ఆధునిక తెలంగాణ మహిళా సాహిత్యం : సుజాతారెడ్డి స్థానం

డా|| వి. త్రివేణి
సాహిత్య విమర్శ, సాహిత్య చరిత్ర, సమీక్ష, నవల, కథ, పరిశోధన, యాత్రా చరిత్ర, సంపాదకత్వం… విభిన్న సాహిత్య ప్రక్రియలు, విభిన్న వస్తు వైవిధ్యం… డా. ముదిగంటి సుజాతరెడ్డి వర్తమాన సాహిత్యంలోనే దర్శించవచ్చు. తెలంగాణా మహిళా సాహిత్యంలోనే ప్రథమస్థానాన్ని వహించిన సుజాతారెడ్డి ఒకానొక ప్రాంతీయ నేపథ్యం గల రచయిత్రిగా గుర్తింపు పొందారు. వాస్తవిక చిత్రణ, జాతీయ దృక్పథం, సంస్కరణ భావం, మానవీయ స్పర్శ వంటివి ఆమె రచనల్లో కనిపించే మౌలిక స్వరూపాలు. అంతర్గత సాహిత్య లోతుల్ని తరచిచూస్తే… ఆమెలో భారతీయ సంస్కృతి పట్ల అభిమానం, ఛాందసత్వం పట్ల తిరస్కారం, ఆధునికత పట్ల ప్రేమ ప్రస్ఫుటమౌతాయి.
సాహిత్యవేత్తల సృజన రచనల్లో వారి వారి బాల్యస్మృతులు, అనుభవాలు, అనుభూతులు, జ్ఞాపకాలు, సంఘటనలు ఏదో ఒక రూపంలో ప్రతిబింబిస్తాయి. ఈ సూత్రం భారతీయ భాషల్లోని అన్ని రచనలకు అనువర్తిస్తుంది. వట్టికోట ఆళ్వారుస్వామి, దాశరథి రంగాచార్యులు, బి.ఎన్‌.శాస్త్రి, సురవరం ప్రతాపరెడ్డి వంటి తెలంగాణ రచయితల బాల్యజీవన నేపథ్యం అనివార్యంగానే వారి రచనల్లో ప్రతిఫలిస్తుంది. ఈ క్రమం డా|| సుజాతరెడ్డి సృజన సాహిత్యంలోనూ కనిపిస్తుంది. బాల్యంలోనే భూస్వాముల ఆగడాలను, రజాకార్ల జగడాలను చూసిన రచయిత్రి తెలంగాణ ఆత్మఘోషను తన అక్షరాలలో ప్రకటించారు. ఆమె రచనల్లో తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వం నూతన రూపురేఖల్ని దిద్దుకొంది. తెలంగాణ గతం స్వగతాల్ని వినిపిస్తుంది.
విద్యాభ్యాసానికి అవరోధం :
సామాజిక గతిశీలత బలహీనంగా ఉన్న తెలంగాణ ప్రాంతంలో జన్మించి, చైతన్యశీలిగా మారిన విదుషీమణి ముదిగంటి సుజాతారెడ్డి. ఆమెది సూర్యాపేటకు సమీపంలో గల ”ఆకారం” గ్రామం. విద్యుత్‌ సదుపాయం కానీ, బస్సు సౌకర్యం కానీ, కనీసం వీధి బడియైనా కానీ లేని ఆ గ్రామంలో ఆడపిల్లల చదువు గూర్చి తల్లిదండ్రులు ఏమాత్రం ఆలోచించేవారు కాదు. మగపిల్లల్ని మాత్రం గ్రామానికి పదిమైళ్ల దూరంలో ఉన్న నకిరేకల్లుకు మాత్రం పంపించి చదివించేవారు. భూస్వాముల కుటుంబంలో పుట్టిన సుజాతారెడ్డి చదువు పట్లనే శ్రద్ధ లేదంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉండేదో ఊహించుకోవచ్చు. నాటి తెలంగాణ పల్లెలు విద్యా, వైద్య, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో చాలా వెనుకబడి ఉన్నాయి. సాంఘిక చైతన్యం ఏమాత్రం లేని ఆ కాలంలో నిజాం అండతో నిరంకుశ పాలనను నిర్వహిస్తున్న దొరల, దేశముఖుల, జమీందారుల దోపిడీ, దౌర్జన్యాలు గ్రామప్రజల్ని పూర్తిగా బానిసత్వంలోకి నెట్టివేశాయి. తర్వాత క్రమక్రమంగా నియంతృత్వాన్ని భరించలేని యువకులు, కమ్యూనిస్టు ఉద్యమ నాయకులై, రజాకార్లతో హోరాహోరీగా పోరాడి తెలంగాణ ప్రాంతంలో జనజాగృతిని తీసుకొచ్చారు. ఆనాటి కల్లోల పరిస్థితులే సుజాతారెడ్డి విద్యాభ్యాసానికి అవరోధాలుగా నిలిచాయని చెప్పవచ్చు.
తెలంగాణ దృక్పథం :
తెలంగాణ విమోచనం కోసం సాగిన రోజుల్లో, వీరోచిత పోరాటంతో అట్టుడికిన తెలంగాణ ప్రాంత ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లారు. సుజాతారెడ్డి కుటుంబం కూడా గుంటూరు సమీపంలో గల అద్దంకికి వెళ్లవలసి వచ్చింది. భౌగోళిక ప్రాంతీయ తేడా వల్ల, భాషాపర తారతమ్యం వల్ల అక్కడ అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. నాడు ఎదుర్కొన్న అనుభవాలు, సంఘటనలు ఆమెలో తెలంగాణ పట్ల నిశితమైన ప్రాంతీయ దృక్పథం ఏర్పడి ఉండటానికి కారణం కావచ్చు.
రచనా వ్యాసంగం :
సుజాతారెడ్డి విద్యాభ్యాసం చాలా ఆలస్యంగానే ప్రారంభం అయింది. పోలీస్‌ యాక్షన్‌ (1948) తర్వాత తమ స్వంత గ్రామానికి చేరుకొన్నవారి కుటుంబం నల్లగొండలోనే స్థిరపడింది. పాఠశాల విద్యాభ్యాసం నుంచే సుజాతారెడ్డి కథలు చదవటం అలవాటు చేసుకొన్నారు. వాళ్ల అమ్మ ఆమెకొక అర్ధరూపాయి ఇస్తే చందమామ పత్రికను కొనుక్కొని, అందులోని అద్భుత కథలను ఆసక్తిగా చదివేవారు. ఆ సమయంలోనే మాలతీ చందూర్‌ నవలలు ఆమెపై చాలా ప్రభావాన్ని చూపాయి. ఆంధ్రప్రభలో ”ప్రమదావనం” శీర్షికను చదవడంలో ఆసక్తిని కనబరిచేవారు. 1956లో గోలకొండ పత్రికలో అచ్చు అయిన ”జీవన్మృతుడు” అనే మొదటి కథతో ఆమె రచనా వ్యాసంగం ప్రారంభం అయింది. అప్పటి నుంచి ఆమె తెలుగు సాహిత్యంలో విశేషంగా కృషి చేస్తూనే ఉన్నారు. తన పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంథంతో పాటు మొత్తం 18 గ్రంథాలు (2006 వరకు) రచించి ప్రచురించారు. అందులో సాహిత్య విమర్శ గ్రంథాలు, సాహిత్య చరిత్ర గ్రంథాలు, సృజనాత్మక రచనలు, సంపాదకత్వ రచనలు, యాత్రారచనలు, సంయుక్త రచనలు మొదలైనవి సాహితీలోక ఆదరాభిమానాలు చూరగొన్నాయి.
|. సాహిత్య విమర్శ రచనలు :
(రి) శ్రీనాథుని కవితా సౌందర్యం : ఈ గ్రంథంలో శ్రీనాథుని జీవితం, రచనలు, వ్యక్తిత్వం, కవితారీతులు తెలియజేయబడ్డాయి. శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి ”శృంగార శ్రీనాథము” రచనలో శృంగారాంశానికి ప్రాధాన్యత ఇవ్వగా, సుజాతారెడ్డి తన గ్రంథంలో శ్రీనాథుని కవితాసౌందర్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. శ్రీనాథుని యుగంలో కథావస్తువు కంటే కవితారీతికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చే ధోరణి ప్రవేశించింది. ఇది ప్రబంధ ధోరణికి అనువైందిగా చెప్పవచ్చు. శ్రీనాథుడు పురాణకథలనే కావ్యాలుగా రచించినా, అందులో ప్రబంధ ఛాయా కవిత్వం దర్శనమవుతుందని రచయిత్రి ఈ గ్రంథంలో నిరూపించారు. శ్రీనాథుని కవితా సౌందర్యాంశానికే ప్రాధాన్యత ఇచ్చిన రచయిత్రి, అతని కావ్యాల్లో ”రూపచిత్రణ కళా సౌందర్యం, శైలీ సౌందర్యం, నిరలంకార శబ్ద సౌందర్యం, భక్తి భావ సౌందర్యం” గూర్చి సుమధురంగా వివరించారు.
రసవంతమైన వాక్కు మధురమని దండి తాత్పర్యం – ఈ వాక్కుల్లోని మాధుర్యం సౌందర్యం. ”సౌందర్యమలంకారః” అని భామహుని సంప్రదాయం – అలంకృతమైన శబ్దార్థాలకు సౌందర్యం ఏర్పడుతుంది. ”నిపుణమైన కవికర్మ కావ్యం” – కావ్యంలోని సౌందర్య సృష్టియే నైపుణ్యం. ప్రాచీన ఆలంకారికుల ఆస్వాదయోగ్యమైన గుణం సౌందర్యం. సౌందర్య ప్రధానమైన శ్రీనాథుని కవిత్వాన్ని రచయిత్రి సరళ సులభ శైలిలో విళ్లేషించారు. ఇది 1980లో ప్రచురించబడింది.
(రిరి) తెలుగు నవలానుశీలనం : సుజాతారెడ్డి అత్యంత హేతుబద్ధంగా ”తెలుగు నవలానుశీలనం” అనే గ్రంథాన్ని రచించారు. ఇది 1990లో ప్రచురించరించబడింది. ఇందులో కథా నవలా సాహిత్యానికంతటికీ ప్రాచీన భారతీయ సాహిత్యమే మూల భూతమైందని పేర్కొనబడింది. ఈ వాదన ఐరోపా భాషలోని వఓరిబీశిరిళిదీవ ను, భారతీయ భాషలపైన దాని ప్రభావాన్ని బలహీన పరుస్తుంది. ఇంకా పాశ్చాత్య నవలకు గల మూలబీజాలు ప్రాచీన భారతీయ సాహిత్యంలోనే ఉన్నాయని రచయిత్రి అభిప్రాయపడ్డారు. పంచతంత్ర కథలు, విక్రమార్కుని కథలు, మర్యాదరామన్న కథలు, బేతాళుని కథలు మొదలైనవి బాటసారుల చేత వ్యాపారస్తుల చేత ఇతర ప్రాంతాలకు చేరవేయబడి పాశ్చాత్య భాషల్లో నవలా ప్రక్రియలు ఉద్భవించడానికి కారణమైనాయని పేర్కొన్నారు.
ఒకవేళ ఆధునిక తెలుగు నవల పాశ్చాత్య భాషా సాహిత్య ప్రభావం చేత ఉద్భవించినా ప్రాచీన వచన కావ్యాలు వస్తు నిర్వహణశైలితో ప్రభావితం చేసి భారతీయ వాతావరణాన్ని సుస్థిరం చేశాయనడంలో అతిశయోక్తి లేదు. ”తెలుగు నవలానుశీలనం” అనే గ్రంథరచనకు బొడ్డుపాటి వేంకట కుటుంబరావు ”తెలుగు నవలా పరిణామం”, మొదలి నాగభూషణశర్మ ”తెలుగు నవలావికాసం” అనే గ్రంథాలను అనుసరించి ”వస్తువైవిధ్యం, స్వరూప స్వభావాలు, వాస్తవికత, ఊహాకల్పన” వంటి అంశాల్ని సవివరణాత్మకంగా పరిశీలించారు.
ఈ గ్రంథంలో రచయిత్రి ”రస సిద్ధాంతం-నవల” అనే అంశాన్ని చేర్చారు. ప్రాచీన భారతీయ ఆలంకారిక శాస్త్రవేత్తలు కేవలం దృశ్యకావ్యాలకు పరిమితం చేసి, అటు తర్వాత శ్రవ్య కావ్యాలకు కూడా రసస్పర్శను ఒప్పుకోవడం జరిగింది. అలాంటి రస సిద్ధాంతాన్ని ముదిగంటి సుజాతారెడ్డి ఆధునిక వచన రచనా ప్రక్రియ అయిన నవలకు అనువర్తింపజేశారు. నవలలోని కథను, వర్ణనలను, పాత్రల సంభాషణలను, పాత్రల చర్యలను పాఠకుడు చదివి తన ఊహాశక్తితో తన మనఃఫలకం మీద సమస్తం నాటకరంగస్థలం మీద లాగా దర్శిస్తాడని రచయిత్రి వివరించారు. నవలలో పోషింపబడిన శృంగార వీరరసాలకనుగుణంగా సాంఘిక చారిత్రక నవలలు రక్తికట్టాయి. రససిద్ధాంతానుసారంగా పాత్ర చిత్రణ, ఇతివృత్తాలుంటే పాఠకులు ధర్మ సత్య కార్యాలకే ఉత్సహించే రసానుభవ స్థితిని పొందుతారని ఈ గ్రంథంలో తెలుస్తుంది. నవలలో వర్ణింపబడిన విభావానుభావ సంచారి భావాలను పాఠకుడు చదివి, వాటితో తాదాత్మ్యం చెంది రసానుభవాన్ని పొందడం గమనింపవచ్చు. ఒక గొప్ప సాహసోపేతమైన ఈ కార్యాన్ని అనేక వివాదాంశాల నుంచి దాటించి రససిద్ధాంతాన్ని నూతన రీతిలో నవలకు అన్వయించారు.
(రిరిరి) వేమన నాథ సంప్రదాయం : వేమన నాథ సంప్రదా యానికి చెందిన వ్యక్తిగా ముదిగంటి సుజాతారెడ్డి మొట్టమొదటిగా ఒక కొత్త అంశాన్ని ప్రతిపాదిస్తూ 1993వ సం||లో ఈ గ్రంథాన్ని ప్రచురించారు. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారు వేమనను ”శివయోగి”గా, బండారు తమ్మయ్య గారు వేమనను ”వీరశైవుడు”గా, సి.పి. బ్రౌన్‌ వేమనను ”జంగముడు”గా, ఆరుద్ర వేమనను ”లోకాయతుడు”గా గుర్తించారు. కొత్తగా సుజాతారెడ్డి వాస్తవాధారాలతో వేమన నాథసంప్రదాయానికి చెందినవారుగా చూపించారు. నాథ సంప్రదాయాన్ని, నవనాథులను, నాథ సంప్ర దాయ సిద్ధాంతాలను, నాథ సంప్రదాయంలో గల హేతువాదాన్ని సవివరంగా విశ్లేషించారు. నాథ సంప్రదాయాన్ని ప్రవర్తింప జేసినవారు నవనాథులు. ఇందులో సాక్షాత్తు శివుడే ఆదినాథుడు. ఈ సంప్రదాయానికి మూలపురుషుడు మత్స్యేంద్రనాథుడైతే, వ్యాపకుడు గోరఖనాథుడు. మిగతా నాథులందరూ సిద్ధాంత అనుయాయులు.
ఎక్కువగా శివభక్తి సంప్రదాయానుయాయులు ”భీమన” పేరు పెట్టుకోవడం కన్పిస్తుంది. వేమన పేరు కూడా ”భీమన” పద వికృతి నామ రూపాంతరమని రచయిత్రి భావించారు. ఇంకా వేమన శతకంలోని మకుటానికి నూతనార్థాన్ని, వేమన ఊరు పేరులో వాస్తవాధారాల్ని ఈ గ్రంథంలో తెలుసుకోవచ్చు. ఈ గ్రంథం వేమనను యోగిగానే గాక కవిగా కూడా నిలబెడుతుంది. అతని పద్యాల్లోని కవితా రమణీయకతను, ధ్వని సౌందర్యాన్ని నూతన కోణాల్లో ఆవిష్కరిస్తుంది. 1984లో ”ఆంధ్ర సారస్వత పరిషత్తు”లో ”సాహిత్యవేదిక” సభల్లో ”భక్తితత్త్వ కవయిత్రులు” అనే విషయంతో ప్రసంగించిన అంశాలను వ్యాసంగా, ఈ గ్రంథంలో అనుబంధంగా రచయిత్రి చేర్చారు.
బహుముఖ ప్రజ్ఞాపాటవ జీవితానుభవం, పాండిత్యంతో కూడిన భావసంపద, వాటికనుగుణమైన శైలీ సౌందర్యం వేమన పద్యాలకు అత్యంత రమణీయకతను సమకూర్చాయని రచయిత్రి వివరించారు. వేమన పద్యాలను నీతి, వైరాగ్య, ఆధ్యాత్మిక భాగాలుగా విభజించిన రచయిత్రి పాఠకులకు సరళ సుబోధకమైన స్థాయిలో రసాలంకార విశ్లేషణ చేశారు. ఉపమ దృష్టాంతాలంకారాల స్థానంలో అధికంగా ఉండి కవితకు అర్థ సౌందర్యాన్ని అందించే మేలిముత్యాలుగా వేమన పద్యాలను కొనియాడారు.
ఈ గ్రంథంలో మరొక ప్రధాన విషయం వేమన కవిత్వంలో ధ్వని సౌందర్యం. ధ్వని భేదాలలో రసధ్వని ఉత్తమమైందని ఆలంకారికుల అభిప్రాయం. అయితే ప్రాచీన కవుల కవిత్వంలో వస్తు ధ్వని కూడా ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకోవడం గమనించవచ్చు. సుజాతారెడ్డి వేమన కవిత్వంలోని వస్తుధ్వనిని నిర్ధారిస్తూ, అనేక పద్యాలను ఉదాహరణపూర్వకంగా వివరించారు.
(రిఖీ) సిద్ధాంత వ్యాసం (మను వసు చరిత్రల తులనాత్మక పరిశీలనము) : అష్టాదశ వర్ణనలతో ప్రకాశిస్తున్న మను వసు చరిత్రలను తులనాత్మకంగా పరిశీలించి సుజాతారెడ్డి తనకున్న పాండితీ ప్రకర్షను ప్రదర్శించారు. రాయల కాలం నాటి భోగ వైరాగ్యాలకు మధ్య గల ఘర్షణకు ప్రతీకగా వరూధినీ, ప్రవర సంవాదం చిత్రించి, వివిధ వర్ణనలను మౌలికమైన భావాలతో అలంకరించి, ఆయా సందర్భాల్లో సమకాలీన సమాజ జీవనాన్ని ప్రతిబింబింపజేసి, అప్రతిమాన శైలితో అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్రను రచయిత్రి సమర్థవంతంగా పరిశీలించారు. పెద్దన ప్రబంధ మార్గాన నడిచిన రామరాజ భూషణుని వసుచరిత్రను తులనాత్మక అధ్యయనం చేస్తూ, కథా సంవిధానంలో భట్టుమూర్తి, పెద్దన కంటే ఎక్కువ స్వాతంత్య్రాన్ని ప్రకటించారని ఆమె పేర్కొన్నారు. ”కళాపూర్ణోదయం” ద్వారా పూర్తిగా కల్పిత కథలను సహృదయులు ఆదరించరని గ్రహించిన భట్టుమూర్తి, మహాభారతంలో అతిస్వల్పంగా ఉన్న వసురాజు కథను తీసుకొని, స్వకల్పనలతో షడాశ్వాసాలుగా తీర్చిదిద్దిన వసుచరిత్ర నాటి పండితలోకపు ఆదరణ పొందిన విధానాన్ని వివరించారు.
సంగీత కళానిధి భట్టుమూర్తి. పెద్దనలో ఈ అంశం తక్కువ. పెద్దనకు గల ఆయుర్వేద-విద్యాపరిచయం భట్టుమూర్తికి లేదు. ఎవరికి వారూ ఆయా కళలలో, విద్యలలో పండితులు. అయితే కథాసంవిధానంలోనూ, వర్ణనలలోనూ, సన్నివేశకల్పనలలోనూ, పద్యశిల్పంలోనూ, శబ్దప్రయోగంలోనూ, శైలిలోనూ, అలంకార వైచిత్రిలోనూ, రసపోషణలోనూ, నాటకీయతలోనూ, పాత్ర చిత్రణ లోనూ, పాండిత్యంలోనూ, అన్నిటికీ మించి వ్యక్తిత్వ స్వామ్యం లోనూ పెద్దనకు, భట్టుమూర్తికి అనేక పోలికల్ని కూలంకషంగా చర్చించి, నిరూపించిన గ్రంథం ఇది. ఈ సందర్భంగా రచయిత్రి వ్యాఖ్యానిస్తూ – ”తెలుగు సాహిత్యంలో ప్రసన్న మాధుర్యగుణభరితమైన మనుచరిత్రలో ప్రబంధారంభం జరిగి రామరాజభూషణుని వసుచరిత్రతో ప్రబంధ కావ్యకళ మేరు శిఖరాగ్రాలను అందుకొన్నది” అని ఈ గ్రంథారంభంలో పేర్కొన్నారు.
పెద్దనను మించవలెనన్న ఉద్దేశంతో రచించబడిన వసుచరిత్రలో భట్టుమూర్తి కవితా ప్రతిభ ఎంత వరకు సఫలం అయిందో ఈ సిద్ధాంత వ్యాస గ్రంథం ద్వారా తెలుస్తుంది. ఒకరి కంటే మరొకరు గొప్పకారని చెప్పడం కంటే ఒకరితో మరొకరు మించారని చెప్పడం ఎంతో సమంజసంగా ఉంటుందని రచయిత్రి అభిప్రాయంలో వెల్లడవుతుంది.
||. సాహిత్య చరిత్ర గ్రంథాలు :
(రి) చారిత్రక సామాజిక నేపథ్యంలో తెలుగు సాహిత్య చరిత్ర : ఆయా కాలాలను బట్టి, రాజులను బట్టి, రాజవంశీయులను బట్టి, మహాకవులను బట్టి యుగవిభజనతో కూడిన తెలుగు సాహిత్య చరిత్ర గ్రంథాలు అనేకం వచ్చాయి. వీటికి అనుగుణంగా కొంత భిన్నత్వంలో మహాకవుల పేరుతో యుగ విభజన చేస్తూ సుజాతారెడ్డి ”చారిత్రక సామాజిక నేపథ్యంలో తెలుగు సాహిత్య చరిత్ర”ను రచించారు.
నన్నయకంటే పూర్వం వారుగా నన్నెచోడుడుని, వేములవాడ భీమకవిని సమర్థ్ధిస్తూ కొన్ని చారిత్రక ఆధారాల్ని, తనకున్న అభిప్రాయాల్ని తెలిపారు. నన్నయ్య తిక్కన మధ్యకాలాన్ని శివకవియుగం అని కాకుండా ”నన్నయ తిక్కనల మధ్యయుగం”గా మాత్రమే పేర్కొన్నారు. ఇందులో పండిత త్రయం రచనలు, కుమారసంభవంలోని ప్రబంధ లక్షణాలు, దేశి కవితోద్యమ శాఖలు కూలంకషంగా విశ్లేషించారు. నాటి సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయల్ని ప్రబంధ యుగకర్తగా పేర్కొన్నారు. దక్షిణాంధ్ర యుగ వైశిష్ట్యాన్ని గూర్చి చర్చిస్తూ, ఈ యుగానికి రఘునాథ నాయకుని కర్తగా చేశారు.
ఆధునిక యుగ విభజనలో వీరేశలింగం తర్వాత కృష్ణశాస్త్రిని యుగకర్తగా ఎంపిక చేసుకొన్నారు. ఈ స్థానాన్ని గురజాడ కానీ, రాయప్రోలు కానీ అధిష్టించాల్సింది. చాలా చరిత్ర గ్రంథాల్లో ఆధునిక యుగకర్తలుగా గురజాడను గానీ, రాయప్రోలును గానీ చిత్రించడం జరిగింది. కాని వీరిరువురిలో యుగలక్షణాలు పూర్తిగా ప్రతిఫలించనందువల్ల, కృష్ణశాస్త్రిలో కాల్పనిక భావ కవితా లక్షణాలు ప్రస్ఫుటమవుతున్నందువల్ల కృష్ణశాస్త్రిని యుగకర్తగా ఎన్నుకోవటం సమయోచితంగా ఉంది. ఇక శ్రీశ్రీ యుగంలో అభ్యుదయ, విప్లవ సాహిత్య యుగాల్ని చేర్చడం గమనార్హం. ఇంకా ఈ గ్రంథంలో నవ్యసాహిత్య ధోరణులను, వాదాలను, ప్రపంచీకరణం వ్యాపార యుగంలో తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వవాదాన్ని చేర్చటం రచయిత్రి ఆవిష్కరించిన కొత్త మార్గాలని చెప్పవచ్చు.
(రిరి) ఆంధ్రుల సంస్కృతి – సాహిత్య చరిత్ర : సుజాతారెడ్డి రచించిన ఈ గ్రంథాన్ని డిగ్రీ (ద్వితీయ సంవత్సరం) పాఠ్యపుస్తకంగా ఎన్నుకోవడం జరిగింది. అప్పటికే అధ్యాపకవృత్తిలో ఉన్న రచయిత్రిలో సాహిత్య చరిత్ర పట్ల ఆమెకున్న అభిలాషను గుర్తించి ఆచార్య నాయని కృష్ణకుమారి, ఎమ్‌. కులశేఖరరావు (ఉస్మానియా అధ్యాపకులు) ఈ బాధ్యతను అప్పగించారు. 1989వ సం||లో తెలుగు అకాడమీ సంస్థ ఈ గ్రంథాన్ని ప్రచురించింది.
ఈ గ్రంథంలో ప్రాఙ్నన్నయ యుగం నుంచీ ఆధునిక యుగం వరకు గల ఆంధ్ర సంస్కృతి, సాహిత్య చరిత్ర వర్ణింపబడింది. ఆంధ్ర-తెనుగు-తెలుగు పదాల చరిత్ర, సాంస్కృతిక పునరుజ్జీవనం, వివిధ ఉద్యమాలు, ఆధునిక వచనా రచనా ప్రక్రియల ఉద్భవం వంటివి కూలంకషంగా వివరింపబడ్డాయి. తెలుగు భాషా, సాహిత్య, సాంస్కృతిక చరిత్రలకు సంబంధించిన వివిధ విభాగాలు కనిపిస్తాయి. పట్టభద్ర విద్యార్థులకు ఉపయోగపడే సామాజిక జీవన పరిణామ వికాసాల్ని ఈ గ్రంథం పూర్తిగా అధ్యయనం చేస్తుంది.
|||. సృజనాత్మక రచనలు :
(రి) మలుపు తిరిగిన రథచక్రాలు (నవల) : తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో నాడు వట్టికోట ఆళ్వారుస్వామి, దాశరథి రంగాచార్యులు, కందికుళ్ల ప్రతాప్‌రెడ్డి, బి.ఎన్‌.శర్మ మొదలైనవారు నవలలు రచించారు. అదే స్ఫూర్తితో సుజాతారెడ్డి ”మలుపు తిరిగిన రథచక్రాలు” (1994) అనే నవలను రచించారు. 1946-86 మధ్యకాలంనాటి రాజకీయ, సామాజిక, చారిత్రక జీవనస్థితిగతులు ప్రతిబింబింపబడ్డాయి. ఈ నవలలో దొరల గడీలలో జరిగే అన్యాయాలను, అకృత్యాలను అత్యంత సహజంగా చిత్రించారు. ”ఫ్యూడల్‌” దోపిడీలలోకెల్లా అతి దారుణమైంది. ”ఆడబాపల” జీవనం. దొరల గడీల్లోనే బానిసలుగా ఉంటూ మానసిక, శారీరక దోపిడికి గురైయ్యే వారి జీవన విధానాన్ని అత్యంత దయనీయంగా వర్ణించారు. ఊరిలోని వారంతా దొరలకు వెట్టిచాకిరి చేయడం, ఎవరైన దొరకు ఎదురు మాట్లాడితే అమానుషంగా దొర, వారిని కొట్టడం కానీ, కాల్చివేయడం కానీ ఈ నవలలో పాఠకులను విషాదస్థితిలోకి నెట్టివేస్తాయి. ఈ నవలలో కథానాయకుడు రమేశ్‌ నాయకత్వాన గ్రామ యువకులంతా రహస్యదళాలుగా ఏర్పడి దొరలను, వారి గడీలను అంతమొందించడంలో విజయం సాధిస్తారు. ఉత్కంఠభరితంగా సాగే నవలలో గగుర్పాటును కల్గించే సన్నివేశాలు వాస్తవిక వర్ణనలతో, సహజమైన శైలితో వర్ణింపబడ్డాయి.
(రిరి) సంకెళ్ళు తెగాయి (నవల) : ఈ నవల 1994లో రచించబడింది. దీనికి ”నారాయణ విజయం” అనే నామాంతరం కూడా ఉంది. చిలకమర్తి గారి ”రామచంద్రవిజయం”, ఉన్నవ వారి ”సంగ విజయం” నవలల్లో గల నేపథ్యాలకనుగుణంగా ”సంకెళ్ళు తెగాయి” నవలలో నారాయణ జీవన వృత్తాంతం వర్ణింపబడింది. నారాయణ నిమ్న కులానికి చెందిన యువకుడు. అతనికి చదువుకోవాలనే కోరిక బలంగా ఉండటం వల్ల కులవృత్తిపైన అంత అభిరుచిని కనబరచలేకపోయాడు. నిర్మాణాత్మకం కాని, పరిష్కార మార్గాలు చూపని ఉద్యమాలను, హింసను నారాయణ తీవ్రంగా ఖండిస్తాడు. పట్నంలో తనకు పరిచయమైన వేదప్రకాశ్‌ మాస్టారు, సహవిద్యార్థిని అనల సహకారాలతో, తాను స్వయంగా సముపార్జించిన విజ్ఞానం, అనుభవాలతో తరతరాల దాస్యాన్ని, కులాల సంకెళ్ళను తెంచుకొని బయటపడుతాడు. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, శ్రమసాధనలతో బానిస సంకెళ్ళను తెంచి, ఉన్నత విలువలుగల వ్యక్తులుగా ఎదగవచ్చుననే గొప్ప సందేశం ఈ నవలలో దాగి ఉంది.
(రిరిరి) ఆకాశంలో విభజనరేఖల్లేవు (నవల) : ఈ నవల 1995లో ముద్రింపబడింది. ఇందులో రచయిత్రి స్త్రీపురుషుల మధ్య ప్రేమ సఖ్య సంబంధాలను, స్త్రీల అభ్యుదయం, స్వేచ్ఛ, సమానతల సాధనకు పురుషుల సహకారముండాలని తెలియజేశారు. స్త్రీ స్వేచ్ఛాసాధనలో పురుషుడు భాగస్వామ్యం అయినప్పుడే స్త్రీ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
స్త్రీల హింసలకు, హత్యలకు, ఆత్మహత్యలకు బలమైన కారణం వరకట్నం. స్త్రీలు తలుచుకొంటే ఈ సమస్యను నిర్మూలించవచ్చుననే ఆత్మవిశ్వాసం రచయిత్రి ప్రదర్శించిన పాత్ర పోషణలో కనిపిస్తుంది. స్త్రీలలో వ్యక్తిత్వ బలం, నైతిక బలం, స్త్రీకి స్త్రీ అండగా ఉండాలనే భావజాలం పెరగాలనే అభిప్రాయం ఈ నవలలో బలంగా కనిపిస్తుంది. స్త్రీపురుషుల మధ్య ప్రజాస్వామ్య విలువలతో కూడిన సంబంధాలుండాలని, స్త్రీలలో గల స్వార్థపూరిత ద్వంద్వ ప్రమాణాలను విమర్శిస్తూ సాగిన ఇతివృత్తంలో అనేక సజీవ పాత్రల జీవన కథనంతో ఈ నవల పాఠకుల్లో నూతనోత్తేజాన్ని నింపుతుంది.
(రి) విసుర్రాయి (కథాసంపుటి) : ఇది 1998లో ముద్రింపబడింది. స్త్రీల జీవనగాథలను వివరించే ”విసుర్రాయి”లో మొత్తం 20 కథలు చోటుచేసుకొన్నాయి. గ్రామీణ స్త్రీల మీద జరిగే దోపిడీ, అన్యాయం, అణచివేతలు, ఆస్తిహక్కు లేకపోవటం, పెండ్లిచూపుల పేరుతో జరిగే అవమానాలు, వరకట్న సమస్యలు, ఇంటా బయటా నిర్ణయాధికారం లేకపోవటం, స్త్రీపురుషుల మధ్య వివక్షతలు మొదలగు సమస్యలనెన్నింటినో కథావస్తువులుగా గ్రహించి స్త్రీ చైతన్యాన్ని కాంక్షిస్తూ ఈ కథాసంపుటిని రచించారు. ఈ గ్రంథంలోని కథలన్నీ స్త్రీలకు జరిగే అన్యాయాలను చిత్రించే కథలు కాబట్టి, అన్నింటిలో ‘ఫెమినిజం’ భావదోరణీ ఉంది కాబట్టి, ఇవి ”స్త్రీవాదకథలు”గా చెప్పుకోవచ్చు. రచయిత్రి ప్రత్యేకంగా ఈ ధోరణికి చెందినవని చెప్పుకోకున్నా, అచ్చంగా ఇవి స్త్రీవాద కథలే. స్త్రీలలో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని, ధైర్యాన్ని, స్త్రీ వ్యక్తిత్వాన్ని, అంతశ్శక్తిని, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే దశలో ఈ కథలన్నీ కనిపిస్తాయి. ఈ కథల ద్వారా రచయిత్రి స్త్రీ స్వేచ్ఛ, సమానత్వాన్ని కాంక్షించారని భావింపవచ్చు.
స్త్రీల జీవితానికి ప్రతీక విసుర్రాయి. విసుర్రాయికి ఎంత చరిత్ర ఉందో స్త్రీ జీవితానికి కూడా అంత చరిత్ర ఉంది. ప్రతిక్షణం విరామం లేకుండా ఇంటి పనిని చేసే స్త్రీ జీవన వ్యక్తీకరణకు ”విసుర్రాయి”ని, ప్రతీకగా ఎన్నుకొని రాసిన కథలివి. ఈ కథలన్నింటిలో లిబరల్‌ భావజాలం కలిగి ఉండి, ప్రతి స్త్రీ తమపై జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను ఎదుర్కొనే నైతిక బలం సమకూర్చుకోవాలని, సమాజ ఆవశ్యకతకు అనుగుణంగా జీవనం సాగించాలనే సందేశం తెలియజేయబడుతుంది.
(రిరి) మింగుతున్న పట్నం (కథాసంపుటి) : ఇందులోని కథలన్నింటిని రచయిత్రి స్వానుభవంతో స్పందించి రచించినవి. ఇది 2001 ఆగస్ట్‌లో ప్రచురింపబడింది. సామాజిక రాజకీయ జీవన పరిణామాలకనుగుణంగా మానవ జీవితాల్లో వచ్చే ప్రకంపనాలు, నశించిపోతున్న మానవ విలువలు ఈ కథలల్లో ప్రతిబింబిస్తాయి. ప్రాచీనకాలంనుంచి భారతదేశంలో అనుసరిస్తున్న విజ్ఞాన కళానైపుణ్యాలు చాలా గొప్పవి. వ్యవసాయశాఖలో గానీ, వివిధ కులవృత్తుల్లో గానీ ఎంతో పనితనాన్ని, నేర్పును నాడు ప్రదర్శించి దేశీయ సామర్ధ్యాన్ని పెంపొందించేవారు. కానీ నేటి బహుళజాతి సంస్థల మార్కెటు రంగప్రవేశం ద్వారా దేశీయ విజ్ఞాన కళానైపుణ్యాలు నశించిపోతున్నాయి. ఈ పరిస్థితులకు చలించిపోయిన రచయిత్రి ఈ నేపథ్యాలతోనే ”మింగుతున్న పట్నం” అనే కథాసంపుటిని రచించారు.
ఈ కథల్లో కన్పించే ప్రధాన సమస్య భూమి సమస్య. ధనవంతుల జల్సాల కోసం రిసార్ట్స్‌గా, విమానాశ్రయాలుగా మారిపోతున్న వందల వేల ఎకరాల భూములను సామాన్య రైతులు అతితక్కువ ధరకు అమ్ముకొని కూలీలుగా, బిచ్చగాళ్లుగా, తాగుబోతులుగా అతి దీనమైన స్థితిలోకి నెట్టబడుతున్నారని ఈ కథల్లో తెలుస్తుంది. ఆధునికీకరణం, ప్రపంచీకరణం ధనవంతుల్ని మరీ ధనవంతులుగా, పేదవారిని మరీ పేదవారిగా మార్చివేస్తున్నాయని ఈ కథల ద్వారా గమనించే అంశాలు.
(రిరిరి) వ్యాపారమృగం (కథాసంపుటి) : పట్టణీకరణం ద్వారా గ్రామాల్లోని ప్రజలు ఏ విధంగా పేదరికంలోకి నెట్టబడుతున్నారో తెలియజెప్పే కథలు ఈ సంపుటిలో దర్శనమిస్తాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో ”వ్యాపారం” అనే మృగం ఏ విధంగా విలయవిహారం చేస్తుందో ఈ కథల అంతర్గత వస్తువైవిధ్యం తెలియజేస్తుంది. ”వసుధైక కుటుంబం” అనేది అర్థంలో బాగానే ఉన్నా ప్రపంచీకరణంలో ఆ మంచి లేదు. దోపిడీయే తప్పా ఆచరణలో మాత్రం నిరాశనే మిగులు తుంది. సమాజాభివృద్ధి, పేదరిక నిర్మూలనం అనే భావనలో ఏర్పడిన ప్రపంచీకరణం నేడు వివిధ రకాల దుష్ఫలితాలను మిగులుస్తుంది. దీనివల్ల అమితమైన వస్తూత్పత్తి జరిగి, వస్తువుల ఆకర్షణలో విని యోగదారులుగా, తమ ఉనికిని, అస్తిత్వాన్ని కోల్పోతున్నారని ఈ కథా వస్తువుల ద్వారా రచయిత్రి అభిప్రాయం వెల్లడవుతుంది. లింగ, వయోభేదం లేకుండా వ్యాపార మృగకోరల్లో చిక్కుకున్న వారందరు లాభాలు గడించటమే ప్రధానంగా చేసుకొని మానవ విలువలను కోల్పోవటం కూడా నేటి ప్రజల్లో కన్పించే ముఖ్యమైన అంశం.
వ్యాపార సంస్కృతి దృష్ట్యా మానవసంబంధాల్లో వచ్చిన మార్పులను, విధ్వంసాలను చిత్రించే కథలు రచయిత్రి ఈ సంపుటిలో పొందుపరిచారు. ఇవన్నీ స్త్రీల, మైనారిటీ వేదనలను, సామాజిక జీవన సమస్యలను తెలియజేసేవి.
|ఙ. సంపాదకత్వ సంకలనాలు :
(రి) తెలంగాణ తొలితరం కథలు : ఈ గ్రంథ సంకలన ముద్రణ 2002లో జరిగింది. నిజాం పాలనారోజుల్లో ఉర్దూ భాషాప్రభావాలు తెలుగు భాషపైన తీవ్రంగా చూపబడ్డాయి. భాషకే కాకుండా స్వంత సంస్కృతికి కూడా తెలుగుప్రజలు దూరమైనారు. క్రమంగా తెలంగాణ ప్రాంత ప్రజలల్లో ఇతర ప్రాంత ప్రజల కంటే తన వ్యత్యాసం ఏర్పడింది. భారతదేశమంతటా సంఘ సంస్కరణలు, పునరుజ్జీవనోద్యమాలు నడుస్తున్నా తెలంగాణాలో వీటి జాడ ఇసుమంతైనా లేకపోయింది. తర్వాతర్వాత ఈ అంధకారం నుంచి బయటపడడానికి గ్రంథాలయోధ్యమాలు, ఆంధ్రమహాసభల పేర సాంస్కృతికోద్యమాలు తెలంగాణ ప్రజల్ని చైతన్యపరిచాయి. తత్ఫలితంగా తెలంగాణా విమోచనోద్యమానికి బాటలు వేశాయి.
నిజాం వ్యతిరేక పోరాట ఆవేశంలోంచి మొదటగా పాట పుట్టింది. గ్రంథాలయోద్యమం, నిజాం వ్యతిరేకోద్యమం, కమ్యూనిస్టు ఉద్యమంలో పాల్గొన్న సాహిత్యాభిమానులు పాట తర్వాత ”కథ” ప్రక్రియకే ప్రాధాన్యత ఇచ్చారు. విస్తృతంగా రచనలు చేశారు. ఈ కథలన్నీ ఆనాటి పత్రికల్లో అచ్చు అయినవే. కాని పునర్ముద్రణకు నోచుకోలేదు. ఆనాటి రాజకీయ, భౌగోళిక, ఆర్థిక, సామాజిక స్థితిగతుల వల్ల ఈ కథలు సంపుటాలుగా ముద్రించుకోలేకపోయాయి. ఇలా ఎక్కడెక్కడనో అస్తవ్యస్తంగా, చెల్లాచెదరుగా ఉన్న అనేక కథలను ఎంతో శ్రమపడి ముదిగంటి సుజాతారెడ్డి సేకరించారు.
ఈ కథలన్నీ వస్తువైవిధ్యంలో ప్రాధాన్యత వహించాయి. చారిత్రకం నుంచి సైన్సు ఫిక్షన్‌ వరకు, వ్యక్తినుంచి సమాజం వరకు కథావస్తువును స్వీకరించడంలో నాటి రచయితలు మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించారు. వీరి కథనశిల్పంలో కూడా నూతనమైన ధోరణి కనిపిస్తుంది. కేవలం తెలంగాణాకే పరిమితమైన ఉద్యమాలను, జీవితాలను, సమస్యలను తీసుకోవడం తెలంగాణా రచయితల కథల్లో కనిపించే గొప్ప విశేషం. ప్రత్యేకమైన తెలంగాణా సామాజిక సాహిత్య వాతావరణంలోనే వీరి కథనశిల్పం వెల్లివిరిసింది. తెలంగాణా భాషాశైలి, సంస్కృతి పరిపుష్టంగా ఉన్న తొలితరం రచయితల కథలను సంకలనంగా, తెలంగాణా ప్రజలకు వారసత్వంగా అందించిన ఈ గ్రంథం వెనుక సుజాతారెడ్డి కృషి అనన్య సామాన్యమైంది.
(రిరి) తొలినాటి కతలు (తొలితరం తెలంగాణా కథలు-||) : ఈ గ్రంథాన్ని సుజాతారెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్‌ కలిసి 2005లో ప్రచురించారు. ఇందులో 1910లో రచించిన కొమర్రాజు లక్ష్మణరావు గారి ”ఏబదివేల బేరము” కథ నుంచి 1956 సం|| వరకు గల రచయితల థలు ఉన్నాయి. ఈ కథలన్నీ ఆనాడు హితబోధిని, సుజాత, ఆంధ్రాభ్యుదయము, దక్కన్‌ కేసరి, మీజాన్‌, ఆంధ్రజ్యోతి, భాగ్యనగర్‌, విశాలాంధ్ర, గోలకొండ, శోభ, ప్రజాశక్తి, నవోదయ, భారతి, తెలుగు స్వతంత్ర, స్రవంతి, తెలుగుదేశం, గృహలక్ష్మి వంటి పత్రికల్లో అచ్చు అయినవి.
తెలంగాణా తన చరిత్రను తాను తవ్వుకొంటున్న సందర్భంలో తెలంగాణా కథాసాహిత్యాన్ని, తెలంగాణా కథలను సాహిత్యలోకానికి పరిచయం చేయాలనే రచయిత్రి సంకల్పం చాలా ఉత్తమమైంది. తెలంగాణా అస్తిత్వం, అస్మితం, ఆత్మగౌరవం వంటి పునర్నిర్మాణంలో తెలంగాణా చరిత్ర, సాహిత్యాలను బయటికి తీయవలసిన అవసరాన్ని రచయిత్రి గుర్తించారు. అందుకే తెలంగాణా పునర్వికాసయుగానికి ఈ సంకలనం ద్వారా ఒక గొప్ప యోగదానానికి సంకల్పించారనే చెప్పవచ్చు. అదే విధంగా తెలంగాణా కథల ప్రాధాన్యాన్ని గూర్చి ప్రస్తావిస్తూ నందిని సిధారెడ్డి ”తెలంగాణా కథల్లో శిల్పం లేకున్నా జీవితం ఉంది” అంటారు. జీవకళ ఉట్టిపడే ఈ కథలు యదార్థ సంఘటనలతో కూడిన ప్రజాజీవితాన్ని చిత్రిస్తాయి. కల్పితేతి వృత్తాలకు, ఊహాజనిత ఇతివృత్తాలకు దూరంగా ఉండి, వస్తుధ్వనిని పాటించాయి. ధ్వన్యాత్మకమైన ప్రతీకలు కూడా ఈ కథల్లో గోచరమౌతాయి.
”తెలంగాణా ప్రాంతం ”బృహత్కథ” కాలం నాటి నుంచీ కథలకు కాణాచి” అని, ”గుణాఢ్యుడు” తెలంగాణ వాడేనవి, శాతవాహన కాలంనాటి నుంచి తెలంగాణ ప్రాంతంలో కథారచన కొనసాగిందని రచయిత్రి ఈ గ్రంథం ద్వారా తెలియజేశారు.
(రిరిరి) ముద్దెర : ఇది వ్యాస సంకలనం. దీనిని సుజాతారెడ్డి 2005లో ప్రచురించారు. తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వవాదాన్ని గూర్చి వివిధ రచయితలు వెలిబుచ్చిన అభిప్రాయాలు ఈ గ్రంథంలో పొందుపరిచారు. తెలంగాణా ప్రాంత అస్తిత్వాన్ని కాపాడుకొనే ఉద్దేశంతో ఈ గ్రంథంలో 14 సాహిత్య విమర్శ వ్యాసాలు దర్శనమిస్తాయి. ఇందులో ఐదు వ్యాసాలు రచయిత్రి రాసినవి. సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తూ అస్తిత్వవాదంపై సరియైన వివరణ పూర్వకమైన అభిప్రాయాలు సుజాతారెడ్డి వ్యాసాల్లో కన్పిస్తాయి. ”తెలంగాణ సాహిత్య విమర్శలో ”తోవలు”, ”తొలితరం తెలంగాణా కథల పునర్నిర్మాణం” అనే వ్యాసాలతో పాటు అత్యాధునిక ధోరణులుగా వ్యవహరింపబడుతున్న ప్రపంచీకరణం, వ్యాపార యుగం అనే అంశాలను కూడా కూలంకషంగా చర్చించారు.
సుజాతారెడ్డితో పాటు గుడిపాటి, జూలూరు గౌరీశంకర్‌, కాసుల ప్రతాపరెడ్డి, నందిని సిధారెడ్డి మొదలగు సాహిత్య విమర్శకులు తెలంగాణ భాష, పాట, కథ, కవిత్వం వంటి అంశాలపై వ్యాసాలు రచించారు. తెలంగాణా జీవిత చిత్రణ, దేశీయత వంటివి వీరి వ్యాసాల్లో కనిపించే ప్రధానాంశాలు.
ఙ. యాత్రా కథన రచనలు :
సుజాతారెడ్డి ఈజిప్టు పర్యటనకు వెళ్లినప్పుడు, అక్కడ తిలకించిన దృశ్యాలతో ”నైలునదీ నాగరికత” పేర యాత్రాకథన రచన చేశారు. ఈజిప్టులో తాను చూసిన అద్భుతాంశాలను, పిరమిడులను, దేవాలయాలను ఆధారంగా చేసుకొని ఆనాటి చరిత్రను, రాచరిక పాలనను, వ్యవస్థను, సామాజిక స్థితిగతులను ఈ గ్రంథంలో తెలియజేశారు. నేటి వరకు వివిధ విషయాలలో విజ్ఞాన శాస్త్రవేత్తలకు, పురావస్తు పరిశీలకులకు ప్రశ్నార్థకంగా ఉన్న ప్రపంచంలోనే అతిప్రాచీనమైన నైలునదీ నాగరికతను గూర్చి అమూల్యమైన విషయాలను స్పష్టపరిచారు.
2006లో ప్రచురింపబడిన ఈ గ్రంథంలో ”ఈజిప్టు యాత్రాకథనం, లద్దాఖ్‌ యాత్రాకథనం” అనే రెండు యాత్రా కథన రచనలు చేయబడ్డాయి.
ఙ|. సంయుక్త రచనలు :
ఆచార్య ముదిగంటి గోపాల్‌రెడ్డి, సుజాతారెడ్డిలు కలిసి చేసిన రచనలు కొన్ని ఉన్నాయి. ఆచార్య ముదిగంటి గోపాల్‌రెడ్డి బహుభాషాకోవిదుడు. సుజాతారెడ్డి వివిధ సాహిత్య ప్రక్రియల్లో రచనలు చేసిన విదుషీమణి. వీరిరువురి సంయుక్త ఆధ్వర్యంలో వచ్చిన గ్రంథాలు అమూల్యమైనవిగా నేటి పాఠకలోకంలో పరిశీలనకున్నాయి.
(రి) బాణుని కాదంబరి పరిశీలనం : బాణుని కాదంబరిపై ఎన్ని విమర్శలొచ్చినా, ఎన్ని పరిశీలనలు కొనసాగినా తవ్వినకొద్దీ రత్నాలు బయటపడ్డట్లు ఒక గొప్ప అద్భుతగని ”కాదంబరి” గద్యకావ్యం. సుజాతారెడ్డి, గోపాల్‌రెడ్డిలు సంయుక్తంగా పరిశీలన చేసిన బాణుని కాదంబరిలో సంస్కృత గద్య కావ్య భేదాలు, గద్యం, దాని పుట్టుపూర్వోత్తరాలు, చరిత్ర, ప్రాచీన గద్యం వంటి అంశాలు చేర్చబడ్డాయి. వీటితోపాటు బాణుని జీవిత విశేషాలు, జనన కాల వివాదాలు, అతని రచనలు కూడా కూలంకషంగా చర్చించబడ్డాయి. కాదంబరిలో జానపద కథల ప్రభావం కనిపిస్తుందని వీరి పరిశీలనలో వెల్లడవుతుంది. మూలకథానుసరణం, కథాకథన చమత్కారం కాదంబరిలో అత్యద్భుతంగా దర్శనమయ్యే నేపథ్యం ఈ గ్రంథంలో తెలుస్తుంది. కాదంబరిలో బాణుడు సృష్టించిన పాత్రలు అత్యంత సహజ సుందరంగా ఉన్నాయని, కథాశిల్పానికి అనుగుణంగా వర్ణనలు, అలంకారాలు, రసపోషణ, శైలీసౌందర్యం వంటి అంశాలు అత్యంత రమణీయంగా తీర్చిదిద్దబడ్డాయని వీరి గ్రంథం వల్ల తెలుస్తుంది.
(రిరి) సంస్కృత సాహిత్య చరిత్ర : ఈ గ్రంథం కూడా గోపాల్‌రెడ్డి, సుజాతారెడ్డిల సంయుక్త ఆధ్వర్యంలో ప్రచురించబడింది. సంస్కృత వాఙ్మయం చాలా విస్తృతమైంది. అతిపురాతన కాలంనుంచి మానవుడు తన మేధోశక్తిని ఉపయోగించి కనుగొన్న విషయాలు ఈ వాఙ్మయంలో చేరుతూ వచ్చాయి. ”మానవ జీవితానికి ఉపయోగపడే ఇహపరములైన అనేక శాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాలు, శాస్త్రవిషయకగ్రంథాలు – ఇవన్నీ సంస్కృత వాఙ్మయంలో చోటుచేసుకొన్నాయి” అని ఈ గ్రంథారంభంలో తెలుస్తుంది. ఇంతటి ప్రశస్తి చెందిన చరిత్రను తెలిపిన ఘనత వీరిరువురికే చెందుతుంది.
ఈ గ్రంథంలో ”వైదిక వాఙ్మయం, లౌకిక వాఙ్మయం” వంటి అంశాలు చేర్చబడ్డాయి. వైదిక వాఙ్మయంలో ముదిగంటి దంపతులు ”వేదం ఈశ్వరీయం” అని ప్రతిపాదించారు. ఈ విభాగంలో నాలుగు వేదాల గూర్చి, సంహితల గూర్చి, వేదద్రష్టలైన ఋషులను గూర్చి, చతుర్వేదాలను గూర్చి, భాష్యాలను గూర్చి విశేషంగా చర్చించబడ్డాయి. లౌకిక వాఙ్మయంలో మహాకావ్యాలు, రూపకాలు, లఘుకావ్యాలు, గద్యకావ్యాలు, చారిత్రకకావ్యాలు, చంపూకావ్యాలు, కథాకావ్యాలు, నీతికథాకావ్యాలు, చిత్రకావ్యాలు, అలంకారశాస్త్ర గ్రంథాలు, నిఘంటు గ్రంథాలు మున్నగు వాటిని గూర్చి కూలంకషంగా వివరింపబడ్డాయి. ”టుబింగెన్‌” యూనివర్శిటీ లైబ్రరీలో సేకరించిన విషయాలతో అతివిస్తృతమైన సంస్కృత సాహిత్య చరిత్రను అత్యంత సులభమైన శైలితో తెలుగువారికి అందించారు.
సంస్కృత వాఙ్మయ చరిత్రలోనే ప్రామాణికంగా వెలుగొందుతున్న ఈ గ్రంథాన్ని గూర్చి మహామహోపాధ్యాయ, రాష్ట్రపతి పురస్కార గ్రహీత ప్రొఫెసర్‌ పుల్లెల శ్రీరామచంద్రుడు ఈ విధంగా సెలవిచ్చారు – ”సర్వాంగ సంపూర్ణమూ, ప్రామాణికమూ అయిన ఇలాంటి వాఙ్మయ చరిత్ర తెలుగులో ఈనాటి వరకూ వెలువడలేదంటే తెలుగు సర్వతోముఖాభివృద్ధికి ఎంతో ప్రయత్నం జరుగుతున్నదని చెప్పే ఈ కాలంలో ఆశ్చర్యకరంగా ఉంటే ఉండవచ్చును గాని ఇది యధార్థమైన విషయం. మా మిత్రులు డా|| ఎమ్‌. గోపాల్‌రెడ్డి గారు, వారి పత్ని డా|| సుజాతారెడ్డి గారు నిరంతర ప్రయత్న ఫలితంగా ఈ గ్రంథం రచించి – తెలుగులో ఆ లోపాన్ని తీర్చడం చాలా ముదావహం”. (పేజీ.6 – సంస్కృత సాహిత్య చరిత్ర)
తెలుగులో వివిధ సాహిత్య ప్రక్రియల్లో రచనలు చేసి సమ్యక్‌ దృష్టిని అలవరుచుకొన్న రచయిత్రి సుజాతారెడ్డి ఆధునిక తెలంగాణ మహిళా సాహిత్యంలో ప్రత్యేక స్థానాన్ని అధిష్టించారు. ఆమె తన ప్రతి సాహిత్య ప్రక్రియలో అనేక నూతనాంశాలను ఆవిష్కరించారు. భారతీయతను, మానవ మౌలిక స్వరూపాన్ని కాపాడటమే ఆమె రచనల ముఖ్యోద్దేశం. మన భారతీయ సంస్కృతికి మూలకందాలైన ప్రాచీన విజ్ఞానాన్ని ఎంతగానో అభిమానించారు. దీనికి తోడు ప్రాచీన భారతీయ సంస్కృతి, సాహిత్యాలు ప్రపంచ సాహిత్యాల్లోకెల్ల గొప్పవని విశ్వసించారు. ప్రాచీన భారతీయ రచనా పద్ధతిని అనుసరిస్తూనే ఆధునిక ప్రక్రియలకు ఆధునిక భావాలను అనువర్తింపజేయడంలో అందె వేశారు. వివిధ సంప్రదాయాలను తాత్త్విక నేపథ్యంలో వివేచించారు. వివాదాస్పదమైన, సాహసోపేతమైన నూతన మార్గంలో సాహిత్య విమర్శ చేసి గెలిచారు. ఆమె విమర్శా మార్గం అభ్యుదయ పథంలో నడిచిన దేశీయ ప్రస్థానం.
సుజాతారెడ్డిది ఒక విభిన్నమైన ప్రత్యేక శైలి. ఆమె ఏ విధంగా ఆలోచిస్తారో, అదే విధంగా రాస్తారు. ఆమె రచనల్లో సహజత్వం కనిపిస్తుంది. సృజన రచనల్లో వస్తు, పాత్ర, భాషా వైవిధ్యం ప్రస్ఫుటంగా దర్శనమిస్తుంది. తెలంగాణ ప్రజల జీవన శైలిని సూక్ష్మేక్షికతో దర్శించి, తన రచనా భాషలో తెలంగాణ మాండలిక పదాలను, మారుమూల పదాలను, ప్రయోగం నుంచి తొలగి పోతున్న వాటిని చాలా వరకు ప్రయోగించి, ఆ పదాలకు జీవం పోశారు. ప్రాంతీయ మాండలిక శైలిని పాత్రల సంభాషణల్లోనే గాక, రచయిత్రి కథనంలో కూడా ప్రదర్శించి ఆధునిక తెలంగాణ రచయిత్రులలో తనంటూ ప్రత్యేక ముద్రను సంతరించుకోవడం గమనార్హం.
పత్ర సమర్పణ చేసిన వ్యాసం)

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

One Response to ఆధునిక తెలంగాణ మహిళా సాహిత్యం : సుజాతారెడ్డి స్థానం

  1. Ramnarsimha says:

    `డా.ముదిగంటి సుజాతరెడ్డి` గారి గురించి తెలియజేసినందుకు
    ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.