డా. రోష్ని
ఈ మధ్య మా స్నేహితురాలి కూతురు ఆడపిల్లను కన్నది, కాన్పయిన రెండో రోజు నుంచి బాలింత అదోరకంగా ఉండటం మొదలుపెట్టింది. సడన్‌గా ఏడ్వడం, విసుక్కోవడం, అలసిపోవడం, మూడీగా వుండడం. ఇదంతా చూసి బాలింత తల్లిదండ్రుల కంగారు. పైగా కాన్పయిందని, ఆడపిల్ల పుట్టిందని కబురు పంపినా చూడ్డానికి రాని అల్లుడు. ఆయనకి మగపిల్లోడ్ని కనలేదని అలకట. అందుకని చూడ్డానికి రాలేదట. ఇది మరీ బావుంది.
సరే బాలింత ఎందుకట్లా ఉంది? కారణాలు ఏమిటి? ఇది చాలా ప్రమాదకరమైందా? ఇది ఎలా తగ్గించుకోవాలి? ఇవి మన ముందున్న ప్రశ్నలు.
పై స్థితిని ‘పోస్ట్‌నాటల్ బ్లూస్’ అని ఇంగ్లీషులో అంటారు. దీన్ని తెలుగులో ‘బాలింత పడే బెంగ’ అందామా? కాన్పు అయ్యాక మూడు నుంచి పది రోజుల మధ్య వస్తుంది. ఇది చాలా సాధారణంగా వస్తుంది. 80% బాలింతల్లో కనిపిస్తుంది. ఉత్త పుణ్యానికే ఏడ్వడం, చిరాకు పడడం, అలసిపోవడం, ఆందోళన చెందడం, విచారంగా ఉండటం, వంటరితనం ఫీలవడం అనే లక్షణాలు కనబడతాయి.
దీనికి కారణాలు చాలా ఉన్నాయి. కాన్పు తర్వాత హార్మోన్ల సమతుల్యం సడెన్ గా మారిపోతుంది. పురిటినొప్పులు, పాలతో నిండిన రొమ్ములలో ఒక విధమై నొప్పి, తల్లిగా కొత్త బాధ్యతలు, నిద్ర సరిపడా ఉండకపోవడం ఇలా చాలా కారణాలున్నాయి.
ఈ పరిస్థితి కొద్ది రోజుల్లోనే నార్మల్‌గా అవుతుంది. వైద్యం ఏమీ అవసరం లేదు. ఈ స్థితిని అర్ధం చేసుకుని సానుభూతితో కుటుంబ సభ్యులు, స్నేహితులు వ్యవహరిస్తే చాలు. దానికదే మాయమవుతుంది. అలా తగ్గకుండా రెండు వారాలకంటే ఎక్కువ రోజులు పై చిహ్నాలు కనిపిస్తుంటే అప్పుడు వైద్యుల సలహాను ఆశ్రయించాలి. ఇది 10 మంది బాలింతల్లో ఒకరికి రావచ్చు. విచారంగా, డల్‌గా ఉండటం దీని చిహ్నాలు. కాని మనం అందరం ఏదో ఒక టైంలో విచారంగా, డల్‌గా వుంటాం.కాని చాలా త్వరగానే కోలుకొని మామూలు జీవితంలో పడిపోతాం. కాని బాలింతల కొచ్చే డిప్రెషన్‌లో ఈ చిహ్నాలు తీవ్రంగా ఉండి చాలా కాలం కొనసాగుతాయి. దైనందిన జీవితానికి నష్టం కలిగిస్తాయి. మనం చాలావరకు దీన్ని గుర్తించం.
ఈ క్రింది చిహ్నాల్లో అన్నీ లేక కొన్ని ఉన్నా అది డిప్రెషన్‌గా గుర్తించాలి.
అలజడి, చికాకుగా వుండడం, విచారం, నిరాశ, ఉత్తినే మాటి మాటికి ఏడ్వడం, ఏ పని చేయడానికి ఆసక్తి ఉత్సాహం లేకపోవడం, అసలు తినకపోవడం లేక అతిగా తినడం, ఏ విషయం మీద ధ్యాస లేకపోవడం, మతి మరుపు, ఆత్మన్యూనతా భావం, స్నేహితులు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటం, తలనొప్పి, గుండెనొప్పి, గుండెదడ, ఆయాసం పై చిహ్నాలే కాకుండా ఈ డిప్రెషన్‌లో బిడ్డకేమైనా హాని కలుగుతుందేమోనని భయం, లేక అసలు బిడ్డ పట్ల ఆసక్తి లేకపోవడం కూడా వుంటుంది. బాలింత డిప్రెషన్ ఆరోగ్యానికి నష్టం కలగచేస్తుంది. దైనందిక జీవితం అలజడికి గురవుతుంది. ఈ డిప్రెషన్ బిడ్డ పుట్టిన సంవత్సరం లోపులో ఎప్పుడైనా రావచ్చు. తప్పకుండా వైద్య సహాయం అవసరం. అంతేకాదు భర్త, కుటుంబ సభ్యులు, స్నేహితులు సానుభూతితో అర్ధం చేసుకుని ఆమెకు సహకరించాలి. ఆమెకు సరయిన తిండి, విశ్రాంతి దొరికేలా శ్రద్ధ వహించాలి.
బాలింత సైకోసిస్ (పోస్ట్‌నాటల్ సైకోసిస్): ఇది చాలా తక్కువగా కనిపిస్తుంది. వెయ్యి మంది బాలింతలలో ఒకరికి రావచ్చు. కాన్పయాక మొదటి ఆరు వారాల్లో ఇది కనపడొచ్చు. ఇంతకు ముందే ఏదైన మానసిక వ్యాధితో బాధపడుతున్న వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. భ్రమ, అపోహాలు, నిద్ర సమస్యలు లాంటివి ఉంటాయి. తీవ్రమైన డిప్రెషన్‌లో బాధపడతారు. అయోమయం, విపరీతమైన భయం లేక ఆనందం, త్వరితగతిలో మారే మూడ్స్, హింసకు గురి చేసే స్వభావం ఉంటాయి. పై స్థితికి తప్పక వైద్య సహాయం , మందులు అవసరం. వైద్యం సరిగా జరగకపోతే నెలల తరబడి ఈ స్థితి ఉండిపోతుంది. బిడ్డకు బాలింతకు మధ్య అనుబంధం ఏర్పడ్డడానికి బంధువుల సహకారం ఎంతైనా అవసరం.
కాబట్టి మిత్రులారా! బిడ్డను కనడం అనేదే మరో జన్మ నెత్తడం అనే విషయం గుర్తించి ఆ తర్వాత బాలింతల మానసిక, శారీరక స్థితులను అర్ధం చేసుకుని ఆమెకు సంపూర్ణ ఆరోగ్యం సమకూరడంలో చుట్టూ ఉన్న భర్త, కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారం చాలా అవసరం. అందుకేనేమో మనవాళ్ళు కాన్పుకోసం అమ్మాయిల్ని తల్లి ఇంటికే పంపుతారు. పుట్టిన బిడ్డకి మూడు నెలలు వచ్చేవరకు అత్తింటికి పంపేవారు కాదు. పుట్టి పెరిగిన ఇంట్లో అమ్మ దగ్గర వసతి ఉంటుందని ఆలోచించి ఉంటారు. ఇప్పుడు రోజులు మారాయి. పద్దతులు మారాయి. ముఖ్యంగా భర్త, స్నేహితులు ఈ విషయాలను అర్థం చేసుకుని సానుభూతితో, సౌమ్యంగా సహకరించాలి. అంతేకాని మగబిడ్డను కనలేదని ఎడమొహం పెట్టుకుంటే కుదరదు. ఆడబిడ్డ, మగబిడ్డ అనేది స్త్రీలపై ఆధారపడి లేదు. ఇది పురుషుడిపైనే ఆధారపడి వుంది కదా! బాలింతలకు పై విధమైన చిహ్నాలు ఏవైనా కనిపించినప్పుడు తమ దగ్గరి వారితో వాటి గురించి మాట్లాడండి. సరయిన సలహాలను, వైద్యాన్ని పొంది ఆరోగ్యంగా ఉండండి. ఈ విషయంలో మౌనం పాటించొద్దు.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags