కత్తి పద్మారావు
తెలుగు భాష వికసించాలంటే?
తెలుగు భాష ఈనాడు ఎందుకు వెనుకబడివుంది? అని మనం ఆలోచిస్తే సామాజిక చరిత్రలో, సామాజిక జాతుల్లోని పదసంపదను తవ్వి తీయక పోవడం వల్లనే అనేది స్పష్టం. వ్యవసాయం పునాదిగా గల సామాజిక జాతులు భూమి, నదులు, చెట్లు, ప్రకృతికి సంబంధించిన ఎంతో పదసంపదను తమ వ్యవహారికంలో ఇప్పటికీ ఉంచుకొన్నారు. అంబేడ్కర్ చెప్పినట్లు కులం మానవ పరిణామ శాస్త్ర ప్రకారం సమాజం మీద అది ఒకానొక సందర్భంలో రుద్దబడింది. కులం నిర్మూలించబడే కొలది మానవ సంబంధాలు చిక్కబడతాయి. మనిషిని మనిషి భాషా పరంగా ప్రకృతి పరంగా అర్థం చేసుకోగలుగుతారు. మనిషి ప్రకృతి జీవి, సామాజిక జీవికూడా. ప్రకృతి, సమాజం అతన్ని నిరంతరం పునరుజ్జీవింప జేస్తాయి. మారుతున్న సమాజం వైపు పయనించలేని జాతులు వెనుకబడిపోతాయి. ఏ శాస్త్రానికైనా మానవుడు కొలమానం. సంఘంలోని సామరస్యం, సౌభ్రాతృత్వాలు మనిషికి మనిషికి మధ్య ఆత్మీయ బంధాన్ని కూర్చుతాయి. ఈ సంబంధ బాంధవ్యాలన్నింటికి భాష ప్రధానవాహిక. సాహిత్యం ఒక సమాజానికి సామాజిక చారిత్రక నేపథ్యాన్ని అందిస్తుంది. ఏ భాషకు, సాహిత్యానికి పదసంపద ఎక్కువ వుంటుందో ఆ భాషా, సాహిత్య సమాజాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందుతాయి. తెలుగు భాష ఆ విశాలతను పెంచుకోవాల్సి వుంది. అప్పుడే తెలుగు జాతి ప్రపంచదేశాల్లో తన తల పైకెత్తి నడువగలదు.
మనం సంస్కృతం నుండి, పాకృతం నుండి, ఇంగ్లీషు నుండి, ఫ్రెంచి నుండి తెచ్చుకొన్న భాషలు మన భాషను సుసంపన్నం చేయాలికాని, మన భాషను మరుగు పరచకూడదు. మనం నిత్య వ్యవహారంలో మన సజీవభాషను ఉపయుక్తం చేయడం పట్ల కనగలిగి వుండక పోవడం వలన మన సంభాషణలో తెలుగు శ్రుతిని కోల్పోతున్నాం. ఒక భాష యొక్క సంస్కృతి ఊనికల్లోను, సంబోధనలోను వుంటుంది. ఇంగ్లీషు వారి ఊనికల కంటే తెలుగువారి ఊనికల్లో సంగీత ధ్వని ఉంది ఆత్మీయతవుంది. మన పాఠ్య గ్రంథాల్లో ఒకటవ తరగతి నుండి సంబోధనలను, ఊనికలను విద్యార్ధులకు నేర్పవలసిన అవసరం వుంది. ఒక జాతికి స్వరం, ప్రవర్తనా శిల్పం ఊనికలనుండి, సంబోధనల నుండే రూపొందుతుంది. అన్ని స్థాయిల్లో అన్ని తరగతుల్లో తెలుగు భాషపై పట్టు సంపాదిస్తేనే డిగ్రీ ఇవ్వడం అవసరం. ఇప్పటికీ జర్మన్‌లోను, ఫ్రెంచిలోను ఈ నియమం అనుసరించబడుతూనే వుంది. డా|| రాం మనోహర్ లోహియా తన పరిశోధనా పత్రం కోసం ఆయన ముందు జర్మన్ నేర్చుకోవాల్సి వచ్చింది. మలేషియాలో ఒక సభలో నేను ఇంగ్లీషులో నా ప్రసంగ పాఠం చదువుతుంటే తెలుగులో మాట్లాడించుకొని ఆ భాషయొక్క గొప్పతనాన్ని ఆ పదాల్లో వున్న సొబగుని ఇతరులకు తెలియ జెప్పించారు. దక్షిణాఫ్రికాలో బస్సు డ్రైవర్లు ఎక్కువ తమిళులు. వారు అక్కడ తమిళంలోనే మాట్లాడుకోవడం మనం గమనిస్తాం.
మనం తెలుగులో మాట్లాడుకోవడం కాకుండా ఇప్పటకీ తెలుగులోనే తమ సంభాషణని కొనసాగిస్తున్న సామాజిక తరగతులను పరిశీలించవలసి వుంది. ఈ క్రమంలో మనం అణగారివున్న సామాజిక జాతులను పరిశీలించటం వలన ఎన్నో భాషా నిధులను, తెలుగు వైద్య, ఆరోగ్య శాస్త్రాంశాలను మనం తెలుసుకోవచ్చును. మన తెలుగు సామాజిక జాతుల్లో ‘యానాదులు’ ప్రసిద్ధులు. వారిలో దాగున్న భాషా, సాంస్కృతిక, సాహిత్య నిధులను బయటకుతీద్దాం.
తెలుగు జాతికి ఆద్యులు యానాదులు
తెలుగు జాతికి పునాది వేసిన యానాదులు తెలుగు జాతికి ఆద్యుల్లో ఒకరు. వీరికి అనాదిగా వున్న క్రమమే వీరికి యానాదిగా పేరొందింది. ఈ యానాదుల గురించి వెన్నెలకంటి రాఘవయ్య రాసిన యానాది అనే గ్రంథం తెలుగు జాతి చరిత్రకు పీఠిక వంటిది. మానవ ప్రపంచం ఆవిర్భవించిన 10 లక్షల సంవత్సరాల్లో లిఖిత సాహిత్య చరిత్ర అంతా 5వేల సంవత్సరాల నాటిదే. ఒక్క యానాది మూడువందల జంతువుల పేర్లు 5వ సంవత్సరం నాటికే చెప్పగలడు. ”ఎలుగు, చిరుత, అడవి దున్న, పులి, చిలకడ దుంప, కుందేలు, అల్లిగడ్డ, పోడు, గనిమ కాకరకాయ, తేనె, దుప్పి, జింక, చర్మం, బొద్ది ఆకు, కలిశ, బీర, గడ్డనెల్లి, దేవదారు, తాబేటి, పొన్నగంటి, నెల్లి, గట్టిగడ్డల,సన్నపాయ, గున్నంగి, పొదపత్ర, తూటాకు, నీరుగబ్బ, గొట్టిగడ్డలు, గిట్టి, గోరుచుట్లు, ఇంజేడి, కొండబోరాయ, కొండఎల్లి, పూరిఎల్లి, అడవి పెండలం, భూచక్రగడ్డ, పెన్నేరు,పెద్దీత,చిట్టీత,కొండ ఈత,మొగశిరి, కన్నెకోమల, అల్లి, చారపప్పు, పొగడ, గొట్టి, తంబ, పొన్నగాని, పొగడపండ్లు, గుత్తి, కలే, మోవి, అల్లి, దేవదారు, తుమ్మిక, వానకలే, చార” ఈ పదాలు ఒక కులానికి సంబంధించినవి కాదు ఒక జాతికి సంబంధించినవి అని మనకు స్పష్టమౌతుంది. యానాదులు తమకు జబ్బులు వచ్చినపుడు ఆ రోజుల్లో వాడే మూలికలు ఆ పేర్లు పరిశీలించి ఒక ఆయుర్వేద వైద్యశాలను రూపొందించవచ్చు.
”నల్లఉప్పలచెక్క, కోలముక్కు చెక్క, ఈసరివేళ్లు, నేల వేము చెక్క, వాగుడు చెక్క, పునగాని చెక్క, వెఱ్ఱిబిల్లు చెక్క, మంచిబిల్లు చెక్క, వెఱ్ఱిచిల్ల చెక్క, మంచి చిల్ల చెక్క, తెల్లగుమ్మడి చెక్క, బాలింత సుదుము చెక్క, ఏనుగ నరగుంజి చెక్క, నుంచి నర గుంజి చెక్క, కరక్కాయ చెక్క, తిప్ప తీగె, దంతి వ్రేళ్లు, పెద్దమాను చెక్క, ఆకుచెముడు చెక్క”.
యానాదుల్లో దాగున్న భాషా నిధులు
నిజానికి యానాదుల జీవితాల మీద వారి భాషమీద, సంస్కృతి మీద, పరిశోధన చేస్తే ఈ రోజు ఇతర దేశాల నుంచి తెచ్చుకుంటున్న ఎంతో భాషని, ఎన్నో మందుల్ని మనం ఆపివేయవచ్చు. ఒక అమెరికాలో తయారైన మందుమీద వుండే ఆసక్తి మన జాతికి పునాదివేసిన యానాదుల మీద లేక పోవడం వలన మనం ఎంతో కోల్పోయాం. నిజానికి గాయాలు తగిలినపుడు ఊటిఆకు, పిచ్చిక బీర ఆకు, గబ్బు ఆకు కట్టిన వెంటనే గాయం మానుతుంది. దీన్ని మనం భాషా పరంగానూ, వైద్యపరంగాను నిర్లక్ష్యం చేస్తున్నాం. వంటికి తీట వచ్చినపుడు దేవదారు రసం, సన్నమల్లి ఆకుల రసాన్ని ఉపయోగిస్తున్నారు. పాము కరిచినపుడు నేలవేము, నాగముష్ఠి, పిచ్చిక బీర, పాముదొండ, తిప్పతీగ, వెర్రిబిల్లు, పల్లముష్ఠి చెక్క వాడుతున్నారు. ఈ చెక్కలు యానాదుల బొడ్డులో కట్టుకుంటారు. పాము కరిచి చనిపోయిన యానాదులు తక్కువ. ఇతర జాతులే ఎక్కువ. ఈ పదజాలమే ఇతరులకు నోటికి రావు ఈ చెట్లే ఇతరులు చూడలేదు. రకరకాల గులాబి తోటలు పెంచడంలో వుండే శ్రద్ధ తెలుగు జాతికి తమ దేశీయమైన చెట్లమీద లేదు. ఇంగ్లీషులో బోటనీలో ఎన్నో పదాలు కష్టపడి నేర్చుకుంటారు. స్పెెల్లింగులు కంఠత పెడతారు. కాని తమ ఎదురుగా వున్న జాతుల్ని నిర్లక్ష్యం చేస్తారు. కొన్ని వందల వేల మంది అతిసారం వచ్చి మరణి స్తున్నపుడు వేపబంక, ఉల్లిందర బంక, ఎద్దుసోగ చ్కెను యానాదులు ఎప్పుడో కనిపెట్టారు. కాని ఆ పేర్లే మనకు రావు. మనకున్న మూఢనమ్మకాల వల్ల కింద జాతులకు వైద్యం వచ్చినా వారు జ్ఞానవంతులు కారు అనే అవిశ్వాసాల వల్ల వారిలో దాగిన భాషా సంపందను, విజ్ఞాన సంపందను కోల్పోతున్నాం. అలాగే యానాదులు లిఖిత భాషను నేర్చుకోవడంలో చొరవ చూపకపోవడం వల్ల వారు మిగిలిన సమాజంలో అభివృద్ధి చెందుతున్న దశలను అందుకోలేకపోతున్నారు. అనేక గిరుల్లో, మూఢనమ్మకాల్లో యానాదులు కూడా నలుగుతున్నారు. లిఖిత సాహిత్యం, భాష నేర్చుకోలేని సామాజిక తరగతులు తమ విస్తరణని తాము కుదించుకుంటున్నాయి. అలాగే మౌఖిక జాతులకు అక్షరాలు రావుకదా, విద్యరాదు కదా వారి దగ్గర ఏమి జ్ఞానం వుంటుంది అని అపోహపడే విద్యాకులాలు తమతోనే వున్న వారిలో వున్న విలువైన సాంస్కృతిక నిధుల్ని అందుకోలేకపోతున్నారు. యానాదులు ఇప్పటికీి స్వచ్ఛమైన తెలుగు జాతి. వారు మొదట గడ్డ ఎత్తిన ఊరికల్లా తెలుగు పేరే వారు పెడతారు. ఆంధ్రదేశంలో ప్రముఖంగా వారున్న చోట తెలుగు పేర్లతోనే విరాజిల్లుతున్నాయి చూడండి
”పోట్లూరు, చెంబేటి, ఎందేటి, ఎల్లంటి, వెల్లటూరు, వెల్లంపల్లి, ఏకొల్లు, చెలంచెర్ల, ఆడపూడి, నంబూరు, రాపూరు, యాకసిరి, అరుదూరు, ఎల్లసిరి, కోవూరు, అల్లూరు, పొన్నూరు, కోట్లపాడు, కానూరు, చౌటూరు, ఏలూరు, చీకోలు, కుడుమల, కల్లూరు, కందికట్టు, తలమంచి, పొన్నలూరు, అంబూరు, చిల్లకూరు, మోపూరు, కుందుకూరు, చేవూరు, పెనుగొండ, జయంపు, ఒంటేరు, కంచి, మన్నూరు, బూదూరు, చింతలపూడి, నెల్లూరు, తలుపూరు, పవని, బాపట్ల, వంజాకుల, మల్లవరపు, ఊటుకూరు, ఎనమాల, చెలంచర్ల, కంచి, ఏనాటి, శింగపేట, యాలకట్ల, కోనేటి, వేణుంబాక.”
యానాదుల జాతీయత
తెలుగు గ్రామనామాలు పరిశీలిస్తే యానాదుల జాతీయత మన ముందుకు వస్తుంది. తెలుగు జాతికి, సంస్కృతికి, జ్ఞానానికి, చరిత్రకి, జీవగర్రలు యానాదులు. ఎందరో పరిశోధకులు వారిని గురించి తెలుసుకోలేక పోయారు. వారి మూల తత్వాన్ని గ్రహించలేక పోయారు. తమ సాహిత్యంలో వార్ని అనామకులుగా చిత్రిస్తూ వచ్చారు. ఒక జాతి గురించి తెలుసుకోవాలంటే పరిశోధకునికి సహృదయం అవసరం. పరిశోధకుడు పాక్షికంగా కుల మతాధిక్యతతో పరిశోధిస్తే తమ కులాధిక్యతలే ముందుకు వస్తాయి. యానాదుల ప్రతి గూడెంలో ఒక వైద్యుడు వున్నాడు. ఈ వైద్యుల భాషలో తెలుగు ప్రకృతి నిబిడీకృతమైంది. ఎన్ని చెట్లు మనం కోల్పోయామో ఆ చెట్టుతో పాటు ఆ చెట్టు పేరు, చెట్టుగుణం, చెట్టు బెరడు, చెట్టు ఆకు, చెట్టు వేరు, దాని సుగుణాలు మానవ శరీరం మీద దాని పలితాలను మనం కోల్పోయాం. వాటి అన్నింటిని వెలికి తీసుకోవాల్సిన సామాజిక బాధ్యత ఈ సంస్కృతిని నూత్న నిష్పాక్షిక పరిశోధనా వ్యక్తిత్వం ఈనాడు మనకు అవసరం. ఆ క్రమంలో యానాదుల ఇంటి పేర్లు కూడా మనకి ప్రాకృతికమైన నామాలే ఎక్కువ కన్పిస్తాయి. ఒక కూలాన్ని నిర్దేశించేవి కాకుండా ప్రకృతితో తమకుండే సంబంధాన్ని తెలిపేవిగా ఈ పేర్లు వున్నాయి. వీరి ఇండ్ల పేర్లల్లో ప్రసిద్ధమైన నెమళ్ల, మేకల, ఈగ, చిలకల, కప్పల, పూరేటి వారి ప్రాచీనతను మనకు తెలియ జేస్తున్నాయి. కొన్ని కులాల్లో జంధ్యాల, పిలక వంటి ఇంటి పేర్లు వుంటాయి. అవి వారి ఆరాచాల్ని వారి కుల నిబద్ధతని తెలియజేస్తాయి.
కుల నామాలు లేని యానాది జాతి
అలా యానాదుల్లో కుల నామాలు ఉండవు. వెనుకటి యుద్ధాల్లో వారు పనిచేసిన గుర్తులుగా తుపాకుల, చొక్కాల, ఇండ్ల, కత్తి, శీలం, పులి, వారు చేసే పనుల్ని బట్టి వారికి కొన్ని ఇంటి పేర్లుగా వున్నాయి. మానికల, తలుపుల, మెలికల, కొడమాల, గంధళ్ల, పిట్టల, మేకల, కూట్ల, మొలకల, కాకి, ఆవుల, చింతల, కందిగోళ్ల, గాజుల, కావలి, పాముల. ఒకనాటిి తెలుగు జాతికి కులం లేదు. ఏ జాతికి కులం మొదట లేదు. కులాల కుదురులో కూరుకు పోయిన తర్వాత తెలుగు జాతి జాతీయతను కోల్పోయింది. మన జాతికి పునాదిరాళ్ళు వేసిన యానాదుల్ని మనం నిర్లక్ష్యం చేయడంలోనే జాతి అభ్యున్నతి కుంటుబడింది. ఇప్పటికైనా కళ్ళు తెరచి యానాదుల్లో వున్న భాష, సంస్కృతులను మనం తెలుగు జాతికి అన్వయించుకొని తెలుగు జాతిని పరిపుష్ఠం చేసుకోవల్సిన. మహోన్నత చారిత్రక సందర్భం ఇది. యానాదుల సాహిత్యాన్ని మనం పరిశీలిస్తే తెలుగు నుడికార నిగారం తెలుగు క్రియా పదాల సొగసు మనకు వెల్లి విరుస్తుంది. ఇతరులను నిందించకుండా తమ చరిత్రే తాము చెప్పుకునే జాతి తత్వంవుంది మనకు వారి పాటల్లో కన్పిస్తుంది.
”ఎంతమంచివాడమ్మా/యాడకి పోయినాడమ్మా/గుట్టమీదికెక్కాడు/పుట్టతేనె తెచ్చాడు/శెట్టిదొర్లో దూకాడు/మట్టగుడిశెలు తెచ్చాడు/పిట్టలకుచ్చు లేస్తాడు/కట్టెలమోపులు మోస్తాడు/కూటికి నీళ్ళకు వాస్తాడు/ఏటికి కావలికాస్తాడు/పుట్టినా గిట్టినా ఒకటేనంటాడు/కట్టుబట్టలతోనే కాలంగడిపేస్తాడు/ఎంత మంచివాడమ్మా యాడకిబోయినాడమ్మా/ఈడుజోడు ఉంటే ఎంతో పనిచేస్తాడు/కాడూ ఎదురైనాను కంచుగంట మోగిస్తాడు/ఎంత మంచివాడమ్మా యాడకిబోయినాడమ్మా”
మౌఖిక జాతుల్లోని సాహిత్య సంపద
యానాదుల పాటల్లో స్పష్టత, సూటిదనం, జీవన శైలి, జీవన సంస్కృతి దాగియున్నాయి. ప్రకృతిలో జీవించే జాతుల్లో ఎక్కువ భాష మాధుర్యం వుంటుంది. ఒక జాతియొక్క సాంస్కృతిక స్థాయిని భాషే నిర్వచిస్తుంది. కృతకమైన భాష అది జాతి దృక్పథాన్ని వెలువరించలేదు. యానాదుల భాషలో కృత్రిమత్వంలేదు. వ్యక్తిత్వాన్ని దుఃఖాన్ని ప్రకృతితో తమకుండే సంబంధాల్ని యానాదుల భాష మనకు తెలుపుతుంది. లోహయుగం, రాతియుగం, నదీనాగరిక సంస్కృతులకు అద్దంపట్టే యుగాలు యానాదుల్లో కొల్లలుగా కని పిస్తాయి. యానాదుల్లోని సున్నితమైన శృంగారాన్ని తెలిపే పాటలు వారి జీవన వ్యవస్థను ప్రతిబింబిస్తాయి.
చింతచెట్టు చిగురుచూడు చిన్నదాని నవురుజూడు
తాటిమోము పొగరుజూడు కుఱ్ఱదాని ఎగురుచూడు
వేపపండు రంగుచూడు యిప్పసారాయి పొంగుచూడు
ఈ పాటలోని మౌరు, పొగరు, ఎగురు, పొంగు పదాలు తెలుగు నుడికారంలోని సొగసును తెలుపుతున్నాయి.
”కట్టమీద గడ్డికోసే లలనా
కట్టక్రింద మోపుగట్టే
లలనా బంగారుసామె” వ్యవసాయ సంస్కృతికి మూలమైన యానాది జీవితంలో కల్మషం లేదు. అనాదిగా అవినీతికి వ్యతిరేకంగా నిలబడిన యానాదుల పాటల్లో నేరప్రవృత్తి నిరసన వుంటుంది. వారి జీవితంలోని నిజాయితీ వారిపాటల్లో అభివ్యక్తమౌతుంది.
”దూలాల కొంపలు మనకచ్చిరావు
కాలాలు మారినా దూలాలు వద్దు
బేరాలు సారాలు మాకెందుకయ్యా
నేరాలు చేయము కారాలునూరము
కడుపునిండా కూడు, కట్టనిండాబట్ట
ఆ మీద మీమాటలెన్నైన యింటాము.”
ఈర్ష్యా ద్వేషాలకు అతీతమైన వారి జీవన విధానంలోని సున్నితమైన శృంగారంలో ఎన్నో పాటలు ఆవిర్భవించాయి. ఎంకి పాటల వంటివి కూడా ఈ పాటల నుండే పుట్టుకొచ్చాయనేది ఈ పాటలను పరిశీలిస్తే మనకు అర్థమౌతుంది. ఈ పాటల్లో వున్న లయ మన తెనుగు ఛందస్సుకు ఆయువు అని చెప్పవచ్చు.
వస్తావ, వస్తావ, వస్తావా వాయీల చీరెలు తెస్తానే
వాయీల చీరెలు తెస్తానే ఒంటినిండా నగలు వేస్తానే
వాయీల చీరెలు, వంకీలు బంకీలు అంటుమామిడి పండ్లు
ఎరగన్ని తెస్తాను
వస్తావ, వస్తావ, వస్తావా?
వాయీల చీరొద్దు, వంకీలు నాకొద్దు, ఒంటినిండా సొమ్ము వద్దైనా వద్దు
ఓసనా చమురుల్లు తెస్తానే, ఒంటినిండా, ముద్దులెడతానే
నీ ముద్దు నాకేల? నీ హద్దు నాకేల?
నేను పొయ్యేచోటికొస్తావా నీమాటే నామాట నంటావా?
నా అడుగుల్లో నీ అడుగు లేస్తావా
నేను పొయ్యేచోటికొస్తావా?
వస్తాను వస్తాను వస్తానే వద్దన్నపోకుండ ఉంటానే
నీవు వద్దన్న నిలదొక్కి ఉంటానే
నమ్మేది నిన్నెట్ల ఎఱ్ఱోడా నక్కజిత్తులమారి కుఱ్ఱోడా?
నీళ్లులేని మబ్బులుంటాయా యెంకి నిప్పులేక రవలు లేస్తాయా?
అట్లయితె యెల్దాము రా మామ
అంటుమామిడితోట కెల్దాము రెడ్డోరి జీడిమామిడి పప్పుతిందాము
ఆడ ఎన్నెట్లొ ఏకమై పోదాము
చేతిలో చెయ్యేసుకుందాము
కూటిలో కూడేసు కుందాము. ఈ పాటలను అను కరించి ఎన్నో జానపద, దేశవాళి, సినిమా పాటలు వచ్చాయి. భాషా సంపదనే కాకుండా తెలుగు సాంస్కృతిక నేపథ్యాన్ని కూడా ఈ పాటలు తెలుపుతున్నాయి. యానాదుల జీవితంలో తేనె చాలా ముఖ్యమైంది. ఈ దిశగా కూడా మిగిలిన తెలుగు జాతివారు కూడా నేర్చుకోవలసింది చాలా వుంది. రష్యాలో కూడా తేనె పరిశ్రమను గురించి పరిశోధించి వారి జీవితానికి దాన్ని అన్వయించుకోవడంలో అత్యున్నతమైన విలువలు సాధించాయి. ఆ దిశగా భాషా నేపథ్యం నుంచి ఆయా సాంస్కృతిక పునరుజ్జీవనంతో పాటు జాతి జీవనాన్ని పరిపుష్టం చేసుకోవాల్సివుంది. వృక్ష సంపదను పెంచడంలోను, తేనెటీగలు పెంచడంలోను యానాదుల జీవన విధానం మనకు మార్గదర్శనకం.
”ప్రస్తుతం వృక్షశాస్త్రజ్ఞులు మొక్కలలో 2,00,000 జాతులు పరిణతి చెందినవనీ, 1,20,000 జాతులు పరిణతి చెందనివనీ వర్గీకరించారు. పక్షిశాస్త్రజ్ఞులు (అర్నిథాల జిస్టులు) 10,000 రకాల పక్షులనీ, జంతుశాస్త్రజ్ఞులు 6,000 క్షీరదాలనీ (మామల్స్) వర్గీకరించారు. కాని కీటకశాస్త్రజ్ఞులకి (ఎంటమాల జిస్టులకి) తెలిపిన కీటకాలలోని జాతుల సంఖ్య మిలియన్‌కు పైగా వుంది. అంటే, ప్రకృతిలో కీటకాలు అనేక రకాలతో చాలా ఎక్కువగా ఉన్నాయని అర్థం.”
”కానీ కీటకాల్లో మనిషికి ఎంతో లాభాన్ని కలిగించేవీ ఉన్నాయి. ప్రధానంగా తేనెటీగలూ, పట్టు పురుగులూ ఈ కోవకి చెందుతాయి. తేనెటీగలు మనిషికి నిజమైన స్నేహితులనీ, అతనికి లాభాన్ని సంపాదించి పెట్టడంలో, ముఖ్యంగా పంట రాబడి పెంచడంలో అవి ఎంతో సహాయపడతాయనీ అందరికీ తెలుసు. మూడవ భూయుగంలో (టెర్షియరీ పీరియడ్) తేనెటీగలు భూమి మీద అవతరించాయి. అంటే ఆదిమ మానవుడు ఆవిర్భవించడానికి సుమారు 56 మిలియన్ల సంవత్సరాల క్రితం అన్నమాట. పురాతన సంస్కృతిని తెలుపుతూ ఈనాటి దాకా చెక్కుచెదరకుండా వున్న స్మృతి చిహ్నాలు ఆదిమ మానవుడు రుచికరమైన, పోషకమైన తేనె కోసం ఎంతో తీవ్రంగా అన్వేషించేవాడని తెల్పుతున్నాయి. పురాతనమైన అటువంటి చెక్కుడు పని వాలెన్సియా దగ్గరలో క్యూవాస్ దె లా అరాన (స్పానిష్ భాషలో గుహలో శాస్త్రం అని అర్థం) పల్లె దగ్గర దొరికింది. ఇది రాతియుగానికి చెందినది. ఈ రాతి చెక్కడంమీద 15-20 వేల ఏళ్ల క్రితం, ముసురుకుని వున్న తేనెటీగల మధ్య తేనెటీగల తుట్టె నుంచి తేనెను ఏ విధంగా తీస్తున్నదీ చిత్రించబడింది.”
ఆంధ్రదేశంలో తేనె యానాదులు, చెంచులు జీవన వ్యవస్థలలో భాగం. రష్యాలో, చైనాలో లాగా మన తెలుగు జాతిని పునర్జీవింప చేసే క్రమంలో తేనె పరిశ్రమను కూడా అభివృద్ధి చేసుకోవచ్చు. తేనెలో వుండే జీవపోషక పదార్ధాలను చెప్తూ మాస్కో విశ్వవిద్యాలయం వారు పరిశోధించి ఇలా బయటకి తీశారు. ”తేనెలో కాల్షియం, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, ఇనుము, క్లోరిన్, ఫాస్పరస్, సల్ఫర్, అయోడిన్‌ల లవణాలు కూడా ఉంటాయి. కొన్ని రకాల తేనెల్లో చివరికి రేడియం కూడా ఉంటుంది. మాస్కో విశ్వవిద్యాలయంలో ఇ.సి. ప్రెఝవాల్‌స్కీ ప్రయోగశాలలో జరిపిన ప్రయోగాల్లో తేనెల్లో మాంగనీసు, అల్యూమినియం, బోరాన్, క్రోమియం, రాగి, లిథియం, నికెల్, సీసం, తగరం, టైటానియం, జింకు ఆస్మియంల లవణాలు కూడా ఉంటాయని నిరూపించబడింది.
మానవ శరీరానికి ఖనిజలవణాల ఆవశ్యకత ఎంతో ఎక్కువగా ఉంటుంది. జంతువులకి క్రమబద్ధ్దంగా ఖనిజలవణాలు లేని ఆహారంపెడితే, ఆ ఆహారంలో ప్రోటీన్‌లూ, కార్బోహైడ్రేట్‌లూ, కొవ్వులూ, విటమిన్లూ ఎంత ఎక్కువగా వున్నా, అవి చనిపోతాయని జంతువుల మీద చేసిన ప్రయోగాలు నిరూపిస్తున్నాయి.”
ప్రపంచ బ్యాంకు ఆధిపత్యంలో తెలుగు జాతి
ఏ అభివృద్ధి అయినా ఆ జాతి ప్రకృతిని అధ్యయనం చేసి ఆయా పరిశ్రమల్ని సంస్కృతిని పెంపొందించుకోవడంలోనే వుంటుంది. తెలుగు జాతి సామాజిక వర్గాలను నిర్లక్ష్యం చేయడం వల్లనే వెనుకబడి వుందనేది స్పష్టమైన విషయం. ప్రధానంగా తెలుగు జాతి మూల శక్తులైన యానాదుల జీవన విధానం వారి భాష, సంస్కృతి పైన పరిశోధన జరగవలసివుంది. ప్రపంచ బ్యాంకు, ప్రపంచ సామ్రాజ్యవాదం ముమ్మరంగా ఆయా రాష్ట్రాలను కదిలిస్తున్న ఈనాడు సాంస్కృతిక పునాదులు, ఆర్థ్ధిక పునాదులు జాతుల మూలాల్లోకి వెళ్ళి మనం కోల్పోయిన వృత్తులను పరిశ్రమలను పునర్జీవింప చేసుకోవలసిన చారిత్రక అవసరం ముందుకు వచ్చింది. చిన్నాచితక జాతులవారికి కోటి, అరకోటి ఖర్చుపెట్టి ఎంతో ప్రచారం చేసుకునే ప్రభుత్వం లక్షా ఇరువై ఐదు కోట్లు ధన వంతులకు బాకీలు ఇచ్చి వసూలు చేయలేకపోతుందనేది సత్యం. నూటయాభై మంది బడా పెట్టుబడుదారులు కలిసి 21,400 కోట్లు బాకీ పడ్డారు. ఈ విషయాన్ని తేటతెల్లంగా తెల్పుతూ ప్రముఖ ఆర్థ్ధిక వేత్త వి. హనుమంతరావుగారు ఇలా వివరించారు:
”లక్షా ఇరవై అయిదు కోట్ల మేరకు మొండిబాకీలు పేరుకుపోవడం, ఆ బాకీలన్నీ పెద్ద కార్పొరేట్ సంస్థల నుంచేనని అందరికీ తెలిసిన విషయమే. ఇపుడు ఈ బాకీలు తగ్గాయని ప్రభుత్వం అంటోంది. ఇవన్నీ ప్రైవేటు సంస్థలే. ఒకపక్క వారి బాకీలు ఇలా పేరుకుపోతుంటే రెండో పక్క ప్రైవేటు రంగానికి బ్యాంకింగు వ్యవస్థను బదలాయించడమంటే, ఈ బాకీలు చెల్లించకుండా ఎగ్గొట్టడానికి అవకాశం కల్పించడమే అవుతుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండిబాకీలు 2002 మార్చి నాటికి రు. 56,607 కోట్లుకాగా, మార్చి 2003 నాటికి రు. 53,883 కోట్లకు తగ్గాయని ప్రభుత్వం అంటోంది. కానీ వాస్తవమేమంటే ఒక కోటి రూపాయలకు పైగా పేరుకుపోయిన మొండి బాకీలు 2001 మార్చినాటికి 12,090మంది రూ.80,246 కోట్లుండగా అది 2002 మార్చినాటికి రూ.13,596 కోట్లకు పెరిగాయి. మొండిబాకీలు తగ్గాయని ప్రభుత్వం అంటూందంటే, కొన్ని బాకీలను వసూలుకాని బాకీలుగా ముద్రవేసి, రద్దు చేయడం వల్ల తగ్గాయి. అలాగే మొండిబకాయి అని ముద్రవేసే ముందు బాకీ ఉన్న మొత్తం చెల్లింపును వాయిదా వేయడంలాంటి అనేక పద్ధతులు ద్వారా మొండిబాకీలు తగ్గాయేకాని అవి వసూలు కావడం వల్ల కాదు. ఇలా బాకీలు పడినవారు చిన్నా చితకా బాపతు కాదు, లక్షలు, కోట్లు రుణాలు పుచ్చుకున్నవారే, ఘనాపాటీలే. ఇలా బాకీలున్నవారి పట్టికలో పైనవున్న కేవలం 150 మంది మాత్రమే రూ. 21,447 కోట్లు బాకీ పడ్డారు. చిన్న చిన్న మొత్తాలు తీసుకున్నవారి వద్ద నుంచి వసూలు కావాల్సిన బాకీలు సంస్కరణలు ప్రవేశ పెట్టిన తరువాత తగ్గుతూ వస్తుండగా, పెద్ద మొత్తాలు రుణాలుగా తీసుకున్నవారే చెల్లించకుండా తాత్సారం చేస్తున్నారు. ఉదాహరణకు కేవలం వ్యవసాయ రుణాల విషయం తీసుకొని చూస్తే ఇరవై ఐదువేల రూపాయలలోపు రుణాలు తీసుకొన్నవారి సంఖ్య 1995-2002 మధ్య సగానికి సగం తగ్గిపోగా రెండు లక్షల రూపాయలపైగా రుణం అందుకున్న వారిసంఖ్య కేవలం 356 నుండి 50,718కి చేరిందంటే బ్యాంకులు బలహీనులకు దూరం అవుతున్నాయనేది స్పష్టం. ధన వంతులకిచ్చిన రుణం మొత్తం కూడా కేవలం రు. 145 లక్షల నుంచి 3931 కోట్లకు పెరిగిపోయింది. వ్యవసాయదారులకు, చిన్న వృత్తిదారులకు ఇచ్చిన మొత్తం రుణంలో ధనాఢ్యులకు ఇచ్చిన రుణం 1995లో కేవలం 0.31 శాతంకాగా 2002 నాటికి 70 శాతానికి చేరుకొన్నాయంటే ఈ ప్రభుత్వం ఎవరి ప్రభుత్వమో, ఈ బ్యాంకులు ఎవరి కోసం పనిచేస్తున్నాయో అర్థ్ధం చేసుకోవచ్చు.”
ప్రపంచ బ్యాంకు పెత్తనం ప్రారంభమయ్యాక గిరిజనుల, దళితుల జీవన వృత్తులు కూలిపోవడం ప్రారంభమైంది. అగ్రకులాలు, ధనవంతులు బ్యాంకుల దగ్గర వందలాది కోట్లు అప్పులు తీసుకొని యెగవేస్తున్నారనేదాన్ని హనుమంతరావు గారు స్పష్టంగా చెప్పారు. ఇక యానాదులు వంటి చిన్న చిన్న కులాలు తమ ఉనికినే కోల్పోయే పరిస్థితులు ముమ్మరం అవుతున్నాయి. చిన్న చిన్న కులాల వారికి బ్యాంకు ఋణాలు దుర్లభమౌతున్నాయి. ముఖ్యంగా చిన్న కులాలు ఆశ్రయించిన కోళ్ళ పెంపకం, తేనె, పందుల పెంపకం వంటివి అన్ని పెద్ద కులాలు కోట్లాది రూపాయలు బ్యాంకు లోన్లతో ఫారమ్స్‌గా పెట్టి వీరిని కూలీలుగా మారుస్తున్నారు. వీరి జీవన సంస్కృతి పూర్తిగా సంక్షోభంలో వుంది. యానాదులు ఎంత ప్రాచీన జాతివారో ప్రసిద్ధ పరిశోధకులు భారతీయ తెగలమీద విశేష కృషి గావించిన కె.యస్. సింగు షెడ్యూల్డు ట్రైబ్స్ అనే గ్రంథంలో యానాదుల గురించి ఇలా తెలిపారు.
యానాదుల చారిత్రక నేపథ్యం
మాతృభాషకు కట్టుబడివున్న యానాదుల జీవన పరిణామాన్ని భాషా సంస్కృతిని మనం అభివృద్ధి చేసే క్రమంలో తెలుగు జాతీయతను మరింత పరిపుష్టత చేయవల్సిన అవసరం వుంది. యానాదులు 1981వ జనాభా లెక్కల్లో వారి అక్షరాస్యత 7.74 మాత్రమే వుంది. స్త్రీలలో 4.54% మాత్రమే వుంది. ఇది ప్రపంచం మొత్తంలోనే అతి తక్కువ అక్షరాస్యత కల్గిన సామాజిక వర్గంగా మనం చెప్పుకోవచ్చు. మౌఖిక జాతులను లిఖిత జాతులుగా రూపొందించుటలో మనం బాగా వెనుకబడి వున్నామని ఈ రిపోర్టు చెప్పుతుంది. నిజమైన తెలుగు వారికి అక్షరాలు నేర్పెే పథకాలు సమర్థ్ధవంతంగా రూపొందించకపోవడం జాత్యాభివృద్ధికి గొడ్డలి పెట్టు. ఏ జాతైనా తమకు పునాది వేసిన వర్గాల శక్తిసామర్థ్ధ్యాలను కొల్లగొట్టడం వల్ల ముందుకు మనజాల లేదు. యానాదులు ఇప్పటికి 76.81% వ్యవసాయ కూలీలుగా వున్నారు. ఈ విషయాన్ని కె.ఎస్.సింగు ఇలా వివరిస్తున్నారు.
మన బాట
యానాదుల వలె ఇతర సామాజిక తరగతుల్లో కూడా ఎన్నో సామాజిక జీవన గాథలు, వైద్యవిజ్ఞాన శాస్త్రాలు, భాషా సాంస్కృతిక నిధులు మనం వెలికి తీయాల్సివుంది. ఒక జాతి అది ప్రకృతిలో మనగలుగుతుంది అంటే దానికి అంతస్సూత్రమైన జ్ఞాన స్రవంతి తప్పకుండా వుంటుంది. ఆర్థ్ధికంగా అణగద్రొక్కబడి కనిపించినంత మాత్రాన ఏ జాతిని మనం నిరాకరించకూడదు. అనేక కారణాలవల్ల అనేక సామాజిక తరగతులు అణగద్రొక్క బడ్డాయి. అయితే మనం నిశితంగా పరిశీలిస్తే ఒక్కొక్క సామాజిక తరగతి ఒక్కొక్క జ్ఞాన నిధి. ఒక్కొక్క సాంస్కృతిక విజ్ఞాన ఖని. తెలుగు భాషా సంస్కృతులకు యానాదులు ఎలా కాణాచిగా ఉన్నారో మనం చూశాం. ఇంకా ముందుకెళ్ళే క్రమంలో ఎన్నో లిఖిత, మౌఖిక స్రవంతులు మన ముందుకు వస్తాయి.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
మంచి విషయాలు, కొత్త విషయాలు ఎన్నెన్నో తెలియజేసిన కత్తి పద్మన్న కు ధన్యవాదాలు!