కొండేపూడి నిర్మల
ప్రపంచ వాణిజ్య సంస్థ కుప్పకూలిన రోజు గుర్తుందా…? పేకమేడల్లా రాలుతున్న ఆకాశహర్మ్యాలు మాత్రమే ప్రముఖంగా కనిపించాయి. ఇరుక్కుపోయిన మనుషుల సంగతేమిటీ… అని మనం ఆందోళనపడేలోగానే ఒక ఆంగ్ల దినపత్రిక సంపాదకీయం రాసేసింది.
”ఎంతయినా ఫారిన్ మీడియాకి డీసెన్సీ తెలుసు. మన కెమేరాల మాదిరి వారి కెమేరాలు శవాలచుట్టూ తిరగవు.”
ఔనేమో… నిజమేనేమో… శవాలు భవనాల కంటే గొప్పవా ఏమిటి…? విధ్వంసం అంటే భవనాల కూల్చివేత, నిర్మాణం అంటే భవనాల కట్టివేత. ఆ సిద్ధాంతం ప్రకారం మనుషులను కూల్చి మాయా మహళ్ళు కట్టడమే అసలైన నాగరికత. అగ్రదేశానికీ ఉగ్ర దేశానికి ఇదే తేడా. అందుకే ఇండియాటుడే చూడండి. బొత్తిగా డీసెన్సీ లేదు. సెన్సిటీవిటీ అంతకంటే లేదు. కాబట్టి రోజులతరబడి కంకర కింద నలిగిన కూలీలే వార్తలవుతారు.
మా మామగారు చెప్పినట్టు… ”పైగా ఆ బోడి విషాద సంగీతం ఒకటి…
ఆయన బాధ కూడా అర్థం చేసుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. సుఖంగా నిద్రలేచి వార్తల కోసం ఒక బ్రాండు టీవి ముందు కూచోగానే ఇంత రక్తం పాలరాతి గచ్చు మీద ఒలికితే విసుగ్గా వుండదూ… వుంటుంది. పొద్దుటి కాఫీ వార్తలు కమ్మగా కర్ణాటక సంగీతంతోనూ, మధ్యాహ్నపు వినోదం జీరో. రుబ్బి తయారుచేసుకునే వంటలతోనూ వుండాలనుకోవడం ఒక వర్గానికి సహజమే కదా. అదే పనిగా దేశంలో వున్న కష్టాలు చదివినా, విన్నా దెబ్బతినేస్తాయి. ఇలాంటి వాళ్ళనే కేంద్రంగా తీసుకుని మొత్తం సమాచార వ్యవస్థే పనిచేస్తుంది అది వేరే విషయం.
అసలు ఈ డీసెన్సీ, సెన్సిటివిటి, సెంటిమెంట్, గట్రా అంటే ఏమిటి…? కొంతమందిలో మాత్రమే ఇవి వుండటానికి ఎన్ని సుకుమార వ్యవస్థలు పనిచెయ్యాలి?… చాలారోజులనించీ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను.
ఉదాహరణకి, మొన్న మా పిన్ని కూతురు శిరీష పురిటికోసం పుట్టింటికి వచ్చింది. డెలివరీ రోజు ఆపరేషన్ థియేటరులోకి ఆమె భర్తను ఆహ్వానించారు. తలాపున వుండే మత్తులోకి జారుకునేదాకా మానసిక ధైర్యం ఇవ్వడం ఎంత అవసరమో శాస్త్రీయంగా గుర్తించిన కొన్ని ఆస్పత్రులు ఇటువంటి ప్రయత్నం చేస్తున్నాయి.
లోగడ ఈ సౌకర్యం లేదు. దీనివల్ల అయినా ఆడవాళ్ల ప్రసవ వేదన పట్ల మగవాడికి సెన్సిటివిటీ పెరుగుతుందని నేనూ ఆశించాను. కానీ తీరా వారికి సెన్సిటివిటీ ఎక్కువ అవడం కారణంగానే భార్యకు దూరంగా కారిడార్ బైట వుండిపోయాడట. కావాలంటే రోజంతా ఉపోషం వుండి నూటొక్క కొబ్బరికాయలు కొడతాడేమో… ఆ రోజు థియేటర్‌లోకి వెళ్ళని పిరికి భర్తలు కొందరు బెంచీమీద బారులు తీరి కూచోవడం నేను చూశాను. ఇద్దరి దాంపత్యానికి కడుపులోంచి బైటికి వచ్చిన బిడ్డని ఈ భూమ్మీద తనే మొట్టమొదట ఎత్తుకునే ఆ అనుభూతిని, ఆ అనుభూతి ఇచ్చిన భార్యని జీవితాంతం అవసరాన్ని వదులుకుని, పొట్టమీద ఆపరేషను కత్తి ఎంత శుభ ఘడియల్లో దిగాలో నర్సుకి గుర్తుచేస్తూ, ఏ జెండరు పుట్టాలో దేవుడికి విన్నవిస్తూ వుండిపోయిన ఇటువంటి భర్తల కంటే ఎనస్తీషియా సూది చాలా చాలా నయమని ఏ ఇల్లాలైనా అనుకోదా…? ఎదురుచూపులో పడి అలసిపోయి, నిమురుతూ, నేతిలో ముంచిన ఇడ్లీ ముక్కల్ని టిఫిను బాక్సులోంచి తినిపించే తల్లులు కూడా అక్కడే కనిపించారు. పాతిక ముప్పైయేళ్ల క్రితం సదుపాయాలేవీ లేనిచోట ఇదే కొడుకుని తను ఎలా కన్నదో చెప్పే అవకాశాన్ని కూడా ఆ తల్లులు ఈ సెన్సిటివిటీ పోషణలో పడి జారవిడుచుకున్నారు. నేను మాట్లాడుతున్నది ఏమిటంటే, కాలికి నేల తగలకుండా పెంచిన పెంపకాల గురించే. అనుభవం ఒక చెట్టులాంటిదైతే అది ఎవరికో నీడ ఇస్తోందని కొమ్మ నరుక్కునేవాళ్ళ గురించే.
జీవితాంతామూ కాల్చుకు తిన్నా గానీ ఓపిక తగ్గింతర్వాత మా నాన్నకి అమ్మంటేనూ, ఆవిడ చేసే సేవలంటేనూ ఎనలేని అనురాగంగా తమ్ముళ్ళూ, చెల్లెళ్ళూ ఎన్నిసార్లు వీసా అప్లై చేసినా ఏ దేశమూ వెళ్లి చూసి రాలేకపోయింది… ఆయన తన అనురాగాన్ని కాస్త తగ్గించి, మాలో సర్దుకున్నా గానీ మా అమ్మ హాయిగా నాలుగు దేశాలూ పర్యటించి వచ్చేది. సరే ఇప్పుడు ఆవిడ ఆరోగ్యపరిస్థితి చూశాక రమ్మనేవాళ్లు లేరు. ఇచ్చిన అసంతృప్తి జీవితాంతమూ వుండచ్చు.
చాలారోజుల క్రితం నా భర్తకి ఊపిరితిత్తులకి సంబంధించి ఒక సర్జరీ జరిగింది. పదిరోజులపాటు ఒంటరిగా ఆ పరిస్థితిని ఎదుర్కొన్నానని చూస్తూ, మరోపక్క పత్రిక కోసం రిపోర్టు రాసుకుంటూ రాత్రంతా కూచుని వున్నాను. తెల్లారి పరామర్శ కోసం హడావిడి పడుతూ మా ఆడపడుచు. కాస్సేపు మీ అన్నయ్య దగ్గర కూచుంటే ఒక కప్పు టీ తాగి వస్తానని రిక్వెస్టు చేశాను. ఆమె ఒప్పుకోలేదు. ఎందుకంటే తనకి చాలా సెన్సిటివిటీ. ఆక్సిజన్ టూబ్‌తో వుంటే చూడలేదట. అన్నగార్ని చూసి అసలు తట్టుకోలేదట. అందుకని, ”ఆ కప్పు టీనో ఏదో హోటల్ నుంచి నేనే తెస్తానని డాక్టర్లు వస్తే ఏమి మాట్లాడాలో నాకు తెలీదు., నీకెలాగూ అలవాటే కదా, …ఇలాటప్పుడు నా బుర్ర నీలా పనిచెయ్యదు బాబూ” అంది. నాకు చాలా బాధ అయినా తమాయించుకున్నాను. ఆవిడలాంటి వాళ్ళ సెన్సిటివిటీ కంటే, నాలాంటివాళ్ళ మొండి అలవాట్లే ప్రాణాల్ని రక్షిస్తాయని నాకప్పుడు తెలియదు.
సాగర సంగమం సినిమాలో అందరికీ నచ్చిన ఆ తకిట తకిట తందాన – పాట సీను చూసినప్పుడల్లా నాకు అశాంతిగా వుంటుంది. ప్రేమించి విడిపోయిన ప్రియుడు బావి అంచుమీద ప్రమాద నాట్యం చేస్తున్నా సరే ప్రేయసి కుంకుమ భరిణ కోసం వెతుకుతూనే వుంటుంది. అనేసరికి సరే ప్రియురాలు కుంకుమ పెట్టుకుందా లేదా అనేదే ముఖ్యం గాని కనిపించడం ప్రధానం కాదు అని దర్శకుడు చెప్పదల్చుకున్నాడు. అప్పుడు వున్న చిరకాల స్నేహం, ప్రేమ, వియోగం ఒక పుచ్చు వంకాయతో సమానమా…? ఒకవేళ తప్ప తాగి కొట్టుకుంటున్న మిత్రుడు నూతిలోకి జారిపోబోతే కుంకుమ దిద్దుకుని అబద్దం చెప్పాలో, కుంకుమ దిద్దుకోకుండా నిజం చెప్పాలో నాయికామణి తేల్చుకోలేకపోతుందనుకోండి. (చిన్నప్పటినుంచీ తర్ఫీదు లేక చురుకుదనం నాలాంటి నేలబారువాళ్లకి సాధ్యం కాదు. సలహా చెప్పే శరత్‌బాబు ఆ సీనులో అక్కడ లేడనుకుందాం.) అప్పుడేం జరుగుతుంది. లేకుండా కేవలం ప్రమాదవశాత్తూ ప్రియుడు హరీ అంటాడు. నిజజీవితంలో అయితే ఇలా జరగదంటారా…? సెంటిమెంట్స్ వాస్తవానికి విరుద్ధమా నిలబడలేవా…? ఇలా నేను మాట్లాడినప్పుడల్లా మా ఇంటిల్లిపాది అదోరకంగా చూస్తారేమిటి…?
పైన నేను చెప్పిన వేర్వేరు సంఘటనల్లో డీసెన్సీ, సెన్సిటివిటీ, సెంటిమెంట్స్ అనే మాటల దగ్గర జరుగుబాటుతనం, పరమ స్వార్ధం, పలాయనత్వము మీకేమైనా అభ్యంతరమా…? మీక్కూడా నామీద కోపం వస్తోందా…?
చెడు వినకు, కనకు, మాట్లాడకు అని చెప్పే మూడు కోతుల కథ మూడో క్లాసులో విన్నప్పుడే నాకు నచ్చలేదు. ఏమీ తెలీని అంధకారంలో నివారణే నా విచారం. ఒకవేళ అది నచ్చిన వాళ్లందరూ సోకాల్డ్ సెన్సిటివిటీ, డీసెన్సీని, సెంటిమెంట్స్‌నీ సుబ్బరంగా పోషించుకోవచ్చు. అయితే సమాధానం కుటుంబానికి గాని వీళ్ల వల్ల ఎటువంటి ప్రయోజనమూ లేదు అని మాత్రం గట్టిగా చెప్పగలను. మనకి గట్టి మనుషులు కావాలి. బురదలో పడిన చేతులతోనూ ఎత్తుకుని గుండెకు హత్తుకునేవాళ్ళు కావాలి. ఎక్కడ మట్టిరేణువు కనబడినా డెట్టాల్‌తో చేతులు కడుక్కునేవాళ్ళు డెట్టాల్‌లా బతుకుతారు. మనుషుల కోసం కాదు.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
బాగుంది.
నిర్మల వాక్య0 -“బురద లో పడిన చేతులతోనూ ఎత్తుకుని గుండెకు హత్తుకునే మనుషులు కావాలి” -చాలా చాలా నచ్చింది .