ఇటీవల ఖమ్మం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో నలుగురు గిరిజన బాలికలు మరణించారు. ఈ మరణాలు సహజంగా సంభవించినవి కావు. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్.పి.వి) వాక్సిన్ తీసుకోవడంవల్ల ఈ మరణాలు సంభవించాయన్న విషయం బయట ప్రపంచానికి తెలిసింది. అసలు ఈ హెచ్.పి.వి వైరస్ వాక్సిన్‌ని ఈ పిల్లలకి ఎందుకిచ్చారు? ఎవరికిచ్చారు? ఎలా ఇచ్చారు? ఈ ప్రశ్నలన్నింటి గురించి కూలంకషంగా ఆలోచిస్తే, తీగ లాగితే డొంకంతా కదిలింది. చిన్న తీగ అనుకున్నది కాస్తా చాలా పెద్దదిగా, డొంక కాస్తా కాలసర్పాలు తిరిగే కారడవిలాగా తయారై, వాటి వివరాలు చదువుతూంటే, అర్థం చేసుకుంటూంటే వెన్నులోంచి నాగుపాము జర జరా పాకిన విభ్రాంతి కలిగింది.
వివరాల్లోకి వెళితే ”పాత్ ఇంటర్నేషనల్’ అనే అంతర్జాతీయ మందులకంపెనీ, | మరియు ఆయా రాష్ట్రాల సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఖమ్మం జిల్లాలోను, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల్లోను హెచ్.పి.వి వాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించాయి. ఈ కార్యక్రమం మొదలయ్యాక ఖమ్మంలోని ఏజన్సీ ప్రాంతంలో నలుగురు ఆడపిల్లలు మృత్యువాత పడ్డారు. హెచ్.పి.వి వాక్సిన్ వేసిన తరువాత తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ ఏర్పడి ఈ పిల్లలు చనిపోయారు.
ఈ విషాద సంఘటన జరిగిన తర్వాత దాదాపు 50 సంఘాలు- వీళ్ళల్లో ప్రజారోగ్య రంగంలో పనిచేసే నిపుణులు, హెల్త్ నెట్‌వర్క్స్, వైద్య నిపుణులు, మానవ హక్కుల కార్యకర్తలు, మహిళా సంఘాలకు చెందినవారున్నారు. వీరంతా ఈ అంశమై గళమెత్తారు. ఈ వాక్సీన్ భద్రత గురించి, ఈ ప్రాజెక్టు అమలు తీరు గురించి ప్రభుత్వానికి మెమొరాండంలు సమర్పించారు. ఖమ్మం జిల్లాలో ఎక్కడైతే (14,000) పధ్నాలుగు వేలమంది ఆడపిల్లలకి హెచ్.పి.వి వాక్సిన్ వేసారో ఆ అన్ని ప్రాంతాల్లోను స్థానిక సంఘాలవారు నిజ నిర్ధారణ చేసినపుడు చాలా భయానకమైన వివరాలు వెలుగులోకొచ్చాయి. ఎంత అమానవీయంగా, ఎంత నిర్లక్ష్యంగా ఈ వాక్సిన్‌లు ఈ అమాయక, గిరిజన ఆడపిల్లలకి వేసారో అర్ధమై కడుపు రగిలిపోయింది. ఈ పిల్లలంతా 10-14 సంవత్సరాల వయస్సులో వున్నవారు. వీరందరికీ మూడు డోసులు హెచ్.పి.వి వాక్సిన్ వేసేసారు. వీరిలో చాలామంది పిల్లలు తీవ్రమైన కడుపునొప్పి, తలనొప్పి, మూడ్స్‌లో మార్పులు, ముందుగానే ముట్లు రావడం, తీవ్ర రక్తస్రావం, మెన్స్‌స్ సమయంలో క్రాంప్స్ రావడంలాంటి సైడ్ ఎఫెక్ట్స్‌కు గురయ్యారు. నలుగురు ఆడపిల్లలు ఏకంగా చనిపోవడమే జరిగింది.
ఈ వాక్సిన్ వేసేటపుడు ఈ పిల్లలకి చెప్పినదేమిటంటే, దీన్ని వేయించుకోవడంవల్ల మీకు ఎప్పటికీ గర్భాశయముఖద్వార కాన్సరు రాదు అని మభ్యపెట్టడం. అయితే ఫార్మాస్యూటికల్ కంపెనీలవాళ్ళు మాత్రం హెచ్.పి.వి వాక్సిన్‌లు వేయించుకోవడంవల్ల హెచ్.పి.వి వైరస్ ఇన్‌ఫెక్షన్ నుంచి రక్షణ మాత్రమే దొరుకుతుందని చెబుతున్నారు. గర్భాశయ ముఖద్వార కాన్సరు లాంటి భయంకరవ్యాధి గురించి వీళ్ళని మభ్యపెట్టడం చాలా అమానుషమైన విషయం. నిజానికి ఈ వాక్సిన్ ప్రభావం 3-5 సంవత్సరాలకు మాత్రమే ఉంటుందనేది ఇప్పటికే అభివృద్ధి చెందని దేశాల్లో నిర్ధారణ అయ్యింది. ఈ వాక్సిన్ నిజ స్వభావం, ఎలా పనిచేస్తుంది. దేనికి రక్షణనిస్తుంది, దీనివల్ల వచ్చే దుష్ఫ్రభావాలేంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి లాంటివేవీ వివరించకుండా, ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా అమాయక గిరిజన ప్రాంతాల బాలికల మీద దీన్ని ప్రయోగించడం ఎంత అన్యాయమో, అనైతికమో అందరం అర్థం చేసుకోవాలి.
పధ్నాలుగు వేలమంది ఆడపిల్లల్ని ఎంపిక చేసిన విధానం, వారి ”అంగీకారం” తీసుకున్న పద్ధతి చాలా అనుమానాస్పదమైంది. ఈ ప్రాజెక్టు అమలు కోసం, కావలసిన ఆడపిల్లల ఎంపిక కోసం ఆశ్రమ పాఠశాలల్ని ఎంచుకుని, కనీసం వారి తల్లిదండ్రులకి తెలపకుండా హాస్టల్ వార్డెన్/ఇంఛార్జి టీచర్ నోటిమాటనే అంగీకారంగా తీసుకున్నారు. బయట నుంచి పాఠశాలకొచ్చే పిల్లల తల్లిదండ్రుల నుంచి ”అంగీకార పత్రం” మీద సంతకాలో, వేలి ముద్రలో తీసుకున్నారు. ఈ అంగీకార పత్రంలో కనీసం ఈ వాక్సిన్ ఏమిటనిగానీ తీసుకుంటే ఏ ఇబ్బందులు వస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే సమాచారం లేదు. ఒక హాస్టల్‌లో ఒక వార్డెన్ ఈ వాక్సిన్ ప్రక్రియని వ్యతిరేకిస్తే, ఇది ”మాండేటరీ” అంటూ ఆమె నోరు నొక్కేసారు. ఇంత అనైతికంగా, అమానవీయంగా ”అంగీకారం” పొందిన విదేశీ కంపెనీలు పధ్నాలుగు వేల మంది ఆడపిల్లలకి ఈ వాక్సిన్‌లు వేసాయి. ఈ ప్రక్రియ అంతా ‘ఎన్‌ఆర్‌హెచ్‌ఎం’ బ్యానర్ కింద జరగడం మరింత షాక్‌ని కల్గిస్తోంది.భద్రాచలం గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాల పరిస్థితి దయనీయంగా వుంటుంది. ఆ ప్రాంతంలో ఒక్క గైనకాలజిస్టు లేదంటే అతిశయోక్తి కాదు. గైనకాలజిస్టు ఆధ్వర్యంలో జరిగే ” పాప్‌స్మియర్” పరీక్ష వెసులుబాటు లేకుండానే (హెచ్.పి.వి వాక్సిన్ వేయించుకున్న వాళ్ళకి ఇది చాలా ముఖ్యమైన పరీక్ష) ఈ వాక్సిన్‌లు వేయడం ఎంత భయంకర నిర్లక్ష్యమో అర్థ్ధం చేసుకోవాలి. ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్న విదేశీ కంపెనీ ‘పాత్’కి బిల్ అండ్ మెలిందా గేట్స్ పౌండేషన్ ఫండింగు ఇస్తోంది. లాభాల వేటలోనే విదేశీ కంపెనీలు పనిచేసినా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీటికి వత్తాసు పలకడం, పర్మిషన్స్ ఇవ్వడం చాలా దారుణమైన అంశం. ”యూనివర్సల్ ఇమ్యూనైజేషన్” పేరుతో ఇవి జరగడం ప్రజల్ని భ్రమపెట్టడమే.
నలుగురు గిరిజన బాలికల బలిదానం జరిగాకైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి, హెచ్.పి.వి. వాక్సిన్ భద్రత గురించి, పర్యవసానాల గురించి, ఈ కార్యక్రమం కోసం జరిగిన ఒప్పందాల గురించి ప్రజలకి తెలియచెయ్యాలి. అభివృద్ధికి నోచుకోని, అన్నెంపున్నెం ఎరుగని అమాయక గిరిజన ప్రాంతాల ఎంపికలోనే దారుణమైన మోసం దాగుంది. ”అంగీకారం పత్రం”లోనే ద్రోహం వుంది. ఈ మొత్తం వ్యవహారం మీద సమగ్ర దర్యాప్తు జరిపించి నిజానిజాలు వెల్లడించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద వుంది. పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులకి నష్టపరిహారం ఇవ్వాల్సిన నైతిక బాధ్యత కూడా వుంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టేటపుడు ప్రజలకు వివరించి, వారి సంపూర్ణ అంగీకారంతోనే చెయ్యాలిగాని రహాస్యంగా, గుట్టు చప్పుడుకాకుండా మారుమూల గిరిజన ప్రాంతాల్లో మొదలుపెట్టడం అన్యాయం, అమానుషం, అనైతికం.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
ఎడిటర్ గారికి,
వ్యాసం చాలా బాగుంది.
అభినందనలు.
`అమాయక గిరిజన బాలికలను` బలి పశువులను చేయడం తీవ్రంగా వ్యతిరేకించాల్సిన విషయం.
సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరమునంది.
ramuputluri@yahoo.in
సత్యా,
ఈ నెల ఎడిటోరియల్ బాధనీ,భయాన్నీ కలిగించింది .ఇదే విషయము గురించి వసంత అనే ఆవిడ చాలా ప్రమాదకరమైన దని ,నిరసన తెల్పాలనీ మెసేజులు ఇచ్చింది.ఆ వెంటనే అంధ్రజ్యోతి లో ఆడవాళ్ల కు అది చాలా మంచి మందు అని వార్త వచ్చింది.మొత్తనికి అది నేరుగా నరకానికి తీసికెళ్లే దని చాలా చక్కగా చైతన్య పరిచావు.
శివ .