చేనేత కార్మికులుగా మారిన బాలికలు

– యస్.వి. శివరంజని, పరిశోధనా సహాయకురాలు

చేనేత విజ్ఞాన విధాన కేంద్రం (చిప్)
పధ్నాలుగు సంవత్సరాలు నిండని వారిని ”బాలలు” అంటారు. ఈ వయసులో పనిచేస్తున్న వారిని బాలకార్మికులంటారు. సాధారణంగా బాలకార్మికులు ఎక్కువగా ఫ్యాక్టరీ పనుల్లో మెకానిక్ పనుల్లో, హోటళ్లలో, బట్టల షాపుల్లో, వ్యవసాయ కూలీలలో కనిపిస్తారు. చేనేతరంగంలో బాలకార్మికులు (బాలికలు) ఉన్నారు.

ఆడపిల్లలు చదువుకుని ఉద్యోగాలు చేయాలా? ఊర్లేలాలా?’ అనే ఒక నానుడి సాంప్రదాయపరంగా పెద్దల్లో నాటుకుంది. విద్య, వైద్య, న్యాయ అన్ని రంగాల్లోను మహిళలు తమకు ధీటులేదంటూ ప్రతిభను చాటుతుంటే, ఆడపిల్ల అంటే కేవలం ఇంటిపనికే పరిమితం కావాలి. సాంప్రదాయ కట్టుబాట్లకు విలువ ఇవ్వాలంటూ, చదువుకు దూరం చేసి పనిలో చేర్పిస్తున్నారు. ఇందుకు తల్లిదండ్రుల్లో మారని వైఖరే కారణమని చెప్పవచ్చు.

ఆడపిల్లకు నేతపని వచ్చిఉండాలని ఈపనిని నేర్పిస్తారు. అదీకాక ఈ వృత్తి పని నేర్చుకుంటే గడప దాటి బయటకెళ్ళకుండా పోషణ జరుగుతుందనే ఆలోచన నేత కార్మిక కుటుంబాల్లో తల్లిదండ్రులకు ఉన్నది. ఆడపిల్లల్ని బడికి పంపిస్తే కండెలు చుట్టేవారుండరు. దీనితో నేతపని సాగదు, ఆర్థిక స్థోమత సరిపోక, ఆడపిల్లలు తల్లికి పనిలో సహాయపడేందుకు బాలకార్మికులుగా మార్చడం. తల్లిదండ్రులు ఆడపిల్లల భవిష్యత్పై దృష్ఠి సారించడంలేదు.

ఏ ఇతరరంగాల కుటుంబాలను తీసుకున్నా ఆ కుటుంబాల ఆర్థికస్థోమతను బట్టి ఆడపిల్లలను హైస్కూలు వరకైనా చదివిస్తున్నారు. వ్యవసాయ రంగంలో పనిచేసే కుటుంబాలలో ఆడపిల్లలు సైతం చదువుకుంటున్నారు. కానీ చేనేత రంగంలో మాత్రం ఊహ తెలిసిన దగ్గర నుండి 6, 7 సంవత్సరాల వయస్సు వస్తే కండెలు చుట్టడంతో పని మొదలుపెడతారు.

చేనేత పరిశ్రమ కుటీర పరిశ్రమ, కాబట్టి ఇంట్లోనే పని చేసుకుంటారు. తల్లి కండెలు చుడుతుంటే బాలికలు తల్లి దగ్గర పని నేర్చుకోవడం మొదలు పెడతారు. బడికిముందు, తరువాత ఆడపిల్లలు కండెలు చుట్టి తల్లికి సహాయకులుగా ఉంటారు. కండెలు చుట్టడంతోపాటు క్రమంగా ఇంటిపని, వంటపనికి అలవాటు చేస్తారు.

ఆడపిల్లలు ఈ విధంగా చేయడం వలన తల్లి ఎక్కువ సమయం మగ్గం నేయగల్గుతుంది. 11, 12 సంవత్సరాల వయస్సు వచ్చే సరికి బాలికలు వాటువేయడం ప్రారంభిస్తారు. ఎలాగూ మగ్గం నేయగలుగుతుంది కదా తనకూ ఒక మగ్గం పెట్టి నేయిస్తే, తన పెళ్ళికి కట్నం డబ్బులు దాచుకుంటుందనే ఉద్దేశంతో వారికి ప్రత్యేకంగా మగ్గంపెట్టి నేయించడం, మగ్గం పెట్టించే పరిస్థితులు లేకపోతే మాస్టర్ వీవర్ ఇళ్లల్లో మగ్గంపై కూలికి నేయించడం లేదా షెడ్డుల్లో నేయించడం జరుగుతుంది.

ఐదు నుండి ఏడవ తరగతి వరకు చదివి, మానేసి మగ్గం నేసేవాళ్లు కొందరైతే 8-10 సంవత్సరాల ఆడపిల్లలు మాస్టర్ వీవర్ల దగ్గరకెళ్లి రోజూ కండెలు చుట్టిరావడం, నెలకు రూ.200 నుండి రూ.300 ఆదాయం పొందడం ఈ విధంగా బాలకార్మికులుగా (బాలికలు) ఎక్కువ మంది ఈ పనిలో ఉన్నారు.

ప్రకాశం జిల్లాలో ఈపురుపాలెం షెడ్డుల్లోను, గుంటూరు జిల్లాలో మంగళగిరి షెడ్డుల్లో, కృష్ణా జిల్లాలో పెడన, కప్పలదొడ్డి ఇతర గ్రామాల్లోను, అనంతపురం జిల్లాలో ధర్మవరం షెడ్డుల్లో అత్యధికంగా బాలికలుగా పని చేస్తున్నారు.

బాలికలు కార్మికులుగా అన్నిరకాల వ్యవస్థల్లోను పని చేస్తున్నారు. వీరు మగ్గం నేయడం, కండెలు చుట్టడం, డబ్బాలు తోడడం, ఆసుపోయడం, అట్టలు కొట్టడం, భుటాలు తీయడం, అల్లు పట్టడం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. వారి కుటుంబ పరిస్థితుల ప్రభావం వీరిపై ఎక్కువగా ఉంటుంది.

కృష్ణాజిల్లాలో షెడ్డుల్లో ఆడపిల్లలు త్రాగుబోతుల మధ్య మగ్గం నేస్తూ ఉంటారు. పురుష కార్మికులు వీరితో వెలికి మాటలు మాట్లాడుతూ వారి మనసును నొప్పిస్తున్నారు. వీరి తండ్రులు త్రాగుబోతులు కావడం వలన ఈ బాలికలది, వారి తల్లుల సంపాదన కుటుంబ జీవనానికి తప్పనిసరి అవుతుంది. ఒక్కోసారి వీరి సంపాదన కూడా తండ్రుల తాగుడుకే ఖర్చుపెడుతూ తల్లిని కొట్టి హింసించడం, వీరిని ఆవేదనకు గురి చేస్తున్నాయి. మానసికంగా వీరు ఆందోళనకు గురవుతున్నారు. వీరి బాల్యమంతా విద్యావికాసానికి కాక, చాకిరితో మగ్గుతున్నారు.

కర్నూలు జిల్లాలో కూడా బాలికలు ఎక్కువ మంది మగ్గం నేస్తున్నారు. కేవలం మగ్గం నేయడం మాత్రమే వీరికి తెలుసు. వాళ్లు నేసే వార్పుకి ఎంత వేతనం ఇస్తారో కూడా వారికి తెలియదు. తల్లిదండ్రులే ఆ వేతనాలు తీసుకుంటారు. కాబట్టి వీరికి ఎటువంటి వివరాలు తెలియవు. ఎక్కువ సమయం మగ్గం నేస్తారు. తాము ఆ పని చేయడం తప్పనిసరి అని మాత్రమే వారికి తెలుసు. యంత్రం మాదిరి పనిచేయడం, తల్లిదండ్రులు చెప్పింది చేయడమే వీరి పని. వీరి ఆలోచనా విధానం కూడా ఎక్కువ నేయాలి, ఎక్కువ పనిచేయాలనే దానిపైనే ఉంటుంది. వీరు ఆరోగ్యం బాగోకున్నా బాధపడతారే తప్ప తల్లిదండ్రులకైనా చెప్పరు. తండ్రి చనిపోతే కుటుంబ పోషణ కోసం అహర్నిశలు శ్రమిస్తూ, ఓర్పుతో, సహనంతో బ్రతుకులీడిస్తున్న బాలికలు ఎందరో నేేత రంగంలోఉన్నారు.

ఇంట్లో చేనేత మగ్గంపై తల్లిదండ్రులకు సహాయంగా కండెలు చుట్టడంతో ప్రారంభించి, మగ్గం నేయడం తప్పనిసరి అయి నేతకార్మికులుగా మారుతున్న బాలికలు కొందరైతే మరమగ్గాల దగ్గర కండెలు చుట్టే మిషను (ఆసు మిషన్) దగ్గర పనిచేస్తూ, రోజుకు 10 నుండి 25 రూపాయలు సంపాదిస్తున్న బాలికలు మరికొందరు ఉన్నారు. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలంటూ ఒకపైపు ప్రభుత్వాలు ఘోషిస్తున్నా, ”బడిబాట” వంటి కార్యక్రమాలు చేపడుతున్నా, గుంటమగ్గాల దగ్గర, మరమగ్గాలదగ్గర కండెలు మిషను దగ్గర తమ బాల్యాన్ని కొనసాగిస్తూ, మానసిక పరిపక్వతకు, ఎదుగుదలకు దూరమై శ్రామిక జీవనాన్ని గడుపుతున్న బాలికలెందరో ఉన్నారు. బాల్యంలోనే కుటుంబ ఆర్థిక విషమ పరిస్థితులకు సమధలౌతున్న చిన్నారులెందరో ఉన్నారు.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.