– పంతం సుజాత
ప్రతి రోజూ వెన్నెల్ని చూసి చూసి అమావాస్య వస్తే మనసు భారమవడం ఖాయం. అలాగే ఒకేసారి ఇన్ని మంచి కథలు చదివి చదివీ పుస్తకం మూసాక ఆలోచన చెమ్మగిల్లుతుంది. గొరుసు జగదీశ్వర రెడ్డి కథలు ‘గజ ఈతరాలు’ చదివితే ప్రతి పాఠకుడికీ అదే భావన కలుగుతుంది.
మూడు ప్రాంతాల భాషల మీద మంచి పట్టు ఉందని నిరూపించుకున్న రచయిత. ఓ పక్క తెలంగాణా భాష, మరో పక్క శ్రీకాకుళం యాస, కథకుడి మనసులో గోదావరి ఘోష.
‘గజ ఈతరాలు’ కథ రచయిత బాల్యాన్ని కళ్ళ ముందుంచినా ‘పూర్ణమ్మ’ పాత్రని ఎవరూ మర్చిపోలేరు. ఎన్నో కష్టాల్ని ఎంతో సులువుగా ఎదిరించి జీవిత చరమాంకంలోకి చేరింది పూర్ణమ్మ. కాని రోగం శరీరంలోకి వచ్చి చేరితే ఏమీ చెయ్యలేకపోయింది. బ్రతుకు భారమై, మమకారం ముక్కలవుతుంటే ఇంటికి బరువు అవ్వలేకపోయిది. తనకు తెలిసిన విద్య బ్రతకడానికి పనికిరాకపోయినా చావుకి అడ్డు పడుతుందని కాళ్ళకి రాళ్ళు కట్టుకుని చనిపోవడమనేది జ్ఞాపకంలో నిలిచిపోయే దారుణం.
పుట్టి పెరిగిన ప్రదేశంపై మనిషికి మమకారం ఉండడం సహజం. కాని చిన్ననాటి సహచరుల్ని గుర్తించుకొని వాళ్ళకి కష్టం వస్తే వెళ్ళి కళ్ళు తుడిచి రావడం అరుదు. పని చేసిన పనిముట్టు పైనా, ప్రేమగా పెంచుకున్న చెట్టు మీదా ఒకే విధమైన ప్రేమను పెంచుకున్నవాడు సున్నిత మనస్కుడు. ‘చీడ’ కథలో ఆ మనసు మనకు తెలుస్తుంది. ‘ఆల్విన్’ కార్మికుల బాధల్ని అతని వాక్యాల్లో చదువుతుంటే గుండె తరుక్కు పోతుంది.
అప్పటి వరకూ గుండెల్లో దాచుకున్న తల్లి, నిర్దాక్షిణ్యంగా బయటకి గెంటేసి, తలుపులు మూసేస్తే ఆ బిడ్డ పరిస్థితి లాంటిదే ఒక్కసారిగా రోడ్డుమీదకి వచ్చిన కార్మికుల పరిస్థితి.
ఆ బాధల్లోంచి వచ్చిన మనసు కాబట్టి ఆ కలం కరెక్ట్‌గా ఆ కసిని పనిగట్టగలిగింది. నరాల్లో సుడితిరిగిన వ్యధ సిరాగా మారింది.
‘బతుకు గోస’ కథలోనే రచయిత నేర్పరితనం తెలిసిపోయింది. కథానాయకుడి పాత్రని ఎక్కడా అనుమానం రాకుండా మలిచిన తీరు అద్బుతం. సహచరులందరూ చేసిన పనే ఇతనూ చేస్తాడేమోనని పాఠకుడు భ్రమ పడే లోపు అతని శరీరంలో తూటాలు శరాఘాతంలా పాఠకుడి మనసుకి తగులుతాయి. అమావాస్య ముందు కాంతిహీన చంద్రుడు బూజు పట్టినట్టున్నాడు అనడం ఆ సందర్భానికి సరిగ్గా సరిపోయింది.
‘వలసపక్షులు’ కథ చదివితే చెమ్మగిల్లిన ఆలోచన చెరిసగమైనట్టుంది. ఇటు మేస్త్రమ్మ కరుకుదనం, అటు ముత్యాలమ్మ మానవత్వం ఒకేసారి ఎదురై ఉక్కిరి బిక్కిరి చేస్తాయి.
ఎప్పటికైనా వస్తాడని ఎదురు చూస్తూ కొడుకు కోసం డబ్బు కూడబెడుతున్న ‘వాల్తేరత్త’లా మళ్ళీ ఇలాంటి మంచి కథలు రచయిత నుండి వస్తాయని ఆశలు కూడబెడుతూ ఎదురుచూద్దాం.