గిడుగు రాజేశ్వరరావు
చట్టాలు దారి చూపిస్తాయేకానీ, చేతులు పట్టుకొని నడిపిస్తాయా? అనుకొంటూ ఒక వ్యాజ్యెం గురించి ఆలోచిస్తూ కుటుంబరావు ఇల్లు చేరుకున్నాడు. ప్రతిరోజూ ఇంట్లోకి రాగానే నల్లకోటు ఇక తనది కాని వస్తువులాగ దండెం మీదికి గిరవాటు వేసి, వదులైన తెల్లని దుస్తుల్లోకి మారిపోతాడు. వేడిగా తేనీరు సేవించి సతీసమేతంగా దగ్గరలోనే ఉన్న వాకింగ్ ప్లాజాకి వెళ్తాడు. కనిపెంచిన పిల్లలు వాళ్ల రెక్కలమీద ఎగురుతూ సంసారాలు దిద్దుకొంటున్న దశలో, వానప్రస్థంలో ఉన్న రావుకి ఎక్కువ ఉత్సాహాన్ని కలిగించే సాయంత్రపు నడక – దినచర్యలో ఒక భాగం.
ఆ కోలనీలో నడిచే ఉత్సాహం, ఓపికా ఉన్నవారికోసం ఒకటిన్నర కిలోమీటర్ల మార్గాన్ని వాకింగ్ ప్లాజాగా ఏర్పాటు చేసుకొన్నారు. వేకువన గంటన్నర, సాయంత్రం రెండుగంటలపాటు వాహనాల బెడద లేకుండా చేసి నిశ్చింతగా, నిరామయంగా నడుస్తారు. రెండుప్రక్కలా ఎత్తయిన చెట్ల మీద పక్షుల కోలాహలం, తేలికపాటి వాద్యసంగీతం చెవులను సోకుతూ ఉంటుంది. దీప స్తంభాలకు వర్ణచిత్రాలున్న (ఫ్లెక్సీ) బోర్డులు అపురూపమైన పువ్వుల్నీ, పక్షుల్నీ కనువిందు చేస్తూ ఉంటాయి. ఏకబిగిని నడవలేనివారికోసం, విశ్రాంతి కావలసినవారికోసం అక్కడక్కడ బెంచీలు కూడా ఉంటాయి. రోజూ ఎదురుపడే ముఖపరిచయస్తుల్ని చిరునవ్వుతో పలుకరిస్తూ, వృత్తిపరంగా ఏకొద్దిపాటి ఒత్తిడిఉన్నా మరిచిపోతాడు రావు.
ఆ రోజు కాలిజోళ్లు విప్పుకొంటూనే, ముందు గదిలో గోళ్లు కొరుక్కొంటూ కూర్చున్న ఆగంతుకుణ్ణి చూశాడు. ఎవడీ శాల్తీ అనుకొనే లోగానే ఆ యువకుడు లేచి నిలుచున్నాడు. నమస్కారం అన్నాడు. ఆలూబజ్జీల ప్లేటుతోనూ, తేనీటి కప్పులతోనూ వంట ఇంట్లోంచి వచ్చిన సుగుణ –
”వీడు నాకు వేలు విడిచిన పినతల్లి కొడుకండీ. సునందుడు. చిన్నప్పుడు వీడ్ని మేమంతా సుందూ సుందూ అనే పిలిచేవాళ్లం.” అంటూ పరిచయం చేసింది. ఒక్క క్షణం ఆగి భర్త స్పందించేలోగా… ”అన్నట్టు మరచాను, వీడి పెళ్లికి మా నాన్నగారితో కలిసి మీరూ వచ్చారు. అయినా మీకేవీ గుర్తుండవు” అంది.
”అలా మరీ నన్ను తీసిపారేయకు. సుమారు ఏడు ఏళ్లు కావస్తోంది. ఆ పెళ్లి వేడుకల్లో చెంబులో వేసిన ఉంగరం ఎవరు తీస్తారో ఉన్న పోటీలో వధువు తెల్లని చేతి మండ మీద గీసి ఎర్రగా రక్తపుచారలు తెప్పించిన స్పోర్ట్స్‌మన్ కదూ” అని చిన్నగా నవ్వాడు కుటుంబరావు.
సునందుడు కుర్చీలో ఇబ్బందిగా కదులుతూవుంటే సుగుణ కలగజేసుకొంది.
”అదే-మీతో వచ్చిన చిక్కు. జ్ఞాపకం ఉంచుకోరానివన్నీ గుర్తుంచుకొంటారు.” అని సంభాషణ మరోదిశగా మళ్లించింది. బజ్జీలు తిని తేనీటి సేవనం, మాటామంతీ అయిన తర్వాత ”ఇక నేవస్తానండీ” అంటూ లేచి నిలుచున్నాడు సునందుడు.
”నువ్వు పెళ్లేది సోమవారం ఎ.పి. ఎక్స్‌ప్రెస్‌కి కదా! ఆదివారం భోజనం మాతో చేసి వెళ్దూగాని రారా సుందూ!” అంటూ సుగుణ చేసిన ప్రతిపాదనకు చిన్న సవరణ చేసి ”ఉదయం ఎవరినో కలవాలి. సాయంత్రం వస్తానక్కా!” అంటూ నిష్క్రమించాడు.
”సుగుణా! వీడి నాయన కుశలమేనా? ఆ పెళ్లిరోజున అనుకున్న కట్నం సొమ్ములో కొంత కొరతపెట్టి ఒక నెలరోజుల తర్వాత ఇస్తారని తెలిసి ఎంత గొడవ చేశాడు! పెళ్లి ఆగిపోతుందనే అనుకొన్నాను…” వాకింగ్‌ప్లాజాకు నడుస్తూ కుటుంబరావు అడిగిన ప్రశ్నకు భార్య చిన్నగా నవ్వింది.
”నయమే, వాడిముందు ఆ ముచ్చట కూడా ప్రస్తావించారు కాదు. మీరు ఆ ఉంగరం పోటీ అన్నప్పుడే సిగ్గుతో సగం చచ్చి బ్రతికాడు. మీరు కోర్టు నుండి వచ్చేదాకా వాడి విడాకుల సొద చెప్పుకొంటూ వింటే విన్నాను. మన కాలనీ తూర్పు దరవాజా దగ్గర రెండో ఇంట్లో వాడి మేనమామ ఉన్నాడట. చూడాలని ఢిల్లీ వచ్చాడట. హైదరాబాద్‌లో వీడు విడాకుల కోసం పెట్టుకొన్న కేసు ఒకంతట తేల్చకుండా కోర్టుచుట్టూ తిప్పుతున్నారట.”
”వధూవరులు ఇద్దరూ పెళ్లిలో ఉషారుగానే ఉన్నారే. అమ్మాయి కూడా కాస్త చదువుకున్న పిల్లలానే కనపడింది. విడాకులు ఎందుకట….?”
”వీడు ఔనంటే ఆమె కాదంటుందట. పడటం లేదు.”
”కారణం లేని పేచీ ఎలా వస్తుంది సుగుణా?”
”మగపిల్లాడికోసం వీడూ వీడి నాయనా ఎదురుచూస్తే ఆడపిల్లని కనిందట.”
”అది ఆమె చేతిలో ఉన్న పనా?”
”పుట్టిన పిల్ల అందరిలా పెరగడంలేదట.”
”అంగవైకల్యమా?”
”అదేంకాదు. త్వరగా నడవదట. ఐదు నిండుతున్నా అన్నిటికీ తల్లి సహాయం కావాలట. దానిని చూసుకొంటూ ఆమె ఇక వీడి లాలనాపాలనా పట్టించుకోదట.”
”ఓహో! ఆ బాధ్యత వదిలించుకొని వీడు మరో పెళ్లికి సిద్ధమైపోతాడన్న మాటే. శ్రద్ధగా చూస్తే ఆ పాపకి సెరిబ్రల్ పాల్సీ ఉండొచ్చని నాకు తోస్తోంది. అలాటి వెనుకబాటుకి ప్రత్యేక శిక్షణ పొందిన టీచర్లతో మంచి సంస్థలు ఎన్నో ఉన్నాయి, ఉంటాయి.”
”మీరన్న మాట నిజమే. కన్నపిల్లమీద ప్రేమంటూ వుంటే అలాటి ఆలోచనలు వస్తాయి. అలాటి సంస్థ ఏదో అక్కడా ఉంది. ఉదయం తీసుకెళ్లి అందులో చేర్చి మధ్యాహ్నం అయినాక తిరిగి యింటికి తెచ్చుకోవచ్చును. లేదా, అలాటి పిల్లలను ఇంటినుండి తీసుకొనివెళ్లి తెచ్చే బస్సుకి డబ్బుకట్టి పంపుదాం. అదీ కాకపోతే ఆ సంస్థకు దగ్గరగానే ఇల్లు అద్దెకు తీసుకుందామని ఆమె అంటుందట. వీడికి నచ్చకుండా ఉందట.”
”తొందరగా చేర్చి అలాటి పిల్లలకు శిక్షణ ఇస్తే – తేరుకొని వాళ్ల పనులు చక్కబెట్టుకోగలుస్తారు. ఎన్నో కొత్త పరికరాలు, పద్ధతులు వచ్చాయి. తల్లిదండ్రులకూ ఇలాటి పిల్లల్ని చూసుకోడానికి శిక్షణ ఇస్తారు. నా స్నేహితుడికి ఒక కొడుకు అలాగనే ఉంటే, హౌజ్‌కాస్ దగ్గర మంచి సంస్థలో వేస్తే ఎంతో మెరుగుపడ్డాడు. నేను వాణ్ణి చూసి ఆశ్చర్యపోయాను.”
”మిమ్మల్ని విడాకులు విషయంలో సలహాలు అడగాలనే వచ్చినట్లున్నాడు. మీ దగ్గర చనువులేక, సందేహించి వెళ్లిపోయి నట్టున్నాడు… ఆదివారం ఎటూ వస్తాడుగా…పదండి పోయి వద్దాం.”
”వివాహబంధంలో ఇరుక్కుపోయి సుఖపడలేనివాళ్లు బయట పడాలని ఏర్పాటు చేసుకున్న విడాకుల సదుపాయాన్ని బాధ్యతనుంచి తప్పించుకునే ఉపాయంగా వినియోగించాలని చూస్తున్నాడు నీ వేలువిడిచిన తమ్ముడు” అని నవ్వుకొంటూ సుగుణతో వాకింగ్‌కి బయలుదేరాడు కుటుంబరావు.”
జ జ జ
ఆదివారం మధ్యాహ్నం భుక్తాయాసంతో కాస్త కునుకుతీశాడు కుటుంబరావు. లేచి, వార్తాపత్రికలు మరోసారి తిరగేస్తూవుంటే వచ్చాడు సునందుడు. ”ఆకుకూరలేమైనా తాజాగా వచ్చేయేమో అని దగ్గరగానే ఉన్న బజారుకి వెళ్లింది. ఇప్పుడే మీ అక్క వస్తుంది, ఇలా కూర్చో-” అని రావు కుర్చీ చూపించాడు. మాటామంతీ లేకుండా ఎదురెదురుగా కూర్చోడం కష్టమే. రెండు నిముషాలు మూకీ సినిమాలా గడిచాక మనసులో ఉన్న బాధను వెళ్లగక్కేడు సునందుడు.
”మీ లాయర్లూ, కోర్టులూ విడాకుల కేసుల్ని ఒక పట్టాన తెగనివ్వరు. నా స్నేహితుడు స్టేట్స్‌లో ఉన్నాడు. అడగ్గానే మూడునెలల్లో డివోర్స్ సెటిల్ చేశారుట. హైదరాబాద్‌లో నాకేసు ఆరునెలలైనా వాయిదాలమీద వాయిదాలు వేస్తున్నారు.”
”వివాహవ్యవస్థపట్ల మనకీ పడమటి దేశస్థులకీ ఒక ముఖ్యమైన తేడా ఉంది. వాళ్ళు వ్యక్తి స్వేచ్ఛకు పెద్దపీట వేస్తారు. తర్వాతే మిగిలినవి. మనకు పెళ్లి అంటే నూరేళ్ల పంట. ఏదో ఒక కోటువిప్పి మరో కోటు తొడుక్కున్నంత ఆషామాషీ వ్యవహారంగా చూడరు. భావితరాల రక్షణే కుటుంబవ్యవస్థకీ, పెళ్లికీ ఎంతో ముఖ్యమైన విషయంగా ఆలోచిస్తారు.”
సునందుడు నీరసంగా నవ్వాడు. ”వ్యవస్థ అని చెప్పి ఒక పంజరంలో ఇరికిస్తే ఎలా? పక్షులు హాయిగా ఎగరవూ?” కుటుంబరావుకి ఈ మాటలు బాగా కదిలించినట్టున్నాయి. ”బాల్యవివాహం కాదు గదా. నువ్వు ఆ వ్యవస్థలోకి పోయి ఎందుకు ఇరుక్కున్నావు? ఒంటరిగా ఒక సత్రవులోని ముసాఫిర్లాగ హాయిగా బ్రతకవచ్చుకదా. ఏ కట్టుబాటూలేని మానవ సమూహంలో వ్యక్తి స్వేచ్ఛగా ఉంటాడనుకోవడం కేవలం భ్రమ. చిట్టచీకటిలో నిద్రమేల్కున్నవాడు దీపం వెలిగించుకోవాలనుకుంటాడు. కనీసం కిటికీ తెరచి వెలుగు కావాలనుకొంటాడు. అలాగే ఆ వ్యవస్థలోంచే వ్యవస్థ రూపుదాలుస్తుంది. అలా పైనించి ఊడిపడదు. నువ్వు ఎప్పుడైనా పాత ఢిల్లీ రైల్వేస్టేషనులో చూశావో లేదో కానీ నన్ను ఒక దృశ్యం తరచూ ఎంతో బాధ కలిగిస్తుంది.”
”నేను ఢిల్లీ ఇదే రావడం.”
”అయితేనేం. మరో స్టేషనేదైనా మనదేశంలో ఇంకోలా ఉంటుందనుకోను. విను. రైలు వచ్చిన వెంటనే చింకినిక్కర్లూ చింపిరిజుత్తులతో ఉన్న చిన్నపిల్లలు కిటికీల దగ్గర నిలబడి అడుక్కొంటూ ప్రయాణీకులు పారవేసిన రొట్టెలు, బ్రెడ్డు ముక్కలూ పోటీపడి చేజిక్కించుకొని బ్రతుకుతూ ఉంటారు. వీళ్లని కని విడిచినవాళ్లు ఏమైనా వారి బాధ్యత గురించి ఆలోచించారా? కనీసం ఇలాటి పిల్లల్ని ఎంపికచేసి చదువూ ఆత్మగౌరవం అందించే సంస్థలేవైనా మనదేశంలో అవసరానికి సరిపడా ఉన్నాయా? వివాహేతర స్వేచ్ఛకు వెంపరలాడే యువతీయువకులకు వివాహవ్యవస్థ మీద రాళ్లు వెయ్యడం ఒక ఫేషన్ అయిపోయింది. నిర్లక్ష్యానికి గురైన పిల్లల సంఖ్య పెరుగుదల మనదేశానికి క్షేమమంటావా?
”నేను విడాకుల గురించే కదా అడుగుతున్నాను.”
”బలమైన కారణాలుంటే కోర్టుకు చూపి, నమ్మించి విడాకులు తీసుకోవద్దన్నదెవరూ? నేను చెప్పేదేమిటంటే – కన్నతల్లే కాక బాధ్యుడైన మగవాడు కూడా తన సంతానాన్ని గుర్తించి నాదీ అని ఉమ్మడి ప్రేమతో పెంచే వివాహవ్యవస్థలో పిల్లలకు ఎక్కువ రక్షణ ఉంటుందన్నదే మన పూర్వీకుల ఆశ. హాయిగా ఆకాశంలో ఎగురుతున్నట్టు కనిపించే పక్షులకూ వ్యవస్థ ఉంటుందని చాలామందికి తెలియదు. వ్యవస్థ అంటే కొన్ని కట్టుబాట్లే కదా!”
అప్పుడే అక్కడకు వచ్చి ఇద్దరి మధ్యా జరుగుతున్న సంభాషణలోని తీవ్రస్థాయిని వింటున్న సుగుణ వేడివేడి తేనీటితో తేలికపరిచే ప్రయత్నం చేసింది. ముగ్గురూ వాకింగ్ ప్లాజావైపు నడిచి చల్లనిగాలి పీల్చుకొన్నారు. కుటుంబరావులో చెలరేగిన బరువైన ఆలోచనల్లోంచి బయటపడ్డాడు. రోజూ తారసిల్లే ముఖపరిచయస్తుల్ని చిరునవ్వులతో పలుకరిస్తూ ఒక గంటసేపు నడిచిన తర్వాత ఒక బెంచీమీద ముగ్గురూ కూర్చున్నారు. ఎదురుగా లైట్లలో మెరిసిపడే ఫ్లెక్సీల్లో ఏవేవో పక్షుల చిత్రాలు, కొన్ని సూక్తులు కనిపిస్తే రావు చూస్తూ – ”ఇదేదో వాక్యం కొత్తగా పెట్టినట్టున్నారు. ‘వియ్ డూనాట్ యిన్‌హెరిట్ దిస్ ఎర్త్ ఫ్రమ్ అవర్ ఏన్సెష్టర్స్. వియ్ బారో ఇట్ ఫ్రమ్ అవర్ చిల్డ్రన్” – అంటూ చదివాడు. ”నిజమే సుమా ఈ నేల వారసత్వపు ఆస్తి అనుకోకు – మన పిల్లలకు తీర్చవలసిన అప్పు అని ఎంతచక్కగా చెప్పాడు” అని మెచ్చుకున్నాడు. ఇంతలో సునందుడు కాసింత దూరాన ఉన్న పక్షి బొమ్మను చూస్తూ ఇదేదో ‘గ్రేట్ ఇండియన్ హార్న్‌బిల్: ఆహారం పండ్లు: నిడివి 65 సెంటిమీటర్లు’ – అంటూ వింతగా స్పందించాడు.
”ఈ పక్షి ఏమి అందంగా ఉందని ఇంత ప్రత్యేకంగా బొమ్మను వ్రేలాడదీశారు. నేను ఎన్నడూ చూసినట్టే లేదు” అన్నాడు. వంపుతిరిగిన పెద్ద ముక్కుతో ఆ ముక్కమీద పెరిగిన కొమ్ముతో, మట్టీ బూడిదా కలిపిన ఛాయ రెక్కలతో, కనుపాపచుట్టూ కొంత ఎరుపు రంగుతో ఆ పక్షి ఆకారం అసాధారణంగానే ఉంది.
”నేనూ ఈ రకం పక్షిని చూడలేదు-” అంది సుగుణ. కుటుంబరావుకి ఇద్దరి మాటలూ కొంత నవ్వు తెప్పించాయి. ”ఈ పక్షి రూపంలో అందం మన కంటికి ఆనకపోవచ్చు. కానీ దీని జీవనశైలి చాలాచాలా అందమైనది. సుగుణా! నువ్వు శ్రద్ధగా చూడలేదేమో కానీ ఈ పక్షిజాతికి చెందినవే కాసింత చిన్నరకం మార్చి ఏప్రిల్ నెలల్లో జంటలుగా వచ్చి మన ఇంటికి ఎదురుగా ఉన్న ఆ పెద్ద చెట్టు చిటారుకొమ్మల మీద వాల్తాయి. వాలీవాలగానే చిన్నపిల్లలు కాళ్ళు ఊపి ఆనందించినట్టు తోకను వెనక్కూ ముందుకూ ఆడిస్తాయి. గద్దలు అరచిన విధంగా ఐదారు సెకండ్లు సాగదీస్తూ ఈలవేస్తాయి. కొన్నిరకాలు కేవలం పండ్లుతిని బ్రతుకుతే, కొన్ని తొండల్నీ ఎలుకల్నీ, ప్రాకే పురుగుల్నీ తింటాయి.” ”దీని జీవనశైలిలో చాలాచాలా అందమన్నారే, ఏమిటది?” అడిగింది కుతూహలంగా సుగుణ.
”మగపక్షీ ఆడపక్షీ జతవీడని జంటగా పెద్దపెద్ద చెట్లమీద వాలుతూ విహరిస్తాయి. గుడ్లుపెట్టి పొదిగే సమయం రాగానే ఎత్తుగా ఉన్న కొమ్మల్లో తొర్రలు వెదుకుతాయి. వాటికి అనువైనదీ, భద్రమైనదీ దొరకగానే ఆడపక్షి ఆ తొర్రలోనికి పోతుంది. దాని రెట్టలతోనూ, మగపక్షి బయట నుంచి తెచ్చిన మట్టితోనూ గారలా చేసి ఒక గోడ ఉమ్మడి శ్రమతో కట్టుకుంటాయి. మగపక్షి ముక్కును మాత్రమే దూర్చగల రంధ్రాన్ని ఆ గోడలో విడిచిపెడతాయి. సుమారుగా రెండునెలలపాటు మగపక్షి బయట కొమ్మల మీదనే తిరుగాడుతూ, ఆహారాన్ని సేకరించి, నమిలి, ఆ సారాన్ని ఆడపక్షి నోటికి అందించి మరీ పోషిస్తుంది.”
సుగుణకు ఆశ్చర్యంగానే తోచింది. ఎందుకో ఈ ప్రత్యేకత వీటికి అనుకొనేలోగా కుటుంబరావు వివరించాడు.
”ఇతర జాతి పక్షుల పిల్లలు గుడ్డులోంచి బయటపడగానే సున్నితంగా ఈకలు ఉంటాయి. కానీ ఈ హార్న్‌బిల్ పక్షి పిల్లలకు అలాటి రక్షణ లేదు. అవి ఎర్రని మాంసఖండాల్లా ఉంటాయి. గద్దలు, ఇతర పక్షుల కంటపడితే ఇక అంతే వాటి పని. అందుకేనేమో మరీ ఇంత విచిత్రమైన రక్షణ. సుమారు రెండునెలల తర్వాత తల్లి పక్షి పొదిగిన పిల్లలకు ఈకలు వచ్చి, రెక్కలు బలం సంపాదించి వాటంతట ఎగిరే శక్తి వస్తుంది. తల్లీ పిల్లలూ గోడను ఛేదించుకొని బయటపడతాయి. అంతవరకూ రక్షకభటుడి బాధ్యత, తిండిపెట్టే శ్రద్ధ అంతా పూర్తిగా మగపక్షిదే. ఒకవేళ దురదృష్టవశాత్తూ మగపక్షి చస్తే లోపలివి కూడా చస్తాయి. అలా, ఆ పక్షుల జంట, అవి కన్నపిల్లలను ఎగిరే సామర్ధ్యం వచ్చేదాకా ఉమ్మడి బాధ్యతగా పెంచుతాయి. నాకు స్వేచ్ఛ కావాలని మగపక్షి పారిపోదు.” చిరునవ్వుతో వాటి అందమైన జీవనశైలిని చెప్పి ముగించాడు రావు.
ఇంటికి వెళ్లి నిదానంగా రాత్రి భోజనం చేశాక, కంప్యూటర్ స్క్రీన్ మీద హార్న్‌బిల్ బొమ్మలతో ఎన్నో విషయాలు చూపించాడు. ”ఇలా పిల్లల బాధ్యత ఈనాటి యువతీయువకులు వహిస్తే లోకంలో ఇప్పుడు విలయతాండవం చేస్తున్న క్రూరత్వం ఉండకపోయేదేమో” అని నిట్టూర్చాడు. కొంతసేపు మాటామంతీ అయినాక కుర్చీలో ఇబ్బందిగా కదలాడుతున్న సునందుడు ‘ఇక వెళ్లి వస్తానని’ లేచాడు. కుటుంబరావు ఎంత ముభావంగా ఉండాలనుకున్నా ఉండలేక పోయాడు.
”ఒక్కొక్కప్పుడు ప్రసవసమయంలో ఆసుపత్రిలో జరిగిన చిన్ని పొరపాటువల్ల కూడా పిల్లల ఎదుగుదలలో వెనుకబాటు ఉండవచ్చు. మీ పిల్లకి సరైన పరీక్ష చేయించి ప్రత్యేక శిక్షణ ఇప్పించండి” అని మాత్రం సూచించి సాగనంపాడు.
”మీరు స్వతహాగా మితభాషి. ఇవాళ ఎందుకనో ఉద్రేకపడి మాట్లాడినట్లనిపించింది నాకు. వాడినీ, వాడి తండ్రినీ మనం మార్చగలమా” సముదాయించింది సుగుణ.
”నువ్వన్నది నిజమే. కానీ ఈనాటి యువతలో స్వేచ్ఛ అంటే వెంపరలాడడం, బొత్తిగా దూరదృష్టి లోపించడం కలవరపెడుతోంది నన్ను. సుప్రీంకోర్టు ముందుకే ఒక కేసు వచ్చింది. మొన్నటి వార్తాపత్రికలో కూడా చదివాను.”
”నేను చదివినట్టులేదే. ఏమిటది?”
”తీర్పు ఎలా వస్తుందో అది వేరే విషయం. ఒక యువతీ, యువకుడూ వేరువేరు రాష్ట్రాలవారు మనదేశంనుండి విదేశం పైచదువుల నిమిత్తం వెళ్లారు. యువతి ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోనే యువకుడూ నివాసం. సుమారు ఐదేళ్లు ఉండి మనదేశం తిరిగివచ్చి వాళ్ల రాష్ట్రాలకు వెళ్లిపోయారు. ఆ యువతికి విదేశంలో కొడుకు పుట్టినట్టూ ఆ యువకుడే తండ్రి కాబట్టి పోషణకు భరణం ఇప్పించమని కోర్టును ఆశ్రయించింది. ఆ కేసును నిలుపుచేయమని యువకుడు పెద్ద కోర్టునే ఆశ్రయించాడు. వారిద్దరికీ పెళ్లితంతుకానీ, విదేశపుచట్టం రీత్యా సివిల్ పార్ట్‌నర్‌గా రిజిస్ట్రేషను కానీ కాలేదు – అన్నాడు. తనకు కొడుకు పుట్టినట్టు ప్రస్తావనే తేలేదు. ఆ యువతి విదేశీ ఆసుపత్రిలో మగపిల్లడిని కన్నట్టుగా పత్రం, పాసుపోర్టులో వివరాలు చూపించి ఆ యువకుడు పిల్లవాడి తండ్రి అన్నది. ఆమె వాదాన్ని నీరుకార్చడానికా అన్నట్లు యువకుడు కొత్త సమాచారం కోర్టుకు అందించాడు. గృహహింస, అత్యాచారం, కట్నంకోసం వేధింపు జరిపినట్టు ఆ యువకుడి మీద విదేశీ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి, రెండు నెలలైనా కాకుండానే ఆ ఫిర్యాదు ఉపసంహరించుకొంటున్నట్టు ఫిర్యాదులోనివి నిజం కానట్టు వేరొక అఫిడవిట్ దాఖలు చేసిందని వివరించాడు.
సుగుణా! ఈ కేసులో ఏది నిజం, ఏది అబద్ధం, తీర్పు ఎలా ఉంటుందో అన్నది వేరే విషయాలు. అనవసరం. కానీ పెద్ద చదువులు చదివిన యువతీ యువకులే ఇలా స్వేచ్ఛ స్వేచ్ఛ అంటూ విదేశాల్లోని మంచిని విడిచిపెట్టి చెడ్డని దిగుమతి చేసుకొంటున్నారన్న బాధ కలుగుతుంది. పరస్పరం నమ్మకాన్ని పెంచుకొని ప్రేమ పండించు కోవలసిన యువత……” అంటూ నిట్టూర్చాడు కుటుంబ రావు.
ఏవో ఆలోచనల భారతంతో మౌనంగా ఉన్న సుగుణను చూస్తూ ”మాట్లాడవేం? విద్యాధికులకే వివాహవ్యవస్థ పట్ల గౌరవం లేకపోతే సామాన్యుల కేమి స్ఫూర్తిని ఇవ్వగలరు?” అన్నాడు.
హార్న్‌బిల్స్ జంట జీవనశైలిలోనే కాక తన భర్త ఆలోచనల్లో కూడా వెల్లివిరిసిన అందం గురించి సుగుణ తలచుకొంటూ తృప్తిగా చిరునవ్వుతో కనులు మూసుకొంది.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
మీ మంచి కథలు టి.వి.కొసము వాడుకొన వచునా? అందరికొసము వ్రాసినవి కాబటి రచఇత పెరుతొనె చెయగలము.