శివరాణీదేవి ప్రేమ్‌చంద్
అనువాదం : ఆర్. శాంతసుందరి
ఇంటర్లు క్లాసు : 1929 నాటి సంగతి. నేను అలహాబాద్ నించి వస్తున్నాను. నావెంట బన్నూ, మా ఆయనా ఉన్నారు. మేం ముగ్గురం ఇంటరు క్లాసులో ప్రయాణం చేస్తున్నాం. అది చైత్రమాసం, అష్టమి. రౖెెళ్లన్నీ కిక్కిరిసి ఉన్నాయి. ఒక స్టేషన్‌లో బోలెడుమంది పల్లెటూరి జనం మా బోగీలో ఎక్కారు. ”ఇది ఇంటర్ క్లాసు, టిక్కెట్టు ధర ఎక్కువ,” అన్నారీయన.
”ఏం చెయ్యమంటారు, బాబూ? రెండ్రోజులుగా ఇక్కడే ఇరుక్కుపోయాం,” అన్నారు వాళ్లు.
”మీరెక్కణ్ణించి వస్తున్నారు, ఎక్కడికెళ్లాలి?” అన్నారీయన.
”అమ్మవారి దర్శనం చేసుకుని వస్తున్నాం బాబూ!”
”అమ్మవారి దర్శనం చేసుకుంటే మీకేం ఒరిగింది? నిజం చెప్పండి, ఒక్కొక్కళ్లూ ఎంత డబ్బు ఖర్చు చేశారు?”
”ఒక్కొక్కళ్లకీ ఎంత లేదన్నా పదిహేనైనా ఖర్చయి ఉంటాయండీ.”
”అంటే మీరందరూ నాలుగు నెలల తిండిగింజలకి పనికి వచ్చే డబ్బుని వృధా చేశారు. ఇంతకన్నా ఆ అమ్మవారి పూజేదో ఇంటి దగ్గరే చేసుకుని ఉండొచ్చే! ఆ దేవత ఎక్కడ లేదని? మీ ఇంట్లో లేదా? మీరంతా సుఖంగా ఉంటేనే కదా ఆ దేవుళ్లు కూడా సంతోషించేది!” అన్నారీయన.
”ఏం చేసేది, మొక్కుకున్నాంగా! ఆవిడ దర్శనానికి వెళ్లకపోతే ఆగ్రహించదా?”
బోగీలో సూది మొన మోపేంత జాగా కూడా లేదు. ఊపిరి సలపనంత జనం. ఉక్క కూడా పోస్తోంది. తరవాతి స్టేషన్‌లో రైలాగగానే నేను ఆయనతో, ”వీళ్లని దిగిపొమ్మని చెప్పండి, మీ ఉపదేశాలేవీ వీళ్ల చెవికెక్కవు,” అన్నాను.
”కానీ వీళ్లకి కాస్త నచ్చచెప్పకపోతే ఎలా చెప్పు!” అన్నారు.
”తరవాతెప్పుడైనా చెపుదురుగాని. నాకు ఊపిరాడటం లేదు.”
”వీళ్ల కోసమే జైలుకెళ్తావు, పోరాడతావు, మళ్లీ వీళ్లనే పొమ్మంటున్నావు. నాకు వీళ్లని చూస్తే పాపం జాలేస్తోంది. మతం పిచ్చిలో పడి ఆకలి చావులు కొని తెచ్చుకుంటున్నారు.”
”బుద్ధి లేకుండా ప్రవర్తిస్తే ఆకలి చావులు చావక మరేం చేస్తారు?”
”ఏం చేస్తాం? తరతరాలుగా ఈ మూఢ నమ్మకాలని పట్టుకుని వేలాడుతున్నారు.”
”స్వయంగా చావు కొరేవాడిని ఎవరు మాత్రం బతికించగలరు? వీళ్లకి బుద్ధి చెప్పాలంటే ఒకటే మార్గం, బలవంతంగా ఏదైనా చట్టాన్ని అమలు చెయ్యాలి.”
”నెమ్మదిగా అర్థం చేసుకుంటారులే. ఆలస్యం అయినా అదే సరైన పద్ధతి. బలవంతంగా ఏ పనైనా చేయించటానికి ప్రయత్నిస్తే రక్తపాతం తప్పదు.”
”ఈ బోగీలో కూర్చుని అంతా నేర్చేసు కుంటారా?”
”మరైతే వీళ్లతో ఎప్పుడు మాట్లాడాలి?”
”మీరు పుస్తకాలకి పుస్తకాలు రాస్తున్నది వీళ్ల కోసమేగా?”
”వీళ్లు నా నవలలు తీసుకుని చదువు తారనుకుంటున్నావా? ఒకటే మార్గం. నా నవలల్ని ఎవరైనా సినిమాలుగా తీసి ప్రతి ఊళ్లోనూ చూపిస్తే జనం చూస్తారు.”
”ముందు మీరు రాయండి. ఆ తరవాత సినిమా తీయించచ్చు.”
మేమిలా మాట్లాడుకుంటూండగానే రైల్వే పోలీసు ఒకడు వచ్చాడు. వాళ్లందర్నీ కోప్పడి, ఇంటరు క్లాసులో ఎక్కినందుకు డబ్బులు చెల్లించమని బెదిరించసాగాడు.
ఆ పోలీసువాడి ధోరణికి ఈయనకి ఒళ్లు మండింది, ”నువ్వు మనిషివా పశువ్వా?” అన్నారు అతనితో.
”పశువు నెందుకయాను? మూడో క్లాసు టిక్కెట్టు కొని ఇంటరు క్లాసులో ఎక్కారు వీళ్లు!” అన్నాడు.
”మూడో క్లాసులో కూర్చోటానికి అసలు చోటుందా? టిక్కెట్టిచ్చి డబ్బులు తీసుకున్నావు, మరి రైల్లో చోటుందో లేదో చూడక్కర్లేదా? మనుషులని జంతువుల్లాగ చూస్తారు మీరు. నేను వీళ్లకోసం పోరాడతాను. డబ్బు తీసుకుని ఎవ్వరికీ కూర్చునేందుకు చోటు చూపించక పోవడం దోపిడీ కాదూ? పద, వీళ్లకి మూడో క్లాసులో సీట్లు చూపించు,” అని పోలీసుతో అని, ఆ పల్లెటూరి వాళ్లతో, ”పదండి, నేను కూడా మీతో వస్తాను,” అన్నారు. అంతే వాళ్లతో పాటు పోలీసు వెంట ఈయన కూడా దిగిపోయారు.
పోలీసువాడు ఎలాగో ఒక్కొక్కర్నీ అక్కడా ఇక్కడా సర్దాడు. ఈయన మళ్లీ వచ్చి. నాతో, ”చూశావా, ఎలాటివాళ్లో వీళ్లు?” అన్నారు.
”మధ్యలో మీరెందుకు గొడవ పడ్డారు?” అన్నాను.
”నేనేమిటి ఎవరూ ఇటువంటివి సహించరు. ఇలాటివి చూసి కూడా ఏమీ అనని వాళ్లు ఎందుకూ కొరగాని వాళ్లని నా ఉద్దేశం.”
”నాయకులమని చెప్పుకునే కాంగ్రెసు వాళ్లు, ‘ఏ’ క్లాసు, ‘బీ’ క్లాసుల్లో హాయిగా వెళ్తారు. ‘సీ’ క్లాసు వాళ్లు సుఖంగా ప్రయాణం చేస్తున్నారా, లేక అవస్థలు పడుతున్నారా అని పట్టించుకోరు,” అన్నాను.
”ఇక్కడ అందరూ బాధ్యతగా ఉంటే దేశం ఇలా ఉండదు. మనలో ఈ లోటు ఉందికనకే సర్కారు హాయిగా పరిపాలిస్తోంది. ఒక పది మంది బ్రిటిషు వాళ్లు ముప్ఫై ఐదు కోట్ల మందిని పరిపాలిస్తున్నారంటే ఏమిటి దానికర్థం? మనలో బలమైన వ్యక్తిత్వం లేదు, ఆత్మబలం లేదన్న మాటేగా! అందుకే మనం ఇలా అవస్థలు పడుతూ, ఏడుస్తూ బతుకుతున్నాం.”
”ఇది ఒక్క రోజులో మారిపోదు కదా?” అన్నాను.
”చేతులు ముడుచుకుని కూర్చుంటే ఏమైనా ప్రయోజనం ఉంటుందా?”
”ఎప్పుడు మారాలో అప్పుడే మారు తుంది,” అన్నాను.
”అయితే నువ్వు అనవసరంగా జైలుకెళ్లావు. కాంగ్రెసు కోసం పాటు పడ్డావు. స్వాతంత్య్రం అనే ఈ మొక్క చింత చెట్టు లాటిది. తాత మొక్క నాటితే మనవడు దాన్ని అనుభవిస్తాడు,” అన్నారు.
రాయ్‌సాహబ్ బిరుదు
నేనప్పుడు లక్నోలో ఉన్నాను. హేలీసాహబ్ గవర్నరయారు. ఆయన తన స్నేహితుడొకరితో, ”మీరు ధనపత్ రాయ్ గారికి ఒక ఉత్తరం రాయండి. నేనాయనకి రాయ్‌సాహబ్ బిరుదివ్వాలనుకుంటున్నాను, ఎందుకంటే ఆయన భారతదేశంలోని రచయితలందర్లోకి గొప్పవాడు,” అన్నాడు. గవర్నర్ స్నేహితుడు భారతీయుడే. ఆయనకి మావారి పుస్తకాలంటే అమితమైన భక్తి. ఆయన మావారికి ఉత్తరం రాశాడు, ”గవర్నర్ సాహబ్ మీకు రాయ్‌సాహబ్ బిరుదివ్వాలను కుంటున్నారు. మీరు ఒకసారి ఆయన్ని లుసుకోండి.”
ఆ ఉత్తరం పట్టుకుని ఈయన లోపలికి వచ్చారు, ”చూడు, గవర్నర్ దగ్గర్నించి నాకు ఉత్తరం వచ్చింది,” అన్నారు.
”ఏం రాశాడాయన ఉత్తరంలో?” అని అడిగాను.
”ఆయనగారు నాకు రాయ్‌బహాదూర్ బిరుదిస్తాడట.”
”ఆయనే స్వయంగా రాశాడా, ఎవరి చేతన్నా రాయించాడా?”
”ఎవరిచేతో రాయించాడు.”
”ఎవరా రాసినది?”
”ఉన్నాడులే ఒకాయన, ఆయనకి కూడా ‘సర్’ బిరుదు ఇచ్చారు.”
”అయితే చక్కగా అందుకోండి వాళ్లిచ్చే బిరుదుని… ఉత్త బిరుదేనా ఇంకేమైనా ఇస్తారా?” అన్నాను.
”ఇంకా ఏదో ఉందనే అనిపిస్తోంది ఉత్తరాన్ని బట్టి.”
”అయితే ఇంకేం, తీసుకోండి.”
”సరే, ఇంతకీ ఈ బిరుదెందుకు ఇవ్వాలనుకుంటున్నారో, చెప్పనా? అప్పుడిక నేను జనం మనిషిని కాకుండా వీళ్ల తొత్తు అయిపోతాను.”
”తొత్తేమిటి? ఎలా?”
”మిగతావాళ్లలాగే. ఇప్పటివరకూ నేను చేసే పనులన్నీ జనం కోసమే కదా, కానీ ఈ బిరుదులూ అవీ ఇచ్చాక, గవర్నమెంట్ ఏం రాయమంటే అవే రాయాల్సి వస్తుంది నేను. నువ్వు సరేనంటే బిరుదు తీసుకుంటాను.”
”తప్పకుండా తీసుకోండి.”
”అదే నీ నిర్ణయమైతే జవాబు రాసేస్తాను.”
నేను ఆలోచనలో పడ్డాను. నిజంగా రాసెయ్యరు కదా, అనుకున్నాను. ”దీనివల్ల నష్టమే ఎక్కువేమో?” అన్నాను.
”అవును, నేనైతే తీసుకోను,” అన్నారు.
”మరి ఆయనకి ఏమని జవాబు రాస్తారు?”
”ధన్యవాదాలు తెలిపి, నేను ప్రజలకి సేవ చేసుకునే మామూలు మనిషి ననీ, జనానికి ఈ బిరుదిస్తే వినయంగా స్వీకరిస్తాననీ, గవర్నమెంటు వారిచ్చే రాయసాహబ్ బిరుదు నాకక్కర్లేదనీ, గవర్నర్ గారికి నా తరపున కృతజ్ఞతలు తెలియ జేయవలసిందనీ రాస్తాను,” అన్నారు.
లక్నో, మహిళా ఆశ్రమం
1929 నాటి విషయం. నెలల తరబడి రాత్రిళ్లు నాకు కొంచెం జ్వరం తగులుతూ ఉంది. ఉదయం నాలుగ్గంటలకల్లా తగ్గిపోయేది.
అది కాంగ్రెస్ యుగం. మధ్యాన్నం పన్నెండు వరకూ నాకు ఇంటి పని తోటే సరిపోయేది. ఆ తరవాత మహిళా ఆశ్రమానికి వెళ్లే దాన్ని. ఈయన నన్ను అంత కష్టపడి పని చెయ్యద్దని ఎప్పుడూ చెపుతూనే ఉండేవారు. శరీర శ్రమవల్లే నాకు జ్వరం వస్తోందని డాక్టర్లు అన్నారు.
నేను నాకు జ్వరం వస్తోందన్న విషయాన్ని దాచిపెట్టాలని అనుకునేదాన్ని. జ్వరం వస్తోందని తెలిస్తే నన్ను ఈయన కాంగ్రెస్ పనులు చెయ్యనివ్వరు.
జూలై నెల. తాగుడుకి విరుద్ధంగా పికెటింగు జరుగుతోంది. యాభై అరవై మంది స్త్రీలని వెంట బెట్టుకుని నేను పికెటింగుకి మూడు నాలుగు రోజులు వెళ్లాను. ఇంటికొచ్చాక స్నానం చేసేదాన్ని. నాలుగో రోజు నాకు బాగా జ్వరం వచ్చింది. పది రోజుల పాటు ఆ జ్వరం తగ్గనే లేదు. అది చూసి ఈయనకి కోపం వచ్చింది.
ఆరోజుల్లో మోహన్‌లాల్ సక్సేనా పల్లెటూళ్లలో తిరుగుతూ తనిఖీ చేసేవారు. ఆయనతోపాటు మూడు రోజులు మా ఆయన కూడా ఊళ్లన్నీ తిరిగారు. నాలుగో రోజు ఇంటికొచ్చారు. నా జ్వరం తగ్గలేదని తెలిసింది.
”మూడు రోజులు ఎక్కడికెళ్లి పోయారు?” అని అడిగాను.
”నువ్వు జ్వరాన్ని వెంట తెచ్చుకున్నావే, అక్కడికే పని మీద వెళ్లాను.”
”మూడు రోజులపాటు కనిపించ కుండా మాయమైపోయారే!”
”మాయం అవకపోతే పనెట్లా అవు తుంది?”
”నాకు జ్వరం తగ్గాక మీరు వెళ్లాల్సింది. ఇంట్లో చిన్నపిల్లలున్నారు, నేనేమో పడకేశాను!”
”చచ్చిపోదామని నిశ్చయించుకున్న మనిషిని బతికించటం నావల్లేమవుతుంది?”
”ఎవరిక్కడ చచ్చిపోదామను కుంటు న్నది? కానీ బాధ్యత తెలుసుకుని పని చెయ్యటం ప్రతి ఒక్కరూ చెయ్యాల్సిన పనే.”
”అంటే నువ్వు చస్తూ ఉంటే నేను పక్కన కూర్చుని చూస్తూ ఉండనా?”
”మరేం చేసేది? డెబ్భై మంది స్త్రీల చేత పని చేయించాలిగా? వాళ్లలో తెలివైన వాళ్లూ, బాధ్యత గల వాళ్లూ ఇద్దరు ముగ్గురి కన్నా లేరు. నేను వెళ్లకపోతే పని జరగదు.”
”అంటే చచ్చిపోతున్నా సరే, పని మాత్రం ఆపకూడదన్నమాట!”
”వాళ్లు రోజూ వచ్చి నన్ను చూసిపోతున్నారు.”
”నిన్ను చూసేందుకు వస్తున్నారా?”
”అవును, సానుభూతి తెలిపేందుకు కాదు ఎలండి, నేను ఊరికే విశ్రాంతి తీసు కుంటున్నానా, నిజంగా జబ్బుగా ఉన్నానా అని చూసేందుకు.”
”అంటే నువ్వు వెర్రిదానివని అనుకుంటున్నారన్న మాట!”
”వాళ్లు నేనేం వెర్రిదానికింద కట్టెయ్య టం లేదు. వాళ్లు మాత్రం పనెందుకు చెయ్యాలి? నాకు వాళ్లని చూస్తే జాలేస్తుంది. వాళ్లు ఏమీ అర్థం చేసుకోలేరు, ఎందుకు పోరాడుతున్నామో తెలీదు, అయినా మా వెంట ప్రాణాలకి తెగించి మరీ వస్తారు. మాతోపాటు అవస్థలు పడతారు. వాళ్లలో కొంతమందికి తినటానికి సరైన తిండికూడా లేదు, అంత బీదవాళ్లు. పని సరిగ్గ అవకపోతే అందరూ వాళ్లనే తప్పుపడతారు. మంచి పేరు వస్తే దాన్ని మేమే దోచుకుంటాం!”
”సరే, అయితే హాయిగా నిద్రపో నువ్వు.”
”పదోరోజున నా జ్వరం తగ్గింది. అప్పుడు జ్యూస్ తాగాను. ఆరోజు ఆడవాళ్లందరూ వచ్చి నన్ను తమవెంట లాక్కెళ్లాలని ప్రయత్నించారు.”
”ఇంకో నాలుగు రోజులాగండి. విశ్రాంతి తీసుకోనివ్వండి, లేకపోతే ఈవిడ ఆరోగ్యం మళ్లీ పాడవుతుంది,” అన్నారు మా ఆయన.
”అలా అయితే మేం కూడా హాయిగా ఇళ్లల్లో కూర్చుంటాం, మేం మట్టుకు ఎందుకు అవస్థ పడాలి?” అన్నారు వాళ్లు.
”ఎందుకలా ఊరికే కోపం తెచ్చు కుంటారు? ఒక్క రెండు రోజులాగండి. కోలుకున్నాక వస్తాను,” అన్నాను.
”అయితే మీరు వచ్చే దాకా మేం కూడా ఇళ్లలోనే ఉండిపోతాం. ఆ స్త్రీలతో కలిసి పనిచెయ్యటం మా వల్ల కాదు,” అన్నారు.
”నేను కోలుకోగానే వస్తానుకదా, అంతవరకూ ఓపిక పట్టండి. చూశారా లేచి నడిచే శక్తి కూడా లేకుండా మంచంలో పడి ఉన్నాను!”
ఎంత చెప్పినా వాళ్లు పని చేసేందుకు వెళ్లం అని భీష్మించుకునేసరికి, ఇక తప్పలేదు నాకు. లేచి చెప్పులేసుకుని బైలుదేరాను.
మా ఆయన అక్కడే ఉన్నారు. ”వెళ్తున్నాను,” అని చెప్పి బైటికెళ్లిపోయాను. రెండు మూడు రోజులు పనిచేశానో లేదో నాకు మళ్లీ జ్వరం పట్టుకుంది. బట్టలూ, చెప్పులూ విప్పుకునే ఓపిక కూడా లేకపోయింది. చెప్పులు నౌకర్ విప్పాడు. ఆ తరవాత మూడు రోజులు నేను జ్వరంతో పడుకున్నాను. దాంతో ఆయనకి నా మీద బాగా కోపం వచ్చింది. ”ఏమిటి ప్రాణం మీదికి తెచ్చుకోదలిచావా? ఇలా గే చేశావంటే ఒకటి రెండు నెలల్లో చచ్చిపోతావు!” అన్నారు.
”మీరు చూస్తూనే ఉన్నారుగా? ఏం చెయ్యను? తలుపులు వేసుకుని ఉందామన్నా సాధ్యం కావటం లేదు. ఆరోజు వాళ్లందరూ ఎలా మాట్లాడారో విన్నారుగా? ఇక తప్పనిసరి అనుకునే వెళ్లాను. అంతకన్నా ఏం చెయ్యాలో నాకు తెలీలేదు.”
”అలా ఒకటి రెండు నెలలు మంచం మీదే పడి ఉన్నావంటే నీకు ఒంట్లో బాగా లేదని వాళ్లే అర్థం చేసుకుంటారు,” అన్నారాయన.
”బలవంతాన ఎవరైనా పనిచేయించు కునే చోట సాకులు చెప్పచ్చు. బాధ్యత అనుకుని స్వయంగా చేపట్టిన పనులని ఎలా వదులుకోను?”
”ఇందులో బాధ్యత ప్రసక్తి ఎక్కడుంది? మహాత్ముడి కన్నా ఎవరూ గొప్పవారు కాదు కదా? ఆయనకి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఎవర్నీ కలవరు తెలుసా?”
”అయితే నేను మహాత్మా గాంధీనా?”
”మనిషివేగా? మహాత్ముడి అవసరం మొత్తం దేశానికుంది. కానీ నీ వాళ్లకి నీ అవసరం ఉంది కదా? నువ్వు నా మాట వినకపోతే, ఇక నేనే పూనుకుని నిన్ను కలిసేందుకు ఎవ్వరినీ రానివ్వను.”
”అది చాలా అన్యాయం.”
”నువ్వు కలం విరిచేసి పారేస్తావు చూడూ, అలాటి న్యాయమే ఇదీనూ. నీకు నా అవసరం ఉన్నట్టే, నాకు కూడా నీ అవసరం ఉంది.”
ఆ తరవాత నేను పది పన్నెండు రోజులు మంచం మీది నించి దిగలేదు.
అదే ఏడు ఏప్రిల్‌లో మేం బనారస్‌కి వచ్చాం. ఆయన ‘మాదురి’లో పని మానేశారు.
ఒకసారి కాంగ్రెస్ మీటింగు జరుగు తోంది. అందులో 140 మంది పురుషులు పని చేస్తున్నారు, ఈయనకూడా ఉన్నారు. స్త్రీలు పదిమంది మాత్రమే ఉన్నారు. అయినా స్త్రీల సంఖ్య మరీ ఎక్కువగా ఉందని పురుషులు అన్నారు.
”వాళ్లు పొరబడుతున్నారు,” అన్నారా యన.
”అందుకే స్త్రీలకి మహిళా ఆశ్రమంలో పనిచెయ్యాలంటే ఇష్టం ఉండదు. మన కష్టాలని మగవాళ్లు పట్టించుకోరు, అంటారు. కాంగ్రెస్ ఆఫీసు చట్ట విరుద్ధమని తేల్చి చెప్పి ఆరునెలలైంది. ఇక భారమంతా మహిళా ఆశ్రమం మీదే పడింది. మరి ఇవాళ మేమే లేకపోతే పనులెలా జరుగుతాయన్న సంగతి మగవాళ్లు ఆలోచించద్దా?”
”అందుకేకదా అన్నాను, వాళ్లు పొరబడుతున్నారని!” అన్నారాయన.
”మీరే చెప్పండి, స్త్రీలు ముందుకి పోవాలంటే ఏం చెయ్యాలి?”
”అధికారం అనేది చాలా ఖరీదైనది. దానికోసం త్యాగం చెయ్యాలి. దయాభిక్షగా ఏదైనా దొరికినా అది మంచిది కాదు, పైగా నిలకడగా ఉండదు. పౌరుషంతో సాధించుకున్నదే నాలుగు కాలాలపాటు నిలుస్తుంది.”
”అయితే మమ్మల్ని అవిటివాళ్లని చేసినదెవరు?”
”ఇప్పుడా విషయం గురించి మాట్లాడకు. ఆకాలం వేరు. అప్పటి విషయాలు పట్టుకుని ఏడిస్తే ఏమీ లాభం ఉండదు. ఇప్పుడు చెయ్యాల్సింది చెయ్యి.”
”కానీ ఆ కాలంలో కూడా మనిద్దరం కలిసే నడిచాం. ఈరోజు కూడా ఒకరికొకరం సహకరించుకుంటున్నాం. మరైతే అడిగితే ఏదీ దొరకదని ఎలా అంటారు మీరు? మీ మగవాళ్లే త్యాగం చెయ్యచ్చే, దిగి రావచ్చే!”
”ఇప్పటివరకూ స్త్రీలని తమతో సమానంగా భావించని వాళ్లు అంత త్వరగా మారరు. స్త్రీలు రంగ ప్రవేశం చెయ్యకపోతే కాంగ్రెస్ ఏనాడో ముగిసిపోయేదని పురుషులకి తెలుసు. స్త్రీల పట్ల వాళ్లు సంతోషంగానే ఉన్నారు.”
”మరైతే స్త్రీలకి పురుషులు గురువులెలా అయారు? స్త్రీలు తమ కర్తవ్యాన్ని ఎప్పుడు పాటించకుండా ఉన్నారు?”
”స్త్రీలు తాము పురుషులకన్నా భిన్నమైన వాళ్లమని అనుకున్న రోజున ఈ ప్రపంచం భయంకరంగా తయారవుతుందన్న సంగతి గుర్తుంచుకో.”
”అయితే దేన్ని చూసుకుని వాళ్లకా మిడిసి పాటు? ఎక్కడ చూడండి, పురుషులే ముందుండాలని తాపత్రయపడుతూ ఉంటారు.”
”లేదు, నిజానికి వాళ్లని చూసి మీరు జాలి పడాలి. వాళ్లమీద కోపం తెచ్చుకోకండి. మీరు మీ చేతులతో తయారు చేసిన వాళ్లు, మీ చేతుల్లోనే ఎలా పాడవుతారు?”
”ఇంకేమనాలి? సమఉజ్జీలయితేనే కదా యుద్ధం చెయ్యగలిగేది! అందుకే తలవంచుకుని వెళ్లిపోతాం. కుళ్లుతూ బతుకుతూంటాం!” అన్నాను.
”అందుకేగా మిమ్మల్ని శక్తి స్థానంలో ఉంచింది!”
”మీ మగాళ్లకి మాయమాటలు చెప్పటం బాగా చాతవును.”
”అరె, ఆడ మగ మధ్య ఈ వేర్పాటేమిటి. ఆడవాళ్లకి దూరంగా ఉంటే మేం ప్రాణాలతోనే ఉండం కదా?”
”కానీ మగాళ్లు ఆడవాళ్లమీద ఒంటికాలితో లేస్తారు కదా?”
”అది పశు బలం. దేవ దానవుల యుద్ధంలో ఎప్పుడూ గెలిచేది దానవులే. ఎందుకంటే వాళ్లు నియమాలని పాటించరు. నీతీ, ధర్మం ఏదీ ఉండదు.అప్పుడు దేవతలు నోరు మెదపరు, ఎందుకంటే నీచుడి నోట్లో నోరు పెట్టేవాడు కూడా నీచుడి కిందే లెక్క. అందుకని దేవతలది ఎప్పుడూ పై చెయ్యి. దానవుడితో మొరపెట్టుకుని ఏం లాభం? అలాగే ఆడా, మగా కూడా. మగాళ్లని ఆడవాళ్లు అణచివెయ్యాలని చూడకపోతే వాళ్లే స్వయంగా అణిగిపోవలసి వస్తుంది. కానీ దీనివల్ల జరిగేదేమిటి? స్త్రీలే గౌరవనీయులు అని తేలుతుంది.”
”చాలా బావుంది!” అనేసి నేనక్కణ్ణించి లేచి వెళ్లిపోయాను.
– ఇంకా ఉంది
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags