రోష్నీ
చాలాకాలంగా రైలు ప్రయాణంలో నేను గమనించిన ఒక వింత గురించి మీకు చెప్పాలి. తెలంగాణా ఎక్స్‌ప్రెస్‌లోని మహిళలకు రిజర్వు చేసిన కంపార్ట్‌మెంటులో ప్రయాణిస్తే మీకూ ఆ వింత కనిపిస్తుంది. ఆ కంపార్ట్‌మెంటు నిండా ఆలేరు, జనగాం, వరంగల్‌లో ఉద్యోగాలు చేసుకునే స్త్రీలు ప్రయాణిస్తుంటారు. అయితే అందులో విశేషమేముందని మీరడగొచ్చు. కాస్త తొందరపడకండి. రైలు ఎక్కి ఎవరి సీట్లో వాళ్లు కూర్చున్నాక అంతా వాళ్లవాళ్ల టిఫిన్‌బాక్సులు బయటికి తీస్తారు. ఒకరికొకరు తలో కాస్తా పంచుకుంటూ టిఫిన్ కానిస్తారు. ఇంట్లోనే ఆ పనేదో ముగించుకొచ్చే టైము వారి దగ్గర లేదు. ఆ తర్వాత కొంతమంది సామాను పెట్టుకోడానికి ఏర్పాటు చేసిన చెక్క అరలెక్కి నిద్రపోతారు. కొంతమంది ఆఫీసుఫైళ్లు వళ్లోపెట్టుకుని పనిచూసుకుంటారు. పంతులమ్మలయితే పిల్లల పరీక్ష పేపర్లు, హోమ్‌వర్క్ పుస్తకాలు దిద్దుకుంటూ కూర్చుంటారు. మరికొంతమంది అల్లికలు, కుట్లు… అలా ట్రెయిన్‌లో కూడా క్షణం తీరిక లేకుండా పనిచేసుకుంటూ తమ తమ ఉద్యోగస్థలాలు చేరుకుంటారు. తమ ఆఫీసుల్లో ఉద్యోగ బాధ్యతలు చూసుకొని మళ్లీ సాయంత్రం తెలంగాణా ఎక్స్‌ప్రెస్‌లో తిరుగు ప్రయాణం. తిరుగుప్రయాణంలో కూడా షరా మామూలే… ఇలా పగలంతా ఉద్యోగాలు చేసి, రైల్లో ప్రయాణం చేసి ఇల్లు చేరుకునేసరికి రాత్రి పది గంటలు దాటుతుంది. ఇంట్లో మళ్లీ వంటచేసి, భోంచేసి, శుభ్రంచేసి, అన్నీ సర్దుకుని పడుకునేసరికి రాత్రి ఏ పన్నెండో అవుతుంది. మర్నాడు 8-30 గంటలకు ట్రెయిన్ అందుకోవాలంటే తెల్లవారుఝామున ఏ అయిదింటికో లేవక తప్పదు. మళ్లీ వంట, పిల్లలకు, భర్తకు, టిఫిన్లు, లంచ్‌బాక్సులు, తన టిఫినూ, లంచ్‌బాక్సూ – ఇలా అన్నీ సర్దుకుని ట్రెయిన్‌లో మహిళల- కంపార్ట్‌మెంట్‌లో….. ఇలా బిజీబిజీగా గడిపేసే ఈ స్త్రీలకు సరయిన విశ్రాంతి దొరుకుతుందా? 7-8 గంటలు మినిమమ్ నిద్రపోవాలి కదా. మరి నిద్ర సరిపోతుందా? కాని వీళ్లంతా అలా ప్రయాణిస్తూనే నిద్ర పూర్తికాని కళ్లతో ఆఫీసు పనులు ట్రెయిన్‌లో చేసుకుంటూనే (కొంతమంది సాయంత్రం ప్రయాణంలో ఆకుకూరో, చిక్కుడుకాయలో తుంపుకుంటూ కూరకు రడీ చేసుకుంటారు). అదృష్టం బావుండి చోటు దొరికితే కాస్త కునుకు తీస్తూ రిటైరుమెంటు వరకూ ప్రయాణంలో గడిపేసే స్త్రీలు ఉన్నారంటే మీకు ఆశ్చర్యంగా లేదా….. ఇంత ప్రయాసను ఓర్చుకుని, లేని శక్తి తెచ్చుకుని ఇంటి బాధ్యతలు, పిల్లల బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు నెరవేరుస్తున్న ఈ స్త్రీలను చూస్తే ”ఆడాళ్లూ! మీకు జోహార్లు” అనాలనిపిస్తుంది.
కాని ఈ విధమైన జీవనశైలి వల్ల వారి ఆరోగ్యం మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది అని ఆలోచించారా? ఆలోచిస్తే మనకు ఈ కింది విషయాలు తెలుస్తాయి.
నిద్రలేమి అనేది మగవారి మీద కంటే ఆడవారి మీదే చెడుప్రభావాన్ని కలిగిస్తుంది. ఇంతవరకూ జరిగిన కొన్ని పరిశోధనల ఫలితాలు ఇలా ఉన్నాయి.
జి నిద్రలేమి వల్ల త్వరగా నేర్చుకునేశక్తి క్షీణిస్తుంది. మాట్లాడటం కష్టమవుతుంది. మతిమరుపు ఎక్కువవుతుంది.
జి దైనందిన వ్యవహారాలు, పనుల్లో ఏకాగ్రత తగ్గిపోతుంది.
జి కారు ప్రమాదాలు పెరిగే అవకాశం (అంటే నిద్రలేమితో బాధపడుతున్న స్త్రీలు కారు నడిపితే గనక)
జి శరీరం బరువు విపరీతంగా పెరుగుతుంది. (వీళ్లు సరయిన నిద్ర కూడ లేకుండా ఎప్పుడూ ఏదో ఒక పనిచేస్తూనే ఉన్నారు కదా మరి బరువెందుకు పెరుగుతారు అనేది ఒక వింత విషయం.)
జి వ్యాధినిరోధకశక్తి తగ్గుతుంది.
జి విసుగు, అలసట ఎక్కువవుతుంది.
జి పై కారణం వల్ల ఆఫీసులోను, వ్యక్తిగత జీవితంలోనూ సంబంధ-బాంధవ్యాల్లో కష్టాలు.
జి డిప్రెషన్ వస్తుంది.
జి ఇదే నిద్రలేమి దీర్ఘకాలం కొనసాగితే డయాబెటిస్ (చక్కెరవ్యాధి) గుండెజబ్బులు వస్తాయి.
జి నిద్రలేమితో బాధపడేవారిలో గమనిస్తే మగవారి కంటే ఆడవారిలో రక్తపోటు వచ్చే అవకాశం 42% ఎక్కువ.
జి ఇక డెబ్భై ఏళ్లు పైబడ్డ స్త్రీలలో నిద్రలేమి ఉంటే నడుస్తున్నప్పుడు కిందపడి దెబ్బలు తగిలే అవకాశం మగవాళ్లకంటె రెండురెట్లు ఎక్కువ. ఎముకలు విరగడం కూడా తరచూ జరుగుతుంటుంది.
జి ఇక మెనోపాజ్ వయసులో అయితే ఇంటిపనులు, ఉద్యోగ బాధ్యతల వల్లనే కలిగే నిద్రలేమితో పాటు ప్రకృతిసిద్ధంగా వచ్చే హాట్‌ఫ్లషస్ (వంట్లోంచి వేడి ఆవిర్లు వచ్చినట్లుండటం) వల్ల ఈ సమస్య అధికమవుతుంది.
ఈ నిద్రలేమి అనేది ఒక్క ఉద్యోగాల్లో ఉన్న స్త్రీల సమస్యే అనుకునేరు. ఇంట్లోనే ఉండిపోయే స్త్రీలకు కూడ పని బాధ్యతలతో అన్నీ సర్దుకుని నిద్రకు చేరుకునేసరికి చాలా లేటవుతుంది. వయసు పెరిగేకొద్దీ 4-5 గంటలు నిద్రపోతే సరిపోతుంది అనుకుంటారు. అది సరికాదు. ఆ వయసులో కూడా 7-8 గంటలు నిద్రపోగలిగితే మరింత ఆరోగ్యంగా ఉంటారు.
మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? మన టి.విల్లో ఈ మధ్య ఒక ప్రకటన చూపిస్తున్నారు. ఒక తల్లి రాత్రి సరిగ్గా నిద్రపోనందువల్ల అయోమయం (కన్‌ఫ్యూజన్)లో వేరే పాపని తన కూతురనుకుని లాక్కుపోతూ ఉంటుంది. ఆ పాప బేర్ బేర్ మని (మమ్మీ-మమ్మీ అని ఇంగ్లీషులోనే) ఏడుస్తుంటుంది. ఇంతవరకూ బాగానే ఉంది. ఆ నిద్రలేమిని, ఆ అయోమయాన్ని పోగొట్టాలంటే ఎలా? ఫలానా పరుపు కొంటే మీ సమస్య తీరుతుంది… టింగు… టిం…గు…టింగు. ఇది మీ సమస్యకు పరిష్కారం!!! ఫలానా పరుపు మీద నిద్ర బాగా పడుతుందని అనుకున్నా అసలు నిద్రపోయే టైము దొరకక కదా మీరు బాధపడుతున్నది. మరి అదెలా తీరుతుంది? దీనికి పరుపు ఒక్కటే సమాధానం కాదు. ఈ సమస్యను పరిష్కరించాలంటే ప్రభుత్వం, కుటుంబం, మన స్త్రీలు కొన్ని మార్పులు తేవాలి. ప్రభుత్వం స్త్రీ ఉద్యోగుల పట్ల సానుభూతితో వ్యవహరించి ఇంటినుంచి ఆఫీసుకి ఉండే మార్గాన్ని తగ్గించేందుకు ప్రయత్నించాలి. స్త్రీ పనిచేసేచోటు కుటుంబానికి దగ్గర్లో ఉంటేనే బావుంటుంది. పనిచేసేచోటే చైల్డ్‌కేర్‌సెంటరు, ఆడవాళ్లు మధ్యాన్నం భోజనం తర్వాత అరగంట విశ్రాంతి (వీలయితే నిద్రపోయే) వసతి కల్పించాలి. నిద్రలేమితో ఉన్నవారికి ఏకాగ్రత తగ్గుతుందని తెలుసుకున్నాం కదా! దానివల్ల పై ఉద్యోగస్తులు స్త్రీలపై నానా కామెంట్లు చేస్తూ చాలా మొరటుగా వ్యవహరిస్తుంటారు. అలాకాకుండా వారిని సానుభూతితో అర్థం చేసుకుని, మంచితనంతో వ్యవహరించి వారి అసలు సమస్యను పరిష్కరించే విధంగా సాయపడితే మీకు వచ్చే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. ఇక కుటుంబం విషయానికొస్తే భర్త, కాస్త ఎదిగిన పిల్లలు ఇంటిపనుల్లో సాయం చెయ్యడం వల్ల ఆ తల్లికి, కుటుంబానికి కూడ ఎంతో మేలు జరుగుతుంది. పిల్లలు చదువులు పాడవుతాయని భయమక్కరలేదు. ఓ రెండు గంటలు చదివాక, చదువాపి ఓ అరగంట ఇంటిపనిచేస్తే మెదడుకు విశ్రాంతి-ఏకాగ్రత పెరుగుతుంది. అదే సమయంలో తల్లికి విశ్రాంతి, ఆరోగ్యం రెండూ సమకూరుతాయి.
ఇక స్త్రీలు ఓటుహక్కు, 8 గంటల పని హక్కు, సమాన కూలి హక్కు ఇంకా ఇలా చాలా హక్కుల కోసం పోరాడారు. కొన్ని సాధిస్తున్నారు… ఇంకా పోరాడుతూనే ఉన్నారు. రోజుకు 7-8 గంటలు నిద్రపోవడం అనేది కూడా తమ హక్కుగా భావించాలి. కాని నిద్ర సరిపోకుండా ఉండటానికి మన స్త్రీలు కూడా కొంత కారణం. భర్తగాని, పిల్లలుగాని ఇంటిపనిలో సాయం చేయడానికి ఒకవేళ ప్రయత్నిస్తే మీకేం తెలీదులే, వంటగదిలోకి రావద్దు అని వాళ్లని తరిమేస్తారు. అలాకాకుండా వాళ్లని పనిచేయనివ్వండి. ఒక నెలో, ఆర్నెల్లో కాకపోతే ఒక సంవత్సరమో ఓపిగ్గా వాళ్లకి నేర్పించండి. తర్వాత మన ఆరోగ్యమే కదా బాగుండేది.
ఇంకో విషయం ఏమిటంటే పనంతా తమ నెత్తి మీదే వేసుకుని దాన్ని సక్రమంగా నిర్వర్తించడం కోసం స్త్రీలు మొదటగా నిద్రను త్యాగం చేస్తారు. తర్వాత స్నేహితుల్ని కలవడం, పుస్తకాలు చదవడం త్యాగం చేస్తారు. మరీ టైము దొరక్కపోతే తిండినీ త్యాగం చేస్తారు. దీనంతటివల్ల మనకొచ్చే సత్ఫలితాలు ఏమీ లేవు. దుష్ఫలితాల వివరాలు మనం ఆల్‌రెడీ పైన చెప్పుకున్నాం. మరి ఆలోచించండి. మన ఆరోగ్యం మన చేతుల్లో, చేతల్లో ఉంది.
చివరగా నిద్రలేమితో బాధపడుతూ నడుంనొప్పి కూడా ఉంటే టీవీలో చూపించారు కదా అని పరుపుని అసలు ఆశ్రయించొద్దు. చెక్కబల్ల మీదే పడుకోండి.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
ఇటువంటి వ్యాసాలు ఇంకా రావాలి. సమతా రోష్ని గారికి అభినందనలు.