భూమిక పాఠకులకు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు
2006 సంవత్సరంలో స్త్రీలపరంగా చూసినపుడు చాలా ముఖ్యమైన పరిణామాలు జరిగాయి. భారతీయ స్త్రీలు అనేక రంగాల్లో అద్భుత విజయాలు సాధించి జయకేతనాలెగరేసారు. భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, కల్పనా చావ్లా ఆశయాన్ని, రోదసికి ఎగిసి వెళ్ళి సాధించగలిగింది. ప్రపంచంలోనే శక్తివంతమైన వ్యాపారవేత్తగా ఇంద్ర నూయీ ఎదగగలిగింది. కిరణ్ దేశాయ్ బుకర్ ప్రైజు గెలుచుకొచ్చింది. ఈ లిస్టు కిందికి ఎందరో మహిళలు చేరతారు. భారత స్త్రీ సాధించలేనిదేమీ లేదని నిరూపిస్తున్న ఈ మహిళలు ఒకవైపు ధగద్ధగాయమానంగా వెలిగిపోతున్నారు. మరోవేపు ఖైర్లాంజి లాంటి హత్యాకాండలో దళిత స్త్రీలు అత్యాచారాలకి, అవమానాలకి, హత్యలకి బలవుతూనే వున్నారు. ‘అభివృద్ధి’ పేరుతో సాగుతున్న హింసకి ఆదివాసీ స్త్రీలు ఆహుతవుతున్నారు. ప్రపంచీకరణ కొడుతున్న చావుదెబ్బలకి రైతులు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. చేనేత మగ్గం మూలన పడి నేతకారుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. రైతక్కలు, నేతక్కలు దిక్కులేనివాళ్ళుగా మిగిలిపోతున్నారు.
గృహహింస తీవ్రరూపం దాల్చింది. స్త్రీల హత్యలు, ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.
దేశంలో జరుగుతున్న నేరాల శాతంలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలబడింది. హెచ్ఐవి సోకిన వాళ్ళు కూడా మన రాష్ట్రంలోనే ఎక్కువ వున్నారు. హెచ్ఐవి వ్యాప్తి దేశంలోనే రెండోస్థానంలో వుండి, ప్రమాదకర పరిస్థితి వేపు పరుగులు తీస్తోంది. ఇది స్త్రీల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఇరవై సంవత్సరాలకే జీవితంలో అన్నీ ముగిసిపోయి ‘పాజిటివ్’ లన్న భయంకర ముద్రవేసుకుని జీవచ్ఛవాలుగా బతుకుతున్న స్త్రీలెందరో. ఆలనా పాలనా చూసేవాళ్ళు లేక అంటరాని వాళ్ళుగా మిగిలిపోతున్నారు.
2006 లోనే కుటుంబ హింసను అరికట్టే చట్టం వచ్చింది. నిత్యహింసలో నలుగుతున్న స్త్రీలకి ఇది వరంలాంటిదే! అయితే అమలులో ఇది ఎంతవరకు విజయవంతమౌతుంది అనేది ప్రశ్నార్థకమే. దీనికి మన రాజకీయ నాయకుల్లో కొరవడిన చిత్తశుద్దే కారణం. చట్టాలు తెచ్చి చేతులు దులిపేసుకోవడం అలవాటైన వీళ్ళు గృహ హింస నిరోధక చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తారో లేదో వేచి చూడాల్సిందే. చట్టం ఒక్కటే హింసను రూపుమాపుతుందనే భ్రమ నాకు లేదు. స్త్రీల పట్ల పురుషుల దృక్పథంలో, కుటుంబం, సమాజం దృక్పధంలో మార్పు రానంతవరకు ఎంతటి శక్తివంతమైన చట్టాలైనా పనికి రాకుండా పోతాయని గతానుభవాలు నిరూపిస్తున్నాయి. ఎంతో ఆశావహంగా, స్త్రీలకు తోడ్పాటు నందించడానికి మొదలైన మహిళా కమీషన్ లాంటి వాటికే రాజకీయ చీడపట్టి నిర్వీర్యమైపోతున్నాయి. అలాగే ఉన్నతమైన ఆశయంతో వచ్చిన సమాచార హక్కు చట్టాన్ని తూట్లు పొడిచే ప్రయత్నాలు ఆరంభమవ్వడం గమనిస్తున్నాం. ఇదెంతో బాధాకరమైన పరిణామం.
2006లో జరిగిన మరో ముఖ్యమైన పరిణామం న్యాయవ్యవస్థ మీద నమ్మకం పెరగడం. ప్రియదర్శిని మట్టో, జెసికా లాల్ కేసులో ఎట్టకేలకు న్యాయం అందడం న్యాయ వ్యవస్థ మీద ప్రజల నమ్మకాన్ని అనూహ్యంగా పెంచింది. హత్యలు చేసిన వాళ్ళు ఎంత ‘గొప్పవాళ్ళ’యినా, ఉన్నత పదవుల్లో వున్నా న్యాయానికి అతీతులు కారని రుజువైంది ఈ కేసుల్లో. మనుశర్మ, సంతోష్ సింగ్లకు శిక్షలు పడడం (ఆలస్యంగానైనా) ఆహ్వానించదగ్గ పరిణామం.
2006లో మరో రెండు ముఖ్యమైన పరిణామాలు- సామాజిక న్యాయం- ఒ.బి.సి లకు ఉన్నత విద్యలో రిజర్వేషన్లు, రెండోది సచార్ కమిటీ రికమెండేషన్లు. భారతీయ సమాజంలో ముస్లింల వెనుకబాటుతనాన్ని ప్రపంచానికి బహిర్గతం చేసిన సచార్ కమిటీ రికమెండేషన్లు- వెనకబాటుతనాన్ని తగ్గించడానికి సూచించిన చర్యలు ఎంతో స్పూర్తిదాయకంగా ఉన్నాయి.
వీటన్నింటినీ గణనలోకి తీసుకుని చూస్తే 2006 ఎన్నో మంచి పరిణామాలనే మన ముందుంచింది. ముఖ్యంగా న్యాయ వ్యవస్థ స్త్రీలకు అందించిన న్యాయం. గృహహింస చట్టం అమలులోను, హింసలో కునారిల్లుతున్న స్త్రీల జీవితాలకు బాసటగా నిలవడంలోను న్యాయ వ్యవస్థ 2006 పంధానే అనుసరించాలని ఆశిద్దాం.