ఇందిర ఒక సాహసం! ఇందిర ఒక అద్భుతం!

సుజాత
ఇందిర గురించి తల్చుకుంటే భయమేస్తుంది. ధైర్యం వస్తుంది. ఇందిరను అర్థం చేసుకోవాలంటే గుండె దిటవు కావాలి.మధ్య మధ్యలో గుండె నిండా ఊపిరి తీసుకుంటూ ఉండాలి.
ఇందిర ఒక అగ్ని శిఖ! ఒక అపురూప వ్యక్తిత్వమున్న యువతి ఇందిర! ఎలాటి దాపరికాలూ లేకుండా జీవితాన్ని ఉతికి ఆరేసేస్తుంది. నిండా ఇరవయ్యేళ్ళు లేకుండానే జీవితాన్ని కాచి వడబోసిన ఇందిర గుండెలు ఆగిపోయే జీవిత సత్యాలను నిర్మొహమాటంగా మొహం పగలగొట్టి మరీ చెప్తుంది.
”కాలాతీత వ్యక్తులు” నవల యాభై ఏళ్ళ తర్వాత కూడా ఇంత పటిష్ఠంగా నిలబడి ఉందంటే అందుకు కారణం కేవలం ఇందిరే! ఇందిర వ్యక్తిత్వమే ఇన్నాళ్ళు ఆ నవలను నిత్యనూతనంగా కాలాతీతంగా నిలబెట్టింది.
ఈ నవల దాదాపు పాతికేళ్ళ క్రితం స్కూల్లో ఉండగా అనుకుంటాను బహుమతిగా సంపాదించాను. మా అమ్మ ఈ పుస్తకం చూసి ”ఇప్పుడే ఇంత బరువు పుస్తకాలెందుకులే నువ్వు క్లాసు పుస్తకాలు చదూకో, నేనిది చదూకుంటా” అని పుస్తకం తీసుకుని కానుగ చెట్టుకింద కుర్చీ వేసుకుంది.
ఆ తర్వాతెప్పుడో మూడు నాలుగేళ్ళకి చదివాననుకోండి!
గొప్ప నవలగా విమర్శకుల, పాఠకుల ప్రశంసలు దండిగా సంపాదించిన నవల గురించి రాయబూనడం సాహసమే అయినా ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించే ఇందిర గురించి రాయకుండా ఉండటం అసాధ్యమనిపించింది.
మీలో చాలామంది ఈ నవల చదివే ఉంటారు. చదవని వారు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకోసం కథ కొద్దిగా చెప్తాను.
1950ల్లో వాతావరణం! విశాఖపట్నంలో ఇందిర అనే పద్దెనిమిదేళ్ళ యువతి తండ్రితో సహా ఒక ఇంటికిందిభాగంలో అద్దెకు దిగుతుంది. అదొక బ్రహ్మచారులుండే కొంప! పైభాగంలో ప్రకాశం అనే మెడికో ఉంటాడు. చలాకీ ఇందిర ప్రకాశంతో ఇట్టే స్నేహం చేస్తుంది. ప్రకాశం ఫ్రెండు కృష్ణ మూర్తితో కూడా!
అద్దె పంచుకోడానికి వీలుగా ఉంటుందని ఒకరోజు ఇందిర కళ్యాణి అనే స్నేహితురాలిని ఆ ఇంట్లో ఒక గదిలో ప్రవేశపెడుతుంది. కళ్యాణిదో తెలుగు సినిమా దీనగాథ! తల్లి లేదు. తండ్రి రోగిష్టి! ఇంటిమీద అప్పు! ఎవరితోనూ కలిసిపోయే స్వభావం కాదు. ఎప్పుడూ తన దీనావస్థను తల్చుకుని కన్నీళ్ళు పెట్టుకోవడం తప్ప కళ్యాణికి మరేమీ చేతకాదు.
కళ్యాణి వచ్చాక ప్రకాశం ఆమెవైపు ఆకర్షితుడవటంతో ఇందిర కళ్యాణితో నిరంకుశంగా ప్రవర్తించి ఆమె వెళ్ళిపోడానికి కారణ మవుతుంది. తండ్రిని పోగొట్టుకున్న కళ్యాణికి స్నేహితురాలు వసుంధర ఆశ్రయమిస్తుంది. మునసబు రామినాయుడుని ఆస్పత్రికి తీసుకువెళ్ళిన సందర్భంలో డాక్టర్‌ చక్రవర్తి కళ్యాణికి పరిచయ మవుతాడు.
ప్రకాశం మేనమామకు ఇందిరతో ప్రకాశం చనువుగా ఉంటున్నాడన్న సంగతి తెల్సి ఊర్నుంచి వచ్చి ఇందిరకు వార్నింగిస్తాడు. ప్రకాశాన్ని ఊరికి తీసుకుపోయి రాజమండ్రి సంబంధం ఖాయం చేస్తాడు. స్వతహాగా భీరువైన ప్రకాశం మేమనమామ మాట కాదనలేక ఒప్పుకుని ఆ తర్వాత ఇందిర మీద వ్యామోహాన్ని వదులుకోలేక పారిపోయి వస్తాడు. ఇందిర అతడిని ఛీ కొట్టి పొమ్మంటుంది. తనకోసం మామయ్యను ఎదిరించి కాకుండా పారిపోయి వచ్చినందుకు తిరస్కరిస్తుంది. అనుక్షణం మామయ్య నుంచి అతన్ని రక్షించలేను వెళ్ళమంటుంది!
మరోవైపు వసుంధర కృష్ణమూర్తివైపు ఆకర్షితురాలవుతుంది. కానీ ఇందిరతో అమితంగా పెరిగిన సాన్నిహిత్యం వసుంధరను వద్దనుకునేలా చేస్తుంది కృష్ణమూర్తిని!
కథ అనేక మలుపులు తిరిగి చివరికి కృష్ణమూర్తి ఇందిరనూ, చక్రవర్తి కళ్యాణినీ పెళ్ళాడటంతో ముగుస్తుంది.
ఈ కథకు హీరో, హీరోయిన్‌, రెండూ ఇందిరే! ఇందిర వ్యక్తిత్వం చదువుతున్నంత సేపూ అబ్బురపడేలా చేస్తుంది. అసలు ఈ నవల్లోని పాత్రల స్వభావాలు ఈనాటికీ నిత్యనూతనంగా ఎవరో ఒకరి రూపంలో కళ్ళబడుతూనే ఉంటాయి. అందుకే రచయిత్రి ఈ నవలకు ఆ పేరుపెట్టారేమో అసలు!
”కాలాతీత వ్యక్తులు” కాదు… ”వ్యక్తే”! ఆ వ్యక్తే ఇందిర అని కొందరి వాదనని 1958లో ముందు మాట రాసిన పి. సరళా దేవి అంటారు.
అడుగడుగునా మేనమామకు భయపడే ప్రకాశానికి, జీవితాన్ని అనుక్షణం విసుక్కుంటూనే మరోవైపు ప్రేమించే జీవించే ఇందిర లాంటి మనుషులు కొత్త! ఆ కొత్త ఇష్టంగానే ఉన్నా దాన్ని అందుకోడానికి భయపడే పిరికివాడు ప్రకాశం. పోరాడి సాధించుకోవడం అనేది జీవితంలో కాదు కదా కనీసం ఊహల్లోకూడా లేనివాడు!
”నేను బలపడి ఇంకొకరికి బలాన్నివ్వాలనుకునే తత్వం నాది” అని ఆత్మవిశ్వాసంతో చెప్పే ఇందిర అంటే ఆరాధన!
”అలా బీచ్‌ కీ పోదాం పద” అని లాక్కెళ్ళే ఇందిర,”… పర్లేదులే ఇంతలో నా పాతివ్రత్యానికేం భంగం రాదు. ఇద్దరమూ ఒకే రిక్షాలో పోదాం పద” అనే ఇందిర… అతనికి అబ్బురంగానే కనిపిస్తుంది గానీ చేయి అందుకోవాలంటే భయం! అలాగే ఇంటినుంచి వచ్చిపడే డబ్బుతో జల్సాగా స్నేహితులతో గడిపే కృష్ణమూర్తికీ ఇందిరలాంటిమనుషులు కొత్తే!
ఇందిరకు ఇటువంటి ఇన్‌ హిబిషన్స్‌ లేవు. ప్రకాశంతోనూ, కృష్ణమూర్తితోనూ అరమరికలు లేకుండా స్నేహం చేస్తుంది. అలాగని ఇందిర పెద్ద ఆదర్శమూర్తేమీ కాదు. తాను కోరుకున్న ప్రకాశం కల్యాణికి దగ్గరవుతుంటే చక్రం అడ్డువేస్తుంది. స్త్రీ సహజమైనదిగా చెప్పబడే అసూయను ప్రదర్శించక మానవ సహజమైన నేర్పరితనం ప్రదర్శిస్తుంది.
అదీ ఇందిర అంటే!
ఇందిర పాత్ర రానున్న సమాజంపై స్త్రీ చేయగల ధిక్కారానికి ప్రతీక అని ఏటుకూరి ప్రసాద్‌ ముందుమాటలో పేర్కొంటారు. కానీ ఇందిర ఒక మనిషిగా ఇవన్నీ మాట్లాడుతుంది తప్ప తాను స్త్రీననీ, స్వేచ్ఛ సాధించుకోవాలనే స్పృహతోనూ మాట్లాడదు. స్త్రీవాదమంటే ఏమిటో ఇందిరకు తెలీదు.
ఎందుకంటే మరో పక్క ”నేనున్నాలే, నీ సమస్యలూ, బరువులూ నా మీద పడేయ్‌” అనగలిగే మగాడు, అవసరమైతే నాకోసం సర్వస్వమూ వదులుకోగలిగే మగాడు కావాలి ప్రకాశం” అని కుండ పగలేస్తుంది ఇరవయ్యేళ్ళకే అరవయ్యేళ్ల కష్టానుభవాల్ని మూటకట్టుకుని విసిగిపోయిన ఇందిర.
”అందరం ఒక్కలాంటివాళ్లమే! అడుగు లేని పడవలం! ఏదో అలా ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నాం! అలాగని గడియ గడియకీ కాళ్ళు చాపి ఏడవటం నా వల్ల కాదు” అని నిర్మొహమాటంగా కల్యాణి నుద్దేశించి చెప్పేస్తుంది. ”నువ్వెక్కడికిపోతావు ప్రకాశం, నువ్వు నా వాడివి” అని భరోసా ఇచ్చిన ఇందిరే అతడు పిరికివాడిలా పారిపోయి వచ్చినపుడు మండిపడుతుంది. ”బతుకులో నాకు కావలసినదొకటి, నాకు దొరుకుతున్నదొకటి! అంచేత కసికొద్దీ లోకాన్ని ధిక్కరిస్తున్నాను. నాకూ ఓ ఇల్లూ, సంసారం, భర్తా ఇవేవీ అక్కర్లేదనుకోకు. కానీ లాటరీలో నాకు దొరికింది ఫైళ్ళూ, ఆఫీసూ, నా మీద ఒరిగిపోయి బతికేసే నాన్నా” అని నిస్పృహ వ్యక్తం చేస్తుంది.
కృష్ణమూర్తి ఇందిరను పెళ్ళి చేసుకుంటున్నపుడు కూడా ”జీవితంలో దేనివిలువ దానికివ్వాలి. పెళ్ళి నా జీవితంలో ఒక భాగం మాత్రమే! నీతో ఎంత దూరం రమ్మన్నా వస్తాను కానీ ఏ ఘట్టంలోనూ నా వ్యక్తిత్వాన్ని చంపుకోలేను. నా అవసరాలను గౌరవించడం నేర్చుకుని నన్ను నా ఇష్టం వచ్చినట్లు ఊపిరి పిల్చుకోనిస్తావా (”నా పర్సనల్‌ స్పేస్‌ నాకుండనివ్వు” అని 50ల్లోనే ఇందిర అడగటం ఎంత ఆశ్చర్యం!) అంటుంది.
”నీ ఆయుర్దాయం ఎంతో అన్ని రోజులూ నిండుగా బతుకు! నిర్భయంగా బతుకు! రోజుకు పదిసార్లు చావకు. ఈ ప్రపంచంలోని వికృతాన్నీ, వికారాన్నీ అసహ్యించుకో! ఆశలూ, స్వప్నాలు అనురాగాలు అన్నీ పెంచుకో! కానీ వాటికి శస్త్ర చికిత్స అవసరమైనపుడు నిర్దాక్షిణ్యంగా కత్తిరించి అవతల పారెయ్‌” అనే ఇందిర జీవితం నుంచి ఎంత నేర్చుకుందా అని ఆశ్చర్యం వేస్తుంది.
నవల కొత్త ముద్రణ (2005)తో డాక్టర్‌ చంద్రశేఖర్‌ రావు రాసిన విశ్లేషణలో అంటారు ”పాతివ్రత్యం, ప్రేమ, అంకితమవటాలు, అర్పించుకోడాలు ఈ నాన్సెన్స్‌నీ, ట్రాష్‌ నీ కాలితో ఫెడీమని తన్నే ఇందిరను మీరెరుగరు, గుర్తు పట్టడానికీ గుర్తుంచుకోడానికీ ఇష్టపడరు! ఇందిరను ఇష్టపడే రోజులు మనకింకా సమీపం కాలేదు” అని!
ఇందిర స్త్రీలాగా ప్రవర్తించదు. సగటు మనిషిలాగా ప్రవర్తిస్తుంది. ఆ ప్రవర్తనలో ప్రేమ, కోపం, ఆవేశం, లౌక్యం, దుఃఖం, నిరాశ, నిర్లిప్తత, స్వార్థం అన్నీ ఉంటాయి. అన్నీ జీవితం ప్రసాదించినవే!
కల్యాణిలాగా ప్రద్దానికీ భోరుమంటూ ఏడవదు. అయితే ఏమిటి? అని పరిస్థితులకు ధైర్యంగా ఎదురు తిరుగుతుంది. కనీసం బింకంగా కనిపిస్తుంది. ”ఈ వెధవ లోకం నాకెందు లొంగిరాదో చూస్తాను” అనుకుంటుంది.
ఇందులో నాకు నచ్చనిపాత్రేదైనా ఉంటే అది కల్యాణే! ఈమె ఒంటినిండా సెల్ఫ్‌ పిటీ నిండిపోయి ఉంటుంది. ఆమె ఒంటరితనానికీ, నిస్సహాయ స్థితికీ ఒక పక్క కొంత సానుభూతి కలుగుతున్నా, ప్రతి క్షణం తన స్వాభిమానాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఏడుపుని ఆశ్రయించి పాఠకుడికి సానుభూతిని బదులు చిరాకుని కల్గిస్తుంది.
వసుంధర ఇంట్లో మునసబు రామినాయుడికి అనారోగ్యం చేయగానే ”చూశావా, వసుంధరా, నా వంటి దానికి ఆశ్రయమిస్తే నీకెలాంటి ఫలితం దక్కిందో” అంటుంది. చివరికి పెళ్ళాడ్డానికి వెళ్తున్నపుడు కారుకి యాక్సిడెంట్‌ కాగానే ”నావంటి దరిద్రాన్ని వరిస్తే ఇంతే!” అని చక్రవర్తిని బెదరగొడుతుంది. ఇలాంటివాళ్ళు జీవితంలో ఒకరుంటే నరకం ఆట్టే దూరంలో లేదనిపించడం ఖాయం!
కానీ ఇందిర అన్నట్లు ”ఈ లోకంలో కల్యాణి లాంటి వాళ్లకే ఎక్కడ లేని జాలీ దొరుకుతుంది”. ఈ నవలకు జరిగిన అన్యాయమేదైనా ఉంటే అది ”చదువుకున్న అమ్మాయిలు” సినిమాగా దీన్ని తీయడమే అనిపిస్తుంది నాకు! సినిమా టైటిల్స్‌ కార్డ్స్‌లో కథ – డాక్టర్‌ పి. శ్రీదేవి అని చూడకపోతే అప్పటికి పదిసార్లు ఈ నవల చదివి ఉన్నా, అది ఈ సినిమాయేనని గుర్తు పట్టం! ఆ సినిమాలో కల్యాణిపాత్ర కృష్ణకుమారికిచ్చి ఆమెను హీరోయిన్ను చేసి, ఆమె ఫ్రెండ్‌ వసుంధరగా సావిత్రిని పెట్టి వీళ్ళిద్దరికీ మధ్య అక్కినేనిని పెట్టి ఏదేదో చేశారు! ఇందిరను ఒక వాంప్‌గా (ఈవీ సరోజ) చిత్రీకరించారు. అలాంటి స్త్రీని అంగీకరించే పరిస్థితులు ఆరోజు లేవు కనుకా… అని జవాబిస్తారేమో ఇదేమని అడిగితే!
కానీ 1950 ల్లోనే ఇద్దరు మగ స్నేహితులతో కల్సి ధైర్యంగా బీచ్‌ లకూ సినిమాలకూ వెళ్ళగలిగే ఇందిర పాత్ర ఒకింత ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. ఆ రోజుల్లో ఇలాంటి స్వేచ్ఛను ఇరుగుపొరుగులెవరూ నిరసించలేదా? అనే సందేహం కలుగుతుంది. ఇందిర అంత స్వేచ్ఛగా మసలడానికి ఏమీ ఇబ్బంది పడకపోవడం కూడా కొద్దిగా ఆశ్చర్యమే! నవలా రచయిత్రి ముప్పయి ఏళ్ల వయసులోనే మృత్యువాత పడకపోయి ఉంటే ఇంకా ఎన్నెన్ని మంచి రచనలు అందించేవారో అన్న ఆలోచన ఈ నవల పూర్తి చేసిన ప్రతి సారీ కల్గుతుంది.
పాత్రల చిత్రణ, వాటి వ్యక్తిత్వాల వర్ణన గుక్క తిప్పుకోనివ్వదు పాఠకులను! ఇందిర అసహనాన్నీ, వెంటనే తేరుకుని ప్రదర్శించే ధిక్కారాన్నీ ఎలా చిత్రీకరిస్తారంటే ఇందిర వెంట పరుగు తీయడం తప్ప ఇంకేం చేయలేం! ఇంత రాసినా ఇంకా ఏదో రాయకుండా వదిలేశారనే ఫీలింగు… అదే కాలాతీత వ్యక్తులు నవల చేసే మాజిక్‌!
ఒక అశాంతిని, కొన్ని లక్షల ఆలోచనలనూ, కొంత హాయినీ ఒకేసారి కల్గించే నవల! 1957లో తెలుగు స్వతంత్ర పత్రికలో ధారావాహికగా వచ్చిన ఈ నవల తరవాత చాలా ముద్రణలు పడింది. 1981లో ఎమెస్కో వారు వేసిన ముద్రణ కాపీ నా వద్ద ఉంది. అందులో చివరి పేజీలు పోయాయని కొత్తది విశాలాంధ్ర వాళ్ళు వేసిన కొత్త కాపీ కొన్నాను. ఇంత మంచి నవల ముద్రణకు విశాలాంధ్ర వాళ్ళుకొంత నాణ్యత ఉన్న పేపర్‌ వాడి ఉంటే బావుండేది.
(http://manasulomaata.blogspot సౌజన్యంతో)

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో