అనసూయ కన్నెగంట
”హరే రామా… ఏంటో ఈ మోకాళ్ళ నొప్పులు. అపార్ట్‌మెంటుల్లో ఉండలేక… ఏదో… కొడుకు ఊరికి దూరంగానైనా… ఇండివిడ్యుయల్ యిల్లు కొన్నాడని… ప్రశాంతంగా ఉండచ్చని కొండంత సంబర పడ్డానే గానీ… యిలా పనమ్మాయిల్దొరక్క… మూల పడతానను కోలేదురా దేవుడా”
కడిగిన గిన్నెల బుట్ట దగ్గర స్టూలేసు కుని దాని మీద కూర్చుంటూ తనలో తనే గొణుక్కుంది ప్రభావతమ్మ.
పాతింటికి కోడలాఫీసు దగ్గరవటంతో పనంతా అయ్యాకే వెళ్ళేది. కాస్తలో కాస్త మేలు. కొత్తిల్లు బాగా దూరం కావటంతో బస్సుల్లో లేటవుద్దేమోనని ఏడింటికే ఆమె వెళ్లాల్సి రావటం, పనాళ్ళు దొరక్క అంతా ఆవిడే పడటం, కాస్త కష్టంగానే ఉంది ప్రభావతమ్మకి.
రేపయినా ఎవరో ఒకరు దొరక్క పోతారా అనే ఆశతో రోజులు నెట్టుకొస్తుంది గాని, ఎవరూ కుదిరి చావటం లేదు. ఆలోచిస్తున్నంతలోనే బెల్ మోగింది.
”భగవంతుడా! కూచ్చుంటే లేవలేను, లేస్తే కూచోలేను, ఎవరొచ్చారో, ఈ గడియ బాధొకటి. ”తెరిచుంచకు లేవలేనని… దొంగల భయం అసలే ఎక్కువట” చెప్పి మరీ వెళ్తాడు కొడుకు రోజూ. లోపల్నించి గడియ పెట్టుకుని, కిటికీలోంచి చెయ్యూపితేనే గాని స్కూటర్ కూడా స్టార్ట్ చెయ్యడు. అంత భయం వాడికి. డోర్ ఐ లోంచి చూసి వాచ్‌మెన్ అని నిర్ధారించు కున్నాక తలుపు తీసింది. పక్కనే ఎవరో ఒకామె ఏమిటన్నట్టు చూసింది కళ్ళతోనే ప్రశ్నిస్తూ…
”నిన్న సార్ చెప్పారమ్మా! ఎవరైనా ఉంటే చూడమని. ఈ ఆడమనిషి పన్జేస్తదటమ్మా, కుదుర్చుకుంటారేమోనని తీసుకొచ్చినా.
ఎగాదిగా చూసింది ఆమె వైపు ప్రభావతమ్మ. మనిషి చాలా శుభ్రంగా ఉంది. తల నున్నగా దువ్వి ముడేసింది. నుదుట గుండ్రటి బొట్టు రూపాయి కాసంత. చేతుల్నిండా గాజులు. భుజం చుట్టూ చెంగు. అంతకు మించి ఆ కళ్ళలో చెప్పలేనంత ఆత్మవిశ్వాసమో, అభిమానమో, ఏదో అలాంటిదే అది కొంచెం నచ్చలేదు ప్రభావతమ్మకి.
”ఏం పనులు చేస్తావ్… లోపలికి రా…” అంటూ ఆమెని లోపలికి పిలుస్తూ ”నువ్వెళ్ళిరా, మేము తలుపేసుకోవాలన్నట్టు చూసింది వాచ్‌మెన్ వైపు. వాడెళ్ళిపోయాడు.
”మీకేం పనులు చెయ్యాలో చెప్తే చెయ్యగలనో లేదో చెప్తా అమ్మా!” అంది ధీమాగా.
అదిగో ఆ ధీమా నచ్చలేదీమెకు.
”ఏముంది అందరిళ్ళల్లో ఉండేవే… గిన్నెలు తోమటం, బట్టలుతకటం, ఇళ్ళు ఊడ్చి తడిబట్ట పెట్టటం. యింతకంటే ఏముంటయ్ ఎవరిళ్ళల్లోనయినా…”
”ఎంతమందుంటారు?” ”ముగ్గురం కొడుకూ, కోడలూ, నేను.”
”ఎన్ని బెడ్రూములిల్లమ్మా” అంది యిల్లంతా కన్పించినంత మేరా పరిశీలనగా చూస్తూ.
”మూడు” అంది గొర్రంగా. ”అమ్మో. .. దీన్తో కష్టమేనేమో… కరోడాలా ఉందని” మనసులోనే అనుకుంటూ…”
”రెండు పూట్లా రావాలా… ఒక్క పూటేనా…”
”రెండు పూట్లా…” బాత్రూములు కడగాలా?”
”కడగాలిగా… మరి… ఎంతిమ్మం టావో చెప్తే…” ఆమెనే ఎగాదిగా చూస్తూ అంది ప్రభావతమ్మ. కాసేపు ఏం మాట్లాడ లేదు. ఏవో ఆలోచిస్తూ ఉండిపోయింది, కాసేపాగి… ”చూడండమ్మగారూ… నేను చేసే పనిగ్గాను నాకాడన రెండు పేకేజీలు న్నాయ్…”
”పేకేజిలా…” ఆశ్చర్యంగా అంది ఆమె మాట కడ్డొస్తూ… యిన్నేళ్ళ అనుభవంలో ఏ పనామె నోటివెంటా వినని మాట. చూడని ధీమా… ”అవునమ్మా… పేకేజీయే… టూర్లవీ వెళుతుంటే బస్సులోళ్ళు పెట్టే పేకేజీల్లాంటివి. యింటే మీకే అర్థమవుతుంది.
”అర్థమైందిలే చెప్పు” అంది ఒకింత ఎటకారంగా. ”పేకేజీయా… నీ బొందా” అని మనసులోనే అనుకుంటూ.
”మొదటి పేకేజీలో… నీకేం పనుండ దమ్మా. రాగానే బట్టల్నాన బెట్టుకుంటా, తర్వాత యిల్లు సర్దేసి ఊడ్చుకొచ్చేస్తా, గిన్నెలు తోమి తుడిచేసి సర్దేస్తా, ఆ తర్వాత బట్టలుతికి ఆరేసి…ముందుగా బాత్రూములు కడుగుతా … చివరగా తడిబట్టేసి యిల్లంతా సాఫ్ చేసేస్తా. మల్లా సాయంత్రం గిన్నెలు కడిగి తుడిచి సర్దేసి, ఆరిన బట్టలు తీసి మడతబెట్టి ఎక్కడివక్కడ సర్దేస్తా.”
యిక రెండో పేకేజుందమ్మా… నేను వచ్చేసరికి బట్టలు నానబెట్టి ఉంచాలి. యిల్లు మీరే సర్దుకోవాలి. గిన్నెలు కడగటం వరకే… తుడవటం, సర్దటం మీదే… తడిబట్ట బాత్రూములు మామూలే…”
”మరి… ఎంతిమ్మంటావో… అది చెప్పు” నూతిలోంచి వచ్చినట్టుగా మాట్టాడు తున్న ప్రభావతమ్మని ఒకింత ఓరగా చూస్తూ… ”మొదటి పేకేజీలో మూడు బెడ్రూములింటికి పదిహేనొందలు, రెండు బెడ్రూములింటికి పన్నెండొందలు. రెండో పేకేజీలో మూడు బెడ్రూములింటికేమో… పన్నెండు… తొమ్మిది…”
నోట మాట రానట్టయిపోయిన ప్రభా వతమ్మని ఆశ్చర్యంగా చూస్తూ మళ్ళీ తనే అంది.
”యిందులో యింకో బెనిఫిట్టుం దమ్మా… నెలజీతం మొత్తం నాకు అడ్వాన్స్‌గా యిచ్చేస్తా ఉంటే… ఎగస్ట్రా పన్లు కూడా చేస్తా… అంటే… స్టవ్ గట్టు తుడవటం, వారానికోసారి దుప్పట్లు మార్చటం, పండగలప్పుడు కాస్త లైట్‌గా బూజులు దులపటం లాంటివి… అలాక్కాదు… మాకివేవీ వద్దు అనుకుంటే జీతం నెలాకర్న యివ్వచ్చు…” అదన్నమాట.
మీరేమాట సాయంకాలానికి చెప్తే రేపే లాటరీ తీసేస్తా…
”లాటరీయా…” అంది ప్రభావతమ్మ. ఎక్కడ పడిపోతానో… అని ఎందుకైనా మంచి దని డైనింగు టేబుల్ కుర్చీని పట్టుకుంటూ.
”అవునమ్మా… మొదటి పేకేజి యిళ్ళయితే రెండే చెయ్యగల్ను. రెండో పేకేజి యిళ్ళయితే మూడు చెయ్యగల్ను… అంతకు మించి చెయ్యలేను. నేనూ టైము ప్లానింగు చేసుకోవాలి గదమ్మా. మా యిల్లు ముందయిపోవాలంటే, మా యిల్లు ముందు చేసెయ్ అంటారు… మళ్ళీ ఎందుకొచ్చిన గొడవలు… అందుకే ముందే చెప్పేసి లాటరీ తీస్తే… ఎవరికి ముందొస్తే వాళ్ళకి ఎలాంటి గొడవలూ ఉండవు గదా.
”మరి, మరి అడ్వాన్స్ తీసుకుని నువు రాకపోతే…” భయంగా బిడియంగా అన్న ప్రభావతమ్మని నిదానంగా చూస్తూ… ”మనుషుల సంబంధాలకి మొదటి ఫౌండేషన్ నమ్మకమే… అమ్మగారూ… అది బలంగా ఉంటేనే సంబంధాలు కూడా బలంగా ఉంటాయి… మీకు తెల్వనిదేముందమ్మా… అంత నమ్మకం లేకుంటే తర్వాతనే యివ్వండి … అంతవరకూ పన్జేయించుకోండి…”
”ఏ… విషయం ఫోన్జెయ్యండమ్మా…” యిది నా… సెల్లు నంబరమ్మా… అంటూ.
ఏదో కాగితం ప్రభావతమ్మ చేతిలో పెట్టింది వెళుతూ వెళుతూ.
”కాస్త కష్టపడదాం లెండి అత్తయ్యా… యిన్నేళ్ళూ అపార్ట్‌మెంటుల్లోనేగా ఉన్నాం. ఈ మోజు మాత్రం ఎప్పుడు తీరుతుంది.
చుట్టూ మంచి మంచి మొక్కలేసుకుని ఆఫీసునుంచి రాగానే వాటికి నీళ్ళు పోస్తూ మన దొడ్లో కాసిన పూలని దేవుడికి పెట్టా లని… అప్పటికప్పుడు కాసిన కూరగాయల్ని వండుకోవాలని… ఎంత కోరిగ్గా ఉందో…
అప్పుడే చెట్టు నుంచి దూసిన కరివేపాకు తాలింపులో వేస్తే ఎంత వాసనో కదా అత్తయ్యా… కోడలి మాటలకి కొడుకు వత్తాసు పలకటంతో రాక తప్పలేదు కాని, మన జీవితాలని పనివాళ్ళు యింతగా నియంత్రిస్తారని యిప్పుడే అర్థమైంది ఆమెకి. ఆలోచిస్తూనే చేతిలో పేపరు విప్పింది. మరింత ఆశ్చర్యం.
”మనం… మన పని… మనదే ఆరోగ్యం…
మనం… మన పనే… యితరులు చేస్తే మనదే అనారోగ్యం.”
”ఓసి దీని దుంపతెగ… ఎంతర్థం ఉందో యిందులో. మీరు కొవ్వెక్కి మీ పని మీరు చేసుకోకుండా మమ్మల్ని చెయ్యమంటే మీరు రోగాల పాలవుతారని చెప్పకనే చెప్పింది కదే…” పెట్టుకుంటే పెట్టుకోండి లేకపోతే లేదన్నట్టా… అమ్మో…అమ్మో”
గుండెలు ఒకటే బాదుకుంటున్న ప్రభావతమ్మని చూసి నవ్వుతూ లోపలి కొచ్చాడు కొడుకు వెంకట్రావు. అప్పటికే అంతా విన్నాడేమో.
”తప్పదమ్మా! అవసరం మనదా వాళ్ళదా అనేది పక్కన పెట్టి ఆలోచించు. బయట రేట్లెలా ఉన్నాయ్. వాళ్ళూ బ్రతకాలి గదా? వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళెవ్వరూ లేరు… చూస్తూనే ఉన్నాంగా. యిన్నాళ్ళూ ఏ ప్రభుత్వమూ వీళ్ళ గోడు పట్టించుకున్నదీ లేదు… ఏ రాయితీలు ప్రకటించిందీ లేదు… నువ్వే చెప్పు. ఈ చివర్నించి… ఆ చివరిదాకా… రోజూ పేపర్ చదువుతావు గదా… ఏ పార్టీ అయినా యిప్పుడు ఎలక్షన్ టైము గదా వాళ్ళ మేనిఫెస్టోలో వీళ్ళ సమస్యల గురించి రాసిందేమో… చూడు… ఎంత వెతికినా ఎక్కడా కనపడదు. ఏదో పాపం, వాళ్ళ పొట్టతిప్పలు వాళ్ళే పడుతున్నార్లే కానియ్… అన్నాడు. ఏదో పేపరు కావల్సి అనుకోకుండా యింటికొచ్చిన వెంకట్రావ్ సాక్సులు కూడా విప్పి బూట్లలో పెట్టి స్టాండు మీద పెడుతూ… ”అది కాదురా… అంతా విన్నావా… ఎంతసేపయింది వచ్చి… స్కూటర్ శబ్దం వినపడనే లేదు… అది కాదు గానొరే… దీన్సిగతరగ… పేకేజీలంటరా… యిన్నావా?”
”ఏముందమ్మా అందులో పాత సారాయే కాకపోతే కొత్త సీసాలో పోసింది.”
”మామూలుగా యిదివరకైతే ఈ రెండో పేకేజీయే కుదుర్చుకుని నడవలేక పోతున్నాననో లేవలేకపోతున్నాననో కాస్త సాయం చెయ్ తల్లీ, ముసల్దాన్ననో… ఏవేవో చెప్పి బతిమాలి చేయించుకునే దానివి… నీలాంటోళ్ళు ఉంటారనే వాళ్ళూ ఆలోచించి అప్పనంగా వాళ్ళ శ్రమని మనకెందుకియ్యా లని ఆలోచించి ఈ పద్ధతి పెట్టుకుని ఉంటారు. మారాలమ్మా కాలంతో పాటువాళ్ళూ మారాలి… వాళ్ళ హక్కులు వాళ్ళూ తెలుసు కోవాలి. మనం మారుతూ… వాళ్ళు అలాగే ఉండాలనుకోవటం ఏం న్యాయం చెప్పు…”
”ఎదుటివాడి ఆత్మవిశ్వాసం మనకి అహంకారం లాగా కన్పిస్తుంది…” పెరటి మొక్క వైద్యానికి పనికిరాదన్నట్టు… మీ ఆడవాళ్ళ సమస్యని… మీరే అర్థం చేసుకోక పోతే ఎలా…?…
”ఏమంటావ్…”
”యింకేమీ ఎక్కువ ఆలోచించక ఆమె చెప్పిన మొదటి పేకేజిని ఓకే చేసేసి లాటరీ తీసెయ్యమని ఫోన్ చెయ్. ఆలస్యమైతే మరెవరైనా కుదిర్చేసుకుంటారు” అన్నాడు వెంకట్రావు పేంటు విప్పి లుంగీ వేసు కుంటూ…
”అంతేనంటావా?…” అంది కొడుకునే చూస్తూ…
”అంతే… అంతే…”
ప్రభావతమ్మ… చేతిలో ఉన్న కాగి తాన్ని తెరిచింది ఫోన్ నంబరు కోసం.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags