ఇంట్లో ప్రేమ్‌చంద్‌ – 21

శివరాణీదేవి ప్రేమ్‌చంద్‌
అనువాదం : ఆర్‌. శాంతసుందరి
”అసలు మగాళ్లందరూ స్వార్థపరులే. స్త్రీల స్వభావంలో స్వార్థం లేదు. వాళ్లలో కూడా స్వార్థం చోటు చేసుకుంటే ప్రపంచమే తల్లకిందులైపోతుంది,” అన్నాను.
మా ఆయన ఆఫీసులో ఒక జ్యోతిష్కుడు ఉన్నాడని ఎలాగో మా వంటావిడకి తెలిసింది. ఒకరోజు నా దగ్గరకొచ్చి, ”ఆ జ్యోతిష్కుడిని అడిగితే మా వాడి జాడమైనా తెలుస్తుందేమో, అమ్మా!” అంది.
”అలాగే, చూద్దాంలే,” అనేసి ఆ బాధ్యత నెత్తికెత్తుకున్నాను. వెంటనే వెళ్లి మా వారితో ఆ విషయం ప్రస్తావించాను.
”ఏమిటి, నీక్కూడా జ్యోతిషం పిచ్చి పట్టుకుందా?” అన్నారు.
”నా నమ్మకం సంగతి అలా ఉంచండి. ఆవిడ అడుగుతోంది. ఆవిణ్ణి మీవెంట ఆఫీసుకి తీసుకెళ్లాంది, ఆయనతో తనే మాట్లాడుకుంటుంది.”
”దానివల్ల ఏమీ జరగదు,” అన్నారు.
”లేదు, నేను మాటిచ్చాను, తప్పదు.”
”సరే, అయితే నావెంట రమ్మను.”
”భోంచేసి ఆయన వెంట వెళ్లు,” అన్నాను.
”నాకు తినాలని లేదమ్మా…” అని నసిగింది. ”భోం చెయ్యి!” అని ఆయన గదమాయించారు.
ఇద్దరూ ఆఫీసుకి వెళ్లారు. ఆవిడ చెప్పిందంతా విని జ్యోతిష్కుడు, అబ్బాయి రెండు మూడరోజుల్లో వచ్చేస్తా పని ధైర్యం చెప్పాడట. వాడు నిజంగానే అలాగే వచ్చేశాడు. వంటావిడ మనసు కుదుట పడింది.
నేను అవతలివాళ్ల బాధ్యతనికూడా మీద వేసుకునేదాన్ని. పని ఎలాటిదైనా సరే, నేను బాధ్యత తీసుకున్న పనిని ఆయన తప్పకుండా చేసేవారు. నా మాట ఆయన వింటారో లేదో అనే ఆలోచనే నాకుండేది కాదు. అసలు నేను అనుకున్న పనులన్నీ జరిగిపోతుంటే అలాటి ఆలోచన ఎందుకు వస్తుంది? అందుకే ఈపని చెయ్యటం అవసరమా, కాదా అని కూడా ఆలోచించేదాన్ని కాదు. బహుశా ఒక పని నేను చెయ్యలేకపోతున్నానే బాధ నాకు కలగకూడదనే ఉద్దేశంతోనే ఆయన నేను చెప్పిన చిన్న, పెద్ద పనులన్నీ చేసేవారేమో! నేను ఓడిపోవటం ఆయన చూడలేకపోయే వారేమో! నా మీద ప్రేమతో, నేను ఆనందంగా ఉండాలని, తన పనులు కూడా వెనక్కి పెట్టి నా పనులు చేసేవారు. నేను చెప్పిన పనిని ఆయన చెయ్యకపోవటం అనేది మా సుదీర్ఘమైన దాంపత్యజీవితంలో ఒక్కసారి కూడా జరిగినట్టు నాకైతే గుర్తులేదు!
నాకు స్వాభిమానం ఎక్కువ. అది కాలంతో పాటు పెరిగింది. నా మనసులో మాట అంత త్వరగా ఎవరిదగ్గరా బైట పెట్టేదాన్ని కాదు. చివరికి నా అవసరాలని కూడా ఎవరికీ చెప్పుకునేదాన్ని కాదు. ఎవరైనా కాదంటే తట్టుకునే శక్తి నా మనసుకి ఉండేది కాదు. ఆ రోజులని తలుచుకుని ఏడవని రోజు లేదు! పాఠకులు ఇదంతా చదివి బాధ పడాలని నేనిది రాయటం లేదు. నేనిలా ఎలా తయారయానా, అనే ఆలోచనే నన్నిలా రాయిస్తోంది. కొంతవరకూ నా స్వభావమే అలాంటిది, ఆ పైన మా ఆయన కూడా నన్నలా తయారు చేశారు. అందరిళ్లలోనూ ఆడవాళ్లు ఉంటారు. భర్త ఇంట్లో మహా అయితే వాళ్లకి ఇంటి యజమానురాలి హోదా లభిస్తుంది. కానీ నేను ఇంటి యజమానురాలే కాదు, మా ఆయన హృదయసామ్రాజ్యానికే రాణినయాను. నాకు కావలిసిన పనులన్నీ ఆయన చేత చేయించేదాన్ని. ఇది నా గొప్పదనం కాదు, నాదేం లేదు, ఆ గొప్పంతా మా ఆయనదే!
జ    జ    జ
మా ఇంట్లో ఒక ముసలి పనిమనిషి ఉండేది, ఆమె రోజంతా ఇంట్లోనే ఉండేది. ఆమెకి ఎదిగిన కొడుకులు నలుగురుండేవాళ్లు, ఒక కూతురుండేది. కానీ ఒక్కరూ ఆమెకి ఇంత ముద్ద పెట్టేవారు కాదు. నెల తిరిగేసరికి ఎవరో ఒక కొడుకు వచ్చి ఆమెకొచ్చే జీతం పట్టుకుపోయేవాడు. ఒకరోజు నేనూ, మా ఆయనా కూర్చునుండగా పనిమనిషి కొడుకు వచ్చి డబ్బు పట్టుకుపోయాడు. ”ఈ ముసిల్దాని పిల్లలు మనుషులా, రాక్షసులా? నాకేం అర్థం కావటం లేదు. ఈ వయసుల ఈవిడ పని చెయ్యటమేమిటి? ఎద్దుల్లా ఉన్న ఆ కొడుకులు ఈవిడ డబ్బులు లాక్కుపోవటం ఏమిటి?” అన్నారాయన.
”ఏం చేద్దామంటారు?”
”నేననేది, వీళ్లకి అసలు సిగ్గూ శరం లేనే లేవా? తల్లిని వాళ్లు పోషించాల్సింది పోయి, అలా అసహ్యంగా నెలనెలా ఆవిడ జీతం డబ్బులు లాక్కుపోతారేమిటి?” అన్నారు.
”వాళ్లకి సిగ్గేమిటి? మహామహావాళ్లకే సిగ్గూ ఎగ్గూ లేకుండా ఉంది. వీళ్లు చదువు సంధ్యలు లేని మూర్ఖులేగా?” అన్నాను.
”అసలీ మనిషి తన డబ్బెందు కిస్తుంది?”
”కష్టాలు ఏకరువు పెడతారేమో, అందుకే పాపం ఇచ్చేస్తుంది! ఎంతైనా తల్లి కదా! పిల్లలు కష్టపడుతూంటే చూస్తూ ఎలా ఊరుకుంటుంది? మీరు కూడా ఒక కథ రాశారుగా, ‘బేటోంవాలీ విధవా’ (పిల్లలుగల వితంతువు)? నాకన్నా ముందు మీరే ఈ విషయం గురించి అభిప్రాయం కథలో చెప్పేశారు. మరిప్పుడు నన్నడుగుతారేం?”
”ఇంగ్లీషు చదువులు చదువుకున్న వాళ్లలోనే స్వార్థం ఎక్కువని నేను అనుకునే వాణ్ణి. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. బీద కుటుంబాలలో తల్లి పట్ల మర్యాదగా ప్రవర్తించటం ఒకప్పుడు చూసేవాణ్ణి. కానీ ఇప్పుడు వాళ్లలో కూడా మార్పు వచ్చేసింది. ఆవిడ పొట్టకూటికోసం చాకిరీ చేస్తోంది. వీళ్లు ఎదిగారు. చిన్నప్పుడు పాలు పీల్చినట్టు ఇప్పుడు ఆవిడ దగ్గరున్న నాలుగు డబ్బులూ పీల్చెయ్యాలని చూస్తున్నారు లాగుంది. వీళ్లకీ పశువులకీ ఏమిటి తేడా? కుక్కకి రొట్టెముక్క వీస్తే దాని పిల్ల వచ్చి నోట కరుచుకుని పరిగెత్తుతుంది. తల్లికి కూడా ఆకలి వేస్తుందన్న జ్ఞానం ఆ జంతువుకి ఉండదు. మనిషికీ దానికీ తేడా ఉండాలిగా? అది తప్పని జ్ఞానం ఉన్న మనిషికి తెలియాలిగా! జంతుదశనించి ఇంతదాకా ఎదిగిన మనిషి స్వార్థం మితిమీరటంతో మళ్లీ జంతువుగా మారిపోతున్నాడా?”
”మీకు ఏవేవో కొత్త విషయాలు తడుతూ ఉంటాయి!” అన్నాను.
”లేదు, రాణీ! బక్కెట్టు ఎత్తటానికే ఆవిడ కష్టపడటం నేను గమనిస్తూనే ఉన్నాను. బరువులు మోసేప్పుడు చేతులు వణుకుతాయి. అందుకే నాపని ఆమె చేత చేయించకుండా నేనే చేసుకుంటాను. ఆ మనిషిని చూస్తే చాలా జాలేస్తుంది. కానీ ఆ రాక్షసులకి మాత్రం దయా దాక్షిణ్యాలనేవి లేవు లాగుంది! నువ్వు వాళ్లని రావద్దని చెప్పరాదూ?”
”ఇంకాకళ్ల కుటుంబం విషయంలో తలదూర్చి న్యాయం చెప్పటం అంటే నాకు మంట. ”నా వల్ల కాదు, మీరే చెప్పండి. వాళ్లకి నచ్చచెప్పడం మీరనుకుంటున్నంత సులభం కాదు. వీళ్లకి కొడుకులంటే చాలా ప్రత్యేకమైన అభిమానం. ఆవిడే మీ మాట వినదసలు,” అన్నాను.
ఆరోజు చాలా సేపటివరకూ మా ఇద్దరికీ ఈ విషయమై వాదన జరుగుతూనే ఉంది.
”మీ ఆడవాళ్లకి ఇంకో గుణం కూడా ఉంది. మొగుడు ఎలాటి వాడైనా, ప్రేమగా ఉనాన లేకపోయినా, వాడు బతికుంటే చాలు ఆ ఆడది అదృష్టవంతురాలనే అంటారు. ఆమె చాలా సుఖంగా ఉందని అనుకుంటారు. అదే భర్త లేని ఆడది అభాగ్యురాలికింద లెక్క,” అన్నారాయన.
”మీ మాటని నేనే ఒప్పుకోను. భర్త లేని ఆడది దురదృష్టవంతురాలే మరి!”
”నీ ఆలోచన తప్పు!”
”నాది కాదు, మీ ఆలోచనే తప్పు!”
”నేనొప్పుకోను.”
”మీరు ఒప్పుకోకపోతే ఏమిటిట?”
”ఇలా చూడు, ఒక మగాడు పెళ్లాం ఉండగా మరో ఆడదాన్ని పెళ్లాడాడనుకో, మొదటి ఆమెని పట్టించుకోవటం పూర్తిగా మానేశాడనుకో, పైగా ఇది చచ్చిపోతే బావుణ్ణు, అనుకుంటాడనుకో, ఇక ఈ స్త్రీ జీవితంలో సుఖమేముంటుంది? ఆమె సుఖంగా ఉందని అనగలవా? నువ్వు అనుకో, కానీ నేనలా అనుకోలేను. అంతకన్నా భర్తపోయిన స్త్రీ జీవితమే సుఖంగా ఉందంటాను. కనీసం అతను ఉన్నన్నాళ్లూ ఆమెని ప్రేమగా చూసుకున్నాడు కదా! ఆ ప్రేమ ఇంకా ఆమె వెంట సుఖమైన జ్ఞాపకంగా మిగిలుంది కదా? వితంతువుగా బతకటం కస్టమే, కాదనను. కానీ ఆమె మనసులో శాశ్వతంగా ఉండిపోయిన మధుర క్షణాలు, అవే నిజమైన ఆస్తి. ఆవిడ చనిపోయేదాకా వాటిని ఎవరూ దోచుకోలేరు. ఇలాటి జ్ఞాపకాలు మిగిలుంటే ఇంక ఆ మనిషికి ఏం కావాలి? మరో పక్క బతికుండగానే కాల్చుకుతినే భర్త ఉన్న స్త్రీతో ఈవిణ్ణి పోల్చి చూడు!” అన్నారు.
ఇవన్నీ తల్చుకుని ఏదో ఒక రోజు ఏడవాల్సి వస్తుందని నాకేం తెలుసు? ఆయన జ్ఞాపకాల న్నిటినీ నెమరేసుకుంటూ సరిపెట్టుకోవల్సి వస్తోంది. విధి ఎంత విచిత్రమైనది! దాని చేతిలో అందరం కీలు బొమ్మలమే. మా ఆయన ఎప్పటికీ నిలిచిపోయేది జ్ఞాపకాలు మాత్రమే అని ఎప్పుడూ అంటూ ఉండేవారు. ఆయన ఉండగా లోకంలోని అన్ని విషయాలమీదా మా ఇద్దరికీ వాదోపవాదాలు జరిగేవి. అప్పుడవి ఎందుకూ పనికిరానివిగా అనిపించేవి. ఈరోజు వాటిని ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటూ రాయటానికి కూర్చున్నాను. అవన్నీ గుర్తొస్తే హృదయాన్ని ఎవరో చీలుస్తున్నంత బాధ కలుగుతుందన్నది వాస్తవమే, అయినా కళ్లముందు సినిమా రీళ్లలా తిరిగి పాతరోజుల్లోని ఆనందాన్ని కూడా అందిస్తాయి. నేనిదంతా రాసి, పాఠకులకి వినోదం పంచిపెడుతున్నానని అనుకోవడం లేదు, ఏదో గొప్ప విషయాలు చెప్పటానికి కూడా నేనిది రాయటం లేదు. నేనెందుకిదంతా ఆలోచిస్తున్నానో, ఎందుకు రాస్తున్నానో నాకే తెలీదు. కానీ రాయకుండా ఉండలేక పోతున్నాను. ఎవరికైనా ఏడవాలనిపించి నప్పుడు బాధాకరమైన సంఘటనలని తలుచుకోవటంలో ఏదో ఆనందం దొరుకుతుంది. అందుకే వాటిని గుర్తు చేసుకోవటం, వాటి గురించి ఆలోచించటం.
పెదనాన్న కొడుకు మరణం
1932లో మా ఆయన పెదనాన్న కొడుకు చనిపోయాడు. ఆయన పోవటం మా ఆయనకి పెద్ద దెబ్బే అయింది. అంతకు ముందు మాకు టెలిగ్రామ్‌ వచ్చింది. మా ఆయన పిరుదులమీద రెండు మూడు కురుపులు లేచాయి. అందుచేత కూర్చోలేక పోయేవారు. ”నా సామాను సర్దు, కూర్చోలేక పోతే పడుకునైనా సరే, ఇవాళ ఉదయం బండిలో వెళ్లాలి,” అన్నారు మా ఆయన. కురుపు పగిలితే అదో అవస్థ, కానీ ఏం చెయ్యను? పోనీ నువ్వు వెళ్ళరాదూ? మా అన్నయ్య నాకేమైనా చెప్పాలనుకుంటు న్నాడేమో!” అన్నారు.
”మరి నేను వెళ్తే ఆ విషయం నాకెలా చెప్తారు?” అన్నాను.
మర్నాడు ఆయన పోయాడని మరో టెలిగ్రామ్‌ వచ్చింది. మా ఆయన ఏడుస్తూ, ”పిల్లలిద్దరూ ఇంకా చిన్నవాళ్లు, వాళ్ల గతేం కాను? ఇంట్లో ఉన్న ఇద్దరు ఆడవాళ్లూ వితంతువులైపోయారు!” అన్నారు.
వాళ్ల అన్నయ్య పోయిన నాలుగోరోజు మా ఆయన బెనారస్‌కి ప్రయాణమవుతూ, ”వారంటు లేకుండానే అరెస్టు చేసేస్తున్నారుట. నువ్వు ఇంతకు ముందు జైలుకెళ్లిన దానివి, ఈసారి వారంటు లేకుండానే నిన్ను పట్టుకుపోతారేమో! ఎందుకు చెపుతున్నా నంటే, నేను వెనక్కి వచ్చేదాకా నువ్వు ఇంట్లోంచి బైటికి వెళ్లద్దు. ఉన్న కష్టాలకి అది కూడా తోడవుతుంది!” అన్నారు.
”లేదు, అస్సలు ఇంట్లోంచి బైటికెళ్లను,” అన్నాను.
బెనారస్‌ నించి వచ్చాక మా ఆయన అక్కడి వివరాలు చెపుతూ, ”మా వదినని ఓదార్చి వచ్చాను. ‘చనిపోయింది మీ భర్తే కాని, మీ పిల్లల తండ్రి కాదు. వాళ్లకి నేనున్నాను. ఇప్పటివరకూ ముగ్గురే పిల్లలు నాకు, ఇక నించీ ఐదుగురు. మీకు ఏ అవసరమొచ్చినా వెంటనే నాకు బురు పెట్టండి. అన్నట్టు అంత్యక్రియలూ అవీ నాకంతగా నచ్చవు, ఏదో క్లుప్తంగా జరిపించెయ్యండి,” అన్నాను బ్యాంకులోంచి వందరూపాయలు తీసి వాళ్లకిచ్చి వచ్చాను. ‘నా భార్యని అరెస్టు చేస్తారనే భయం ఉంది నాకు. వెళ్తున్నాను, మళ్లీ వస్తాను,’ అని చెప్పి వచ్చేశాను,” అన్నారు.
‘ఆజ్‌ లో వ్యాసం
మా ఆయన రాసిన ఒక వ్యాసం ‘ఆజ్‌’లో అచ్చయింది. అది చదివి కాశీలోని హిందువులకి కోపం వచ్చింది. అక్కడ ఆ రోజుల్లో ‘హిందూ సభ’ కి చాలా ప్రాచుర్యం ఉండేది. కాంగ్రెసువాళ్లు కూడా దాన్ని సమర్థించేవాళ్లు. చాలామంది వచ్చి, ”మీరు రాసిన వ్యాసం చదివి కాశీలోని హిందువులు మీపట్ల కోపంగా ఉన్నారు,” ఉన్నారు. అలా అన్నవాళ్లలో కాంగ్రెసువాళ్లే ఎక్కువ.
ఈయన లోపలికి రాగానే, ”ఏమిటి, ఏమంటున్నారు వాళ్లు?” అన్నాను.
”ఏం లేదు, ఆ వ్యాసం చాలా బావుందంటున్నారు!”
”మరైతే చంపేస్తామని ఎందుకు బెదిరిస్తున్నారు?”
”ఇదంతా హిందూ సభ వాళ్లు చేసిన పని.”
”కానీ వీళ్లు కాంగ్రెస్‌ పార్టీ వాళ్లు కదా?”
”ప్రస్తుతం వీళ్లు కూడా వాళ్ల పక్షమే.”
”శత్రుత్వం కొని తెచ్చుకునే అలాంటి వ్యాసాలు ఎందుకు రాస్తారు మీరు? ప్రభు త్వమో, ప్రజలో ఎవరో ఒకరితో మీకెప్పుడూ విరోధమే. గట్టిగా గాలివీస్తే ఎగిరిపోయే ట్టుంటారు కదా! ఎందుకండీ ఇవన్నీ రాస్తారు?”
”ప్రభుత్వమూ, ప్రజలూ రచయితని తమ బానిస అనుకుంటాయి. ఏం? రచయితకి తనకంటూ ఒక వ్యక్తిత్వం ఉండదా? అందరూ మెచ్చేదే రాసేట్టయితే ఇక వాడు రచయితేమిటి నా మొహం? ప్రభుత్వం జైల్లో పెడుతుంది, జనం చంపేస్తామని బెదిరిస్తారు! అంత మాత్రాన రచయిత భయపడిపోయి రాయటం మానెయ్యాలా?”
”ఇంకేమైనా చెయ్యొచ్చు, కానీ ప్రాణం మీదికి తెచ్చుకోకూడదు కదా!”
”రచయిత ఏం రాసినా, లోపల్లోపల ఏదైనా ఇబ్బంది పెడితేనే రాస్తాడు. మనసు బాధ పడితే రాస్తాడు.”
”అది బాగానే ఉంది, కానీ రోజూ గొడవే అయితే కష్టం.”
”ఈ ప్రపంచమే గొడవల మయం. భయపడి పారిపోతే ఏమీ జరగదు. యుద్ధభూమిలో నిలబడి ఉండటమే సరైన పద్ధతి.”
”వీళ్లు కూడా ఒకసారి కాంగ్రెస్‌ వైపుకీ ఒకసారి హిందూ సభ వైపుకీ ఎందుకలా మారుతూ ఉంటారు?”
”నన్నూ అలా మారమంటావా?”
”ఎటువంటి సిద్ధాంతాలకీ కట్టుబడి ఉండద్దని నేననటం లేదు. కానీ వాళ్లందరూ మీరు ముసల్మానుగా మారిపోయారని అంటున్నారు. కాని అసలు ఆ సంగతి వాళ్లకెందుకు? మీరు ముసల్మాను కాదు కదా కావాలంటే క్రిస్టియన్‌గా కూడా మారచ్చు, అది మీ ఇష్టం!”
”వీళ్లు చాలా పొరబడుతున్నారు. వీళ్ల మనసులు ఎప్పుడూ మూతపడే ఉంటాయి. నేనెంత నచ్చజెప్పినా అర్థంకాదు వీళ్లకి. ప్రతి విషయంలోనూ అడ్డు చెపుతూంటారు, అది అర్థమైనా, కాకపోయినా!”
”అయితే మీరు వాళ్లకి నచ్చజెప్పారా?”
”అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తే మనిషన్నవాడికి అర్థం కాకపోదు. అయినా నీకెందుకంత కంగారు?”
”చుట్టూ విరోధులుంటే కంగారుగా ఉండదూ?”
”నేను చూడు ఎంత నిశ్చింతగా ఉన్నానో! లేకపోతే ఏమైనా చెయ్యగలనా? రచయితైన వాడు ఇలాటివి పట్టుక్కూర్చుంటే ఇక తన ఆలోచనలూ, అభిప్రాయాలూ అందరికీ ఎలా చెప్పగలుగుతాడు? వాళ్లకి మార్గదర్శకుడుగా ఎలా ఉండగలడు?
”జనం మీరు రాసినవి చదవనప్పుడు, మీ మాటలు వినిపించుకోకుండా ఉంటే, ఒక వేళ చదివినా దాన్ని ద్వేషిస్తే, మీ రచనలవల్ల ఏం లాభం?”
”రచయిత ప్రతిమనిషి గురించీ ఎలా ఆలోచించగలడు? అలా చేస్తే వాళ్లకి అణిగిమణిగి ఉన్నట్టేగా? ఇక ఆ వ్యక్తిలో రచయిత ఏం మిగులుతాడు? ఎవరి గురించీ పట్టించుకోకుండా తన అభిప్రాయాలని తెలియజేసేవాడే రచయిత. జనం దాన్ని మనసారా ఆహ్వానించటం కూడా జరుగుతుంది. కానీ ఆ జనానిది గొర్రెల మంద స్వభావం. ఎవరి మాట మీద గురి ఉంటుందో, వాళ్ల వెనకే వెళ్తారు అది మంచిది కాదు కదా? నా ఉద్దేశంలో తమ మంచి చెడ్డల విషయం ప్రజలే నిర్ణయించుకోవాలి. కానీ ఇక్కడ వీళ్లకి నాయకత్వం మీదున్న దృష్టి ప్రజల మంచి చెడ్డల మీద లేదు. ఇక వాళ్ల గురించి ఎవరాలోచిస్తారు? హిందూ-ముస్లిమ్‌ గొడవల మధ్య వీళ్లు తమ నాయకత్వాన్ని మరింత పటిష్ఠంగా తయారుచేసుకుంటారు.”

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.