హేమా వెంక్రటావు
”నక్సల్బరీ”ని అందిపుచ్చుకున్న సీకాకులం రాష్ట్రంలో అన్ని పోరాటాల్ని కొత్త మలుపు తిప్పింది. వెంకట్రావు సత్యం, పంచాది నిర్మల, సుబ్బారావు, పాణిగ్రాహిలాంటి ఎందరో వీరులు అమరులైనారు. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ సోంపేట ”అభివృద్ధి” పేరుమీద జరుగుతున్న జీవన ”విధ్వాంసానికి” వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి పోరాడింది. ఆ త్యాగం వృధా పోదు.
గత దశాబ్దకాలంగా రాష్ట్రంలో సెజ్‌లు , కోస్టల్ కారిడార్‌లు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తమ భూముల్ని గ్రామాల్ని ప్రభుత్వం దగ్గరుండి కంపెనీలకు కట్టబెడుతుంటే తిరగ బడుతున్న జనాల మీద దారుణ మారణ కాండ జరుగుతూనే వుంది. గంగవరంలో ఒక మత్స్య కారుడు ప్రాణాలు కోల్పోయాడు. కాకినాడ సెజ్ వ్యతిరేక నాయకులపై అక్రమ కేసులు నడుస్తూనే ఉన్నాయి. వాన్‌పిక్‌లో అగ్గి రాజుకుంటూనే ఉంది. ఈ సందర్భంలో సోంపేట ప్రజలు తమ భూమికోసం, ”బీల” కోసం సాహసోపేతంగా పోరాడటం ప్రజాపోరాటాలకు కొండంత ధైర్యాన్నిచ్చింది. ఆ స్ఫూర్తిని నింపుకుంటూ సోంపేట పోరాటానికి బాసటగా మనమందరం నిలవాలని కోరుకుంటూ వారి బాధను తెలపడమే ఈ వ్యాసం ఉద్దేశం.
జూలై 14వ తేదీ కాల్పుల సంఘటనకు ముందు గ్రామాలకు వెళ్ళిన పోలీసులు, సాయుధ కంపెనీ గుండాలు ప్రతీ ఇంటిని సోదాచేసి ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేసారు. ముఖ్యంగా స్త్రీలను బయటకు రావద్దని, వారి పురుషుల్ని కట్టడి చేయాలని లేకపోతే తీవ్ర పరిమాణాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు. విచ్చలవిడిగా ఒక పత్రికా విలేఖరి సహాయంతో గ్రామాల్లో డబ్బులు వెదజల్లారు. వీధుల్లో కవాతు చేసారు. సుమారు 1000 మంది గుండాలను చత్తీస్‌ఘడ్, ఒరిస్సాల నుండి అక్కడ ధర్మల్ విద్యుత్ పవర్‌ప్లాంటు నిర్మాణం చేపట్టపోతున్న నాగార్జున కనస్ట్రక్షన్ కంపెనీ రప్పించింది. వీరు మారణాయుధాలు ధరించి వీధులలో, గ్రామాలలో తిరుగాడుతూ ప్రజల్ని ముఖ్యంగా స్త్రీలను భయభ్రాంతులకు గురి చేస్తుంటే పర్యావరణ పరిరక్షణ సంఘ సభ్యులు కలెక్టరుకు విషయాన్ని నివేదించినా స్పందన శూన్యం. మొత్తంగా కంపెనీ తరఫున, పాలక వర్గాల పక్షాన జిల్లా పాలనా యంత్రాంగం నిలబడింది. సోంపేట ఉద్యమ నాయకత్వాన్ని అందిస్తున్న పర్యావరణ పరిరక్షణ సంఘం ప్రధాన కార్యదర్శి బీన ఢిల్లీరావు భార్యజ్ఞానేశ్వరిని నడిరోడ్డు మీద తగలరాని ప్రదేశంలో కొట్టి అవమానించారు. కొందరు స్త్రీలను వివస్త్రలను చేయడానికి ప్రయత్నించారు. సంఘ అధ్యక్షులు డా. క్రిష్టమూర్తి రిలే నిరాహార దీక్షలో కూర్చున్న స్త్రీలకు మద్ధతుగా శిబిరానికి వెళితే ఆయనతోపాటు స్త్రీలను చావగొట్టి చితకబాదారు. మరో నాయకుడు టి. రామారావు సంఘ ఉపాధ్యక్షులు ఆసుపత్రి మీద దాడి చేసి అక్కడ ఉన్న నర్సులను బెదిరించి చేయి చేసుకున్నారు. మహిళా రోగులనగలు దోచుకున్నారు. గర్భిణీ స్త్రీలను బయటకు ఈడ్చేసి బీభత్సాన్ని సృష్టిం చారు. ఇంత జరిగితే హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఒక స్త్రీ అయివుండి కూడా అది ఒక అల్లరి మూక పని అని చెప్పటం సిగ్గు చేటు. మరి యింతగా ప్రజల్ని పోరాటంలోకి నడిపించిన ఆ పరిశ్రమ ఏమిటి? స్త్రీలు నాయకత్వం వహించి ముందుండి పోలీసుల్ని, గూండాల్ని తమ భూమిలోకి రాకుండా అడ్డుకోవడానికి అవసరమైతే తమ ప్రాణాలు వదలడానికి కూడా సిద్దపడి ఆ పరిశ్రమలను ఎందుకు ఆపాలనుకుంటున్నారు.
అభివృద్ధి, పారిశ్రామీకరణ పేరిట, ఉత్తరాంధ్ర (మూడు జిల్లాల్లో) 14 ధర్మల్ విద్యుత్‌ప్లాంట్లు నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో శ్రీకాకుళం జిల్లా సోంపేటలో నాగార్జున కనస్ట్రక్షన్ కంపెనీ అనుమతి పొందింది. సోంపేట మండలంలోని గొల్లగండి, గ్రామ ప్రాంతం పరిశ్రమ ఏర్పాటుకు అనువైనదని గుర్తించింది. ఈ ప్రాంతం పురాతన రేపుల్లో ఒకటైన బారువాకు చేరువగా ఉన్న బారువ, ప్రముఖ స్వాతంత్య్ర యోధుడైన గౌతు లచ్చన్న జన్మస్థలం కూడా! 12 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 2640 మెగావాట్ల సామర్ధ్యంగల పరిశ్రమను 1890 ఎకరాల భూమి అవసరమని నిర్ణయించారు. పరిశ్రమల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కోసం ఆంధ్ర ప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పోరేషన్ పూనుకుంది. ప్రభుత్వ పట్టా భూమికి 80000/- ప్రయివేటు వ్యక్తుల భూమికి 2 లక్షల నుండి 3.5 లక్షల వరకు ధరను ప్రకటించారు. ఇది కూడా భూమి నాణ్యత బట్టి కాకుండా వ్యక్తుల పరపతి మీద ధర ఆధారపడి ఉంటుంది. ఇప్పటివరకు ప్రభుత్వ భూమికి 970 ఎకరాలు ప్రయివేటు వ్యక్తుల నుంచి 560 ఎకరాలు నయానో భయానో సేకరించారు. ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.నిర్మాణ ప్రదేశంలో ”బీ” అని స్థానికులు, పిల్చుకునే చిత్తడి భూములున్నాయి. ఏడాది పొడవునా వీటిలో నీరుంటుంది. మత్స్యకారులు వీటిలో చేపలు వేట చేస్తారు. రైతులు వీటి ఆధారంగా రెండు సీజనుల్లో వరి పండిస్తారు. ఈ ప్రదేశంలో నిర్మాణం చేపడితే వర్షాధారిత బీలు, జలాశయాలు ఎండిపోతాయి. దీనివలన వ్యవసాయానికి, చేపలు వేటకి జీవ వైవిధ్యానికి విఘాతం కలుగుతుంది. ఈ ప్రదేశంలో 118 రకాల పక్షులు, అంతరించిపోతున్న అరుదైన జంతువుల నాశనం అవుతుంది.
ఈ ప్రాంతం అంతా మరో కోనసీమగా భావించే ”ఉద్ధానం”లో భాగం బొగ్గు దిగుమతికి జెట్టీని సముద్రంలో నిర్మిస్తారు. కాని కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనల ప్రకారం సముద్రానికి 500 మీటర్లు లోపు ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు. ఈ నిబంధనకు వ్యతిరేకంగానే కంపెనీ చర్యలు చేపడుతుంది. ఈ పరిశ్రమల వలన గంటకు 228 క్యూబిక్ మీటర్ల వ్యర్ధ జలాల విడుదల వలన చేపల వేటకు సమస్యలు ఉత్పన్నమవుతాయి. చేపలు, రొయ్యల ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతుందని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. నీటిలో కాలుష్యం పెరగటం, ప్లాంటు ప్రాంతంలో భూ ఉపరితల భాగం, పచ్చదనం, మట్టి కొంతమేరకు కోల్పోయే అవకాశం ఉంది.
అయితే బూడిద, వ్యర్ధజలాల వల్ల ఎటువంటి యిబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అత్యంత ఆధునికమైన, నాణ్యమైన సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో పరిశ్రమను నడుపుతామని నాగార్జున కన్‌స్ట్రక్సన్ కంపెనీ యాజమాన్యం ప్రజలను నమ్మించ డానికి ప్రయత్నించింది. తమకు అనుకూలంగా స్పందించి రిపోర్టులు యిచ్చే కొంతమంది పర్యావరణ శాస్త్రవేత్తలను, వివిధ రకాల నిపుణులను ఈ ప్రాంతానికి రప్పించి స్థానికులను మభ్య పెట్టడానికి ప్రయత్నాలు చేసింది. అదే సమయంలో సలాసపురం గ్రామం నుండి అగ్రికల్చరల్ యం. యస్సీ. చేసిన వ్యక్తి ఈ నష్టాన్ని గుర్తెరిగి ప్రజల ముందు పెట్టగా 2008 సం. అక్టోబర్ నెలలో జనరక్షణ సమితి పేరుతో బీన ఢిల్లీరావు 10 వేల కరపత్రాలు ప్రచురించి గ్రామ గ్రామాన ఆటోలో తిరిగి సమావేశం ఏర్పాటు చేయగా 7గురు రైతు ప్రతినిధులు సనపల శ్రీరాంమూర్తి, మాదిన రాఘువుల, మొదలగు వారు 7గురు హజరై దీనిని పర్యావరణ పరిరక్షణ సమితిగారూపకల్పన చేసారు. పర్యావరణ స్థానిక పరిరక్షణ ఉద్యమ నాయకులు కూడా ప్రజల పక్షాన నిలబడి నిబద్ధతతో వ్యవహరించే శాస్త్రవేత్తలను, నిపుణులను రప్పించి పరిశ్రమల వల్ల ముప్పు ఉందని ప్రకటించారు. అంతేకాకుండా గాలి, నీరు, భూమి, వాతావరణం మొత్తం వేడెక్కుతుందని అనేక జబ్బులు వస్తాయని, వ్యవసాయం కుంటుపడుతుందని తద్వారా ఆహార ధాన్యాల కొరత ఏర్పడు తుందని మత్స్య ఐక్యవేదిక ఏర్పడి ప్రజలు పర్యావరణ సమితి, తీర ప్రాంత మత్స్యకార ఐక్యవేదిక వాటి తీరుతెన్నులను ప్రజల ముందర ఎండగట్టారు.
తరువాత క్రమంలో సోంపేటలో ఉన్న లోకనాధేశ్వర కళాపీ సంఘం ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ సమితికి మద్దతుగా పవర్ ప్లాంటుకు వ్యతిరేకంగా బందు పిలుపు ఇవ్వడం జరిగినది. అప్పుడు ఈ ప్రాంత మేధావి వర్గం, డాక్టర్లు, అడ్వకేట్సు, తాపీ మేస్త్రీల సంఘంవారు, ఉపాధ్యాయులు, వ్యాపార వేత్తలు, స్వచ్ఛంద సంస్థలు వారంతట వారు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఈ జరుగుతున్న దానిపై చర్చించుకొని పరవాడ, తాల్చేర్ ప్లాంటులు చూసి వచ్చి అపుడు పర్యావరణ పరిరక్షణ సమితికి మద్దతు తెలపడం జరిగింది. అప్పటినుండి పర్యావరణ పరిరక్షణ సంఘంగా మార్పు చెందింది. సంఘ అధ్యక్షులు డా. క్రిష్టమూర్తి ముందుగా ఒక డాక్టరుగా ప్రజారోగ్యానికి, పర్యావరణానికి ప్రాధాన్యత యిచ్చి ఈ ఉద్యమాల్లో పాల్గొన్నారు. ప్రజల జీవించే హక్కులకే భంగం ఏర్పడుతుందని గ్రహించి ప్రజాపోరాటానికి ఇతర సంఘాలను కలుపుకుని ఇక్కడ మెకానిక్ ఇంజనీర్ చదువుకొని ఈ ప్రాంతంలోనే విద్యాసంస్థలు నడుపుతున్న సంఘ ఉపాధ్యక్షులు రామారావు పోరాటంలో చేరి ముందుకు సాగుతున్నారు. ఈ ఉద్యమ ప్రాంతంలోకి అన్ని అస్తిత్వ వర్గాల వృత్తుల యూనియన్లు భాగస్వామ్యంలో సంఘం మరింతగా బలపడింది.
ఉద్యమ నేపధ్యం :
పోలీసు, రెవెన్యూ శాఖలు నయానో కొంతమంది దగ్గర భూమిని యిక్కడ కూడా ప్రజల నుంచి బలవంతంగా లాక్కొవడం జరిగింది. కానీ పోరాటాలకు మారు పేరైన శ్రీకాకుళం సోంపేట వాస్తవ్యులు తమపట్ల జరిగిన మోసాన్ని త్వరితగతినే గ్రహించారు. అందుకే గ్రామ గ్రామాన ప్రజలు ధర్మల్ విద్యుత్ ప్రాజెక్టును మనసా వాచా ప్రతిఘటించారు. అవసరమైతే తమ ప్రాణాన్ని ఓడైకడనా నిలువరిస్తామని శపథం చేసారు. తమ భూములలోకి వచ్చే వారికి మొదట నుంచి అడ్డుకోవడానికి ప్రయత్నించారు. గ్రామ గ్రామాన వీధి వీధినా సభలు పెట్టుకున్నారు. అభివృద్ధే ప్రధానమని అధికార కాగ్రెస్‌పార్టీ స్పష్టంగా ప్రకటించింది. పరిశ్రమను అడ్డుకునే ప్రయత్నాలకు ఎవరూ సహకరించవద్దని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ముందుగానే కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు నిచ్చారు. సోంపేటలో ఎన్నో దశాబ్దాల అనుబంధం గల సర్దార్ గౌతు లచ్చన్న కుమారుడు మాజీ మంత్రి గౌతు శివాజీ కూడా బహిరంగంగా ఈ పరిశ్రమకు మద్దతునిచ్చాడు.
స్థానిక పరిస్థితుల వలన కొందరు కాంగ్రెస్ శ్రేణులు ఉద్యమంలో పాల్గొన్నా ప్రజలకు వారి స్టాండు తెలుసు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల సీనియర్ నాయకులు ఒకటి రెండు సార్లు వచ్చి బహిరంగ సభల్లో ఉద్యమానికి మద్దతు ప్రకటించినా మమేకం కాలేకపోయారు. ఇక సి.పి.యం. ప్రభుత్వం నందిగ్రాంలో పారించిన రక్తపుటేర్లు వారి కళ్ళ ముందు కదులుతూనే ఉన్నాయి. ప్రజారాజ్యం పార్టీ సీనియర్ నాయకులు ఒకటి రెండు సార్లు వేదికలపై ఉపన్యాసాలు యివ్వడం తప్ప ఉద్యమంలో కొనసాగిన దాఖలాలు లేవు. శ్రీకాళం జిల్లా ఏకైక శాసన సభ్యుడైన పి. సాయిరాజ్ స్థానికులకు దూరమైపోతాననే భావనతో మద్దతు ప్రకటించినా, దాదాపు 194 రోజుల పాటు ఉద్యమంలో భాగస్వామిగా కన్పిస్తూ కుంటి సాకులతో ఉద్యమాన్ని చీల్చి స్థానిక తెలుగు దేశం నాయకులు ఉద్యమ కారులకు షాకిచ్చారు. అయినా రాజకీయ పార్టీల నిజాయితీ, నిబద్ధత, చిత్తశుద్ధి పట్ల ప్రజలకు వుండే సందేహాలు ప్రజలకున్నాయి.
గత ఏడాది ఆగష్టు 8న మానవ హక్కుల వేదిక బాలగోపాల్ తదితర నాయకులు పాదయాత్ర నిర్వహించి ఉద్యమానికి మద్దతు తెలిపారు. అదే నెల 18న గొల్లగండిలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో దాదాపు అందరూ పరిశ్రమను వ్యతిరేకించారు. ఆగష్టు 29న ముఖ్యమంత్రిగారిని, తెలుగు దేశం పార్టీ నేత చంద్రబాబుగారిని పి.ఆర్.పి. నేత చిరంజీవిని, సి.పి.ఐ నేత నారాయణను, లోక్‌సత్తా నేత జయప్రకాష్ నారాయణని కలిసి ఉద్యమకారులు వినతి పత్రాలను ఇచ్చారు. అదే రోజు మానవ హక్కుల కమీషన్ ఛైర్మన్ శ్రీ సుభాషణ్ రెడ్డి గారిని కూడా కలిసి సదరు మహజరు ఇవ్వడమైనది. రైల్‌రోకోలతో మొదలై డిసెంబరు 5న పదిమందితో రిలే నిరాహార దీక్ష శిబిరం ప్రారంభించడం జరిగింది. కాల్పులు సంఘటన జరిగే నాటికి అనేక గ్రామాల నుంచి స్త్రీలు పాల్గొని 222 రోజులు పూర్తి చేసారు. గత జనవరిలో ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులు మమతా బెనర్జీ, జైపాల్ రెడ్డిలను కలిసారు. సోనియా, రాహుల్ గాంధీ, మన్‌మోహన్‌లకు వినతి పత్రాలు సమర్పించారు. ఫిబ్రవరిలో జాయింట్ కలెక్టర్ పర్యటనను అడ్డుకుని అదే నెల 25న భారీ ఎత్తున ప్రజాగర్జన సభ ఏర్పాటు చేసారు. ఏప్రిల్‌లో రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, ప్రముఖ పర్యావరణ వేత్త సందీప్ పాండే ఈ ప్రాంతాన్ని సందర్శించారు. జూన్ 21న నర్మదా బచావో ఉద్యమ సారధి మేధా పాట్కర్ ఈ ప్రదేశానికి వచ్చి వీరి ఉద్యమానికి మద్దతు పలికారు. యిప్పటికీ ఉద్యమకారులపై 25 కేసులు తాజాగా కాల్పులు సందర్భంగా హత్యానేరారోపణలపై కేసులు బనాయించారు. వాటిలో 10 నాన్ బెయిల్‌బుల్ కేసులు, ఆరుగురిపై రౌడీ షీట్‌కేసులు తెరిచారు. యస్.సి, యస్.టి కేసును సంఘ ప్రధాన కార్యదర్శిపై మోపారు. కానీ ప్రజల మనోభావాలను గుర్తించలేదు సరికదా చివరకు జూలై 14న పిట్టల్ని కాల్చినట్టు కాల్చారు.
సోంపేట ప్రజల్ని పిట్టల్ని కాల్చినట్లు కాల్చాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ప్రపంచీకరణ, ప్రయివేటీకరణ విధానాల అమలు ఈ దుర్మార్గానికి మూలం.
రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం ప్రపంచ వ్యాప్తంగా జాతీయోద్యమాలు ఉవ్వెత్తున లేచి సామ్రాజ్యవాదుల విస్తృత కాంక్షను వెనక్కి తిప్పి కొట్టారు. పాత పద్ధతులలో తమ ప్రభావాన్ని కొనసాగించలేమని అబివృద్ధి చెందిన దేశాలు గుర్తించాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలోని పాలక వర్గాలను బుట్టలో వేసుకొని వారి ద్వారా తమ దేశంలోకి పెట్టుబడిదారులు, బహుళ జాతి సంస్థల ప్రయోజనాలను కాపాడటానికి నడుం బిగించారు. ఆయా దేశాలలో పెట్టుబడులు పెట్టి ఆ దేశ సహజ వనరులను ఉపయోగించుకొని పరిశ్రమలు స్థాపించి లాభాలను తమ దేశాలకు తరలించుకు పోవడం జరుగుతుంది. అందుకు స్థానిక దళారీ సంస్థల సహాయం కోరడం జరుగుతుంది.
మానవ జీవితానికి సంబంధించిన ప్రతి విషయం ఇక్కడ వినియోగ వస్తువుగానే పరిగణించబడుతుంది. అందుకే మనకు కావల్సినంత విద్యుత్ ఉత్పత్తి ఉన్నప్పటికీ దాని పేరిట లాభాలను కొల్లగొట్టాలని ప్రయత్నిస్తున్నారు. సోంపేట మీద కూడా ఆ ప్రపంచీకరణ రాబందు నీడ పడింది. అందుకే ప్రజల ప్రాణాలను అంత సులభంగా తీయగలిగారు.
ఈ పాశవిక ఘటనకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగానూ ప్రజా సంఘాలు ప్రజల పక్షాన నిలబడ్డారు. ప్రతి జిల్లాలోనూ సంఘటనలకు ఖండిస్తూ మత్స్యకారులు, రైతు సంఘాలు, ప్రజాస్వామ్య వాదులు ధర్నాలు, మౌన ప్రదర్శనలు, కలక్టరేటు ముట్టడిలతో తమ నిరసనను తెలియజేసారు. మానవ హక్కుల వేదిక, సాంప్రదాయ మత్స్యకారుల సమితి, ఇండియన్ పీపుల్స్ లాయర్స్, పర్యావరణ పరిరక్షణ సంఘం, ప్రజా ఉద్యమాల జాతీయ సమాఖ్య మానవ హక్కుల కమీషన్‌కు న్యాయవాది హేమా వెంకట్రావు ద్వారా పిటీషన్లు దాఖలు చేసారు. తక్షణమే పోలీసులను ఉపసంహ రించాలని, ఉద్యమకారుల ప్రాణాలకు పోలీసుల నుండి, కంపెనీ యాజమాన్యం నుండి రక్షణ కల్పించాలని నాగార్జున కనస్ట్రక్షన్ కంపెనీకి చట్టవ్యతిరేకంగా మద్దతునిచ్చి ప్రజల ప్రాణాలను హరించిన వారిపై న్యాయ విచారణ జరిపించాలని, జరిగిన సంఘటనలపై కమీషన్ ఆధ్వర్యంలో కమీషన్ ఏర్పాటును లేదా హైకోర్టు సిట్టింగు జడ్జితో విచారణ ఆదేశించాలని, కంపెనీ యాజమాన్యపు గుండాలు ప్రజల్ని భయ భ్రాంతుల్ని చేస్తుంటే ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టిికి తెచ్చినా స్పందించని కలెక్టరుపై చర్య తీసుకోవాలని, ముఖ్యంగా ”అశోక్ కుమార్, నవీన్ కుమార్” ఎస్త్సెలు ప్రజలకు సినిమా చూపిస్తామని అడ్డుకుంటే ప్రాణాలు తీస్తామని బహిరంగంగా ప్రకటించినందుకు తక్షణమే వారిని సస్పెండు చేయాలని, ఉద్యమ కారులపై ఆక్రమంగా బనాయించిన కేసులను ఎత్తివేయాలని, హత్య, లూటీ, దాడి, స్త్రీలపై అత్యాచార ప్రయత్నం, ఇతరుల భూములలోకి అనుమతి లేకుండా ప్రవేశించడంపై పోలీసులపై, గూండాలపై సంబంధింత ఐ.పి.సి సెక్షన్ క్రింద కేసులు పెట్టి అరెస్టు చేయాలని, వారిని విధులనుండి బహిష్కరించాలని కోరారు. ముఖ్యంగా మహిళా నాయకురాలు అయిన జ్ఞానేశ్వరిని బహిరంగంగా బట్టలు ఊడదీసి అవమాన పరిచినందుకు, మౌర్య ఆసుపత్రిలో, శిబిరంలో స్త్రీలపై జరిగిన దాడులకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. దీనికి కొంత అనుకూలంగా స్పందించిన మానవ హక్కుల కమీషన్ ఉద్యమ కారులను బెదిరింపులకు గురిచేయవద్దని, ఎలాంటి హాని తలపెట్టవద్దని తక్షణమే వైద్య సహాయం అందించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి మానవ హక్కుల కమీషన్ ఎక్స్‌గ్రేషియాకై ఆదేశిస్తామని తెలిపినా అలాంటిదేమీ వద్దని న్యాయవాది ద్వారా హక్కుల కమీషన్‌కు తెలిపారు. అలాగే మేథాపాట్కర్, మిగతా మేధావులు తమ ప్రాంతానికి వచ్చినా ఎట్టి పరిస్థితులలోను పునరావాసం కొరకు ప్రస్తావించవద్దని ఉద్యమ కారులు కోరారు. ఆ సంఘటనా స్థలానికి వెళ్ళి నిజా నిజాలను కమీషన్‌కు తెలియచేస్తామన్న న్యాయవాది ప్రతిపాదనను మానవ హక్కుల కమీషన్ ఆమోదించింది.
సమత అనే స్వచ్ఛంద సంస్థ పర్యావరణ అప్పిలేటు కమీషన్‌కు పిటీషన్ దాఖలు చేయగా కంపెనీ యాజమాన్యం వాస్తవాలను తప్పుదోవ పట్టించింది. కాబట్టి పూర్తి అధ్యయనం తరువాతే అనుమతుల్విడం జరుగతుందని వారు ఆదేశించారు. ఇవన్నీ కొంతమేరకు ప్రజలు సాధించిన విజయాలే.
కానీ ధర్మల్ ప్లాంటు ఆగిపోయేంతవరకు విశ్రమించకూడదని పట్టుదలతో ఉన్నారు. అంతేకాకుండా పరిశ్రమను ఆపడమే కాదు. ఇప్పటివరకు ఆక్రమంగా బెదిరించి, మోసగించి తమ వద్దనుండి లాక్కున్న భూములను డీ-నోటిఫై చెయ్యాలని, డిమాండు చేస్తున్నారు.
గత రెండు సంవత్సరాలుగా నిరవధికంగా రిలే నిరాహార దీక్షలు ధర్నాలు, బందులు, ప్రజల్ని చైతన్య పర్చడం, అన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాడే ప్రజలందరిని కూడగట్టడం, కుళ్ళు రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మించి 3000 మంది పోలీసులు, మరో వెయ్యి మంది గుండాల ప్రయివేటు సైన్యానికి ఎదురు నిల్చి ఉద్యమ స్ఫూర్తిని నిలబెట్టడంలో సోంపేట, దాని చుట్టూ ఉన్న 84 గ్రామాల ప్రజలు ముఖ్యంగా మహిళలు ప్రదర్శించిన తెగువ అన్ని ప్రజా పోరాటాలకు ఆదర్శం అనుటలో అతిశయోక్తి లేదు. అందుకే ఇప్పుడు సోంపేట శ్రీకాకుళ పోరాట బావుటా.
(రచయిత్రి సోంపేట ఉద్యమ సంఘాల న్యాయవాదిని) ఫోటోలు పంపిన ప్రశాంతి ఉప్పలపాటి, రాకేష్‌రెడ్డి దుబ్బుడుకి ధన్యవాదాలు.)
వీర గున్నమ్మ దారిలో…
స్త్రీవాదం అంటే మనం, మన కుటుంబం అనే చట్రాలను దాటుకొని వాటికి మూలాలైన సామాజిక, ఆర్థిక, రాజకీయ, వ్యవస్థల మార్పుకై నడుం బిగించి సెజ్‌లకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న మహిళలెందరో. ”కాకినాడ” రాములమ్మ ”పోలేపల్లి” చుక్కమ్మ ”జిందాల్” దేవుడమ్మ, ”మహాముంబాయి” ఉల్కా మహాజన్, ”మంగుళూరు” విద్యా నటేషన్..వీరిలో కొందరు మాత్రమే!!
సోంపేట ప్రాంతానికి చెంది, 1940 సం. లో జమీందారీ వ్యతిరేక పోరాటంలో అమరురాలైన వీర గున్నమ్మ స్ఫూర్తిని ఎత్తిపడుతూ సోంపేట మహిళలు వీరోచితంగా తిరగబడ్డారు. ఇక్కడ స్త్రీలంతా శ్రామిక వర్గానికి చెందిన వారే. మత్స్యకార కుటుంబాలకు చెందిన స్త్రీలు, మగవారు వేటచేసి రాగా చేపలను ఆరబెట్టి, గ్రేడింగు చేసి, అమ్మకాలు చేసేవారు. మిగిలిన కులాలకు చెందిన వారు రైతు కూలీలుగాను, తమకున్న కొంత భూమిని సాగు చేసుకుంటూనే, కుల వృత్తులు చేసుకుంటూ ఉపాధిని పొందుతూ కొంత మేర ఆర్ధికంగా నిలబడ్డావారే. అందుకే ఇతర సెజ్‌లలోలాగానే ఇక్కడ స్త్రీలు కూడా థర్మల్ విద్యుత్ ప్లాంటు యాజమాన్యపు మాటలు నమ్మి ఉపాధిని పోగొట్టుకోదల్చలేదు. ఉద్యోగం పురుష లక్షణం అని నమ్మే సమాజంలో ఎలాంటి ఉపాధి కంపెనీ నుండి దొరుకుతుందో వారికి తెలుసు. అందుకే ససేమిరా అన్నారు. ప్రభుత్వ స్వయం సహాయ బృందాలకు చెందిన మహిళలు ఉద్యమంలో పాల్గొనకూడదని ప్రభుత్వం పరోక్షంగా హెచ్చరించినా సంక్షేమ పధకాలు నిలిపివేస్తామని బెదిరించినా పోరులో ముందు భాగాన ఉన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రాజెక్టులు మాకొద్దు, మా సహజ వవనరుల్ని ఆక్రమించవద్దని ఆక్రందనలు చేసారు. పాద యాత్రలు, ప్రజాభిప్రాయ సేకరణ, సమావేశాలలో ఒకటిగా ఉద్యమించి భాగస్వామ్యమయ్యారు. గురి చూసి కాలుస్తున్న పోలీసుల్ని బ్రతిమిలాడారు. ప్రాధేయపడ్డారు. వారికి ఎదురు నిలిచి తమను గురి పెట్టమన్నారు. ధర్మల్ పవర్ ప్లాంటుకు వ్యతిరేకంగా మహిళలు పెద్ద ఎత్తున కదిలారు.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
భూ మికకు అభి వందనము, మీవ్యాసము అక్ష్రర సత్యము.స్రి కాకుళ్మ జిల్లా సర్వనాసనమ చెసెందుకు రజకీయ నయకులు
ఉద్దెసించినారు,అందువలన. అందరు చెయూతనివ్వలి