వదిలేయాలని ఎందుకనుకుంటుందని ఆలోచించలేకపోతున్నారు…
అయితే… దివ్య ఒకటే అనుకుంటుంది… కాలం మారిందని అనుకుంటున్నాంకానీ… అక్కడే వున్నామని… మనిషి మారడానికి ఒక స్త్రీ మనసును అర్థం చేసుకోవడానికి చాలాకాలం పడుతుందని…!! తప్పులేకున్నా, అపనిందలు నీడల్లా వెన్నంటే తప్పక వుంటాయని…!!
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
ఈ కథ కు ఇన్కా మంచి ముగిమ్పు ఇవ్వచ్చు. రవి కి హెచ్.ఇ.వి వుండి దివ్య ను అలా అడిగాడు. ఆ ప్రాణాంతక వ్యాధి దివ్య కు తన పుట్టబొయె బిడ్డకు లెదని తెలిసి సంతొషంగా వున్నాడు.