అబ్బూరి ఛాయాదేవి
‘తెలుగు సాహిత్యం-మహిళలు’ అనే విషయాన్ని రెండు కోణాలనుంచి విశ్లేషించుకోవచ్చు- 1. తెలుగు సాహిత్యంలోని మహిళలపాత్ర చిత్రణ, 2. తెలుగు సాహిత్యంలో మహిళల పాత్ర.
తెలుగు సాహిత్యం అంటే ప్రాచీన సాహిత్యం నుంచి నేటి సాహిత్యం వరకూ పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది- సంక్షిప్తంగా అయినా.
ప్రాచీన సాహిత్యంలో స్త్రీ పాత్రల చిత్రణ చేసిన విదుషీమణి డా. పి. యశోదారెడ్డి గారు. ఆమె రాసిన ‘భారతంలో స్త్రీ’ అనే గ్రంథంలో, ముఖ్యమైన స్త్రీ పాత్రలతోపాటు, ప్రాసంగిక ఇతి వృత్తాల్లోని స్త్రీపాత్రల్నీ, ధర్మస్వరూప కథాగత స్త్రీ పాత్రల్నీ ఆ ముగ్గురు కవులూ ఏవిధంగా చిత్రించారో సోదాహరణంగా వివరించారు. ఈ గ్రంథరచనలో ఆమె పాండిత్య ప్రతిభ వెల్లడవుతుంది. అలాగే, ‘సాహిత్యంలోనాడు, నేడు స్త్రీ స్థానం’ అనే విషయంపై డా. నాయని కృష్ణకుమారి గారు దుర్గాభాయి దేశ్‌ముఖ్ స్మారకోపన్యాసం చేశారు. దాన్ని ఆంధ్రమహిళాసభ ప్రచురించింది. ఆ వ్యాసంలో ఆమె ప్రాచీన కావ్యాలు మొదలుకొని ఆధునిక సాహిత్యంలోని స్త్రీల స్థితి వరకూ సమీక్షించారు. పురాణేతిహాసాల్లో స్త్రీ పాత్రల గురించి వ్యాసాలు రాసినవారిలో డా.సి.మృణాళిని, డా.ముక్తేవి భారతి మొదలైన వారున్నారు. వీళ్ళు ఆధునిక నవలల్లోని, ముఖ్యంగా స్త్రీల నవలల్లోని స్త్రీ పాత్రల్ని విశ్లేషిస్తూ కూడా వ్యాసాలు రాశారు. డా. భారతి ఇంకా రాస్తున్నారు. డా. దాస్యం రూత్ మేరీ కూడా ఆధునిక రచయిత్రుల రచనల్లోని స్త్రీ పాత్రలగురించి రాశారు-తెలుగు రచయిత్రుల మహాసభ స్వర్ణజయంతి ప్రత్యేకసంచికలో రాసిన వ్యాసంలో విశ్లేషించారు.
ఇటీవల స్త్రీవాద రచయిత్రి ఓల్గా వెలువరించిన ‘విముక్త’ అనే కథాసంపుటిలో, రామాయణంలోని కొన్ని స్త్రీ పాత్రల్ని చిత్రిస్తూ విశ్లేషణాత్మకంగా రాసిన కథలున్నాయి. సీత, శూర్పణఖ, అహల్య, ఊర్మిళ, రేణుకల గురించిన కథలే కాకుండా, ‘బంధితుడు’ అనే కథ కూడా ఉంది ఆ సంపుటిలో. అందులో సీతారాముల అనుబంధాన్నీ, వివిధ ధర్మాలకు బద్ధుడైన రాముణ్ణీ సానుభూతితో చిత్రించడం జరిగింది.
కొందరు ప్రముఖ రచయితలు రామాయణ మహాభారతాల్లోని ముఖ్య స్త్రీ పాత్రల్ని, శృంగారానికి ప్రాధాన్యాన్నిస్తూ కొంత వక్రీకరించి చిత్రించడం జరిగింది. ఇంకోవైపు, అలంకార శాస్త్రాన్ని స్త్రీ చుట్టూ ఎలా నిర్మించడం జరిగిందో డా. కాత్యాయనీ విద్మహే, డా. దావులూరి కృష్ణకుమారి వ్యాసాలు రాశారు.
ఇక, తెలుగు సాహిత్యంలో మహిళల పాత్ర గురించి విశేషంగా చెప్పుకోవాలి. అనాదిగా స్త్రీలకు పురుషులతో సమానంగా విద్యావకాశాలు లేనందువల్లా, సామాజికంగా స్త్రీలు పురుషులపై ఆధారపడే పరిస్థితులు ఉండటం వల్లా, స్త్రీలకు రచనలు చేసే అవకాశాలు అరుదుగా లభించేవి. అయినప్పటికీ, తెలుగు సాహిత్య చరిత్రలో తాళ్ళపాక తిమ్మక్క మొదలుకుని, మొల్ల, ఆ తరవాత తరిగొండ వెంగమాంబ, రంగాజమ్మ, ముద్దుపళని మొదలైన కవయిత్రులు ప్రసిద్ధి చెందారు. డా. ముదిగంటి సుజాతారెడ్డి ‘తెలుగు సాహిత్య చరిత్ర’ అనే పరిశోధనాత్మక గ్రంథం రాయగా, డా. దావులూరి కృష్ణకుమారి కొందరు ప్రాచీన కవయిత్రుల ప్రతిభ గురించీ, కొందరు ఆధునిక కవయిత్రులూ రచయిత్రుల గురించీ సోదాహరణంగా విశ్లేషిస్తూ వ్యాసాలు రాశారు.
కందుకూరి, గురజాడ మొదలైన సంఘసంస్కర్తల, రచయితల ప్రభావంతో ఆ రోజుల్లో విద్యావంతులైన కొందరు స్త్రీలు సాటి స్త్రీలలో చైతన్యాన్ని కలిగించేందుకు స్వయంగా పత్రికలు స్థాపించి, సంపాదకత్వం నిర్వహించారు. బాలాంత్రపు శేషమ్మ ‘హిందూసుందరి’ పత్రికనీ, పులుగుర్త లక్ష్మీనరసమాంబ ‘సావిత్రి’ పత్రికనీ, వింజమూరి వెంకట నరసమ్మ ‘అనసూయ’ పత్రికనీ నిర్వహించారు. ఇవన్నీ 20వ శతాబ్దంలో ప్రారంభకాలంలో నడిచాయి. తరవాత 1940 దశకంలో ‘ఆంధ్రమహిళ’ మాసపత్రికని దుర్గాబాయమ్మ, ‘ఆంధ్రవనిత’ మాసపత్రికని భండారు అచ్చమాంబ స్థాపించారు. 1950లలోనే సూర్యదేవర రాజ్యలక్ష్మిగారు ‘తెలుగుదేశం’ అనే పత్రికని స్థాపించి సంపాదకత్వం వహించారు హైదరాబాదులో. 1955-56 ప్రాంతంలో నేను ఒక ఏడాదిపాటు ఆంధ్రయువతీమండలి తరపున ‘వనిత’ అనే మాసపత్రికని నిర్వహించాను. ఇటీవలికాలంలో కొండవీటి సత్యవతి ‘స్త్రీవాద పత్రిక భూమిక’ ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ‘చైతన్యమానవి’, ‘మహిళా మార్గం’, ‘మహిళా విజయం’, ‘నారీలోకం’ అనే మాసపత్రికలు కూడా మహిళల సారథ్యంలో వెలువడుతున్నాయి. కేవలం కథాసాహిత్యానికి ప్రాతినిధ్యం వహించే ‘కథాకేళి’ అనే మాసపత్రికకి యం. నాగకుమారి, ‘బాలబాట’ అనే బాలల మాసపత్రికకి కె.యస్వీ. రమణమ్మ సంపాదకులుగా ఉంటూ ఆ పత్రికలను నిర్వహించడం విశేషం.
20వ శతాబ్దం ప్రారంభంలో స్త్రీలు స్థాపించి నడిపించిన పత్రికలలోనే కాకుండా, స్త్రీలకోసం స్థాపించబడిన ‘జనానా’, ‘ఆంధ్రలక్ష్మి’, ‘గృహలక్ష్మి’ వంటి పత్రికలలో కూడా ఆనాటి కవయిత్రులూ, రచయిత్రులూ ఎక్కువగా రాసేవారు. పద్యకవిత్వం రాసిన మహిళలలో పులుగుర్త లక్ష్మీనరసమాంబ, కాంచనపల్లి కనకాంబ, జూలూరి తులశమ్మ, చిల్కపాటి సీతాంబ, గిడుగు లక్ష్మీకాంతమ్మ, జొన్నలగడ్డ శారదాంబ, మొదలైనవారున్నారు. వీళ్ళు చాలావరకు పౌరాణిక కావ్యవస్తువులను తీసుకునో, సతీధర్మాలను ప్రబోధిస్తూనో కావ్యాలనూ, శతకాలనూ రచించారు.
ఆ కాలంలోనే భావకవిత్వం రాసిన కవయిత్రులు కూడా ఉన్నారు. దైవభక్తి, పతిభక్తి, దేశభక్తి వంటి భక్తి రచనలు చేయడానికి వీలున్న వాతావరణంలో కొందరు మహిళలు ప్రణయ కవిత్వం రాయడం సాహసమే. అటువంటి సాహసాన్ని ప్రదర్శించిన వారిలో తల్లాప్రగడ విశ్వసుందరమ్మ, చావలి బంగారమ్మ, సౌదామిని (బసవరాజు రాజ్యలక్ష్మమ్మ), దొప్పలపూడి అనసూయాదేవి, స్థానాపతి రుక్మిణమ్మ వంటి వారున్నారు. తల్లాప్రగడ విశ్వసుందరమ్మ స్వాతంత్య్ర సమరయోధురాలు కూడా. జైలు జీవితాన్ని గడిపిన అనుభవంతో ఆమె ‘స్త్రీల చెరసాలలో…’ అనే కవిత రాశారు. ఆనాటి జైళ్ళలో స్త్రీల జీవితాన్ని రామాయణంలో సీత లంకా వాసంతో పోలుస్తూ, వ్యంగ్యపూరితంగా, ఆంగ్ల పదాలను కూడా విరివిగా వాడుతూ రాశారు. దొప్పలపూడి అనసూయాదేవి ‘కాన్పు’, ‘పాకీపని’ అనే పద్యాల్లో మాతృత్వాన్ని కీర్తిస్తూనే, దాన్ని పొందడానికి స్త్రీగా తాను ఎంత కష్టాన్ని భరించిందో, ఎటువంటి రోతపుట్టే పనులు చేసిందో వర్ణించారు. ఆనాటి కవయిత్రులెవరూ రాయాలనుకోని విషయాన్ని కవితా వస్తువుగా తీసుకున్నారు.
గొప్ప విదుషీమణి, ఉభయ భాషా ప్రవీణ, పద్యకవయిత్రి అయిన ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు ‘ఆంధ్ర కవయిత్రులు’ అనే సంకలనాన్ని ప్రచురించారు. ఆమెకు ఎన్నో పురస్కారాలతో పాటు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ‘కళాప్రపూర్ణ’ బిరుదు కూడా లభించింది.
ఈనాడు పద్యరచన చేస్తున్న కవయిత్రులలో కొలకలూరి స్వరూపరాణి ప్రముఖులు. పురాణ గాథల ఆదారంగా రాసిన స్ఫూర్తితోనే, ఆధునిక భావాలతో ‘స్త్రీపర్వం’ రాశారు. భార్యను దాసిగా కాకుండా, సమానంగా చూడాలనీ, ఆమెపై స్నేహం, ప్రేమ చూపించాలనీ ‘స్త్రీ పర్వం’ లో ప్రబోధించారు. స్త్రీల పరిస్థితి గురించి శతకం రాసిన చిల్లరిగె స్వరాజ్యలక్ష్మి గారు విస్తృతంగా కవితలు రాశారు.
స్వాతంత్య్రానంతరం వ్యావహారికభాష ప్రాచుర్యంలోకి రావడంతోనూ, అభ్యుదయకరమైన ఆలోచనా ధోరణి పెరగడంతోనూ ఎందరో మహిళలు వచన కవితా మార్గాన్ని అనుసరించారు. విద్య, ఉద్యోగానుభవాలూ నూతన స్ఫూర్తినిచ్చాయి. యల్లాప్రగడ సీతాకుమారి, నాయని కృష్ణకుమారి, సి. వేదవతి, ఆదూరి సత్యవతీదేవి, శీలా సుభద్రాదేవి, శారదా అశోకవర్ధన్, వాసా ప్రభావతి, చిల్లర భవానీదేవి, ఎన్. అరుణ మొదలైన కవయిత్రులు వైవిధ్యపూరితమైన కవితలు రాశారు. కొందరు ఇంకా విస్తృతంగా రాస్తున్నారు. వీరిలో కొందరిలో భావకవితా ఛాయలు కూడా కనిపిస్తాయి.
‘స్త్రీ వాదం’ ప్రాచుర్యంలోకి రాకముందే వాణీ రంగారావు, రేవతీదేవి స్త్రీల దుస్థితి పట్ల ఆర్తితో, చైతన్యవంతమైన కవితలు రాశారు. స్త్రీవాద కవయిత్రులుగా ఓల్గా, జయప్రభ, కొండేపూడి నిర్మల, ఘంటసాల నిర్మల, పాటిబండ్ల రజని, ‘శిలాలోలిత’, చల్లపల్లి స్వరూపరాణి, మహెజబీన్, షాజహానా మొదలైన కవయిత్రులు ప్రసిద్ధి చెందారు. ‘నీలి మేఘాలు’ అనే కవితా సంకలనాన్ని తొంభైలలో తీసుకువచ్చారు ఓల్గా, ఆమె మిత్రులూ కలిసి. ప్రాచీన, ఆధునిక తెలుగు కవయిత్రులలో కొందరిని ఎంపిక చేసి ‘ముద్ర’ అనే కవితా సంకలనానికి శీలా సుభద్రాదేవి గారు, డా. భార్గవీరావు గారూ కలిసి సంపాదకత్వం వహించారు 1990 లో.
తెలుగు సాహిత్యం అంటే కవిత్వం ఒక్కటే కాదు. నవల, కథ, నాటకం మొదలైన ప్రక్రియలున్నాయి. నవల, కథానిక ఆధునిక ప్రక్రియలు. రచయిత్రి అనగానే ‘నవలా రచయిత్రి’ అనుకునేటంత విస్తృతంగా మహిళలు తెలుగులో నవలలు రాశారు, రాస్తున్నారు. 20వ శతాబ్దం ఆరంభంలో మహిళలు నవలలు రాసిన వారు పురుషుల్లాగే సరళ గ్రాంథికంలో రాశారు. పులుగుర్త లక్ష్మీనరసమాంబ, కాంచనపల్లి కనకాంబ, పులవర్తి కమలాదేవి, కనుపర్తి వరలక్ష్మమ్మ, మాగంటి అన్నపూర్ణాదేవి, వేదుల మీనాక్షీదేవి మొదలైన వారు ఇరవైమంది దాకా ఉన్నారు. నలభైలలో చలం కుమార్తె సౌరిస్ కూడా నవలలు రాశారు. ఇల్లిందల సరస్వతీదేవి తెలంగాణా జీవన విధానాన్ని, దిగువస్థాయి వారి దుస్థితినీ చిత్రిస్తూ గొప్ప నవలలు రాశారు. స్వాతంత్య్రానంతరం, ఉద్యోగం చేసే మహిళ ఎదుర్కొనే సమస్యలగురించి మొట్టమొదటిసారిగా నవలరాసిన రచయిత్రి మాలతీ చందూర్. స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న కుటుంబాల పరిణామాల గురించి ఆమె రాసిన ‘హృదయనేత్రి’ నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఇంతవరకు తెలుగు నవలా ప్రక్రియలో ఆ అవార్డు అందుకున్న మహిళ మాలతీ చందూర్ ఒక్కరే. ద్వివేదుల విశాలాక్షి, కె. రామలక్ష్మి, కుటుంబాల్లోని సమస్యల గురించీ, స్త్రీలు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యల గురించీ నవలలు రాస్తుంటే, యుద్దనపూడి సులోచనరాణి ‘సెక్రటరీ’ అనే నవలతో మొదలుపెట్టి, జనరంజకమైన ప్రేమ కథలతో నవలలు రాయడం ఒక ప్రభంజనంలా వ్యాపించింది. తెలుగు పాఠకుల సంఖ్య విపరీతంగా పెరిగింది. కొన్ని సినిమాలుగా కూడా వచ్చాయి. అదే స్ఫూర్తితో కోడూరి కౌసల్యాదేవి, మాదిరెడ్డి సులోచన, సి. ఆనందారామం, పోల్కంపల్లి శాంతాదేవి, పవని నిర్మల ప్రభావతి, పరిమళా సోమేశ్వర్, పోలా ప్రగడ రాజ్యలక్ష్మి మొదలైన రచయిత్రులు విరివిగా నవలలు రాశారు. వీరికి కొంత భిన్నంగా అభ్యుదయ భావాలతో నవలలు రాసిన వారు రంగనాయకమ్మ, వాసిరెడ్డి సీతాదేవి, శారదా అశ్‌కవర్ధన్, వాసా ప్రభావతి మొదలైనవారు. ఎనభైలలో స్త్రీవాద నవలలకు శ్రీకారం చుట్టిన మహిళ ఓల్గా. సి. సుజాత, కె. వరలక్ష్మి, గీతాంజలి వంటి కొందరు రచయిత్రులు ఆ బాటని అనుసరించారు.
తెలుగులో కథాసాహిత్యం మరో విస్తృతమైన, ఆకర్షణీ యమైన రంగం. మహిళా కథకులు వందల కొద్దీ ఉన్నారు. కొన్నివేల కథలు రాశారు. ఇంకా రాస్తున్నారు. నాలుగేళ్ళ క్రితం తెలుగు ‘కథాకోశం’ గ్రంథంలో 400 మంది కథారచయిత్రులు చోటు చేసుకున్నారు. డా. భార్గవీరావు సంకలనం చేసిన ‘నూరేళ్ళపంట’ లో నూరుమంది కథారచయిత్రుల కథలున్నాయి. తెలంగాణా తొలితరం కథల సంకలనంలో డా. ముదిగంటి సుజాతారెడ్డి ముగ్గురు రచయిత్రుల్ని చేర్చారు. 1901 నుంచి 1980 వరకూ ప్రచురితమైన రచయిత్రుల కథల్ని ఎంపిక చేసి, డా. కె. లక్షీనారాయణ ‘స్త్రీల కథలు’ పేరుతో 2006, 2007 సంవత్సరాల మధ్య 5 సంపుటాలను ప్రచురించారు. తెలుగు కథాసాహిత్యంలో ప్రప్రథమంగా ఇల్లిందల సరస్వతీదేవి గారి ‘స్వర్ణకమలాలు’ అనే నూరు కథల సంపుటానికి కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు లభించింది. మరో నూట ఎనిమిది కథలతో ‘తులసి దళాలు’ అనే మరో సంపుటాన్ని కూడా ప్రచురించారామె. తెలుగు కథాసాహిత్యాన్ని మహిళలు సుసంపన్నం చేశారు.
నాటకరంగంతో పురుషులకున్న సాన్నిహిత్యం మహిళలకు లేకపోవడంవల్ల నాటకరచనలో మహిళలు దూసుకుపోలేక పోయారు. అప్పుడూ ఇప్పుడూ కూడా నాటకరచయిత్రుల్ని వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. పూర్వం పౌరాణిక ఇతివృత్తాలతో నాటకాలు రాసిన మహిళలు కాంచనపల్లి కనకాంబ, జూలూరి తులశమ్మ, కనుపర్తి వరలక్ష్మమ్మ, స్థానాపతి రుక్మిణమ్మ గార్లను చెప్పుకోవాలి. ఆధునికంగా నాటకాలు రాసిన వారిలో సౌరిస్, యల్లాప్రగడ సీతాకుమారి, ఇల్లిందల సరస్వతీదేవి, ఐ.వి.యస్. అచ్యుతవల్లి, ఆ తరవాత శారదా అశోక వర్ధన్, వాసా ప్రభావతి, అత్తలూరి విజయలక్ష్మి వంటి కొద్దిమంది రేడియో కోసమూ, వేదికపై ప్రదర్శన కోసమూ కూడా సమర్థవంతంగా రాశారు. డా. తెన్నేటి సుధ రేడియో ప్రసారం కోసం తెలుగు సామెతలను ఆధారంగా చేసుకుని 500 నాటికలు రాశారు. చలం నవలల్లోని స్త్రీపాత్రల్నీ, వారి సంభాషణల్నీ తీసుకుని, వారి జీవితానుభవాలను వారు ముచ్చటించుకుంటున్నట్లు ఓల్గా ప్రయోగాత్మకంగా ‘వాళ్ళు ఆరుగురూ’ అనే నాటకాన్ని రచించి, ప్రముఖ రచయిత్రుల చేత ప్రదర్శింపచేశారు. అది ఆంగ్లంలోకి కూడా అనువదితమైంది.
ఇతర ముఖ్య సాహిత్య ప్రక్రియలలో జీవితచరిత్ర, లేదా ఆత్మచరిత్రని ముందుగా చెప్పుకోవాలి. భండారు అచ్చమాంబ ‘అబలా సచ్చరిత్రమాల’ అనే పేరున స్త్రీల జీవిత చరిత్రను రాసిన ప్రథమ మహిళ. ఇందులో, పౌరాణిక, దేశ చారిత్రక స్త్రీల జీవితాలనే కాక విదేశీయ స్త్రీలలో ప్రసిద్ధిచెందిన కొందరి జీవితాలను కూడా చిత్రించారామె. ఇల్లిందల సరస్వతీదేవి తెలంగాణాలోని ప్రముఖ రాజకీయవ్యక్తులు పదిమంది స్త్రీలతోసహా వారి గురించి రాసిన గ్రంథం ‘తేజో మూర్తులు’. డా. వాసా ప్రభావతి ‘స్వాతంత్య్ర సమరంలో స్త్రీలు’ అనే విలువైన గ్రంథాన్ని రాశారు. తెలుగు అకాడమీ ప్రచురించిన ‘తెలుగు సాహితీ మూర్తులు’ అనే గ్రంథంలో నలుగురు ప్రసిద్ధ మహిళల్ని – భండారు అచ్చమాంబ మొదలుకుని ఇల్లిందల సరస్వతీదేవి వరకూ చేర్చారు డా. ముక్తేవి భారతి. దాదాపు పదిసంవత్సరాల క్రితం ‘అస్మిత’ అనే సంస్థ సాహిత్య, సాంస్కృతిక, సామాజిక, రాజకీయరంగాల్లో 20వ శతాబ్దం నుంచి నేటి వరకూ ప్రసిద్ధులైన కొందరు మహిళల గురించి సంక్షిప్త సమాచారాన్ని ఫోటోలతో సహా ‘మహిళావరణం/వుమెన్స్ కేప్’ అనే బృహత్ గ్రంథాన్ని ప్రచురించింది.
ఆ తరవాత ఇంతవరకు మనకి రచయిత్రుల సమాచార సూచిక కూడా సమగ్రమైనది రాలేదు – 1960లలో సంక్షిప్తంగా కొద్దిమంది రచయిత్రుల గురించి కె. రామలక్ష్మి తయారుచేసినది తప్ప. ఒక సమగ్ర సమాచార సూచికని తయారు చెయ్యడానికి కొందరం ప్రయత్నం చేసినా ఫలించలేదు.
ప్రత్యేక జీవితచరిత్రలలో- కనుపర్తి వరలక్ష్మమ్మ ‘కందుకూరి రాజలక్ష్మమ్మ గారి చరిత్ర’ రాశారు ‘సౌదామిని’ ‘నేనూ- అప్పారావు గారు’ అనే ఆత్మచరిత్ర రాశారు. కోడూరి లీలావతీదేవి ‘కుంకుమరేఖ’ అనే పేరుతో కస్తూరిబా గాంధీ గురించీ, ‘ఇంద్రధనస్సు’ పేరుతో సరోజినీనాయుడు జీవితచరిత్రా రాశారు. మల్లాది సుబ్బమ్మ గారు ప్రచురించిన ఆత్మచరిత్ర ‘పాతివ్రత్యం నుంచి ఫెమినిజందాకా’. భానుమతీ రామకృష్ణ ‘నాలో నేను’ అనే శీర్షికతో ఆత్మచరిత్ర రాయగా, శారదా అశోకవర్ధన్ ‘భానుమతీ-నేను’ అనే గ్రంథం రాశారు. కేంద్రసాహిత్య అకాడమీ ప్రచురించిన జీవితచరిత్రల్లో ‘నుపర్తి వరలక్ష్మమ్మ’ గురించి పోలాప్రగడ రాజ్యలక్ష్మి గారూ, ‘ఇల్లిందల సరస్వతీదేవి’ గురించి డా. ముక్తేవి భారతి గారూ రచించినవి ఉన్నాయి. సి.పి.బ్రౌన్ అకాడమీ తరపున ‘దుర్గాబాయి దేశ్‌ముఖ్’ జీవితచరిత్రని ఇంద్రగంటి జానకీబాల రాశారు. ఇటీవల శోభాపేరిందేవి వ్యక్తిగతంగా రాసిన జీవితచరిత్ర ‘ఆమె ఓటమిని ఓడించింది’ అనే గ్రంథం- ‘అభినందన’ భవాని గురించి రాసినది.
తెలుగులో యాత్రా చరిత్రలు రాసిన మహిళలు తక్కువగానే ఉన్నారు. కాంచనపల్లి కనకాంబ ‘కాశీయాత్ర చరిత్రము’, డా. నాయని కృష్ణకుమారి ‘కాశ్మీర దీపకళిక’, డి. కామేశ్వరి ‘నా విదేశానుభవాలు’, డా. వాసా ప్రభావతి ‘రష్యాయాత్రానుభవాలు’, ద్వివేదుల విశాలాక్షి ‘నా విదేశానుభవాలు’, అనే రచనలతోపాటు నేను రాసిన ‘చైనాలో ఛాయా చిత్రాలు’ అనే యాత్రా చరిత్ర కూడా ఉంది.
బాలసాహిత్యంలో కృషిచేసిన రచయిత్రులలో ఆనాటి నుంచి నేటివరకూ, వేదుల మీనాక్షీదేవి, కోడూరి లీలావతీదేవి, యల్లాప్రగడ సీతాకుమారి, ఇల్లిందల సరస్వతీదేవి, సత్తిరాజు రాజ్యలక్ష్మి, తురగా జానకీరాణి, శారదా అశోకవర్ధన్, డి. సుజాతా దేవి, దావులూరి జయలక్ష్మి, మల్లాది పద్మావతి, ఆకెళ్ళవెంకట సుబ్బలక్ష్మి, శివలక్ష్మి మొదలైన వాళ్ళున్నారు.
సృజనాత్మక సాహిత్యంలో లేఖారచన కూడా ఒక ముఖ్యభాగం. లేఖారచనని ప్రప్రథమంగా, సమర్థవంతంగా చేపట్టిన తెలుగుమహిళ కనుపర్తి వరలక్ష్మమ్మ. ఒక మిత్రురాలికి లేఖల రూపంలో సామాజిక సమస్యల గురించీ, సంస్కరణగురించీ చర్చిస్తూ వివిధ పత్రికలలో ‘శారద’ పేరుతో ‘నెచ్చెలి’ కి రాసిన లేఖల సంపుటం ‘శారద లేఖలు’. సమాజంలో స్త్రీల పరిస్థితి గురించీ, దేశభక్తి గురించీ మాగంటి అన్నపూర్ణాదేవి భర్తకి రాసిన లేఖల్ని భర్త ప్రచురించారు. ఆ లేఖల్లోని సూక్తుల్నీ, హితోక్తుల్నీ అయితం సోదరీమణులు- ఇందిరాదేవి, భారతీదేవి పద్యాల్లో సుభాషిత రత్నావళి రాశారు. ఆహ్వానం మాసపత్రిక సంపాదకురాలు ఎస్.ఎస్. లక్ష్మికీ, ప్రముఖ సాహితీవేత్త, తత్త్వవేత్త సంజీవదేవ్‌కీ మధ్య సాగిన లేఖల సంపుటి కూడా ప్రచురితమైంది. మా నాన్న గారికీ నాకూ మధ్య మూడు దశాబ్దాలపాటు సాగిన ఉత్తర ప్రత్యుత్తరాల ఆధారంగా ‘మృత్యుంజయ’ అనే చిన్న పుస్తకాన్ని రాశాను నేను ప్రయోగాత్మకంగా ఒక నవలికలాగ.
సాహితీ ప్రక్రియలలో వ్యాసరచన అతిముఖ్యమైనది. సాహిత్య వ్యాసాలూ, ‘కాలమ్స్’ రూపంలో వ్యాసాలూ, వ్యాఖ్యలూ చాలామంది రాసిన అనేక సంపుటాలు వెలువడ్డాయి. ఇవికాక, పిహెచ్.డి. డిగ్రీ కోసం రాసిన పరిశోధనా వ్యాసాలు కూడా మహిళలు రాసినవి చాలా వెలువడ్డాయి. ప్రముఖ కవయిత్రులూ, రచయిత్రులూ, రచయితలూ, సంస్కర్తలపై రాసిన పరిశోధనా గ్రంథాలు అవి. డా. వెలుదండ నిత్యానందరావు చేసిన సంకలనంలో వీరి విశేషాలు తెలుస్తాయి.
ఎన్ని ప్రక్రియల్లో రాసినా, హాస్యరచనలు చేసే రచయిత్రులు చాలా అరుదు. వాళ్ళని వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. భానుమతీ రామకృష్ణ, మృణాళిని, సోమరాజు సుశీల, పొత్తూరి విజయలక్ష్మి, చింతపెంట కమల చెప్పుకోదగిన హాస్య, వ్యంగ్య రచయిత్రులు.
అనువాదాల ద్వారానే తెలుగు సాహిత్యం ఇతర భాషల వారికి తెలిసి వస్తుందని అందరికీ తెలుసు. కానీ అనువాదాలు తెలుగునుంచి ఇతర భాషల్లోకి జరిగేవి చాలా తక్కువే. ఇప్పుడిప్పుడే కొంత కృషి జరుగుతోంది. తెలుగునుంచి ఆంగ్లంలోకి అనువాదం చేసే మహిళలు విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులైన అల్లాడి ఉమ, విజయశ్రీ, జయశ్రీ మోహన్‌రాజ్, సునీతారాణి ఉన్నారు. తెలుగునుంచి హిందీలోకి అనువాదం చేసే ప్రముఖ మహిళ ఆర్. శాంతసుందరి. తమిళంలోకి అనువాదం చేస్తున్న శాంతాదత్, ఒరియాలోకి చేసే ఉపద్రష్ట అనూరాధ, ఇంకా ఇతర భాషల్లోకి చేసేవారూ ఉన్నారు అక్కడక్కడ.
ఇతర భాషల నుంచి తెలుగులోకి అనువదించిన మహిళలూ అనువదిస్తున్న మహిళలూ చాలామంది ఉన్నారు. స్వాతంత్య్రానంతరం మాలతీ చందూర్ ఇంగ్లీషు నుంచి అనేక ప్రసిద్ధ నవలల్ని సంక్షిప్తంగా అనువదించి తెలుగు పాఠకులకు పరిచయం చేశారు. ఇప్పుడు మృణాళిని చేస్తోంది. తమిళం నుంచి మాలతీ చందూరు కొన్ని ప్రసిద్ధ రచనల్ని, నవలల్ని అనువదించారు. సుజాతా పట్వారీ కన్నడ నుంచి యు.ఆర్. అనంతమూర్తి నవల ‘సంస్కార’ తెలుగులోకి అనువదించారు.
అన్ని ప్రక్రియలలోనూ ఎంతోమంది రచనలు చేస్తూ ప్రసిద్ధులైన వారున్నారు. అందరినీ పేరుపేరునా ప్రస్తావించడం అసాధ్యం- ఎంతగా కోరుకున్నా.
మొత్తంమీద తెలుగు సాహిత్యంలో మహిళలు ప్రముఖ స్థానంలో ఉన్నారని అంగీకరించక తప్పదు. కానీ తెలుగు సాహితీ సంకలనాల్లో మహిళల ప్రాతినిధ్యం తక్కువే. పదిశాతం కూడా ఉండటం లేదు. రచయిత్రుల విడి సంపుటాలూ, ప్రత్యేక సంకలనాలూ ఆ లోటుని పూర్తి చేస్తున్నాయి కొంతవరకు.
(శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం 110వ స్థాపన దినోత్సవం సందర్భంగా 2.9.2010 నాడు చేసిన ప్రసంగంకోసం రాసిన వ్యాసం)
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
మీ వ్యాసం చాలా బాగుంది.
అభినందనలు.
(ఈ సంచిక అద్భుతం. అన్ని వ్యాసాలు అద్భుతంగా ఉన్నాయి. అందరికి అభినందనలు.)
అబ్బూరి ఛాయాదేవి గారు,
సుమారు పది సంవత్సరాల క్రితం “జిడ్డు క్రిష్ణమూర్తి” గారిపై మీరు రాసిన పుస్తకాలు చదివాను.
ఆ పుస్తకాలు నాపై చెరగని ముద్రవేశాయి.
ఇతరులకు సలహాలు ఇచ్చేంత గొప్పవాన్ని కాను.
ప్రతి ఒక్కరు ఈ పుస్తకాల్ని చదవాల్సిందిగా కోరుతున్నాను.