జూపాక సుభద్ర
మా లచ్చక్క వూరు ములుగు అడివి గ్రామం (వరంగల్). కొంత పోడు భూమి ఉంది. వ్యవసాయం జేస్తది. కూలినాలి పనులకు పోతది.అడివిల తునికాకు కోసెదానిక్కూడా పోతది. ఈ మధ్య ఏమైందో ఏమో లచ్చక్క వరంగల్‌ల్లో కారప్పొడి మిల్లుల పంజేస్తుందని తెల్సింది. యింత సడన్‌గా ఏమైంది? వలసమూల మా లచ్చక్కను కూడా విడువలేదు. కరువు పాడుగాను అని బాధపడుకుంట కలువనీకి బొయిన మిల్లుకాడికి. మిరపకాయలెండేస్తుంది ఎర్రటి ఎండల మా లచ్చక్క. ఆమెనట్లా చూడంగనే నాకు దుక్కమాగలే. ఒకరిమీద ఒకరంబడి బాగేడ్సుకున్నం. తర్వాత నేనే తేరుకొని ఏందక్కా ఏమైంది గీడికెందుకొస్తిరి? నాకు తెలువకుంట గీ పంజేద్దామనుకున్నరా, యిల్లు జాగొదిలిపెట్టి గంత కష్టమేమి వచ్చిందని గీ పనికొస్తిరి” అని అడిగిన కండ్లు తూడ్సుకుంట.
మా లచ్చక్క తన సొదంతా చెప్పుడు మొదలుపెట్టింది. ”ఏం జెప్పను సెల్లే అప్పులు పాడువడ అప్పులు జెయ్యవట్టి గీ గతిల వడ్డం. ఒకప్పుగాదు సోమారం పొద్దటి సిట్టీలోనికి, బుధవారం పొద్దటి సిట్టీలోనికి, మంగళారం మాపటి సిట్లీలోనికి, బ్యాంకోనికి అప్పులు గట్టాలె.
గా డాక్ర మహిళా గ్రూపులొచ్చిన కొత్తల మావాడదాకరాలే. వూల్లెది వూల్లెనే పంచుకుండ్రు, ఎంత నాలుగేండ్లయింది మా వాడకట్టోల్లం మహిళా గ్రూపుల జేరి ఓ…. మహిళ గ్రూపు జేర్తె బాగుపడ్తరు, మూడు పూటల మంచిగ తింటరు పైసకు కొత్తకు కొదువుండదు అని, బాకీలు వీజిగ, తక్కువ వడ్డికే దొర్కుతయి, అని వుదురగొట్టిండ్రు. రోజుకు రూపాయి కూడబెట్టి బ్యాంకులగట్టి మల్ల అప్పులు దెచ్చుకున్నం. కాని మనకున్న అవుసరాలకు బ్యాంకులు లోనులియ్యయి. వానికి గ్యారెంటీయ్యాలె, ష్యూరిటీ చూపియ్యాలె. కాల్లరిగే దాక బ్యాంకోని సుట్టు తిరుగాలె. బ్యాంకులు ఏమన్న మన వూల్లె వుంటయా మండలంబోవాలె. మండలం బొయివచ్చే కర్సులు వెయిరొండు వేలుయి తయి పనిజెడ తిరుగాలె. ఆ యిచ్చే లోనులు గూడ కొసిరి కొసిరి యిత్తరు. మల్లా తొంబయి తొమ్మిది కారణాలడుగుతడు. అవన్ని చెప్పేటాలకు గుండెల ప్రాణం గుటుక్కు మంటది. బ్యాంకోడిచ్చే లోను సేతికి మూతికి సాలదాయె. సెరువు లెండిపొయి పంటలు సరింగ పండుతలేవాయె, కూల్లు, నాల్లు గూడ దొర్కుతలేవాయె, ఎడ్లకు గడ్డి గర్క గూడ లేక బూములు బీడువడె – యిండ్ల దావుకాన కర్సులు, బువ్వకూరకు, బట్టబాతలకు అన్నిటికి అప్పుజేసుడైంది. బ్యాంకోడిచ్చేటియి ఏమిటికి మొదలు గాదాయె. గిట్లున్న పరిస్థితిల యింటి ముందటికొచ్చి తక్కువ వడ్డికి పైసలిత్తం తీసుకోండ్రి అని వచ్చిన సిట్టీలోల్లు కొత్తల దేవుల్లతీరు కనిపిచ్చిండ్రు. పొద్దుగాల సిట్టోల్లు, పొద్దుగూకి సిట్టోల్లు, సోమారం సిట్టోల్లు, మంగళారం సిట్లోల్లు వచ్చిండ్రు. మొగడు పెండ్లాలు దిగిన ఫొటో, ఒక రేషన్ కార్డు తెమ్మంటరు. ఆల్ల పద్ధతులు ఎట్లుంటయి అప్పుల సంగతులెట్లుంటయి, ఎట్ల అప్పుగట్టాలె, ఏ రోజు కట్టాలె ఎన్ని వారాలు కట్టాలె అని రెండు మూడ్రోజులు ట్రేనింగిస్తరు. వాల్లొచ్చిన రోజు లైనుగ నిలబడాలె. వాడప్పులిచ్చిన ఆడోల్లంత సేతులు గట్టుకొని రౌండుగ కూసోవాలె. ఏందో తప్పుజేసినోల్లను కూసోబెట్టినట్లు కూసోబెడ్తరు. మొదటిసారి అవుసరంల వుండి తెలువక తీస్కున్నం అప్పు. తర్వాత తెల్సింది సెల్లే… ఎములోల్లు నయం. అండ్ల యిరుక్కున్నమంటే కూసున్నా, నిల్సున్నావాని అప్పే బయపెడ్తది. కండ్లుమూసి తెరిసెటాల్లకే వారం రానే వస్తది. సేతిల సిల్లితూటు పైసుండది. పదైదుగాదు పావుల తక్కువైనా వూకోరు గాడుదులు. అవ్వనక్కను ఆడ్తరు. రౌడీలసోంటల్ల నేసుకొని వూరిమీదికొస్తరు వాల్లనెవ్వడాపడు. ఏ పోలీసోడు కూడా పట్టిచ్చుకోడు. యీ సిట్టీల బాడ్కావులకు గింత దయసెమలుండయి. యింటి మొగోల్లను కొడ్తరు. యిజ్జత్‌కి యాన్నన్నబొయి సావాలన్నంత హీన మనిపిస్తది. గ్రూపులున్న మహిళలతోని గూడ తిట్టిస్తరు ఎగదోస్తరు. ఓసెల్లే… వానప్పు పాడుగాను ఎములోల్లప్పే. ఎములోల్లన్న బాంచెన్ కాల్మొక్త అంటే యింటారేమో గాని యీ సిట్టీల కొడుకులు యిననే యినరు. ఆల్ల బయానికి కడుపునిండ తినలేము, కండ్లార నిద్రబోము. రూపాయి కర్సువెట్టేదానిగ్గూడ దైర్నం రాదు. బియ్యానికి బదులు నూకలు తిన్నం. కూరండితె పైసలు తక్కువ బడ్తయని తొక్కునూర్కొని తిన్నం. యిన్ని జేసినా ఆ సోమారపోని పొద్దటిసిట్టి, మంగలారపోని మాపటిసిట్టి తీర్పకపోయినం. మనుసుకు గింత నిమ్ముతం లేకుంట పంజేసి కట్టినా ఆల్ల బాకి తీరలే. అందికే మావాడల శానమందిమి తలుపులు తాళాలేసి గీకంపిండ్ల జేరినం. తినక తాగక గా సిట్టీలోల్లకే రక్తం దారబోస్తుంటిమి. గీల్ల బయాలతోని, దవుటుల్తోని జెరాలొస్తన్నయి. ఏం జెయ్యాలె. వారవారమందరం పైసలు జమచేసి బకాయినకిచ్చి మావూరికి తోలిస్తం. లేకుంటె యీడిగ్గూడొచ్చి మమ్ముల ఏజిత ఏజిత జేద్దురు. గీ బ్యాంకులు, గవురుమెంటు మంచిగుంటే యిల్లుపొల్లిడిసి గీ కానూరుకు ఎందుకొద్దుము గిట్ల ఎందుగ్గోస పడుదుము. గంజో గడ్కో తాగి వూల్లెనే వుందుము. గాసిట్టోలోల్ల తిట్లకు అవుమానాలకు సుట్టుపక్కలూర్లల్ల సచ్చిపోతుండ్రు. గియన్ని సిన్నకులపాడోల్ల మెడకే పడ్డయి. యీ సిగ్గుసాలయింది గాసిట్టీల తెరువుబోము సచ్చినా మంచిదే. మా రెక్కల కష్టమంతా తిన్నయి. నలభైవేలకు డెబ్బయివేలు కడ్తన్నం ఒర్రంగ, వారవారం గడ్తన్నం. ఏందో ఆడోల్ల పేరు మీద అప్పులు మొదలువెట్టి ఆడోల్ల వుసురు తీస్తండ్రు. డాక్రన్నరు, ఆడోల్ల సంగాలన్నరు, అప్పులిచ్చి నిలబెట్టి ఆడోల్ల సాదికార మన్నరు. గియన్ని ఆడోల్లని సంపనీకా సాదనీకా! ఈసారి బాకిగట్టుండ్రని లోనులిస్తమని యింటిముందటికొస్తె సీపురుకట్టల్తోని సింగారిత్తం.
(వూల్లల్ల మైక్రోఫైనాన్స్‌వాల్లను సిట్టీలోల్లంటరు. వాల్లకు పేర్లున్నా పొద్దటి చిట్టీలోడు, మాపటి చిట్టీలోడని నాల్లు స్వంతంగా పేర్లు పెట్టుకుంటరు.)
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags