జాతీయ నేరాల నమోదు సంస్థ ప్రతి సంవత్సరం విడుదల చేసే నేరాల నివేదిక విడుదలైంది. మన రాష్ట్రం మహిళలకు సంబంధించి అక్షరాస్యతలో అట్టడుగు భాగాన, అత్యాచారాల్లో, నేరాల్లో అగ్రభాగాన నిలబడింది. దాదాపు ఇరవై కోట్ల జనాభా ఉన్న ఉత్తర ప్రదేశ్ మన వెనుక ఉండటం, ఎనిమిదన్నర కోట్ల జనాభా ఉన్న మన రాష్ట్రం మహిళల పట్ల నేరాల్లో అగ్ర స్థానాన ఉండటం చాలా విషాదకరమైన అంశం.
రాష్ట్రంలో ఉన్న మహిళలు ఒక అభద్రతలో బతుకుతున్నారనడం అతిశయోక్తి కాదు. చదువుకుంటున్న ఆడపిల్లలు ప్రేమ పేరుతో ఎన్ని రకాల దాడులకు గురవుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ప్రేమించమని వేధించే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఒకడు యాసిడ్ పోస్తాడు. ఒకడు బిల్డింగు మీంచి తోసేస్తాడు. ఒకడు ఏకంగా ఆడపిల్ల ఇంటికే వెళ్లి తల్లిదండ్రుల్ని కత్తులతో పొడిచేస్తాడు. ప్రేమించానని చెప్పి ఆడపిల్ల గొంతు కోసేస్తాడు. ఇంకొకడు క్లాస్‌రూమ్‌లో ఉన్న పిల్ల మీద పడి అందరి ముందూ చంపేస్తాడు. ఇంకొకడు ఆడపిల్లని ఎత్తుకెళ్లిపోతాడు. ఇన్ని రకాల హింసారూపాలను అనుభవిస్తూ ఆడపిల్లలు అహరహం నలిగిపోతున్నా, ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్టు కూడా ఉండదు. మొన్నటికి మొన్న పసిపిల్ల, తొమ్మిదో తరగతి చదువుతున్న లలిత యాసిడ్ దాడికి గురై నరకయాతన పడి కన్నుమూసింది.
ఇక వివాహిత స్త్రీలు అనుభవిస్తున్న గృహహింసకు అంతమే లేకుండా ఉంది. గృహహింస నుంచి రక్షణ కల్పించే చట్టమొచ్చి నాలుగు సంవత్సరాలవుతోంది. ఎంతమంది స్త్రీలను కుటుంబ హింస నుంచి రక్షించింది ఈ చట్టం అని ఆరా తీస్తే ఆ సంఖ్య వందల్లో కూడా ఉండదు. లక్షల సంఖ్యలో మహిళలు నిత్యం హింసను అనుభవిస్తూ, ధైర్యం చేసి కొంతమంది మహిళలు రక్షణాధికారుల దగ్గరకొచ్చి కేసులు నమోదు చేసినా, ఆ కేసులు కూడా మాములు కేసుల్లాగానే సంవత్సరాల తరబడి కోర్టుల్లో మగ్గుతున్నాయి. న్యాయవ్యవస్థకి జండర్ సెన్సిటివిటీ లేదనడానికి, జాతీయ నేరాల చిట్టాలో మహిళలపట్ల పెరిగిపోతున్న నేరాల సంఖ్య వీరికేమాత్రమూ పట్టదనేది స్పష్టంగా అర్థమౌతుంది. హింసకు గురవుతున్న స్త్రీలకు సకాలంలో సహాయం, అది పోలీసుల నుంచి, ప్రొటక్షన్ అధికారులనుంచి, న్యాయస్థానాల నుంచి అందిన రోజు ఈ నేరాల సంఖ్య కూడా తగ్గుతుంది. మహిళలపై రకరకాల హింసలకు పాల్పడుతున్న నిందితులు ఎలాంటి శిక్షలూ లేకుండా తప్పించుకుంటున్నారు. ఎలాంటి శిక్షలులేని చోట నేరాలు పునరావృతమవుతాయి తప్ప తగ్గు ముఖం పట్టవు. ఎంత క్రూరమైన, హీనమైన నేరం చేసిన వాడైనా కాలరెత్తుకుని సభ్య సమాజంలో తిరుగుతున్నప్పుడు, ఎలాంటి శిక్షలూ అమలులేనప్పుడు మహిళలపై నేరాలు ప్రతి సంవత్సరం ఇలా పెరుగుతూనే వుంటాయి.
ప్రతి సంవత్సరం విడుదలయ్యే ఈ నేరాల వివరాల్ని ప్రభుత్వం ఎలా తీసుకుంటుందో అర్ధం కావడం లేదు. తీవ్రమవుతున్న పరిస్థితులననుసరించి ఏమైనా కొత్త చర్యలు, మహిళల కోసం కొత్త సదుపాయాలు, నేరాలను తగ్గించడానికి ప్రణాళికలు ఏమైనా సిద్ధం చేస్తుందా? అంటే అనుమానమే. కొత్త ప్రణాళికల మాటేమోగాని మహిళల కోసం ఏర్పాటైన కొన్ని ముఖ్య సంస్థలు, వ్యవస్థలు మూలనపడి మూలుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై నేరాలను అదుపు చేయడానికే కాదు ఆపడానికి అట్టహాసంగా ఏర్పాటైన ‘ఉమెన్ ప్రొటక్షన్ సెల్’ ఉన్నట్లా లేనట్లా అన్నట్టు ఉంది. ఉనికిని కోల్పోయిన ఈ సెల్‌ని పటిష్టపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహిళ హోం మినిష్టర్‌గా ఉన్న చోట మహిళలపై ఇంత పెద్ద స్థాయిలో హింసలు పెచ్చరిల్లడం సిగ్గుచేటు. ప్రతి పోలీస్‌స్టేషన్‌లోనూ సపొర్ట్‌సెంటర్స్ పెడతామని, మహిళలకు అన్ని విధాలుగానూ రక్షణ కల్పిస్తామని యాసిడ్ దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తామని కంటతడి పెట్టి మరీ ప్రకటించిన హోం శాఖామాత్యులు ఏ రాజకీయాల్లో మునిగితేలుతున్నారోగాని మహిళల సంగతి మర్చిపోయారు.
మన రాష్ట్రంలో మహిళా శిశుసంక్షేమానికి మంత్రి లేరు. మహిళలు ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘మహిళా కమీషన్’ రాజకీయాల కుళ్లులో కూరుకుపోయి కనుమరుగైంది. మహిళలకోసం రాజ్యాంగ ప్రతిపత్తితో ఏర్పాటైన మహిళా కమీషన్, రాజకీయ జోక్యంతో కుంటుపడి, ఓ కౌన్సిలింగుసెంటర్‌ు స్థాయికి దిగజార్చబడింది. మహిళల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఉండాల్సిన ప్రధాన వ్యవస్థలు, సంస్థలు ఇలా మూలనపడి మూలుగుతుంటే, ప్రతి సంవత్సరం మహిళల మీద నేరాలు ఇలాగే పెరుగుతాయి. రాజకీయ నాయకుల, ప్రభుత్వాల నిర్లక్ష్యానికి వందలాది స్త్రీలు బలవన్మరణాలకు గురవుతూనే ఉంటారు.
ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని మహిళా కమీషన్‌ను, ఉమెన్ ప్రొటక్షన్ సెల్‌ను పునరుద్ధరించాల్సిన అవసరముందని అర్ధం చేసుకోవాలి. స్త్రీలకు ఏవైతే సహాయ సంస్థలున్నాయో వాటన్నింటినీ ప్రక్షాళణ చేయకపోతే మహిళల పరంగా ఆంధ్ర రాష్ట్రం అన్నపూర్ణ కాదు అధోరాష్ట్రమవుతుంది.
కొసమెరుపు: ఇటీవల ఎక్కడా చూసినా , రోడ్ల మీద, టివీల్లో, పత్రికల్లో పులుల్ని చంపడం నేరం. పద్నాలుగొందలే మిగిలాయి. పులుల్ని రక్షించండి అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ‘మహిళలు హింసకు గురై పెద్ద సంఖ్యలో చనిపోతున్నారు. హింసకు పాల్పడటం నేరం. హింస లేని సమాజం స్త్రీల హక్కు. హింసకు పాల్పడిన వారు కఠినంగా శిక్షించబడతారు’ అని ప్రచారమెందుకు చేయరు! జంతువుకన్నా హీనమా ఈ రాష్ట్రంలో మహిళ???
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
సత్యవతి గారు,
రాష్ట్రంలో మహిళా కమిషన్ దుస్తితిని మీ సంపాదకీయంలో ఎండగట్టారు. జంతువుల కన్న హీనంగా మారుతున్న మహిళల పరిస్తితిని, నానాటికీ పెరిగిపోతున్న అభద్రతని ఇంత సూటిగా ప్రశ్నించడం అభినందనీయం.
-పసుపులేటి గీత