రాజీవ
మహిళా సంఘాలు మెరుపుతీగల్లా
కిలకిలా రావాలతో లోపలికి వచ్చారు –
ఉన్నారాండీ! యీ కవి సమ్మేళనం
కేవలం మీ పరిచయం కోసమే –
నా ఊపిరి ఆగినట్లయింది.
షర్టు వేసుకుంటూ మా వారు –
లుంగీ దోపుకుంటూ మామగారు
పుస్తకంతో ఓ మరిది – ఫైలుతో మరో మరిది,
దోసలేస్తూ, అత్తగారు పిండిగంటెతో
ఒక్క ఉదుటున హాల్లో నిండిపోయారు.
సంగం వాళ్ళు అందర్ని చూసి ఉన్న
యిద్దరాడాళ్ళలో అత్తగారో, కోడలో
కవయిత్రి ఎవరో తెల్చుకోలేక – క్రాంతి! అన్నారు.
క్రాంతి మా యింట్లో ఎవరూ లేరమ్మా –
కవిత్వాలు, నాట్యాలు ప్రోగ్రాములు మా ఆడాళ్ళకలవాటు లేవు.
అన్నారు కాస్త ఠీవిగా, గర్వంగా మా మామగారు
నిండు గర్భిణి నైన నన్ను – నయాపైసంత బొట్టుతో –
మడి కట్టుకొని అట్లకాడతో నలభయ్యో పడిలోని మా అత్తగారిని
మరోసారి చూసి – సారి అండీ – అడ్రస్ యిదే ఉంది –
అంటూ అనుమానంగా మావంకె చూసుకుంటూ వెళ్ళారు.
వంటగదిలోకెళ్ళిన నన్ను మా అత్త దగ్గరకు తీసుకుంది.
పెళ్ళిచూపుల్లో పెద్దలు పాటపాడమంటే
హార్మోనియం మీద ”మరుగేలరా ఓ రాఘవా”
అంటూ తాళయుక్తంగా నేను పాడిన పాటకు తన్మయులయ్యారు.
చూడు క్రాంతి – అదే నా ఆఖరి పాట –
పెళ్ళయ్యాక కూనిరాగం తీసినా యింక ఆపు –
పగటి పాట పని చెరుపు – రాత్రి పాట నిద్ర చెరుపు
అంటూ మీ మామగారు నా గొంతు నొక్కేసారు.
మా అత్తగారు గుండెలో అణచబడిన ఆవేదన
ఒకే జాతి పక్షిని గుర్తించింది –
టిఫిన్ రడి కాలేదా? ఆఫీసు టైం అయింది –
బాప్‌రే – వెనక మా శ్రీవారి గర్జన!
నెలలు నిండబట్టో – పరుగులాంటి నడకబట్లో
మావారికి టిఫిన్ ప్లేటు అందించి,
”అమ్మా” అంటూ కడుపు పట్టుకొని ఒరిగిపోయాను.
మళ్ళీ ఆడపిల్ల – పెద్దదానికి ఏడాదిన్నర
గతం కండ్లముందు కదలాడింది –
మోహెపన్‌గట్ పే నందలాల్ ఛేడుగయోరే –
అంటూ నా నాట్యం కాలేజి వార్షికోత్సవానికే హైలైట్!
దిమ్మెరపోయిన మా ఆయన అందరిలాగే మధుబాల కంటే మిన్న!
మామగారు, నాన్నగారు కాలేజి వ్యవస్థాపకులు –
కుటుంబపరిచయాలు కులగోత్రాలు కట్న కానుకలు
సమ ఉజ్జీలు కావడంతో ఏ గొడవ లేకుండా వివాహం అయ్యింది.
నాగదిలో ఓసారి రేడియోలో మోహెపన్ గట్ పే –
పాట వినబడగానే ఆవేశం కట్టలు తెంచుకొని నాట్యం గంతులేసింది.
త్రుళ్ళిపడ్డాను – నా భర్త అరుపు విని! నా ఉనికే మరిచిపోయావా.
ఇదేం మెహందీ ఖానానా – సంసారుల యిల్లు – తెలియదా!
అదే నా నాట్యానికి ముగింపు – నా కాళ్ళు మా కాలేజికి –
చరిత్రపాఠం తిరగతోడి – యింటికి – అలవాటు పడ్డాయి.
పన్నెండేళ్ళు గడిచాయి – పిల్లలిద్దరూ ఏపుగా ఎదిగారు.
వాళ్ళ స్కూల్ వార్షికోత్సవం – హెడ్‌మాస్టర్ –
ఆహ్వానంతో పాటు స్వయంగా వచ్చి ఆహ్వానించారు.
మా కుటుంబమంతా – మరుదులు, వారి భార్యలు
పసిపిల్లలతో సహా అత్త మామ నేను మావారు వెళ్లాం.
పెద్ద పాప ”మోహెపన్ గట్ పే…” అంటూ ప్రేక్షకులకు
అక్బర్ బాదుషా దర్బారులో కన్నయ్య రాధికల సారాగాలందించింది.
అయితే చిన్నపాన ”ఐ లవ్ యు – యు లవ్ మి”
లెటజ్ ప్లే ద గేమ్ ఆఫ్ లవ్ అంటూ భీట్స్ మీద అదరగొట్టేసింది.
ఓపెన్ ఎయిర్ థియేటర్ వేల ప్రేక్షకుల చప్పట్లు తారాజువ్వలయ్యాయి.
గతం మరిచారేమో – పిల్లల్ని ముద్దులతో ముంచేసారు.
కాలంతో మారారో – కొత్త సభ్యుల చేరిక చైతన్యమో
నేను మా అత్తగారి అజ్ఞాత కృషి ఫలితమో
ప్రస్తుతం చర్చించడం అనవసరం.
నా కలం
ఆకుతోట జయచంద్ర
స్వార్థ రాజకీయాలను ఖండించే
ఖడ్గం కాదు నా కలం
అణగారిన జీవితాలకు ఆశాజ్యోతి
కాదు నా కలం
విప్లవవీరుడి కొడవలిని
పదునెక్కించే ఆకురాయి
కాదు నా కలం
స్త్రీవాదాన్ని సమర్థ్ధించే
ఉక్కుపిడికిలి కాదు
నా కలం
మంచి స్పృశిస్తూ…
చెడుని ఖండిస్తూ…
స్వేచ్ఛ, సమానత్వాలను
సిరాగా మలుచుకొన్న
ఒక సాదాసీదా
భారతీయుని
ఆశలు, కలల్లోంచి
చిగురించిన
అంకురం
నా కలం
మహిళా మహోత్సవం
కోపూరి పుష్పాదేవి
అనాదిగా అణగదొక్కబడినా
అణచివేతలే ఆలంబనగా
ఆయుధమై మొలకెత్తింది మహిళ
ఆత్మవిశ్వాసమే ఊపిరిగా
ఆకాశమంత ఎత్తుకి ఎదిగింది అతివ
చదువెందు కన్నారు…
చాకలి పద్దులకు పరిమితి చేశారు
బలమెందు కన్నారు…
తాము బరితెగించారు
ఆస్తిపాస్తు లందనివ్వక
అఘాయిత్యాలు చేశారు
బంగారు బాల్యం బూడిద చేసి
భర్త చితిమంటల పడదోశారు
రూపసి అయితే కోపించారు
కేశములు ఖండించి మూలన కూర్చోపెట్టారు
జంతువులను మచ్చిక చేసుకుని
సర్కస్సాడించినట్లు
పిన్న వయసులో
”పెళ్ళి” అనే కాడి భుజానికెత్తారు
బంధాలూ, బాధ్యతల
బంగారు సంకెలలు వేశారు
అభివృద్ధి పథంలో పరుగులిడే కాళ్ళకు
నియమాల బంధాలు కట్టారు
ప్రేమ పేరుతో
కుత్తుకలుత్తరించారు
యాసిడ్ దాడులతో
ఉసురులు తీశారు
అన్నిరోజులూ మీవే కావు
మాకూ మంచిరోజులొచ్చాయి
పంజరం నుండి బయటపడిన పక్షులం మేము
స్వయంకృషితో సాధించాం
మేమేమిటో నిరూపించాం
సీత, సావిత్రులు మావాళ్ళు
కిరణ్‌బేడి, కల్పనా చావ్లాలు మావాళ్ళు
ఆకాశమే మాది
అవకాశాలన్నీ మావి
ఇప్పుడు ప్రపంచమే మాది
అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు.
పాత అధ్యాయం
మహమ్మద్ ఖాన్
ఋతువు ఏదైతేనేమి
పెదవులపై పూలు విరబూసేందుకు
కాలము నలుపయినా
తెలుపయినా, పూచే పూలకు అడ్డేముంది?
పెదవులపై పూలు పూయించడమంటే
కూలిపోయిన సామ్రాజ్య
బురుజుల శకలాల నడుమ
పచ్చటి వసంతాన్ని చవిచూడటమే!
బండరాతి సందుల పొరలలో
వేరయి చొచ్చుకుంటూ పోయి
ఓ మహా వృక్షమయి తల ఎత్తటమే!
తల ఎత్తిన వృక్షం
ఊడలు దింపి, తన దక్షతను
నల్‌దిక్కులకు విస్తరింపజేయటమే!
అన్ని ఋతువులకన్నా
వసంత ఋతువు మిన్న అన్నారు పెద్దలు
నా దృష్టిలో
పెదవులపై నునులేత రేఖలయి
విప్పారిన నిత్య వసంతమే, వసంతానికి మాతృక
కనిపించే గాయం మాట అలా ఉంచి
కనిపించని ఎద గాయాన్ని సయితము
బాధను మరిపించి
ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచే ప్రక్రియ, చిరునవ్వు
నవ్వు, మనిషికి దైవికంగా లభించిన వరం
నవ్వుతూ జీవించడం, నవ్వుతూ వీడ్కోలు పల్కడం
మనం నేర్చదగిన క్రొత్తగా కన్పించే పాత అధ్యాయం.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags