కె. ఎన్. మల్లీశ్వరి
”…నా పక్కన కూచుని నాకు మంచీ చెడూ చెప్పవు గదా…” సోంపేట పోలీసు కాల్పుల్లో మరణించిన గున్నా జోగారావు (43) భార్యకి ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించినపుడు ఆమె ప్రతిస్పందన అది ”… నా భర్త ప్రజలకోసం జరుగుతున్న ఉద్యమంలో చనిపోయాడు. నా పిల్లలు , వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం చెపుతున్నా మాకు పవర్‌ప్లాంట్ వద్దు వద్దు…” దు:ఖాన్ని, గుండె లోతుల్లో అణిచి పెట్టి ఖచ్చితంగా తెగేసి చెప్పింది గున్నా జగదాంబ.
శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలో ప్రభుత్వ అనుమతితో నాగార్జున కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ (ఎన్‌సిసి) నిర్మించతలపెట్టిన బొగ్గు ఆధారిత విద్యుత్ కర్మాగారాన్ని గత రెండేళ్ళుగా యిక్కడి ప్రజలు తిరస్కరిస్తున్నారు. తప్పుడు నివేదికలతో చీల భూముల్ని (చిత్తడి నేలలు) బీడు భూములుగా చూపించి ఈ పవర్ ప్లాంట్‌ని నిర్మించ బూనడం యిక్కడి ప్రజల వ్యతిరేకతకి కారణమైంది.
పంట భూములు, చీల భూముల్లో పవర్‌ప్లాంట్ల నిర్మాణంవల్ల అనేక నష్టాలున్నాయని పర్యావరణ పరిరక్షణ వాదులు ఎంతగా ఘోషిస్తున్నా ప్రభుత్వాలు, బడా ప్రయివేటు కంపెనీలు పెడ చెవిన పెట్టి రాష్ట్రానికి లేదా కనీసం ఆ ప్రాంతపు అభివృద్దికి ఏ మాత్రం ఉపయోగపడని, పై పెచ్చు హాని చేసే ఇలాంటి ప్లాంట్లని ప్రజలు సంఘటితమై వ్యతిరేకిస్తున్నారు.
రాజకీయ నాయకులు పవర్ ప్లాంట్లను అభివృద్ధికి చిహ్నంగా అభివర్ణిస్తున్న ఇలాంటి సందర్భంలో అభివృద్ధి నమూనాను ఇపుడు కొత్తగా నిర్వచించాల్సిందే.
పవర్‌ప్లాంట్ల నిర్మాణం జరిగితే ఆకస్మాత్తుగా యిక్కడి ప్రజలు ”ధనవంతులయిపోతారనీ, పంచెలు పోయి పాంట్లు, చెప్పులు పోయి, బూట్లు” వస్తాయని మాటలతో రాజకీయ నాయకులు ప్రజలను మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తుంటే ఉద్యమాలు కొత్తకాని ఉత్తరాంధ్ర వాసులు తాము కోల్పోయే వాటి సంగతేంటని ప్రశ్నిస్తున్నారు.
పవర్‌ప్లాంట్ల నిర్మాణం జరిగితే కోల్పోయే ఉపాధి అవకాశాలు, అడుగంటే భూగర్భజలాలు, తలెత్తే వాతావరణ కాలుష్యం మొదలయిన సమస్యల సంగతేంటని నిలదీస్తున్నారు.
పోలీసుకాల్పుల్లో మరణించిన గొణిప కృష్ణమూర్తి (60) కుటుంబీకులతో మాట్లాడినపుడు ఆయన సోదరుడు స్పష్టంగా ఒకే ఒక విషయం చెప్పారు. ” ఈ చల్లని గాలి…యింత తియ్యటి నీళ్ళు..నిలబడ్డానికి ఈ కాసింత నేల చాలు మాకు.. వీటిని పొగొట్టి వచ్చే ఏ అభివృద్ధి మా కొద్దు…”అన్నారు.
జూలై 14న సోంపేట కాల్పుల్లో గాయపడినవారిని, మృతుల కుటుంబాలనూ పరామర్శించి అక్కడి పరిస్థితులను అధ్యయనం చెయ్యడానికి జూలై 18న ప్రజాసంఘాలతో కలిసి వెళ్ళినపుడు అక్కడి ప్రజల్లో స్వచ్ఛందంగా వెల్లి విరుస్తున్న చైతన్యం నుంచి ఎంతో నేర్చుకోవాల్సింది ఉందనిపించింది.
పలాన పురంలో జోగారావు కుటుంబీకులను పరామర్శించి గ్రామ ప్రజలతో మాట్లాడిన తర్వాత సోంపేటలో డా. కృష్ణమూర్తిని కలిసాం. ఈ ప్రజా ఉద్యమపు పూర్వాపరాలన్నీ ఆయన వివరించారు. తీర ప్రాంత మత్స్యకార వేదిక, పర్యావరణ పరిరక్షణ సమితి ఈ ఉద్యమానికి అవసరమయిన అవగాహనని ప్రజలకి అందిస్తున్నాయి. ప్రధానంగా ఈ ఉద్యమంలో మహిళ చైతన్య స్థాయిని చూస్తుంటే జీవికకి సంబంధించిన సంఘర్షణ మనిషికి ఎంతటి జ్ఞానాన్ని యిస్తుందో అర్థమయ్యింది. పరవాడ పవర్‌ప్లాంట్ల ఏర్పాటు ప్రాంతాలకు యిక్కడి మహిళలు వెళ్ళి చూసి అక్కడి మహిళల నుంచి ప్రభావితమయ్యారని కృష్ణమూర్తి చెప్పారు. జూలై 14న నాగార్జున కంపెనీ ప్లాంట& కోసం భూమి పూజ మొదలుపెడుతోందని తెలిసిన ప్రజలు నిరసన తెలపడానికి ఉద్యుక్తులయ్యారు. మూడు రోజుల ముందే సోంపేట పోలీసులు ఒక కరపతం ద్వారా ‘శాంతియుతంగా నిరసన తెలియజేయొచ్చు తప్ప విధ్వంసానికి దిగొద్దని’ గ్రామ గ్రామానా హెచ్చరించడం జరిగింది. ఆ రోజు ఉద్యమం 8 గం. నుంచే సుమారు నాలుగువేలమంది ప్రజలు నిర్మాణ ఏర్పాటుకి ఉద్దేశించబడిన స్థలాలకు చేరుకున్నారు. చర్చలకి లోపలికి రమ్మని శిబిరంలోకి పోలీసులు పిలిస్తే అక్కడికీ వ్యూహాత్మకంగానే ముందు వరుసలో మహిళలు, వృద్ధులూ లోపలికి వెళ్ళడం జరిగింది. చర్చలని లోపలికి పిలిచి లాఠీఛార్జీ చేయడం మొదలుపెట్టారు. ప్రజల ఆరోపణల మేరకు పోలీసులు, మెడలో బ్లూస్కార్ఫ్ కట్టుకున్న ఎన్‌సిసి గూండాలు కలిసి ప్రజలపై దాడి చేశారు. ఉద్రిక్తతలను సృష్టించి గాల్లోకి కాల్పులు జరపడంతో ప్రజలు తిరగబడ్డారు. అపుడు పోలీసులు తెల్లజెండాలను చూపించాక ప్రజలు శాంతించారు. పోలీసులు ఉద్యమ నాయకుల మధ్య చర్చలు ముగిసి ఎవరికి వారు ఇళ్ళకి వెళ్తుండగా జీపు ఎక్కి అది కదులుతుండగా సోంపేట ఎస్‌ఐ అశోక్ కుమార్ రోడ్డుపక్కన నిల్చున్న ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఇద్దరు చనిపోయారు. నలుగురైదుగురికి బుల్లెట్ గాయాలయ్యాయి.
తరతంపర భూముల్ని, ‘ఉద్ధానం’ గా పిలవబడే కొబ్బరి తోటల ఉద్యాన వనాల్ని దాటుకుని ముందుకువెళ్తే వస్తుంది సముద్రపు ఒడ్డున ఉండే ఇసుకపాలెం. ఎక్కువ శాతం మత్స్యకార కుటుంబాలే అక్కడ ఉంటాయి. వారి జీవనాధారం చేపలవేటే. పవర్‌ప్లాంట్ మూలంగా మొదట ఎఫెక్ట్ అయ్యేవి మత్స్యకారుల జీవితాలే. అందుకే మొదట సమస్యని గురించి తీర ప్రాంతాల్లో మడ్డు రాజారావు ఎం.పి. కూడా. మత్స్యకారులందరిని ఐక్య పరిచి ఉద్యమ బాట పట్టించింది రాజారావే. అందుకే సహజంగానే దాడిలో అతను టార్గెట్ అయ్యారు. తలపై తీవ్ర గాయంతో కూడా తనని చూడవచ్చిన వాళ్ళందరికీ ఏం జరిగిందో, ఇక ముందు కూడా ఏం చెయ్యదల్చుకున్నారో ఉద్వేగంగా చెప్పారు.
ఇసుక పాలెంలో చూశాం మహిళల విశ్వరూపం. తమకే ప్రత్యేకమయిన ఉత్తరాంధ్ర మత్స్యకారులు మాట్లాడే మాండలికంలో తూటాల్లా పేలే మాటలకి అనుగుణంగా హావభావప్రకటనతో నిలువెల్లా ఊగిపోతూ కనిపించారు.
బట్టి జయమ్మ మాట్లాడుతూ ” మేం ఎవళనీ నమ్మం. ఆ పార్టీవాళ్ళు.. ఈ పార్టీవాళ్ళు వొచ్చి వుద్యోగాలిత్తాం. వూళ్ళిత్తాం అని సెపుతున్నరు. మా పొట్టగొట్టి యీళు మాకేవిత్తారు. యీ పాలియెవళొచ్చినా ‘దిగే’ మని మీటికాయ (మొట్టికాయ) లేస్తాం…” అని అందో లేదో బట్టి మోయినమ్మ (మోహిని) నిలువెత్తు రణన్నినాదమైపోయింది. ” ఏటే మీటికాయ తీసి వదిలేది. ఆళు అగ్గిబాంబులు తెత్తే మాం పెట్రోల్ తెస్తాం..” అనేసి ఒక రాజకీయ నాయకుడిని ఉద్దేశించి ”… నాయనా… మాకు నీలా అచ్చరమ్ము క్కలుంటే అసంబ్లీలో కాయితమ్ముక్కలు సూపించి కవుర్లు సెపుదుము.. అక్కడ గాదు బాపూ.. యీ కొచ్చి సెప్మీయింటాం. మా కొద్దు పవర్‌ప్లాంట్లు.. అమెరికాలో కట్టుకోవచ్చుగా… నల్లమల అడవుల్లో కట్టుకోవచ్చుగా…” అంటూ చెలరేగిపోయింది.
అక్కడి ప్రజలంతా, ముఖ్యంగా స్త్రీలు ఏక కంఠంలో చెప్పిన మాట ఒకటే..” మాకు దెబ్బలు తగిలినా, మా ప్రాణాలు పోయినా సరే ప్లాంట్‌ని రానివ్వం” అని . ఇవి ఎవరో చెప్పించిన చిలక పలుకులు కావు… ప్రజలు పవర్‌ప్లాంట్లని తీవ్రంగా వ్యతిరేకించడం అడుగడుగునా స్పష్టమవుతోంది.
సోంపేటలో 223 రోజులుగా రిలే నిరాహారదీక్షలో బాధ్యతతో స్త్రీలు పాల్గొంటున్నారు. రోజుకి ఒక వూరి నుంచి ఒక పొదుపు సంఘం మహిళలు వచ్చి శిబిరంలో కూర్చుంటున్నారు. ఎక్కడ చూసినా ‘పర్యావరణం ముద్దు -థర్మల్ పవర్‌ప్లాంట్ వద్దు’ అన్న నినాదాలు గోడల మీదా పోస్టర్లు, బ్యానర్లలోనూ కనిపిస్తున్నాయి.
జూలై 14న సోంపేట దగ్గరలో కాల్పులు జరిగిన ప్రాంతం, ప్లాంట్ నిర్మాణానికి ఉద్దేశించిన స్థలం చూశాం. చుట్టూ పచ్చని పంట పొలాలు… ఇంకాస్త లోపల అన్ని బీల భూములే (చిత్తడి నేలలు) ప్లాంట్‌నిర్మాణం జరిగితే భూగర్భ జలాలు అడుగంటి పోతాయి… ప్రతి సంవత్సరం వలస వచ్చే వేలాది పక్షులు మరి కనిపించవు. తీర ప్రాంత మత్స్యకారులు తమ జీవనోపాధిని కోల్పోతారు. ప్రజలు రకరకాల వ్యాధుల బారిని పడే ప్రమాదం ఉంది. వ్యవసాయ సంస్కృతిని కనుమరుగు చేస్తూ ప్రభుత్వం వల్లె వేసే అభివృద్ధి మంత్రం ప్రజల మధ్య అనేక కొత్త అంతరాలను సృష్టిస్తుంది…పేద ప్రజానీకం గోడు పట్టని ప్రభుత్వం ఎప్పటిలాగే వెనకడుగు వేసే ప్రసక్తి లేదని చెపుతుండగా ప్రాణాలనయినా ధారపోస్తాం. ప్లాంట్‌ని మాత్రం రానివ్వం అని చెపుతున్నారు. సోంపేట పరిసర గ్రామాల ప్రజలు.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags