కొండవీటి సత్యవతి
నాకు చట్రాలను చూస్తే చచ్చే భయం
అలాగని చావంటే భయంలేదు సుమా!
పుట్టిన క్షణమే చావూ సిద్ధమయ్యే ఉంటుంది
అందుకని క్షణక్షణం చావక్కరలేదుగా
బతకడం ఎంత సంబరమో కొందరికి
చెట్టుని చూస్తే సంబరం
పిట్టల్ని చూస్తే రివ్వున ఎగరాలన్నంత ఉత్సాహం
ఆకాశంలోని నీలం రంగు
అవని అంతా కమ్ముకున్న నల్లరంగు
తొలి వేకువలో తూరుపు సింధూరం
సాయంకాలపు సంధ్య కెంజాయ
ఆషాడమాసంలో ఉరుముతూ వేంచేసే తొలి మేఘం
నిట్టనిలువునా పులకింతలు రేపే తొలకరి జల్లు
నగర సాగరం మీద విల్లులా ఒంగే ఇంద్రధనుస్సు
ఈ రంగు రంగుల సీతాకోకచిలుకలు
నా కోసమే నట్టనడిరాత్రి పూసిన బ్రహ్మకమలాలు
సంపెంగ చెట్టు చూడ్డానికి చిన్నదే
కళ్ళు విప్పి చూస్తే కణుపు కణుపు మొగ్గలే
తెల్లారి చూస్తే కమ్మటి సువాసనలతో పువ్వులే పువ్వులు
ఈ ఆనార్ చెట్టు ఎంత ఎత్తు ఉందని
అబ్బో! ఎర్రెర్రగా ఎన్ని పూలు పూసిందో
ఈ గోగు పూల తీగ కే మొచ్చిందో గోడంతా పాకేసింది
నక్షత్రాలను తెచ్చి పువ్వూల్లా పూయించేసింది
ఈ మాధవీలతను చూస్తే చాలు
గుండెల్లో బాల్యపు జేగంటలు మోగుతాయి
బుల్లి బుల్లి గిన్నెల్నిండా
మధువు నింపుకున్న మధుమాలతులు
వస్తున్నా నుండవోయ్ పొగడపూలమ్మా!
నా మీద అలకేనా! పూలన్నీ అలా ముడుచుకుపోయాయ్
ముందు నీ దగ్గరకే వస్తే తొందరగా పోగలనా
పొగడపూల మీద మోహం పొయ్యేదా చెప్పు
అరే !అరే ! అంత కోపమా ఆకాశమల్లెమ్మా
నువ్వు రావడానికి నా మీద రాలడానికి
ఇంకా చాలా టైంముంది లేమ్మా
అమ్మో! ఆ ముళ్ళన్నీ నన్ను గుచ్చడానికేనా మొగలిరేకమ్మా
నిన్ను ముట్టుకోకుండా
నీ ముళ్ళు గుచ్చుకోకుండా శ్రావణం గడిచేనా
నాగమల్లివో తీగమల్లివో
నయనానందకరం నీ దర్శనం నవనవోన్మేషణం
ఆగవోయ్! ఎర్రకలువ పిల్లా
ఏమా తొందర వస్తున్నానుండు
అదంతా నా మీద కోపమేనా
మూతి ముడిచినట్టు ముడుచుకుపోయావ్
ఈ పూలతో కబుర్లు చెప్పకపోతే
నాకు నిద్దరే రాదు సుమా!
జనాలు బోరుకొడుతుందని ఎందుకంటారో?
నాకెప్పటికీ అర్ధం కాదు
చుట్టూ ఇంత సౌందర్యం
ఇంత వైవిధ్యం
ఇంత పచ్చదనం
ఇన్ని రంగులు
ఇంకేం కావాలి?
మనుష్యులతో సజీవ సంబంధం
మన చుట్టూ పరిసరాలతో
మమేకమయ్యే ఆత్మీయ అనుబంధం
ఇది చాలదా బతకడానికి?
ఎందుకు చట్రాల్లో బందీ అవ్వడం?
అన్ని చట్రాలని తెంపుకుందాం రండి.
హాయిగా ఎగిరిపోదాం పదండి.
మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఆసరా మనమయితే
ఈ సమస్త ప్రకృతి మనకి కొండంత అండ కాదా?
పసిడి సంకెళ్ళు
దుర్గాప్రసన్న
లెక్కకు మిక్కిలి ఆశలు నా హృదయంలో
అవి అందని ఆకాశంలో తళుకుమనే తారల్లా
హృదయం మాత్రం
మబ్బులు ముసిరిన ఆకాశం
మెల్లగా బరువుగా సాగే ఆలోచనలతో
యుగాలనాటి దౌర్బల్యానికి చిహ్నంగా
బంధం పేరుతో ‘నన్ను’ మాత్రమే కట్టి వుంచిన
కనపడని సంకెళ్ళు…
నా స్వేచ్ఛనీ, స్వాతంత్య్రాన్నీ హరించి
ముడిపడిన బంధాలు-బరువుతో
మోయలేని భారంతో… నేను –
సంకెళ్ళు? బరువెక్కడమేమిటీ?
నాలో… నేనే…
నాకు నేనే పదే పదే వేసుకునే ప్రశ్న?
ఎవరికీ అర్థం కాని ప్రశ్న??
అయినా… వాళ్ళంతా…
అందమైన బంధమనీ
జీవితాన్ని పంచుకోవడమనీ
… అద్భుతమైన కలల్ని అల్లేరు
ఊహల పల్లకీలో ఊరేగించారే!
కానీ –
నేను అల్లికల వలలో చిక్కుకుని
ఊపిరాడక ఆర్తనాదాలు చేస్తున్నా
ఒక్కరూ చేయి అందించరేం?
గట్టిగా అరవలేకపోతున్నానెందుకూ??
సంకెళ్ళు నా తనువుని బంధిస్తే
ఆ సంకెళ్ళ బరువు
నా గొంతుని నొక్కి పెట్టినట్లుంది.
మెల్లమెల్లగా వెలుగురేకలు విచ్చుకుంటున్నాయి
నాకెందుకో…
సూర్యుని కిరణాలు గుచ్చుకుంటున్నాయి
అచేతనమౌతున్న నాలో ఏదో క్రొత్త చేతనం
నన్ను నేను ప్రశ్నించుకోగా… ప్రశ్నించుకోగా
నాకు నేను అర్థమౌతున్నాను
నాలో ఆలోచనల చైతన్యం వెలుగులై
నా చుట్టూ నిండింది
సంకెళ్ళు – పసిడి సంకెళ్ళయినా సరే…
త్రెంచుకోక తప్పదు
బంధం అంటే
నిన్నూ, నన్నూ కలిపే బంధుత్వం
కానీ –
నీ దృష్టిలో
నీకు – యజమానిగా గుర్తింపూ…
నాకు – నీ సొత్తుగా పరిగణింపూ…
అందుకే –
ఈ బంధం నాకు సంకెళ్ళు అయింది.
యుద్ధాన్ని కొనసాగిద్దాం
ఝాన్సీ కె.వి. కుమారి
ఇక్కడ… నువ్వు…
జీవించడం కోసం
యుద్ధం చేయాలి
మనిషిగా నిన్ను నీవు
రుజువు చేసుకునేందుకూ
యుద్ధమే చేయాలి
జీవితంలోని ప్రతి సందర్భం
నిన్ను గేలిచేసేదే
గాయాన్ని రేపేదే
గాయాలను మాన్పుకోవడం కోసమూ
యుద్ధమే అవసరం!
నీలోని నువ్వును
నువ్వులోని నీ ప్రతిభను
నువ్వు గుర్తించేందుకూ
పోరాటమే ఆయుధం… నీకు!
నువ్వు నడిచే కాంతి కిరణానివే
అది వెలుగని ఒప్పుకునే ధైర్యమే
వాడికి లేదు
నువ్వు గుబాళించే
సుగంధానివే
అది సుమధుర పరిమళమని
ప్రకటించే నిజాయితీ
వాడికుంటేగా…?
నువ్వు సజీవ చైతన్య రూపమే
ఆ సత్యాన్ని స్వీకరించే
సహృదయం…
వాడిలో శూన్యం
అసలు… నిన్ను మనిషిగా
గౌరవించాలంటేనే
వాడికి చచ్చే భయం
సత్యాన్ని చూడలేని అంధకారం
వాడి సొంతం!
కులంగా నిన్ను నిలువునా చీల్చే
మతాన్ని సృష్టించాడు
వద్దుల హద్దుల్లో
నిన్ను అణచివేశాడు
సహజీవనంలోని
ఆనందంగానీ
శ్రమైకస్వేదంలోని
సౌందర్యంగానీ
వాడి అనుభూతికి అందనివే…
గీతలగిరులను కల్పించుకుని
అజ్ఞాన శిఖరాలను అధిరోహించాడు
ఈ గీతల హద్దులను
నిర్మూలించడమే యుద్ధం…
ఈ అజ్ఞాన చీకట్లను
తరిమేయడమే యుద్ధం…
సత్యమైన వెలుగుపుంజాల కాంతి
గుండె గుండెను వెలిగించేవరకు
ఈ యుద్ధాన్ని…..
కొనసాగిద్దాం!!
పవ్రాహాన్ని ఆపలేను…
ముంగర జాషువ
ఆరోజు ఇంకా
నా జ్ఞాపకాల వలయంలో తిరుగుతూనే వుంది –
ఇప్పటికి
నాలుగు దశాబ్దాలు దాటిపోయినా
నీవు మట్టిపొరలలో నిద్రించిన క్షణం
స్మృతిలో
ఒక గాయంలా కెలుకుతూనే వుంది –
మీ అన్నయ్య తిట్టినందుకు
ఎందుకు నిన్ను నీవు బలి చేసుకున్నావు?
నన్నెందుకు
ఒంటరిగా, బికారిగా, ఫకీరుగా
వదిలిపెట్టి వెళ్లావు?
నీరూపం ఇన్నేళ్లయినా
ఇంకా మనోనేత్రంపై
పాలపిట్టలా వాలి వుంది!
ఆ రోజుల్లోనే
ఎంత ఆధునికంగా వుండేదానివి!
క్రాఫింగూ, పంజాబీ డ్రెస్సూ
ఉత్తరాది అమ్మాయిలా వుండేదానివి!
మనం మాట్లాడుకున్నప్పుడు
నేను నీకు పాఠాలు చెప్పేటప్పుడు
ఇద్దరి చూపులూ, మాటలూ ఒక్కటయ్యాయి –
మనిద్దరి మధ్య అంకురించిన ప్రేమ మొక్కను
మొదట్లోనే పీకేశారు –
నీవు ఇప్పుడు జీవించిలేవు
నేను జీవచ్ఛవంలా వున్నాను –
నీవు మరణించిన తర్వాత
దొంగతనంగా నీ సమాధి దగ్గరకు వచ్చి
దోసెడు గులాబీలు పోసి
నిన్ను పూడ్చిన మట్టిపై దొర్లాడాను –
సంవత్సరాల తరబడి ఏడ్చాను –
ఇదంతా నీకు తెలియదు!
రోజా –
ఇన్నాళ్లకు ఇన్నేళ్లకు ఇన్ని దశాబ్దాలకు
నీవు మరణించిన రోజున
ఈ ప్రొద్దున కూడా
దుఃఖాన్ని ఆపలేకపోతున్నాను –
నా భార్య చూస్తుందేమోనని
రహస్యంగా
కన్నీళ్లను తుడుచుకొంటున్నాను –
ఎన్నిసార్లు తుడిచినా యీ కన్నీళ్లు
ఆగిపోవడం లేదు –
నేను మరణించేవరకూ
ఈ దుఃఖప్రవాహాన్ని ఆపలేను –
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
కథా—???
పత్రిక లొ యెక్కువ పాలు రచనలు మియె ????