యమకూపం (అను వేశ్యావాటిక) పరిచయం

సుజాత
ఈ మధ్య ఒక సెక్స్‌వర్కర్‌ ఆత్మకథ పుస్తకం మీద ఆంధ్రజ్యోతిలో రంగనాయకమ్మగారు రాసిన విమర్శ హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వారి బ్లాగులో చదివాను. ఆ నేపధ్యంలో ఈ ”యమకూపం” నవల గురించి రాయాలనిపించింది.
వ్యభిచారంలో దిగిన స్త్రీలంతా దాన్ని వృత్తిగానే భావించినా అది గత్యంతరం లేని పరిస్థితుల్లోనే. లేక హైటెక్‌ వ్యబిచారమైతే పని చేయడానికి ఒళ్ళు వంగకో, విలాసాలకోసమో చేస్తారు తప్పించి ఎవరూ సంతోషంతోనో ”ప్రేమ పూర్వకంగానో చేయరు. సరే. ఇక్కడ ఆ విషయాన్ని చర్చించడానిక్కాదు ఇది మొదలుపెట్టింది.
ఒక వేశ్యావాటికలోని జీవితాలు ఎంత దుర్భరంగా ఉంటాయో కళ్ళకు కట్టినట్లు వర్ణించే రష్యన్‌ నవల ”యమకూపం” గురించి నాలుగు పరిచయ వాక్యాలు రాద్దామని!
రష్యాలో జట్కా బండ్లవాళ్ళు, ఇతర దిగువ తరగతి జనం విచ్చలవిడిగా సంచరించే ఒక ప్రదేశం పేరు ”యామ్‌ స్కాయా స్లోబోడా” దీన్ని క్లుప్తంగా ”యామా” అని పిలుస్తుంటారు. ఇక్కడ ఉన్న ఒక వేశ్యా వాటిక గురించి రష్యన్‌ రచయిత అలెగ్జాండర్‌ కుప్రిన్‌ రాసిన మహత్తర నవల ”యామా ద పిచ్‌” దీన్ని తెలుగులోకి 110% సరిపోయేలా ”యమకూపం” పేరు పెట్టి అనువదించిన వారు శ్రీ రెంటాల గోపాలకృష్ణగారు. వీరి అనువాదాలు నాకు చాలా చాలా ఇష్టం.
ఈ నవల మొదటిసారి 1904లో వెలువడినపుడు రష్యాలో పెద్ద సంక్షోభం బయలుదేరింది. జార్‌ ప్రభుత్వం భయంతో వణికి చచ్చి, కుప్రిన్‌ మీద, అతని రచనల మీదా విరుచుకుపడింది. కుప్రిన్‌ ఈ రచనద్వారా యువకుల మనసులో విషం గుమ్మరిస్తున్నాడని నిప్పులు కురిపిస్తూ, ప్రచురణాలయం మీద కూడా దాడులు చేసి ప్రతులను తగలబెట్టించింది. అవును, నిజం నిప్పులాంటిది కదూ మరి, మొహం పగలగొట్టినట్లు చూపిస్తే ఎదుర్కోవడం కష్టమే!
స్త్రీ జాతి నైతికంగా పతనమైతే జాతి యావత్తూ ఎంత ఘోర విపత్తులు ఎదుర్కోవలసి వస్తుందో ఇదులో కుప్రిన్‌ చూపిస్తాడు. వ్యభిచారం ఎంత నీచమైనదో, దానివల్ల ఎంత తీవ్ర సమస్యలు తలెత్తుతాయో, జీవితాలు ఎలా సర్వ నాశనమమౌతాయో కుప్రిన్‌ అద్భుతంగా చిత్రీకరించాడు. రష్యన్‌ ప్రభుత్వం ఈ నవలను నిషేధించింది. దీన్నొక బూతు పుస్తకంగా అభివర్ణించింది.
కానీ ఈ నవల అప్పటికే ప్రజల చేతుల్లో పడింది. అక్కడినుంచి దేశ దేశాంతారాలకూ వ్యాప్తి చెందింది. ప్రపంచం నలుమూలల నుంచీ అనేకమంది పండిత పామరుల ప్రశంసలూ, విమర్శలు పొందింది. స్వయంగా అనేకమంది వేశ్యలు తమ దుర్భర జీవితాల్లోని విషాదాన్ని గుర్తించినందుకు పదే పదే కృతజ్ఞతలు తెలుపుతూ కుప్రిన్‌కు ఉత్తరాలు రాశారు. 1929 నాటికి ఈ నవల 20 ఇతర భాషల్లోకి అనువదితమై 30 లక్షల ప్రతులు అమ్ముడుపోయాయి కూడా!
ఇందులో ప్రధానంగా నడిచే కథేమి ఉండదు. యామాలో ఉండే మూడు ప్రధాన వేశ్యా కేంద్రాల్లో మధ్య రకం దాన్ని ఎన్నుకుని అక్కడి స్త్రీల దుర్భర జీవితాన్నీ, వాళ్ళు నిత్యం పడే హింసల్నీ, ఆ జీవితం తాలుకూ విషాదాన్ని ప్రపంచ పాఠకులకు అందించే ఉద్దేశంతో కుప్రిన్‌ ఈ అంశాన్ని ఎన్నుకున్నాడు.
”అన్నా మార్కోవ్‌ నా” నడుపుతోన్న ఈ వేశ్యా వాటికలో వేశ్యలు ల్యూటా, జెన్నీ, పాషా, టమారా, జోయా, న్యూరా, చిన్నమంకా, పెద్దమంకా,నైనా, పెక్లూహ్షా! వీళ్ళంతా అనేక దుర్భర పరిస్థితుల్లో గత్యంతరం లేక అక్కడికి చేరి గడుపుతున్నవారే! పగలంతా నిద్రపోయి సాయంత్రం లేచి తయారవడం…. వారికోసం వచ్చే మనుషుల్ని తృప్తి పరచి పంపడం…ఇదే వారి పని!
వారి నిత్య జీవితం!
వీరిలో కొందర్ని తల్లిదండ్రులే దరిద్రాన్ని తట్టుకోలేక అమ్మేశారు. మరికొందరు ఎవరూ లేని అనాధలై..సమాజంలో రక్షణ లేక ఇక్కడికొచ్చి చిక్కినవారు.
ప్రతి ఒక్కరి వెనకా ఒక విషాదగాథ! వీరిలో ఒకమ్మాయి కి ఒక ప్రేమికుడు ఉంటాడు. ఇద్దరూ అనేకకారణాలవల్ల పెళ్ళి చేసుకోలేకపోతారు. ఆమె ఇక్కడ చేరుతుంది. కేవలం పొట్టపోసుకోవడానికి. ఆ ప్రేమికుడు ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ అప్పుడప్పుడూ వచ్చి ఈమెను చూసి కాసేపు దు:ఖపడి వెళ్ళిపోతాడు. ఒకసారి ఒక విద్యార్ధుల గుంపు సరదాగా ఈ వేశ్యావాటికకు వస్తారు. వారిలో లిఖోనిన్‌ అనే కుర్రాడు ఆ వేశ్యా జీవితాలు చూసి చలించిపోతాడు. ఈ సందర్భంగా అతడు అక్కడ ఉన్న ఒక జర్నలిస్టుతో జరిపిన సంభాషణ ఈ నవలకు ప్రాణం వంటిది. ప్లాటోనోవ్‌ అనే ఆ జర్నలిస్ట్‌ వేశ్యల జీవితాలు ఎంత దుర్భరంగా ఉంటాయో, వారి ప్రమేయం లేకుండానే అవి ఎలా కొద్ది కొద్దిగా నాశనమై పోతాయో, చివరికి శక్తి ఉడిగిపోయాక వారి జీవితాలు ఎంత విషాదకరంగా వీధుల పాలై ముగుస్తాయో కళ్ళు చెమర్చేలా వివరిస్తాడు.
”వీరి జీవితంలోని భయంకరమైన నగ్న సత్యం ఇక్కడికి నన్ను ఆకర్షించింది. సత్యాన్ని దాచే ముసుగు లేదిక్కడ! అబద్ధం, ఆడంబరం, మోసం, డంబాచారం వీటికి ఇక్కడ తావు లేదు. వీరి బతుకుల్లో భ్రాంతి, పటాటోపం లేవు .”నేనొక పడుపు కత్తెను. అందరికీ ఉపయోగకరమైన పాత్రను. నగరంలోని భోగాసక్తి తీర్చడానికి దాచిపెట్టడిన వస్తువును. రండి, సంతృప్తిగా తిరిగివెళ్ళండి. కానీ ఇందుకు బదులుగా మీరు నాకివ్వవలసినవేవో తెలుసా!డబ్బు, జబ్బు, అవమానం, హింస, ” అంటుంది ప్రతి వేశ్య!..
ప్లాటోనోవ్‌ మాటలు విన్న లిఖోనిన్‌ ఇంకా ఆలోచిస్తూ ఇలా అడుగుతాడు. ” అసలు ఈ వృత్తి ఎందుకొచ్చింది? దీనికి అంతు ఉందా! ఇది తరతరాల నుంచి వస్తోన్న సత్యమా? మానవులు అంతమైనపుడే ఇదీ నశిస్తుందా?”
దానికి ప్లాటోనోవ్‌ ” ఇది ఎపుడు అంతమవుతుందో ఎవరూ చెప్పలేరు. కమ్యూనిస్టులు, సోషలిస్టులు అందమైన కలలు కంటున్నారు (ఇక్కడ అతని మాటల్లో వ్యంగ్యం గమనించాలి)! వారి కలలు నిజమైనపుడే ఇది అంతమవుతుందేమో! ఈ ప్రపంచం ఏ ఒక్కరిదీ మాత్రం కాక అందరూ సమాన హక్కులేె అనుభవించినపుడు కూడా ఇది అంతం కావొచ్చు! ప్రేమ అనేది అందరికీ కోరినంతగా దొరికినపుడు , లేక మానవుడు యోగియై, మహర్షియై, దిగంబరుడె,ౖపాపరహితుడై, పవిత్రుడైనపుడు ఇది నశిస్తుంది” అని నిర్వేదంగా చెప్తాడు.
లిఖోనిన్‌ చలించి పోయి అక్కడ ఉన్న ఒక వేశ్యను విముక్తురాలిని చేసి గౌరవనీయమైన జీవితాన్ని ఇవ్వాలనుకుంటాడు. వెంట తీసుకెళతాడు కూడా! కానీ మిత్రులనుంచి, ఇరుగుపోరుగువారి నుంచి ఎదురయ్యే అవహేళనను భరించడం కష్టంగా తోస్తుంది. చివరికామెను వదిలించుకోవాలనే ప్రయత్నంతో అబద్ధమని తెలిసినా తన మిత్రుడికీ, ల్యూబాకు సంబంధం అంటగట్టి ఆమెను వీధిలోకి గెంటేస్తాడు.
ఆదర్శం పటాటోపం ఇదీ!
ల్యూబా అనేక రకాలుగా గౌరవంగా బతికేందుకు ప్రయత్నించి వీలుపడక తిరిగి వేశ్యా వాటికకే వచ్చి అన్నా కాళ్ళ మీద పడుతుంది. ఎంత హీనమో చూడండి! ఇలా ప్రతి ఒక్క జీవితమూ మురుక్కాలువలాగే ఉంటుందిక్కడ! ఏ ఒక్కరి జీవితంలోనూ సంతోషం, నవ్వు, ప్రశాంతత అనే మాటే ఉండదు. జున్నీకి ఎయిడ్స్‌ వంటి భయంకరవ్యాధి పట్టుకుంటుంది. ఆమె మగాళ్ళమీద కసితో తన వ్యాధిని దాచి ఎంతోమందికి సంక్రమింపజేస్తుంది. ఒక రోజు పరీక్షలకోసం డాక్టర్‌ వస్తున్నాడని తెలిసి బయటపడటం ఇష్టంలేక ఉరేసుకుంటుంది. 22 ఏళ్ళ జెన్నీ! కాస్తో కూస్తో చదువుకున్న జెన్నీ చరిత్ర అలా ముగుస్తుంది. వృత్తిలో మానియాక్‌లా ప్రవర్తించే పాఫాకు పిచ్చెక్కడంతో ఆమెను జైల్లో పడేస్తారు. టమారా ఎవరినో మోసం చేయబోయి జైలు పాలవుతుంది. అక్కడ అందరి జీవితాలూ ఇలాగే ముగుస్తాయి. సోల్జర్ల గొడవల్లో చిక్కి వేశ్యావాటికలు వీధుల్లో పడి వేశ్యలంతా చెట్టుకొకరు పుట్టకొకరుగా అయి మురికి చావుల పాలవుతారు. చివరికి కొన్నాళ్ళకు యామా అనే పేరు కూడా లేకుండా పోతుంది.
ఈ నవల్లో వేశ్యా గృహాల్లో ఉన్న పరిస్థితుల్ని, వాతావరణాన్ని కుప్రిన్‌ ఎలా వర్ణిస్తాడంటే ఒక్కో చోట వాంతొచ్చినంత పనవుతుంది. పగలంతా మర్యాదస్తుల మల్లే మసిలే కొందరు చీకటిపడగానే యామా వైపు పరుగులు తీయడాన్ని కుప్రిన్‌ గేలి చేస్తాడు. ఒకసారి ఈ వృత్తిలోకి అతి నీచ కారణాలవల్లనో, గతిలేకో ప్రవేశించిన వారు ఇక మామూలు జీవితంలోకి రావడానికి ఇష్టపడరనే సత్యం ఈ నవల్లో కనబడుతుంది. మామూలు మనుషుల్లో కలవడానికి వీరు చిన్నతనం ఫీలవుతారు.
వీరి జీవితం నిండా పేదరికం, నిరాదరణ, ప్రేమ రాహిత్యం, తాగుడు, తిట్లు, కొట్లాటలు, రోగాలు, హింస, చివరికి వృద్ధాప్యంలో దిక్కులేని చావులు!
ఇంత హృదయ విదారకమైన నవల ఇంతకు ముందు చదవలేదు. గౌరవనీయంగా పని చేసుకుని బతకగలిగే అవకాశం ఏ మాత్రమున్నా స్త్రీలు ఇటువంటి వృత్తిలోకి రావడానికి ఇష్టపడరని, గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఈ గోతిలోకి దిగుతారనీ రచయిత ఇందులోని పాత్రల ద్వారా చూపిస్తాడు.
ఇది అందరూ ఎరిగిన సత్యమే! ఎందరు ఆత్మకథలు రాసినా ఇదొక వృత్తనీ, వారికి హక్కులుండాలనీ వాదించినా, ” మాకు కావలసింది మీ జాలి, దయ కాదు, మమ్మల్ని అర్ధం చేసుకోండి” అని డిమాండ్‌ చేసినా వీరి జీవితాల గురించి తెలిసిన తర్వాత వారికి దొరికేవి అవే…జాలి, దయ!
ఈ మధ్య స్వాతి వార పత్రికలో వంశీ దిగువ గోదావరి కథల శీర్షిక కింద ”వాసంతి” అనే నటి గురించి రాస్తూ వాసంతి జీవితాన్ని పరిశీలిస్తుంటే ”యామా ది పిట్‌” నవల గుర్తొచ్చిందని రాశాడు. ఇతర భాషా నవలలు పాఠకులకు సరైన రీతిలో చేరాలంటే అనువాదం అద్భుతంగా ఉంటే తప్ప సాధ్యం కాదు. ఈ నవల అటువంటి అద్భుత అనువాదంతోనే తెలుగులోకి వచ్చింది. స్వర్గీయ రెంటాల గొపాల కృష్ణగారు అనేక ఉద్వేగ భరిత సన్నివేశాల్ని, వేశ్యల మనసులోని దు:ఖాన్ని సైతం ఎంతో చక్కగా ( ఇంతకంటే ఇక్కడ ఏం మాట వాడాలో తెలీడంలేదు) అనువదించారు. రోగాల పాలై ఆత్మహత్యకు సిద్ధమైన జెన్నీ అంతరంగాన్నీ,ల్యూబా అమాయ కత్వాన్నీ, పోలీసుల దుర్మార్గాన్నీ, యజమానుల దయా రాహిత్యాన్నీ…ఇలా చదువుతున్నంత సేపూ యామా కళ్ళ ముందే కనపడేంత ప్రతిభావంతమైన అనువాదం.
ఈ నవల తెలుగు అనువాదం మూడో ముద్రణ 1979లో ఆదర్శ గ్రంథ మండలి విజయవాడ వారు వేసిన కాపీ నా వద్ద ఉంది. ప్రస్తుతం ఇది మార్కెట్లో దొరికే పరిస్థితి లేదు.ఎక్కడైనా దొరికే పరిస్థితి ఉంటే మాత్రం తప్పక చదవండి.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.