– రాజేశ్వరి దివాకర్ల
వచనాలను పలికిన స్త్రీ శరణులలో అక్క మహాదేవి అగ్రగణ్యురాలు. ఆమె ఆలోచనాత్మకాలైన అనేక వచనాలను పలికింది. ఆమె జీవితంలో ఎన్నో మహత్తరమైన సంఘటనలు జరిగాయి. ఆమె అపారమైన ధైర్య సాహసాలను ప్రదర్శించింది. అక్కమహా దేవి చెన్న మల్లికార్జునుడిని వలచింది. అనంత ప్రకృతిలో అంతటా అతనిని చూచింది. అతనిని చేరుకోవాలని సకల భోగభాగ్యాలనూ, భర్తనూ వదిలి ఇల్లు విడిచి ఒంటరిగా బయలుదేరింది.
తన ఆశయసిద్ధికి దేహాన్ని సాధనగా చేసుకుంది. కఠినమైన యోగాన్ని అభ్యసించింది. ‘ఆకలయితే భిక్షాన్నాలున్నాయి, దాహమైతే చెరువులు, గుంటలు, బావులున్నాయి. శయనానికి శిథిల దేవాలయాలున్నాయి’ అన్న సంకల్ప బలంతో ఇంద్రియ సంకటాల నన్నింటినీ జయించింది. ‘ఆకలీ, నీవు ఆగు! నిద్రా, నీవు నిలు!’ అంటూ శాసించింది. అక్కమహాదేవి భక్తితో పాటు, శరీర తత్వాన్ని శాస్త్రీయంగా అవలోకించింది. దేహజ్ఞానాన్ని అనుభవపూర్వకంగా సంపాదించింది. ‘యోగాంగ త్రివిధి’ ని కూడా రచించింది.
ఆధునికులైన స్త్రీలు ఇప్పుడు ఆహారాన్ని గురించి, భోజన నియమాలను గురించి అధిక శ్రద్ధను చూపుతున్నారు. కాలరీల ఆదాయ వ్యయాల గురించి ఆందోళన పడుతున్నారు. నేటి వైద్యులు, ఆహార నిపుణులు, ఆరోగ్య సూత్రకారులు అభ్యసన పూర్వకంగా పరిశోధనలను చేసి వెల్లడించిన విషయాల నెన్నింటినో అక్కమహాదేవి పన్నెండవ శతాబ్దంలోనే, అంటే ఇప్పటికీ ఎనిమిది వందల సంవత్సరాలకు పూర్వమే వెల్లడించిందని మనం తెలుసుకోవాలి. దేహ విషయమైన జాగ్రత్తను గూర్చి, శరీర ఆరోగ్యాన్ని గురించి మనకు తెలిపిన ప్రప్రథమ కవయిత్రి అక్కమహాదేవి.
మనిషి శరీరం సకలేంద్రియాలకు ఆధారం. అంతరంగికంగా బుద్ధి మన ఆలోచనలను నియంత్రించి మంచి నడవడిని తీర్చిదిద్దితే, ఆహారం దేహానికి కావలసిన పుష్టిని, శక్తిని ఇస్తుంది. అవయవ సౌష్టవమిచ్చి సర్వక్రియా కారకమౌతుంది. మనిషి జీవనానికి ఆహారం ఎంత ముఖ్యమో, అధికంగా తినడం అంత అపాయకరం. మితమైన భోజనం మేలు చేస్తుంది. దీర్ఘాయువునిస్తుంది. మనం చేరవలసిన గమ్యాలకు సదవకాశాలను కలుగజేస్తుంది. మనకున్నది ఒక్కటే జీవితం. ఆ జీవితాన్ని చురుకుగా తెలివిగా మలచుకోవాలి. అందుకు మునుముందుగా నోటి చపలతను అదుపుచేయాలి. ఈ విషయాన్ని అక్క మహాదేవి ఈ క్రింది వచనంలో ఇలా చెప్పింది:
ఆహారాన్ని తక్కువ చేయండన్నా!
ఆహారాన్ని తక్కువ చేయండి!
ఆహారం వల్ల వ్యాధులొచ్చి
పట్టుకుంటామయ్యా!
ఆహారం వల్ల నిద్ర, నిద్రతో తామసం,
అజ్ఞానం, మైమరపు,
మనోవికారం, భావవికారం, ఇంద్రియ వికారం
వాయువికారం వంటి పంచవికారాలను కలిగించి
ప్రకృతి వికటిస్తుంది కనుక, అతిగా
కాయాన్ని పోషించవద్దు.
అతి పోషణ మృత్యువు లాంటిది
జప,తప,ధ్యాన,ధారణ పూజకు సూక్ష్మమైన
తనువుంటే చాలదా!
అంతవరకే పోషించు, ఆశయతీత్వానికి
భంగమౌతుంది
తనువునతిగా పోషిస్తే తామసం
హెచ్చుతుంది
తెలివి తగ్గుతుంది, విరక్తికి హాని
కలుగుతుంది
మెలకువ పోతుంది, పరం
దూరమౌతుంది
నిశ్చయం లేకపోడమే దీనికి కారణం
చెన్న మల్లికార్జునుడిని
ప్రేమించుటకుపయోగపడే
కాయాన్ని చెడిపోనీక కాపాడుకోండయ్యా!
అక్క మహాదేవి ఆహారాన్ని తక్కువ చేయాలని ఒత్తి ఒత్తి పలికింది. అధికాహారం ఎన్ని అనర్థాలను కలిగిస్తుందో విడమరచి బోధించింది. ఎక్కువగా తింటే కాలరీలు హెచ్చుతాయి. సహజమైన జీర్ణక్రియ తప్పి పంచవిధ వాయు వికారాలు పుడతాయి. అన్నింటికంటె భావవికారం ఆశయాలకు హానిని కలిగిస్తుంది. అక్క మహాదేవి ‘జప,తప, ధ్యాన, ధారణ పూజకు’ సూక్ష్మమైన తనువుంటే చాలునని చెప్పిన విషయాన్ని, మనం ఈనాడు చేసే కర్తవ్య నిర్వహణకు అన్వయించుకోవచ్చు. ఏ పనిని చేయాలన్నా ఉత్సాహం ముఖ్యం. ఈ ఉత్సాహం దేహస్థితిమీద ఎంతగానో ఆధారపడుతుంది. అందుకనే ఈ కాయాన్ని కాయకంతో (శ్రమతో) శుద్ధి చేసుకోవాలి అని అంటారు శివశరణులు.
అక్కమహాదేవి దేహానికున్న బాహ్యమైన కట్టుబాట్లను ఛేదించదలచింది. స్త్రీ, పురుషుడు అన్న ఆకారబేధాలు మనిషి దురాశతో కల్పించాడని నిర్ధారించింది. ‘పాముకు గల కోరలు పీకి ఆడించగలిగితే పాముతో స్నేహం చేయడం సులభం’ అని శరీరానికున్న అడ్డు గోడలు తొలగించాలని, అప్పుడే నిజమైన స్వేచ్ఛ లభిస్తుందని నమ్మింది. తాను దిగంబరి గా సంచరించింది. ఈ సమాజం (ఆనాడు) స్త్రీని రెండు విధాలుగా మాత్రమే గుర్తించింది. ఒకటి సతి. మరొకటి వేశ్య. తాను సతినీ కాదు, వేశ్యనూ కాదు, మనిషిని అని మొట్టమొదటి సారిగా తెలిపిన వీర విరాగిణి అక్కమహాదేవి.
మితంగా తిని, శరీరం పట్ల అవగాహనను కలిగి, ఎక్కువ కాలం బతికి హాయిగా వుండండి అని ‘దీర్ఘాయువు’ గుట్టు తెలిపిన మహాదేవి మన స్త్రీలందరకూ నిజమైన అక్క అని చెప్పవచ్చు.
చాల బాగా ఉన్నది