రావిరాల కుసుమ
(ఆల్కహాలిక్ పిల్లలు, ఒక అవగాహన-గ్రంథ సమీక్ష) ఇగ్నౌ వారి సహకారంతో వి.బి. రాజు సోషల్ హెల్త్ ఫౌన్డేషన్ ప్రచురించిన ‘ఆవిష్కరించిన-ఆల్కహాలిక్‌ల పిల్లలు, ఒక అవగాహన’, ఒక విలక్షణమైన, విలువైన సాహిత్య ప్రక్రియ.
ఈ పుస్తకం సమాజంలోని డాక్టర్లు, సమాజ సేవకులు మొదలై వారికేగాక, ఆల్కహాలిక్ ల కుటుంబీకులు, టీచర్లు, సేవాసంస్థలు, ఇలా అన్ని వర్గాలవారికి ఉపయోగపడే గ్రంథంగా చెప్పుకోవచ్చు. అతి ప్రమాదకరమైన రుగ్మత ఆల్కహాలిజనం గురించి ప్రస్తావిస్తూ, ఈ పుస్తకం ఎందుకు, ఎవరికి ఉపయోగపడుతుందో రచయిత్రి శ్రీదేవి మురళీధర్ ”ఈ పుస్తకం ఎందుకు” అనే పరిచయంలోనే వివరించారు. శాస్త్రీయపరంగా, సామాజిక దృక్కోణంతో ఈ పుస్తకం ఆల్కహాలిజం వ్యాధి తీరుతెన్నులను, దుష్ప్రభావాలను, సోదాహరణంగా మన కళ్ళ ముందు బాలి గారి చక్కని బొమ్మల సాయంతో నిలబెడుతుంది.
ఈ పుస్తకం ఉచితంగా పంపిణీ చేయబడటం నేటి కాలంలో ముదావహం.
అందరి ఇళ్ళల్లో, గ్రంథాలయాలలో, ఆసుపత్రులలో, స్కూళ్ళల్లో, ఉండతగిన అపురూప పుస్తకమిది.
ఇంట్లో ఆల్కహాలిక్ ల ఉనికి కుటుంబానికి ఎంత సిగ్గుచేటుగా పరిణమిస్తుందో, వారు ఎలాంటి దాపరికాలకు, వ్యధలకు లోనవుతారో ‘నట్టింట్లో ఏనుగు’, ‘ఇంటి గుట్టు’ ‘ఈ ఇల్లు మీదేనా?’ వ్యాసాలు సచిత్రంగా అక్షరాల ఆసరాతో మనల్ని ఒక బాధామయ ప్రపంచానికి పరిచయం చేస్తాయి.
‘చిన్నారి బందీలు’ గురించి చదువుతోంటే చదువరి ఎంతో బాధకు లోనవుతాడు.
‘ఈ పిల్లలు మీకు తెలుసా?’లో చిత్రించిన ఆల్కహాలిక్ ల పిల్లల జీవనచిత్రాలు కళ్ళు చెమరింప జేస్తాయి..
ప్రతివ్యాసమూ ఒక సజీవచిత్రమే! నగ్న సత్యమే! సూటిగా, పదునైన శైలితో పాఠకుల హృదయాన్ని స్పందింపజేసే కథనాలు ఈ చిన్న పుస్తకం నిండా వున్నాయి.
‘ముఖ్య దోహదకారి’లో భార్యలు తమ ప్రమేయం లేకుండా ఎలా ఒక ఆల్కహాలిక్‌ను సీసాకి మరింత చేరువ చేస్తారో ఉదాహరణ పూర్వకంగా వివరించారు రచయిత్రి.
‘కర్తవ్యం’, ‘వెలుగువైపు ప్రయాణం’ వ్యాపాలలో ముందు చేయవలసిన పని ఏమిటి, బాధ్యత ఎటువంటిది అనే వాటి పట్ల దృష్టి సారించవచ్చు.
ఒక అనుభవశాలి అయిన కౌన్సెలర్‌గా తన అనుభవం పదిమందికి ఉపకరించే విధంగా ఎంతో చిత్త శుద్ధితో, కృషిని జోడించి రాసిన ఉత్తమ గ్రంథమిది.
పిల్లలు ముందు తరాల ప్రతినిధులు. వారి జీవితాలు ఆల్కహాలిక్ అయిన తండ్రి వలన ఎలా వెతల పాలవుతాయి, ఎలా వారు కూడా పతనమయ్యే అవకాశం ఉన్నది అనే అంశం ఈ ‘ఆవిష్కరణ’ పుస్తకానికి పునాది. తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరూ చదివి తీరవలసిన పుస్తకం ఇది. స్కూళ్ళల్లో, ఇతరచోట్ల ఇలాంటి పిల్లలకు, పెద్దలకు ఉపకరించే ప్రశ్నావళి శీర్షికలు, వాటి వినియోగం ఈ పుస్తకంలో పొందుపరచటం చాలా ఆలోచనతో కూడిన పని.
ఆల్కహాలిక్స్ అనానిమస్ సంస్థల వివరాలు, డి అడిక్షన్ కేంద్రాల చిరునామాలు, ఆలనాన్, ఆలటీన్ వివరాలు ఇందులో పొందుపరచారు. ప్రభుత్వ యంత్రాంగానికి కూడా ఎంతో మార్గదర్శకమైనది ఈ పుస్తకం.
ముఖపత్రం ఆశావహ దృక్పథాన్ని సూచిస్తుంది. కూర్పు, ముద్రణా ముచ్చట గొలిపే విధంగా ఉన్నాయి.
ఇగ్నో కులపతి రాజశేఖర్ పిళ్ళై పుస్తక పరిచయం, శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావుగారి ‘ఉదాత్త సేవ’ అనే ముందుమాట, ఈ పుస్తకంలోని అంశం యొక్క గాంభీర్యాన్ని మనకు తొలిపుటల్లోనే అవగతం చేస్తాయి.
చాలా మామూలుగా మొదలై వ్యక్తి పతనానికి, సంసార విధ్వంసానికి దారి తీసే మద్యపాన వ్యాధి గురించి ఎంతో విపులంగా, ఉపయోగకరంగా వ్రాయబడిన ‘ఆవిష్కరణ’ తెలుగులో ఈ అంశం గురించిన సాహిత్యంలో మొట్ట మొదటిది, మేలైనది అని నిస్సందేహంగా రుజువు చేసింది.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
మీ సాహిత్యం చదవడానికి ఇంపుగా వుంది. ధన్యవాదములు.