పి.సత్యవతి
రవీంద్రనాథ్ టాగోర్, దేవులపల్లి కృష్ణశాస్త్రి, చెహోవ్, కాథరీన్ మాన్స్ ఫీల్డ్‌లను అభిమానించే ఆచంట శారదాదేవి కథలలో ఒక విషాదపు జీర అలముకుని వుంటుంది. ప్రకృతి ఆస్వాదన, సంగీతం పట్ల అభిరుచి, ఎవరినీ నొప్పించని సున్నితత్వం, ఉన్న పరిస్థితిల్లోనే ఏదో ఒక ఉపశాంతిని కనుక్కుని జీవితాన్ని నడుపుకోవడం, కొంత మానసిక విశ్లేషణ, ఈమె రచనల్లో ముఖ్యాంశాలుగా వుంటాయి. స్త్రీల జీవితాలలో జెండర్ పాత్రని గుర్తించడం వున్నా, దాన్ని ఎదిరించలేని పాత్రలు…., ప్రేమా ఆరాధనలకు ప్రాముఖ్యం. లోకం పోకడ, కొన్ని తాత్వికమైన ఆలోచనలను, అనుభవాలను, హాయిగా చదువుకుపోయే లలితమైన శైలిలో వ్రాస్తారు.
1950 ల మొదలుకుని విరివిగా వ్రాసిన ప్రసిద్ధ కథా రచయిత్రులలో శారదాదేవి ఒకరు. ”పగడాలు” ”ఒక నాటి అతిథి” ”అమ్మ” ”మరీచిక” ”అడవి దాగిన వెన్నెల” ”పారిపోయిన చిలక” ”మారిన మనిషి” వంటి ప్రాచుర్యం పొందిన కథలతో కలిసి దాదాపు వంద కథలు వ్రాసి వుంటారు. ఆరు కథా సంపుటాలు వెలువరించారు. అన్నీ కలిపిన ఒక సమగ్రమైన సంకలనం వెయ్యనందున ఇప్పుడు ఆ సంపుటాలలో కొన్ని మాత్రమే అందుబాటులో వున్నాయి. మొదటి కథ 1945 లో చిత్రాంగి అనే పత్రికలో వ్రాశారు. చాలా కథా సంకలనాలలో చేర్చబడి బహుళప్రాచుర్యం పొందిన కథ ”పగడాలు”… కథ…. ఆడుకుంటూ పడేసుకున్న పగడాల దండ తీశాడన్న అభియోగంతో ఇంటి ఎదురుగా వుండే ముసలి లక్ష్మన్న తాతనూ అతని మనవరాలు సీతనూ అనుమానించి పోలీసుల్ని కూడా పిలుస్తారు వాసంతి తల్లితండ్రులు. ఆ దండ ఖరీదుకి డబ్బివ్వమంటారు. దండ ఖరీదు ఇవ్వలేని తాత తన దగ్గరున్న పదమూడు రూపాయలూ ఇచ్చి దణ్ణం పెడతాడు. కానీ చివరికి పగడాలు, బీరువా కింద దొరికాక కూడా ఆ విషయం అతనికి చెప్పి డబ్బు వాపస్ ఇవ్వకపోగా ఆ విషయాన్ని గుట్టుగా వుంచడం చిన్నారి వాసంతిని బాధ పెట్టింది. పెద్దల పట్ల భయ భక్తుల వల్ల ఆ విషయాన్ని అలాగే దిగమింగుకుంది. తరువాత వాసంతిని సీతతో ఆడ్డానికి పోనివ్వలేదు… వాళ్లని దూరంనించే చూస్తూ వుండేది… వివాహమై ఒక బిడ్డకు తల్లి అయినాక పుట్టింటి కొచ్చిన వాసంతికి ఆ విషయాలన్నీ గుర్తురావడంగా కథ మొదలౌతుంది. అప్పటి ఆటపాటలు ఆనాటి ఇంటి వాతావరణం. లక్ష్మన్న తాత మనవరాలు సీతతో తన ఆటలు పోలీసు రిపోర్టూ తాత తన దగ్గరున్న డబ్బు అంతా ఇచ్చెయ్యడం అన్నీ గుర్తొస్తాయి. వాళ్ళేమయ్యారని తల్లిని అడుగుతుంది. ఆవిడ స్వభావం ప్రకారం అదంత ముఖ్య విషయం కాదన్నట్లు ముఖం చిట్లించుకుంటూ మాట్లాడుతుంది. ఆ పగడాలు ఇంకా వాసంతి మెడలోనే వున్నాయి. అవి గుండెల్లో కొట్టుకున్నాయి. గుండెల్లో గుచ్చుకునే ఆ పగడాలనీ ఆ చేదు జ్ఞాపకాలనీ ఆమె ఎందుకు మోస్తోందో తెలీదు… చెప్పింది వినడమే పద్ధతిగా పెరిగిన వాసంతి, ఆ పగడాలని అలా గుచ్చుకున్నా వుంచుకోవాలనుకుని వుండవచ్చు. పిల్లలలో చిగురించే స్పందనలను పెద్దల లౌక్యం కబళించడం సహజమే!! పెద్దదై బిడ్డ తల్లి అయిన వాసంతి ఆ పెంపకపు నీడనించీ బయటికి రాకపోవడం ఒక కారణం కావచ్చు.
ఎక్కువ కథల్లో యువతులు ఒక అపరిచితుడిపైనో చిన్నప్పటి స్నేహితుడి పైనో మక్కువ పెంచుకుని దాన్ని ఆరాధనగా మార్చుకుని ఆ అందని మానిపండు కోసం జీవితకాలం నిరీక్షిస్తూ వుంటారు… వానజల్లు కథలో పార్వతి ఆమె బావను ప్రేమించింది. కానీ అతను ఆమెను ఇష్ట పడడు. ఆమె లెక్చెరర్‌గా పని చేస్తూ తండ్రిని చూసుకుంటూ వుంటుంది… తన ఇల్లూ ఇంటి ముందరి చిన్ని తోటా, తండ్రి ప్రేమా, విద్యార్థుల అభిమానం, ఆమె జీవితానికి చోదక శక్తులు. చారుశీల అనే కథలో మంజిష్ట అనే అమ్మాయికి తన మేనమామ మరొకర్ని వివాహమాడాడని తెలుసు. అతను పెళ్ళిచేసుకున్న చారుశీలకి అతనంటే వల్లమాలిన అభిమానమేకాక ఒక పొసెసివ్ నెస్ ఉందని కూడా తెలుసు. తల్లి పోగానే ఆమె మేనమామ దగ్గరికే వచ్చింది. అయినా అతన్నే ఆరాధించింది. అతన్ని తప్ప వేరొకర్ని చేసుకోదు. చివరికి నదిలో పడి మరణించింది. అ మేనకోడలి మరణానికి కొంత చారుశీల పొసెసివ్ నెస్ కారణమన్నట్లు అర్థమౌతుంది. అట్లాగే దిగుడుబావి అనే కథలో చంద్రమల్లి అనే అమ్మాయి ఆవూరిలో ఏదో పని వుండి వచ్చిన హరిరావుపైన మనసు పారేసుకుంది. తనపని కాగానే అతను వెళ్ళిపోతే ఆ వేదన భరించలేక చనిపోవాలని అనుకుని మళ్ళీ తన మరణం తన వాళ్ళనెంత కృంగతీస్తుందో గ్రహించుకుని ఆ ప్రయత్నం మానుకుంటుంది. కానీ అతన్నే తలుచు కుంటూ ఆ దిగుడుబావి దగ్గరకు వెళ్ళి కూచుంటూ వుంటుంది… నిలువలేని నీరు కథలో ధరణి తన బావను ప్రేమించింది. అతని నడత మంచిది కాదని చెప్పినా అతన్నే పెళ్ళిచేసుకుంటానని పట్టుపట్టింది. అతన్ని అమెరికా పంపించి పై చదువులు చెప్పిస్తానని ధరణి తండ్రి ఆమెతో పెళ్లికి వప్పిస్తాడు. అతను ధరణిని పెళ్ళిచేసుకుని అమెరికా వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చినా ఆమెను పిలవడు. పైగా వేరొక అమ్మాయిని పెళ్ళి చేసుకోటానికి ఈమెను పెళ్ళి రద్దు చేసుకున్నట్లు వ్రాసిమ్మంటాడు. అతనడిగిందే చాలని వ్రాసిచ్చింది. అతని జ్ఞాపకాలతోనే బ్రతుకుతున్నది. కానీ చివరికి అతను ధరణిని రమ్మని కబురు పెట్టాడు. కబురంపిందేచాలని సంబర పడుతున్న ధరణికి ఆమె చెల్లెలు అతనెందుకు రమ్మన్నాడో చెప్పింది. అతని కొత్త భార్య గర్భంతో వుండి పని చేసుకోలేక పోతున్నది కనుక ఆమెను రమ్మన్నాడు. అయినా అదే మహాభాగ్యమని ఆమె ఒప్పుకుంది… అప్పుడు వెన్నెలలో ఆమె ముఖం పసిపాపలా మెరిసింది, ఎంతైనా మనసు లోపలి మమకారం మాసిపోదేమో అనుకుంది చెల్లెలు. మరీచిక అనే కథలో నీల కూడా తాముండే పరిసరాలను అధ్యయనం చెయ్యడానికొచ్చిన ఒకతన్ని ప్రేమించి అతను వెళ్ళిపోగానే దుఃఖసాగరంలో కూరుకు పోయింది. ఇక అందని లేఖ కథలో సురస అనే అమ్మాయి తమ ఇంట్లో అద్దెకున్న ఒక అబ్బాయిని ఇష్టపడింది. అప్పటికి ఇద్దరికీ బాల్యమే. కలిసి ఆడుకునే వాళ్ళు. ఆ అబ్బాయి పేరు కిరణమాలి. వాళ్ళనాన్న సంగీత విద్వాంసుడు. కొడుక్కి సంగీతం నేర్పుతూ వుంటే ఈ పాప శ్రద్ధగా వింటూ అతని గానాన్ని మెచ్చుకుంటూ వుండేది. కిరణమాలి తల్లి చనిపోగా వాళ్ళు వూరు వదిలి వెళ్ళిపోయారు. కానీ అతని వివరాలన్నీ ఆమె తెలుసుకుంటూనే వుంది. అతను ప్రసిద్ధ గాయకుడయ్యాడు. డబ్బూ కీర్తి సంపా దించాడు. ఎంత గొప్ప గాయకుడయ్యాడో అంత స్త్రీలోలుడని పేరు పడ్డాడు. ఒక సంగీత విద్యాలయం స్థాపించాడు. అక్కడ శిక్షణ కొచ్చిన అమ్మాయిలకు అతనంటే గౌరవం వుండేది కాదు. అయినా అతని మీద ప్రేమతో అక్కడికి వెళ్లి సంగీతం నేర్చుకుని అతన్ని కలిసి వొచ్చిందే కానీ అతను తనని గుర్తుపట్టలేదు. ఊళ్ళో వాళ్ళకి తనని అతను పెళ్లి చేసుకుని బాధలు పెట్టాడనీ అందుకోసం వచ్చేశాననీ అబద్ధం చెప్పి వాళ్ళ సానుభూతి పొందింది. ఇప్పుడామెకి తల్లీ తండ్రీ లేరు, రాజీ అనే బంధువులమ్మాయి (మూగది), ఒక నౌకరు మాత్రమే తోడున్నారు. అంతలోనే ఆమెకు కాలిమీద వ్రణం లేచి ప్రాణాపాయం ఏర్పడింది. అప్పుడామె తన ఆస్తినంతా మూగ పిల్లకో, పాలేరుకో వ్రాయకుండా అతని పేర వ్రాసేసి మృత్యువుకోసం ఎదురుచూస్తూ వుంటుంది… ఒక సారి ఒకరిని ప్రేమించాక, జీవితమంతా అతనికోసమే అర్పించాలని అతని బలహీనతలన్నిటితో సహా అతన్ని స్వీకరించాలని, లేదా అతన్నే ఆరాధిస్తూ జీవితం గడిపెయ్యడమే గాఢమైన ప్రేమ అని రచయిత్రి భావన కావచ్చనిపిస్తుంది. ఇప్పటి పాఠకులు ఇటువంటి కథల్ని ఎట్లా తీసుకుంటారు?
ఇవి కాక ఇతర అంశాలను స్పృశిం చిన కథల్లో చెప్పుకోదగ్గది, ”కారుమబ్బులు”. ఒకే ఆఫీస్‌లో పనిచేసే యువతీ యువకులిద్దరు పరిచయం పెరిగి ఇష్టపడి పెళ్ళిచేసుకుని కలిసి మెలిసి కాపురం చేసుకుంటూ వుండగా భార్యకి ప్రమోషన్ వచ్చింది. ఆమె తన కలీగ్సుకు పార్టీ ఇస్తే అతను వెళ్ళడు. ఆ క్షణం నించీ అతని ప్రవర్తనలో మార్పొచ్చింది. అతను ఆత్మన్యూనతతో బాధ పడుతున్నాడని గ్రహిస్తుంది.. అతను అక్కడ రాజీనామా చేసి వేరే ఉద్యోగం చేసుకుంటానంటే ఆమె రాజీనామా చేసి అతన్ని సంతోష పెడుతుంది. అతని మనసుకి పట్టిన మబ్బు విడిపోయింది కానీ ఆమె ఇప్పుడు అతనికి అంత సన్నిహితంగా మెలగలేకపోతుంది. తన ప్రమోషన్‌ని సహించలేక పోయిన అతని సంకుచితత్వం గుర్తొస్తూ వుంటుంది… ఆ మబ్బేదో తనని ఆవరిస్తున్న దనిపిస్తుంది. కానీ తన ప్రవర్తనకు తనే నవ్వుకుని అందులోనించీ బయటికి రావాలను కుంటుంది. ఉదాత్తంగా ప్రవర్తించడం స్త్రీలు అలవాటు చేసుకోవాలి కదా! ”అందం” అనే కథలో మాలతి అందమైన స్త్రీ, పసితనం నించీ ఆమె అందం అందర్నీ ఆకర్షించేది. అది ఆమెనొక్కక్కసారి చాలా చికాకు పెట్టేది కూడా. చిన్నప్పుడు బుగ్గలు పుణకడం, కౌగిళ్లల్లో బంధించడం వంటివి… రాను రాను ముసలి వాళ్ళు కూడా తినేసేలాగా చూడ్డం అబ్బాయిలు వెంటపడ్డం ఇవ్వన్నీ స్త్రీల సహజానుభవాలే. అట్లాగే తోటలో అందంగా పూసిన పూలను తెంచేదాకా కొంతమందికి తోచదు. చెట్టునుంటె కళ్ళకీ మనసుకీ ఆనందం కలిగించే పూలను తెంపి ఒక్క క్షణం ఆనందించి పడెయ్యడమూ అంతే సహజం. మాలతి అందం చూసి ముగ్ధుడైన జడ్జిగారబ్బాయి ఆమెను కోరి పెళ్లి చేసు కున్నాడు. అయితే ఆ అందాన్ని పక్కన పెట్టుకుని బయటకి వెళ్లినప్పుడల్లా అతనికి ఆమెను అందరూ అట్లా చూడ్డం నచ్చదు. పమిట కప్పుకోమని అలాంటివన్నీ అంటూ వుంటాడు. ఆమె అతనితో బయటకు పోవడం తగ్గించింది. ఇప్పుడిక మాలతి కూతురు చిన్న పాప మాలతిలాగే అందంగా వుంటుంది. ఎవరో హైస్కూల్ పిల్లాడు ఆ పిల్ల బుగ్గ గిల్లితే అక్కడ గిల్లిన గుర్తుపడింది. ముందు కోపం వచ్చింది మాలతికి. ఎవరైనా గిల్లితే మళ్ళీ గిల్లు, మాష్టర్‌కి రిపోర్ట్ ఇవ్వు అని చెప్పాలను కుంది ”అయినా ఎవరన్నని ఏం లాభం, మానవ ప్రకృతి మారదు. మౌనంగా భరించక తప్పదు” అనుకుంటుంది. అట్లా చెబితే పాపలో సున్నితత్వం నశిస్తుందంటుంది. మొరటుదై పోతుంది అనుకుంటుంది. పాప తండ్రి పాప బుగ్గ చూసి కోపంతో మండిపడ తాడు. హేడ్ మాష్టర్‌కి చెప్తానంటాడు. మాలతి నవ్వుకుంటుంది. పువ్వులు కొయ్యకుండా వంటావిడ ఎవర్నీ ఆపలేదు తండ్రి కూడా పాప బుగ్గ గిల్లకుండా ఎవర్నీ ఆపలేడు, అరిచి నవ్వులపాలవడం తప్ప అను కుంటుంది. ఇంకా అందంగా వుండడం పాప చేసిన తప్పు. అందంగా వుండడం పువ్వులు చేసిన పాపం అని కూడా అను కుంటుంది. మన ముంగిట్లో తోటపూలు మనం కాపాడుకోలేమనీ, మన పిల్ల బుగ్గ కమిలి పోయేలా గిల్లితే మనం ”అదంతే” అని ఊర్కోవాలని చెప్పిన ఈ కథని అర్థం చేసుకోవడం కష్టమే… స్త్రీలపై వయసుతో నిమిత్తం లేకుండా చాలా సటిల్‌గా జరిగే లైంగిక వేధింపుల్ని అండర్ టోన్స్‌లో చక్కగా చెప్పిన ఈ కథ ముగింపు కొచ్చేసరికి అట్లా మిధ్యా వాదంలోకి మళ్ళింది…
వృద్ధాప్యంలోని ఒంటరితనంలో ఒక స్నేహం కోసం ఆశపడి, జీవనోత్సాహం నశించిపోకుండా కాపాడుకోడం కోసం ”బిందువు” కథలో రంగాజమ్మ దేవయ్యతో స్నేహం చేస్తుంది. ”అమ్మ” అనే కథలో ఒకమ్మాయి తన తల్లి అమిత తెలివైందీ చురుకైందీ అని అందరికీ చెప్పి నమ్మిస్తుంటుంది. నిజానికి ఆమెకు అసలు తల్లి లేదు. ఈ ”డెల్యూజన్” ఆ అమ్మాయికి కొంత ఉపశమనాన్ని కలిగిస్తుంది. దాన్ని ప్రశ్నించకుండా ఆమె నలా బ్రతకనివ్వడమే ఆమెకు చేయగల ఉపకారం అంటుంది రచయిత్రి. ఇట్లా మానసిక వైచిత్రులమీద శారదాదేవి మరికొన్ని కథలు కూడా వ్రాశారు. అడవి దాగిన వెన్నెల కథలో తపతి, సవతి తల్లి వలన అనేక బాధలు పడుతుంది. ఆమెని నిలువరించలేని తండ్రి తపతిని వేరే ఊరు రహస్యంగా తీసుకొచ్చి రామలక్ష్మి కొడుక్కిచ్చి పెళ్ళి చేసి వెళ్ళిపోతాడు. వితంతువైన రామలక్ష్మి కూడా స్వతంత్రురాలు కాదు. ఆమె మనుగడ కోసం గోవిందయ్య చెప్పుచేతల్లో ఉంది. గోవిందయ్య కన్ను తపతిపై పడ్డం రామలక్ష్మిని కలత పెట్టింది. గోవిందయ్య కంటపడకుండా ఒక రాత్రి ఇంటివెనుక అడవిలో దాక్కున్న తపతి అక్కడే మరణించింది… మరొక కథలో మధ్య తరగతి జడత్వం ఉదాసీనతలు ఎన్ని నష్టాలకు వేదనలకు కారణమౌతాయో చక్కగా చెప్పారు.
మొత్తం మీద శారదాదేవి కథల్లో ఆవేశం వుండదు, ఆత్మ శోధన తోనో ఇతరుల బోధ తోనో అధ్యయనం అనుభవాల ద్వారానో చైతన్యం పొంది కార్యాచరణకు సిద్ధపడే పాత్రలూ తక్కువే… ఉన్న స్థితిలోనే ఒక ఉపశాంతిని వెతుక్కుని దాన్ని రేషనలైజ్ చేసుకునే పాత్రలే ఎక్కువ కనపడతాయి. ఒక్క ”చందమామ” అనే కథలో మాత్రం ప్రధాన పాత్ర భర్త వేధింపు మాటలు పడలేక బిడ్డను తీసుకుని పుట్టింటికొచ్చింది. వేధింపు మాటలు ఆపినాకే తిరిగొస్తానంటూ అందుకోసం ఎదురు చూస్తుంది. పారిపోయిన చిలక కథలో పంజరానికి స్త్రీల జీవితానికీ పోలిక చూపారు… శారదాదేవి గారి కథల్లో తండ్రులందరూ చాల మంచివాళ్ళు… ఆడపిల్లల్ని ప్రేమగా అక్కున చేర్చుకునే వాళ్లు.
1922లో జన్మించిన శారదాదేవి గారిది అసలు విజయవాడ. మద్రాస్‌లోని విమెన్స్ క్రిష్తియన్ కాలేజీలోనూ ప్రెసిడెన్సీ కాలేజీలోనూ చదివారు. 1954 నించీ 77 వరకూ తిరుపతి పద్మావతీ కళాశాలలో తెలుగు ప్రొఫెసర్‌గా వున్నారు. ఆచంట జానకిరామ్ గారిని వివాహం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. 1999లో మరణించారు.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
సత్యవతి గారికి,
నమస్కార0.తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా.తప్పులుంటే క్షమించాలి.ఆచంట జానకిరామ్ అవివాహితుడని
చదివినట్లు గుర్తు.కాదా?