– కె. సత్యవతి
లయోలా ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ సొసైటీ చింతూరు మండలం కాటుక పల్లి వారి తరఫున వారు జరుపబోయే అంతర్జాతీయ మహిళాదినం సమావేశంలో పాల్గొన వలసిందిగా ఆహ్వానించ డానికి మోహన చంద్రగారు నా దగ్గరికి వచ్చినపుడు నేను కొంత తటపటాయించాను. అయితే ఈ సమావేశం దట్టమైన అడవిలో రెండు వేలమంది పైగా గిరిజన స్త్రీలతో జరుగుతుందని ఆయన చెప్పగానే నేను వెంటనే ఒప్పేసుకున్నాను. నాతో పాటు డాక్టర్ సమత రోష్ని, పంతం సుజాత, భూమికలో పనిచేసే లక్ష్మి కూడా బయలు దేరారు.
పన్నెండున మేం నలుగురం మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి ఉదయం ఐదింటికి భద్రాచలం రోడ్‌లో దిగాం. మోహనచంద్ర కూడ మాతో వున్నారు. స్టేషన్‌లో మా కోసం క్వాలిస్ సిద్ధంగా వుంది. మేం అయిదుగురం ఎక్కగానే మా వాహనం భద్రాచలం వేపు బయలు దేరింది. కొత్త గూడెం నుండి భద్రాచలం దాదాపు నలభై కిలోమీటర్లుంది. అపుడపుడే తెల తెల వారుతోంది. చెట్లన్నీ మంచు ముసుగే సుకుని వున్నాయి. చల్లటి గాలి హాయిగా ఒళ్ళంతా నిమురుతోంది. పాల్వంచ, వెంటనే కిన్నెరసాని వాగు దాటాం. భద్రాచలంలో పెట్రోలు బంకు దగ్గర ఆయిల్ కోసం ఆగినపుడు ఆ బంకు యజమాని మమ్మల్ని వాళ్ళింటిలోకి ఆహ్వానించారు. మేం బ్రష్‌్ చేసేసుకుని, కాలకృత్యాల కార్యక్రమం పూర్తి చేసేసాం. పెట్రోలు బంకు చుట్టూ రాశులు పోసిన, ఎర్రటి తివాసీలా ఆరబెట్టిన ఎండుమిర్చి మా కళ్ళను కట్టి పడేసింది. గొంతులో గరగర మంటుంటే కొంచెం తులసి ఆకు కోసుకోవచ్చా అని ఇంటావిడను అడిగినపుడు స్నానాలు కాలేదుగా తెంపొద్దు అని మర్యాదగా చెప్పింది. ఆవిడ మాటల్ని మన్నించి, చెట్టు మీద చెయ్యి వేయకుండా బుద్ధిగా వచ్చి మా బండిలో కూర్చున్నాం. మళ్ళీ మా ప్రయాణం మొదలైంది. తూరుపు దిక్కు ఎర్రబారుతోంది. మేం తిన్నగా తూర్పువేపే వెళుతున్నాం. మహాద్భుతమైన దృశ్యం మా కంటబడింది. ఎర్రటి సూర్యబింబం రోడ్డుకు ఆ చివర మమ్మల్ని రా రామ్మని పిలుస్తూ మాకు దారి చూపిస్తూ మా ముందు పరుగులు తీస్తోంది. తిన్నటి ఆ రోడ్డు మీద మేం కన్నార్పకుండా బింబం వెంట పడి వెర్రి పరుగులు తీసాం. మాకు దిశానిర్దేశం చేస్తూ, దారి చూపిస్తున్న ఆ ఎర్రదనానికి ముగ్ధులమౌతుండగానే దారికిటూ, అటూ విస్తరించిన అడవి, ఆ అడవిలో సూర్యుడి ఎర్రదనంతో పోటీ పడుతూ, ఆకు కూడా కన్పించని మోదుగు పూల రాశులు. అడవి తగలబడుతున్నదా అన్నంత భ్రాంతికి లోను చేసిన మోదుగ చెట్ల నిండా, నిలువల్లా విచ్చుకున్న ఎర్రటి, కాషాయపు రంగు పూలు. మేం ఈ తన్మయత్వంలో మునిగి ఉండగానే మా వాహనం కాటుకపల్లిలో లిడ్స్ ఆఫీసు ముందు ఆగింది. ఫాదర్, నర్సులు, సిబ్బంది మమ్మల్ని ఆహ్వానించారు. విరగబూసిన వేప చెట్లు, చిరు చేదు వాసనలు వెదజల్లుతున్నాయి. ఆ చెట్ల కింద కూర్చుని చాలా మంది పిల్లలు అల్పాహారం ఆరగిస్తున్నారు. నర్సులుండే గదులకెళ్ళి మేం స్నానాదులు పూర్తి చేసి టిఫిన్ తిన్నాం.
మా కోసం పిల్లలు ఎదురు చూస్తున్నారని, మీటింగ్ మొదలవ్వడానికి ఇంకో రెండు గంటలు పడుతుందని చెప్పారు. బాల కార్మికులుగా వుంటూ మొదటి సారి చదువుకుంటున్న ఆడపిల్లలు, మగపిల్లలు ఒక తరగతి గదిలో కూర్చుని వున్నారు. రెండు గంటల పాటు వాళ్ళతో మా సంభాషణ కొనసాగింది. ఒక్కొక్కరిది ఒక్కో వ్యధాపూరిత గాథ. దట్టమైన అడవి లోపలి వాళ్ళ జీవన చిత్రాల్ని ఒకొరి తర్వాత మరొకరు మా ముందు ఆవిష్కరించారు. ఎంతో స్పష్టంగా, స్వచ్ఛంగా మాట్లాడారు. ఆ పిల్లలు తమ బతుకుల్లోని దుఃఖాన్ని విప్పి చెబుతున్నపుడు మా కళ్ళు తడిసిపోయాయి. అరకపట్టి పోడు వ్యవసాయం చేసిన పదేళ్ళ పిల్లవాడి అనుభవం మా గుండెల్ని పిండేసింది. వాళ్ళ ఆశలు, ఆకాంక్షలు, భవిష్యత్ ప్రణాళికలు, జీవితంపట్ల వాళ్ళ ఆశావహదృక్పథం మమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసాయి. మా సంభాషణలు ముగింపుకొస్తున్నపుడు ఒక పిల్ల చటుక్కున లేచి నిలబడి, ముత్యాల్లాంటి తన పలువరుస మెరిసిపోతుండగా (అన్నట్లు మర్చిపోయాను మాతో మాట్లాడిన పిల్లలందరి పలువరుసలు మల్లెపువ్వంత తెల్లగా వుండి, సెలయేరంత స్వచ్ఛమైన నవ్వుతో మెరిసిపోయాయి. బుగ్గలు సొట్టలు పడి ముసి ముసి నవ్వుల్ని పూయిస్తున్నపుడు నేను ఆ మాట వాళ్ళకి చెబితే ఎంత సంబరంగా నవ్వారో!!) “మా జీవిత కథలు విన్నారుగా మేడం! మీరు మా కోసం ఏం చెయ్యగలరు?” అని సూటిగా వేసిన ప్రశ్న మా గుండెల్ని తాకింది. మీ గురించి పత్రికలో రాసి మీ సమస్యల గురించి అందరికీ తెలిసేలా చేస్తామని మేం పేలవమైన సమాధానం చెప్పాం. అంతకన్నా ఇంకేం చెప్పలేకపోయాం! ఆ తర్వాత డ్వాక్రా సంఘాల స్త్రీలతో మా సంభాషణ మొదలైంది. అయితే ఈ లోపే వేదిక మీద పాటలు మొదలై మా మాటలు ఒకరికొకరికి వినబడలేదు. మీటింగ్ అయ్యాక మాట్లాడుకుందాంలే అనుకుని, వాళ్ళతో కొంత సేపు నృత్యం చేసాం.అప్పటికే చాలామంది స్త్రీలు వచ్చారు.ఇంకా చాలామంది బయలుదేరి వస్తున్నారని, కొండలు దిగి, అడవి లోలోపలి నుండి వస్తున్నారని నిర్వహకులు చెప్పారు. ముఖ్యంగా కోయ, కొండరెడ్డి, గొత్తి కోయ, నాయక్ వర్గాలకు చెందిన స్త్రీలు వస్తారని చెప్పారు. ఒంటిగంటకి సభాస్థలి మొత్తం నిండి పోయింది. మోకాళ్ళ వరకు చీరకట్టి, పక్కకొప్పుల్లో పూలు పెట్టిన మహిళలతో ఆ ప్రాంతమంతా కళకళ లాడింది.
సభా కార్యక్రమం మొదలైంది. ఉపన్యాసాల వెల్లువ తక్కువగా వుండి సాంస్కృతిక కార్యక్రమాలు ఎక్కువగా వుండడం ఈ కార్యక్రమంలో విశేషం. సంప్రదాయ గిరిజన నృత్యాలు, లంబాడా నృత్యాలు, గుత్తి కోయ మహిళల నృత్యం ముఖ్య ఆకర్షణలుగా నిలిచాయి. వివిధ సామాజిక సమస్యల మీద పిల్లలు వేసిన నాటికలు ఎంతో స్ఫూర్తి దాయకంగా వున్నాయి. బాల కార్మిక వ్యవస్థ మీద, పిల్లల హక్కుల మీద, ఆడపిల్లలు, స్త్రీల అక్రమ రవాణా మీద, హెచ్‌ఐవి/ ఎయిడ్స్ మీద పిల్లలు అద్బుతమైన, నాటికలు ప్రదర్శించారు. వీటన్నింటిని వాళ్ళ స్వంత భాషలో ప్రదర్శించడంతో సభాస్థలి ముందు భాగంలో కూర్చున్న పిల్లలు, వెనుక కూర్చున్న మహిళలు ఎంతో బాగా స్పందించారు. మేము పిల్లల్ని అడిగి అనువాదం చేయించుకున్నాం. సమత, నేను చాలా క్లుప్తంగా ఆ మీటింగ్‌లో మాట్లాడాం.
వివిధ అంశాల మీద పిల్లలు ప్రదర్శించిన నాటికలు ఆయా సమస్యల పట్ల చాలా స్పష్టమైన వైఖరితో, సూటీగా వున్నాయి. అల్లగూడెం నుంచి వచ్చిన జానకి, మాధిగూడెం నుంచి వచ్చిన సావిత్రిలు తమ జీవిత కథనాలు విన్పించారు. నాలుగవు తుండగా సభ ముగింపుకొచ్చింది కాని గిరిజన స్త్రీలు ప్రధానంగా ఎదుర్కొంటున్న ఒక ముఖ్యమైన సమస్య గురించి ఎలాంటి ప్రస్తావనా లేకపోవడం మమ్మల్ని ఆశ్చర్య పరిచింది. మైదాన ప్రాంతాల నుంచి వచ్చే పురుషులు ప్రేమ పేరుతో గిరిజన స్త్రీలను వివాహాలు చేసుకుని పిల్లలు పుట్టగానే వదిలేసి వెళ్ళిపోవడం, అలా పుట్టిన పిల్లలు తమ తల్లి కులాన్ని కోల్పోవడం, తండ్రి అగ్రకులానికి చెందితే, వదిలేసి పోయినా సరే ఆ కులమే సంక్రమించడం, దీనివల్ల వారికెదురౌతున్న సమస్యల గురించి ఎలాంటి ప్రస్తావన లేకుండానే అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభ ముగిసింది.
ఆ తర్వాత మేం అక్కడ గిరిజన స్త్రీలు ప్రదర్శించిన వివిధ వస్తువుల్ని చూసాం. గిరిజనుల జీవితంలో భాగమైన ఎన్నో వస్తువుల్ని అక్కడ ప్రదర్శించారు. వాటన్నింటిలోకి మమ్మల్ని ముఖ్యంగా నన్ను ఓ వస్తువు విప రీతంగా ఆకర్షించింది. మొసలి కోరలంత పదునుగా వున్న ముళ్ళతో చేసిన ఓ లావుపాటి గాజు. అది చేతికి ధరించి, ఎవరైనా మన మీద దాడి చేస్తే ఒక్క దెబ్బ వేస్తే చాలు అంగుళం మేర శరీరంలోకి దిగిపోతాయి ముళ్ళు. రక్తాలు కారాల్సిందే. దానిని సంపాదించాలని నేను ఎన్నో ప్రయత్నాలు చేసాను. దానిని అమ్మడానికి గాని, ఇవ్వడానికిగానీ వారు అంగీకరించలేదు. దాని ఫోటో తీసుకుని తృప్తి పడి మా తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాం. అందరికీ వీడ్కొలు చెప్పి, అద్భుతమైన అనుభవాలను గుండెల్లో దాచుకుని ఐదుగంటలకి మేం భద్రాచలం వేపు బయలు దేరాం. మా రైలు రాత్రి పదిన్నరకి కాబట్టి మధ్యలో భద్రాచలం గుడి, పంచవటి, కిన్నెరసాని ప్రాజెక్టు చూడాలనుకున్నాం. పంచవటికి వెళ్ళి రావడం కష్టమని మా డ్రెవర్ భాస్కర్ చెప్పడంతో మేం కిన్నెరసాని ప్రాజెక్టు చూద్దామనుకున్నాం. భద్రాచలంలో గుడికి వెళ్ళాలనుకున్న వాళ్ళు గుడికెళ్ళారు. నేనూ, సమత గోదావరిని చూస్తూ నర్సాపురంలోని మా వశిష్ట గోదావరిని తలుచుకున్నాం. కిన్నెరసాని ప్రాజెక్టుకి వెళ్ళే ముందే అడవి మధ్యలో ఆగి బోలెడు మోదుగపూలు కోసుకున్నాం.
కిన్నెరసాని చేరేసరికి బాగా చీకటిపడి పోయింది. అదంతా దట్టమైన అడవి ప్రాంతం. గేటు మూసేసారు. వెళ్ళడానికి కుదరదన్నారు గేటు దగ్గర. మేం కాస్త బతిమాలి టికెట్టు పేరుతో యాభై సమర్పించాక మమ్మల్ని లోపలికి వదిలాడు. లోపలంతా నిర్మానుష్యం. కీచురాళ్ళ రొదలోంచి “ఎవరదీ ఈ టైమ్‌లో లోపలికెలా వచ్చారు. వెనక్కి వెళ్ళిపొండి “ అని అరిచారు. దూరంగా లైట్ల వెలుగులో డామ్ కన్పిస్తోంది. మేం మళ్ళీ లోపలి వాళ్ళని బతిమాలి డామ్ మీది కెళ్ళాం. ‘ఇది చాలా ప్రమాదకరమైన ప్రాంతం. ఇలాంటి అడ్వంచర్లు ఇంకెపుడూ చెయ్యకండి’ అని మమ్మల్ని హెచ్చరించి ఫోటోలు తీసుకోవడానికి ఒప్పుకున్నారు. ఆ చీకట్లో డామ్ మీద ఫోటోలు తీసుకుని బిక్కు బిక్కు మంటూ అక్కడ్నుంచి బయటపడ్డాం. వెలుతురులో చూడాల్సిన అద్భుత ప్రాంతమిది. సుదీర్ఘంగా విస్తరించిన రిజర్వాయర్, అందులో మునిగిన కొండ అస్పష్టంగా కన్పడ్డాయి. అంతకు కొద్ది రోజుల ముందు తగలబెట్టిన గెస్ట్‌హౌస్ కళావిహీనంగా, నల్లగా నిలిచి వుంది.
మేం కొత్త గూడెం చేరుకుని రైలెక్కడంతో మా అడవి ప్రయాణం ముగింపు కొచ్చింది. నగరంలో జరిగిన అనేక అంతర్జాతీయ మహిళాదినం సమావేశాలకు, ఈ దట్టమైన అడవిలో జరిగిన గిరిజన స్త్రీల సమావేశానికి ఎంతో వ్యత్యాసముంది. స్త్రీల నుండి, పిల్లల నుండి మేం ఎంతో నేర్చుకున్నాం. వారి సమస్యలను అవగాహన చేసుకునే వీలును ఈ సమావేశం కల్పించింది. ఈ అవకాశం మాకు కల్పించిన, గిరిజన స్త్రీల కోసం, పిల్లల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న లిడ్స్ వారికి కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో పాల్గొనమని ప్రోత్సహించిన ఆక్స్‌ఫామ్ గిరిజకి, మమ్మల్ని వెంటబెట్టుకు తీసుకెళ్ళిన మోహనచంద్ర గారికి మా కృతజ్ఞతలు. అడవి తల్లికీ దండాలో అంటూ అడవికి ప్రణమిల్లి, అడవి పుత్రికల చైతన్యాన్ని, పిల్లల స్ఫూర్తిదాయకమైన సంభాషణని మా గుండెల్లో భద్రపరుచుకుని మేం మహానగరంలో మళ్ళీ కాలుపెట్టాం.
చిక్కటి అడవి ప్రాంతంలో చక్కటి బడి వాతావరణం. వసంతకాలం ప్రారంభంకదా విరగబూసిన వేపచెట్లు మంచి సువాసనలతో మాకు స్వాగతం పలికాయి. ఫాదర్ డానియల్ సాదరంగా ఆహ్వానించారు. సిస్టర్స్ ప్రేమ పూర్వక ఆదరణ మరువలేనిది.
ఖమ్మం జిల్లా ‘చింతూరు’ మండలం ‘కాటుకపల్లి’లో ఏర్పాటయిన లిడ్స్ సంస్థ సంస్థ చేస్తున్న వివిధ కార్యక్రమాలు నిజంగా అభినందనీయం. ముఖ్యంగా బాలకార్మికులను ఆదరించి విద్య నేర్పించడం వారి మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం. ఆ విద్యార్ధులతో భూమిక మాట్లాడినపుడు అనేక ఆసక్తికర విషయాలు తెలిసాయి.
స్వచ్ఛమైన చిరునవ్వుని, కళ్ళల్లో అమాయకత్వాన్ని అంత నిజాయితీగా మనం ఎక్కడా చూడం. ఆ గిరిజనులందరి లోనూ ఒకే భావం.
చదువు విలువ తెలిసిన వారు, అందరికీ ఆ విషయం అర్ధమయ్యేలా చెప్పి పిల్లలందరినీ చదివించాలని, బాల్య వివాహ వ్యవస్థ రద్దు చేయాలని, ఆ వ్యవస్థపై స్పష్టమైన అవగాహన కలిగి, ఆ వ్యవస్థను సామూహికంగా వ్యతిరేకిస్తున్నారు. చక్కగా చదివి ఉద్యోగాలు సంపాదించి తమ తమ గ్రామాలకే వచ్చి సేవ చెయ్యాలని చెప్పారు.
మల్లెల గూడెం నుండి వచ్చిన లక్ష్మి తొమ్మిదవ తరగతి చదువుతోంది. మామిడి చెట్ట్టుపై కోయిలమ్మలా ‘వేణుమాధవా’ అంటూ కమ్మగా పాడింది. కళాకారులు కోచింగ్ సెంటర్స్‌లోంచే రానక్కర్లేదని ఆ అమ్మాయి గొంతు వింటే అర్థమవుతుంది. చిన్నప్పటి నుంచి చదువంటే ఇష్టం. ఏడవ తరగతిలో స్కూలు సెకండ్ వచ్చింది. లారీ ఆక్సిడెంట్‌లో తండ్రి మరణంతో చదువు ఆగిపోయింది. అమ్మమ్మ దగ్గర పని చేసుకుంటూ ఉండగా ‘లిడ్స్’ సంస్థ ఆ ఊర్లో నిర్వహించిన మీటింగకి హాజరై మళ్ళీ స్కూల్లో జాయినయ్యింది. జీవితంలో స్థిరపడి తల్లిని బాగా చూసుకోవాలని ఉందని చెప్పింది.
మాతిగూడెం నుంచి వచ్చిన సుజాత ఒక్క సంవత్సరంలో ఆరో తరగతి వరకు చదివింది. ఇంట్లో చెల్లిని, తమ్ముడ్ని చూడమని చెప్పి స్కూలు పంపేవారు కాదు. ఊహ తెలిసాక చదువుకుంటానంటే ‘ఈ వయసులో నీకు చదువేంట’ి అని హేళన చేసారు. అలా నవ్విన వారికి టీచర్ అయ్యి తనేమిటో నిరూపించు కోవాలని ఉందని కసిగా చెప్పింది.
ఇరవై సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాలకి వచ్చి స్థిరపడిన కుటుంబంలోంచి వచ్చిన మమత. చిన్నప్పుడు చదివినా ఇంటి పరిస్థితులు బాగాలేక మానేసింది. ఈ స్కూల్లో చేరి పదో తరగతి పూర్తి చేసింది. తన చదువు పదిమందికీ ఉపమోగపడా లని ఈమె కోరిక.
వెంకటాపూర్ నుండి వచ్చిన కోశయ్య నాలుగవ తరగతి చదువుతున్నాడు. రెండవ తరగతి చదివి మానేసి ఆ చిట్టి చేతులతో పశువులు కాసి, నీళ్లు మోసి, వ్యవసాయం చేసేవాడు. చదువు విలువ తెలిసి మళ్ళీ ప్రారంభించానని చెప్పాడు.
మద్దిగూడెం నుండి వచ్చిన సావిత్రి ఏడవ తరగతి చదువుతోంది. మూడవ క్లాస్ చదివి మానేసింది. తల్లిని తానే కనిపెట్టుకొని ఉండేది. లారీ ఏక్సిడెంట్‌లో కుడి చేతి వేళ్ళు పొగొట్టుకుంది. పట్టుదలతో ఇంకో చేతితో రాయడం నేర్చుకుంది. అంగన్‌వాడి సెంటర్‌లో అందరికీ చదువు చెప్పాలని కోరిక.
వియ్యాలపురం నుండి వచ్చిన సత్యనారాయణ పదవ తరగతి చదువుతున్నాడు. బాబాయి కొడుకుని చూసి చదువుకోవాలనిపించి ఇక్కడికి వచ్చాడు. చదివి ఎస్సై అవ్వాలని అతని కోరిక.
చిడుమూరు నుండి వచ్చిన కనక పదవవ తరగతి చదువుతోంది. మూడు సంవత్సరాల క్రితం చదువుకోవాలన్న కోరికతో పారిపోయి వచ్చింది. టీచరయ్యి అందరికీ చదువు చెప్పాలని, చెల్లెల్ని కూడా ఇక్కడే చదివిస్తోంది.
నర్సింగ్ పేట నుండి వచ్చిన కృష్ణ పదవ తరగతి చదువుతున్నాడు. ‘లాయర్’ చదవాలని అతని ఆశయం.
ఇరవై సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాలకి వచ్చి స్థిరపడిన కుటుంబంలోంచి వచ్చిన మమత. చిన్నప్పుడు చదివినా ఇంటి పరిస్థితులు బాగాలేక మానేసింది. ఈ స్కూల్లో చేరి పదో తరగతి పూర్తి చేసింది. తన చదువు పదిమందికీ ఉపమోగపడా లని ఈమె కోరిక.
చూరుకుంట నుంచి వచ్చిన చంద్రకళ తొమ్మిదవ తరగతి చదువుతోంది. కబాడీ లో స్టేట్ ప్లేయర్ నేషనల్ లెవల్‌కి వెళ్ళాలని ఆమె కోరిక.
చింతల చెరువు నుండి వచ్చిన పార్వతి అయిదవ తరగతి చదువుతోంది. తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. బాగా చదువుకొని టీచర్ అయ్యి అమ్మని బాగా చూసుకోవాలని ఉందని చెప్పింది.
నర్సింగ్ పేట నుండి వచ్చిన శ్రీదేవికి తల్లి లేదు. చెల్లిని,తమ్ముడ్ని చూడడానికి చదువు మాన్పించారు. బడికి వెళ్తానంటే పిన్ని కట్టేసి కొట్టేది. పెళ్ళిచెయ్యబోతే ఏడ్చి పారిపోయి ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు తొమ్మిదవ తరగతి చదువుతోంది. తోటివారి బాధల్ని పంచుకుంటూ, పెద్దల్ని గౌరవిస్తూ ఉండాలని, చదువులేకపోతే నూతిలో కప్పుల్లాగ ఉంటామని, అందుకే చదువుకోవాలని చెప్పింది. డాక్టరయ్యి తనలాంటి వాళ్ళకి హెల్ప్ చెయ్యాలని ఉంది అని చెప్పింది.