అల్లిగూడెం నుండి వచ్చిన రాములమ్మ రెండో తరగతి చదివి మానేసి వ్యవసాయం చేసేది. తల్లిదండ్రులు చదివించడానికి అంగీకరించ లేదు. లిడ్స్‌లో చేరి చదువు కొనసాగిస్తోంది. ఆటలంటే ఇష్టమని చెప్పింది. నేషనల్ కబాడీ పోటీలకు చత్తీస్‌గడ్ వెళ్ళింది.జాతీయ స్థాయిలో ఆడింది రాములమ్మ.
కాటుకపల్లి నుండి వచ్చిన కామేశ్వరరావు పదవ తరగతి చదువుతున్నాడు. డాక్టర్ అయ్యి ఊళ్ళో సేవ చెయ్యాలని ఆశయం.
మొండిగుంట నుండి వచ్చిన రాజు ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. చిన్నప్పుడే తండ్రి చనిపోతే, తల్లి తో పాటు కూలి పనికి వెళ్ళి పశువులు కాసేవాడు. తోటి పిల్లల్ని చూసి చదువుకోవాలన్న కోరికతో ‘లిడ్స్’లో చేరాడు.గోలగట్టనుండి వచ్చిన కృష్ణ తల్లిదండ్రులు కూలి పని చేసేవారు. స్కూలుకి పంపితే బడి ఎగ్గొట్టి ఆటలు ఆడేవాడు. పశువులు కాసేవాడు. ఎరవో చెబితే ఈ స్కూల్‌లో చేరాడు. చదువు విలువ తెలిసింది. ఏడవ తరగతిలో స్కూలు ఫస్ట్ వచ్చాడు. డాక్టరయ్యి గిరిజన ప్రాంతాల్లోనే సేవ చెయ్యాలని అతని కోరిక.
పాలగూడెం నుంచి వచ్చిన రాజమ్మా అంతే. తల్లితండ్రులు వ్యవసాయ కూలీలు. ఏడుసంవత్సరాలలో పది పాసయ్యి నర్సింగ్ చేసింది.
వినాయక పూర్ నుండి వచ్చిన రాజేష్ తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. అయిదవ తరగతి వరకు చదివి మానేసాడు. పశువులు కాసేవాడు. తల్లిదండ్రులు వ్యవసాయకూలీలు. ఇంజనీరు అవ్వాలని ఇతని కోరిక.
అల్లిగూడెం నుంచి వచ్చిన జానకి ఏడు సంవత్సరాలలో పదో తరగతి పాసయి ఖమ్మంలో నర్సింగ్ కోర్సు చదువుతోంది. ప్రజాసేవ చెయ్యాలన్న కోరిక వెలిబుచ్చింది.
తునికి చెరువు నుంచి వచ్చిన దారయ్య ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. పోలీసు అయ్యి పల్లెటూరిలో జరిగే అన్యాయం అరికట్టాలని అతని కోరిక.
బొడ్రాయిగూడెం నుండి వచ్చిన సీత తొమ్మిదవ తరగతి చదువుతోంది. తల్లికి ఆరోగ్యం బాగా లేకపోతే నువ్వెలా చదువుకుంటావని అన్న తండ్రిని ఎదిరించి చదువుకుంటోంది. వాళ్ళ ఊళ్ళో చదువుకున్నవారు లేరని, టీచరయ్యి అందరికీ చదువుచెప్పాలని, చుట్టుపక్కల జరిగేవి అందరికీ తెలియచెయ్యాలని, అందరిలో విజ్ఞానం పెంచాలని ఆమె ఆశయం.
రామన్నపాలెం నుండి వచ్చిన శ్రీను పదవ తరగతి చదువుతున్నాడు. చిన్నప్పుడే అమ్మానాన్నలు చనిపోతే పశువులు కాసి జీవించాడు. ఏడవ తరగతిలో స్కూలు ఫస్టు వచ్చాడు. చదువుకోవాలన్న కోరికతో ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వచ్చేసి లిడ్స్‌లో జాయినయ్యాడు. బంధువులు వచ్చి అడిగినా తిరిగి రానని చెప్పాడు. టీచర్ అయ్యి ఎక్కడైనా తనలాంటి పిల్లలకి చదువు చెప్పాలని తన కోరిక అని చెప్పాడు.
తునికి చెరువు నుండి వచ్చిన అంజలి అయిదవ తరగతి చదువుతోంది. తల్లితండ్రులు నిరక్షరాస్యులు. మిషన్ నేర్చుకుంటూ పనికి వెళ్ళేది. ఊర్లో ఎవరో చెబితే ఈ సంస్థలో జాయినయ్యింది. డాక్టర్ చదవాలని ఈ అమ్మాయి కోరిక.
వినాయకపురం నుండి వచ్చిన రాధ తొమ్మిదవ తరగతి చదువుతోంది. ఆరో తరగతి వరకూ చదివి మానేసి పనికి వెళ్ళేది. ‘లిడ్స్’ గురించి తెలుసుకుని ఇక్కడికి వచ్చి చదువు కొనసాగిస్తోంది. ‘టీచర్’ కాని ‘నర్స్’ కాని అవ్వాలని వుందని, సొంత ఊరిలో సేవ చెయ్యాలని ఉందని చెప్పింది. బాల్య వివాహలు వద్దని ఖచ్చితమైన అభిప్రాయం వెలిబుచ్చింది.
ఇక్కడి టీచర్స్ కూడా ఎంతో అంకిత భావంతో పనిచేస్తున్నారు. వరరామపురం నుండి వచ్చిన కల్పనారావు అనే టీచర్ ఇక్కడ పని బావుందని, తనలోని కోపం, దురుసుదనం పోయి సహనం పెరిగిందని చెప్పారు. చిత్తూరు నుండి వచ్చిన జగ్గయ్య హిందీ మాస్టారు. రెండు సంవత్సరాలుగా ఇక్కడి పిల్లలకి హిందీ నేర్పిస్తున్నారు. ఏడు సంవత్సరాల క్రితం డ్రామా వేయడానికి వచ్చిన జయమణి ఇక్కడే వుండి పోయారు. లక్ష్మి అక్షరం కూడా రాని పిల్లలకి అన్నీ నేర్పి అయిదవ తరగతికి పంపిస్తారు. ఇకపోతే పి.టి సార్ బి. వి. రామకృష్ణ మాటల్లో ఇక్కడకి వచ్చాక తనలోని ప్రతిభ అందరికీ ఉపయోగపడుతున్నందుకు సంతోషమని, చిన్నప్పుడు తను బడి మానేసి ఎలా కష్టాలు పడిందీ పిల్లల్తో చెప్పి వారిలో మార్పుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. స్టేట్ కాంపిటేషన్‌కి వెళ్ళినప్పుడు మిగతా వారికి ఇక్కడి వారికి ముఖ్యమైన తేడా గమనించి, ఇక్కడి పిల్లల్లో సహజశక్తి ఎక్కువని గ్రహించి, బాగా ట్రైనింగ్ ఇచ్చి నేషనల్స్ పంపించారు.
(ఇంటర్వ్యూ సేకరణ: పంతం సుజాత, కె.సత్యవతి, సమతారోష్ని)