కొండేపూడి నిర్మల
హమ్మయ్య! ఎలాగైతేనేం పంట పొలాల్లో చీడపీడల్ని వదిలించుకోవడానికి సులభమైన మార్గం దొరికింది. రైతక్కలారా, అన్నలారా! మీరింక, అన్నలారా! ఎరువుల బస్తాల కోసం ఎదురుచూడక్కర్లేదు. బ్లాక్ మార్కెట్టు ముందు ధర్నాకు దిగక్కర్లేదు. శాంతి భద్రతల సమస్య కింద లాఠీ దెబ్బలు తినక్కర్లేదు.
అసలేమీ అక్కర్లేదు…వినాయక లడ్డు ఒకటి కొనుక్కొండి. మీ పొలాల్లో చల్లుకోండి. కరెంటు బావుల్లో చల్లుకోండి. దీనివల్ల మీ కుటుంబమే కాదు. గ్రామం, రాష్ట్రం, దేశం కూడా బాగుపడతాయిట. ఏడాదికి నాలుగు పంటలు పండుతాయట. లడ్డూలే కదా అని సెనగపిండి, పంచదార పాకంపట్టి ఇంట్లోనే వుండకట్టి తయారు చేసుకునేరు. అదేం కుదర్దు. అందుకే మీరసలు బాగు పడ్డం మానేశారు. హైదరాబాదు వెళ్ళి అక్కడ బాలానగర్లో వేలంపాట పాడుకోవాలి. లేదా గుంటూరు జిల్లా నకిరేకల్లు గాని ఇంకెక్కడికైనా గానీ వెళ్ళండి. వేలంపాటల్లో దొరికిన దాన్నే లడ్డూ అంటారు. ఇంట్లో ఇల్లాలు చేసినది గాడిద గుడ్డు అన్న మాట.
ఎంతకి పాడాలీ అంటారా..? అబ్బే, ఎంతో కాదండి ఆప్ట్రాల్ అయిదున్నర లక్షలు. అదేమిటలా మొహం పెట్టారు? అంత డబ్బుల్లేవా, అప్పుడు ఇల్లూ వాకిలీ అమ్మేయ్యండి, అప్పు చేయండి. పావలా వడ్డీ అయితే ప్రభుత్వం దగ్గరే దొరుకుతుంది. ఫ్యాక్టరీలకోసమో, ఫ్లై ఓవర్ల కోసమో, కారు షెడ్ల కోసమో, గుండాల శిలా విగ్రహాల కోసమో ఎన్ని సార్లు మీ జాగాలు వదులుకోలేదు…? ఇప్పుడు తిరుపతి, సారీ వినాయక లడ్డూ కోసం వదులుకోండి (అన్నట్టు తిరుపతి లడ్డుకి వినాయక లడ్డూకి పోటీ పెడితే ఏది గెలుస్తుందంటారు. కోడి పందేలాట ఏర్పాటు చేద్దామా..? తిరుపతి లడ్డుకి పరపతి తగ్గినట్టుగా విన్నాను. నిజమేనంటారా..?) ఈ లడ్డు మహత్యంతో మీ జాతకం గిర గిర తిరిగిపోతుంది. ఒట్టు.
అదిగదిగో అయన్ని చూడండి. ఎవరో చాలా పెద్ద వ్యాపారిట. లడ్డూను తక్కించుకున్నందుకు తన జీవితాశయం నెరవేరిపోయిందిట, జనాల భుజాల మీద ఊరేగుతూ ఎంత తన్మయంగా చెబుతున్నాడో చూశారా, అసలు ఆయన నెత్తి మీద , అంతకంటే పెద్దదిగా లగ్జరీ ప్యాక్‌లో వున్న లడ్డూను దర్శించండి. దాన్ని చూసినా , తాకినా, గాలి తగిలినా, వాసన పీల్చినా చాలని ఎంత మంది తోసుకుంటున్నారో కదా. బక్కవాళ్ళని బలంగల వాళ్ళు ఎలా తొక్కేస్తున్నారో చూడండి. పోతే పోయింది వెధవ ప్రాణం. లడ్డు కంటే ఎక్కువ ఏమిటి అనుకుంటున్నట్టూగా వున్నారంతా…? నిమజ్జనంలో జరిగిన అపశ్రుతులు నెమ్మదిగా రేపు తెలుస్తాయి లెండి…గుంపులో గొలుసులు పోయిన వాళ్ళు, ప్రాణాలు పోయినవాళ్ళు, సగం మానం పోయిన వాళ్ళు, గుంపులకి దూరంగా సొంత పని మీద ఎక్కడికీ వెళ్ళలేక నిస్సహాయంగా నిలబడిపోయిన వాళ్ళు, అంబులెన్సులో ఆగిపోయి కొన వూపిరి వదులుకున్న వాళ్ళు తెల్లారేసరికల్లా వార్తలయిపోతారు. ఇవాళంతా భక్తే భక్తి. భక్తంటే తొడ తొక్కిడి, భక్తంటే వ్యాపారం, భక్తంటే డబ్బు. అవును కదా డబ్బు చేసిన వాళ్ళకి భక్తి కుదురుతుంది.. రామదాసు లాంటి పేద భక్తుడు కూడా జైలుకెళ్ళాక గానీ తను ఓవర్ యాక్షన్ చేసినట్టు తెలుసుకోలేకపోతాడు ”ఎవడబ్బ సొమ్మని కులుకుతు తిరిగేవు రామచంద్రా” అని పాడతాడు. ఆ దేవుడు అప్పుడూ పలకడు. ఇప్పుడూ పలకడు.
తన పేరిట వున్న మాన్యాలు దోపిడీ చేస్తున్న దేవాదాయ శాఖని చూళ్ళేక, కళ్ళకి అడ్డంగా నామాలు దిద్దుకుని కూచున్నాడు.
అదిగో.. అక్కడ మొత్తం లడ్డు దక్కించుకున్నంత ఎ క్లాసు అదృష్ట జాతకులు కాకపోయినా, రాలిన విబూదినీ, కుంకుమనీ దక్కించుకున్న బి క్లాసు జాతకులు మాట్లాడుతున్నారు వినండి, ఒకరికి వెన్ను నొప్పి తగ్గిపోయిందిట, ఒకరికి చర్మరోగం మాయమై పోయిందట. ఇంకొకరు అనుకోకుండా గర్భవతి అయ్యారట. గర్భవతులు కాని వాళ్ళకు ఇన్నాళ్ళుపాటు స్వామీజీలు, బాబాలు తోడ్పడ్డారు. ఇప్పుడు, విబూది ఫర్టిలిటీ క్రీమ్‌గానూ, కుంకుమ పెయిన్ బామ్‌గా పనికొస్తుందని తెలిసొచ్చింది.. వైద్యులూ వింటున్నారా…? సారీ, మీరు కూడా ఇదే గుంపులో వుంటే నేను డిస్ట్రబ్ చెయ్యను. క్రిందటిసారి బాలానగర్ వేలం పాటల్లో లడ్డూ దక్కించుకుని ఒక మహిళ అదృష్టవంతురాలయ్యింది. ఆవిడ్ని అభినందిస్తూ ఒక ఛానల్ వాళ్ళు చేసిన ఇంటర్వ్యూ వల్లనే నాకింత జ్ఞానోదయం అయింది.. లడ్డు దక్కించుకోవడంద్వారా తను మహిళా సాధికారత సాధించినట్టూ సగర్వంగా ఒప్పుకుంది. ఆ లడ్డూని చిదిమి చల్లడంవల్ల తన పంట పొలాల్లో ఎలకలు ఎలా పారిపోయాయో, కష్టాలన్నీ ఎలా తొలగిపోయాయో చెప్పింది… అదేమిటి ఎలక వినాయక వాహనం కదా, తన స్వామి ప్రసాదం దెబ్బకి తనే పారిపోవడమేమిటి అని లీగల్ పాయింట్లు తియ్యకండి. ప్రశ్నించేవాడికి మంత్రం పనిచెయ్యదుట..
అసలు ఈ సారి కూడా ఆవిడే గెలవాల్సి వుండగా మోసంతో ఇంకెవరో పురుషుడు తక్కువకి వేలం పాడి కూడా గెలిచిపోయాట్ట్డ… అది మహిళా లోకానికి జరిగిన అన్యాయంగా భావించి దేశ వ్యాప్తంగా ఆందోళన చేస్తానని ఆవిడ శపథం చేసింది. పనిలో పనిగా ఈ సారి ఆ లడ్డూ దక్కించుకున్న వారికి దాన్ని దక్కించుకున్న ప్రయోజనం లేకుండా పోతుందని శాపం కూడా పెట్టేసింది..సో.. ఔత్సాహిక నిర్మాతలు ఎవరైనా దీన్ని సినిమా తీసుకోవచ్చు. అసలు వినాయకుడు లాంటి పర్సనాలిటీ ఎలక మీదెక్కి కూచోవడమే ఒక హింస కాదా అని లోపల్లోపల నాకో సందేహం.బ్లూక్రాస్ అమల ఎందుకనో ఈ విషయం పట్టించుకున్నట్టు లేదు.
కానీ బండ హీరోలతో డ్యూయెట్లు పాడించిన బక్క హీరోయిన్ల ముఖ కవళికలు తెర మీద చూశాక మన వాళ్ళకి జీవకారుణ్యం కూడా అంతంత మాత్రమేనని తేలిపోయింది.
భూమి గుండ్రంగా వుందని మొదట కనిపెట్టిన వాడెవరో, కాన్సరుకి మందు కనిపెట్టినవారెవరో, ఆకాశంలో పిట్ట మాదిరి మనిషి రెక్కల సాయంతో ఎగరడం కనిపెట్టినవాడెవరో, ఎవరెస్టు ఎక్కిన వాడెవరో మనకి అక్కర్లేదు.
లడ్డు సాధించిన వాళ్ళ చరిత్ర, వీర చరిత్రలాగా స్క్రోలింగులో వస్తోంది. రేపు గ్రూపు వన్‌లో అడుగుతారేమో గుర్తుంచుకోండి.
మీకేమిటంత అసూయ..? కావాలంటే ఒక లడ్డూ కొనుక్కోండి. సారీ దక్కించుకోండి అని నన్ను అంటున్నారా…? అనండి ఫర్లేదు. సారా పర్మిట్టు దక్కించుకోవాలన్నా, సిమెంటు కుంభకోణాన్ని దాచిపెట్టాలన్నా, భూ కబ్జా లెక్కలు మాయం చెయ్యాలన్నా సొంత ప్రభుత్వం వుండాలి. అప్పుడు పుణ్యపు లడ్డు సాధించినంత గొప్పగా బతకచ్చు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం సొంతదెలా అవుతుంది అని పిచ్చి ప్రశ్నలు వేయకండి. కావాలంటే వినాయక వ్రత కథ చదవండి. అది మానవాళికి ఆదర్శమని అయ్యవారు మొదటి పూజ రోజునే చెప్పారా లేదా…?
తల్లిదండ్రులు న్యాయ నిర్ణేతలుగా వున్నారు కాబట్టి, తమ్ముడైన వెర్రిబాగుల కుమారస్వామిని ముల్లోకాల్లోనూ వున్న నదులన్నిటా మునిగి రమ్మని అటు పంపించి, తను ఎటువంటి శ్రమా పడకుండా కేవలం కుర్చీ కొట్టేసిన వాడు కాపట్టి నాయకుడు.
అంటే పాఠం చెప్పిన ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి పరీక్ష రాయకుండానే మార్కులు వేయించుకున్నట్టు వుందా, లేదా..?
భార్యని శాంతింపచేయడానికి ఉత్తర దిక్కున నిద్రించే ఏనుగు తల నరికి తెచ్చి కొడుకు మెడ మీద అతికిన పరమ శివుడి చర్య ఎలా వుంది..?
గుట్టు చప్పుడు కాకుండా జనరల్ వార్డు పేషంటు కిడ్నీ తీసేసి అస్మదీయుడి పొట్టలో పెట్టి కుట్టేసినట్టుగా వుంది, లేదా?.?
చవితి నాడు చంద్రుడ్ని చూసిన వాళ్లంతా నీలాపనిందల పాలవుతారని జగన్మాత పెట్టిన శాపం ఎలా వుంది..?
ఎదురు తిరిగిన వాడి తలకి వెలకట్టి గ్రామాలకు గ్రామాల్నే నిద్రాహారాలు లేకుండా చేసిన పోలీసు వ్యవస్థలా వుందా, లేదా..?
తండ్రిని చంపి అతని కూతురు శమంతకమణిని ఎత్తుకు పోవడంలో కృష్ణ పరమాత్మకి వున్న దేమిటి…? మోహమా..? సంపదల దాహమా..?
అన్నిటికీ కూడా ఏదో ధర్మ పన్నాగం వుందంటరా…? నాది మరీ చిన్న బుర్ర కాబట్టి అసలే సూక్ష్మం బోధపడ్డం లేదా..?
ఏమోనండీ మరి, నాకు తెలిసినంత వరకు ఎంత గొప్ప లడ్డూ అయినా అయిదో రోజుకి బూజు పడుతుంది. నిలవ వుండడం కోసం ఏ రసాయనమో కలిపితే అది వ్యాపారం అవుతుంది. నీ వ్యాపారం నా శారీరక మానసిక ఆరోగ్యాల్ని పాడు చేస్తుంటే అది కేసవుతుంది. కేసుని కేసు అనకుండా మహత్యం అనో, ఆ మహత్యమే మన పరువు ప్రతిష్ఠ అనో, జాతి సంస్కృతి అనో ఎవరు చెప్పినా గాని తక్షణమే అనుమానించాలినిపిస్తుంది.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
ప్రశ్నించే వాడికి మంత్రం పని చెయ్యదని చెప్తూనే, చదివే వారి మదిలో బోలెడన్ని ప్రశ్నల్ని రేపిన “వినాయక లడ్డూ” అందర్నీ ప్రసాదం లడ్డూల గురించి ఆలోచించమంటుంది.చాలా బాగుంది.
చాలా చాలా చాలా బాగుంది.
`సరదాగా` ఉంది.
భారతీయుల తెలివితక్కువతనాన్ని
చక్కగా వివరించారు.
“కొత్త మందుకు అభినందనలు..
రైతులకు ఇక లేవు ఎరువుల తిప్పలు”..
నిర్మ ల గారు
వినాయకుడీ “లడ్దు వేలం పాట మీద మీకొచ్చిన విసుగు సమాజానికి జరిగే నష్టం
ప్రజల మూర్ఖ్ త్వం మీ అస హనం అర్ధం అయ్యింది .కాని పురాణాల్ని నేటీ ద్రుష్టి
కొణంతొ చూస్తూ ఏదొ కొత్త విష్యం కనిపెట్టామని,మన దేవుళ్ళని సంప్రదాయాల్ని
హస్యంగా రాసినంతమాత్రాన ఒరేగేదేమి లేదు.సమ స్య పై ఆలొచనలు పదునేక్కేలా
రాయండి లేక పొతే మీకు మిగిలేది “పెన్నుశొష”
భామతి