స్వర్ణప్రభాతలక్ష్మి
(భూమిక నిర్వహించిన కథ/వ్యాస రచన పోటీల్లో మూడవ బహుమతి పొందిన కథ)
కొంచెం బెరుగ్గా ఆఫీసులో అడుగుపెట్టింది సౌమ్య. నిలబడినచోటు నుండే కళ్ళతో మేనేజర్ కాబిన్ కోసం వెతుకుతోంది.
”ఎక్స్‌క్యూజ్‌మీ!” చాలా దగ్గరగా వినిపించింది. సౌమ్య ఉలికిపాటుతో తల త్రిప్పి చూసింది.
తెల్లగా పొడుగ్గా చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉన్నాడు. అతన్ని ఎక్కడో చూసినట్టుంది.
”నా అంచనా తప్పు కాకపోతే మీరు అకౌంట్స్ సెక్షన్‌లో జూనియర్ అకౌంటెంట్‌గా జాయిన్ అవడానికి వచ్చారు. బైదిబై! నా పేరు ప్రకాష్. నాది ఆడిటింగ్ సెక్షన్. సారీ! మిమ్మల్ని నిలబెట్టే బోరు కొట్టిస్తున్నానా? అదుగో! ఆ కుడివేపు కేబిన్ మేనేజర్‌ది. ముందు మీరు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చేసి రండి. తర్వాత తీరిగ్గా మిమ్మల్ని పరిచయం చేసుకుంటాను.”
ఆమెకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, ఎలా వచ్చాడో అలాగే క్షణాల్లో అతను మాయమయ్యాడు. సౌమ్య ఆలోచనలనుండి బయటపడి మేనేజర్ కేబిన్‌కేసి నడిచింది. జాయినింగ్ రిపోర్టు ఇచ్చి, తన క్యూబికిల్‌కి వచ్చింది. సీనియర్ అకౌంటెంట్ ఇచ్చిన పెండింగ్ వర్క్ చేస్తూ కూర్చుంది. పక్క క్యూబికిల్ నుండి కమల వచ్చి పరిచయం చేసుకుని, ఆమె పనిలో అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చింది. సౌమ్యకి ఆమె మొదటి పరిచయంలోనే బాగా నచ్చింది. లంచ్ అవర్‌లో ఇద్దరూ కలిసే భోంచేశారు.
”సౌమ్యా! మీరు పేరుకు తగ్గట్టుగా ఉన్నారు. అందంగా, అమాయకంగా, బాపూ బొమ్మలా!!” అంది కమల నవ్వుతూ.
సౌమ్య మొహమాటంగా నవ్వింది.
”హలో! కమలగారికి మంచి కంపెనీ దొరికినట్టుందే!”
ఇద్దరూ వెనక్కి తిరిగారు. ప్రకాష్ నవ్వుతూ నిల్చున్నాడు.
”సౌమ్యా! ఈయన ప్రకాష్‌గారు. ఆడిటింగ్ సెక్షన్ – సర్వాంతర్యామి.”
”నా పరిచయం అయింది లెండి. ఆమెని పరిచయం చెయ్యండి” చొరవగా అన్నాడు.
”అనుకున్నాను లెండి. ఆమె ఇవాళేగా చేరింది. ఇతర వివరాలు నేను అడగలేదు. అయినా మీకు ఈపాటికి తెలిసే ఉంటాయిగా!” కమల గొంతులో వ్యంగ్యం.
”కమలగారి మాటలకు కంగారు పడ కండి. నేను అందరితో ఫ్రెండ్లీగా ఉంటానని ఆవిడ భావం. సర్లెండి. కలుస్తూనే ఉంటాంగా! వస్తా!” అతను వెళ్ళిపోయాడు.
”వాడి బొంద! కొద్దిగా చనువిస్తే నెత్తినెక్కు తాడు” విసుగ్గా అంది కమల.
”అదేమిటి?”
”సారీ! నా మాటలు అసభ్యంగా ఉన్నాయి కదూ! ఏం చేయను చెప్పండి. అతన్ని చూస్తేనే నాకు చిరాకు. పెద్ద మేధావినని, చాలా సరదా మనిషినని తెగ ఫీలైపోతుంటాడు. అతనికి అంతకంటే మర్యాద ఇవ్వాలని పించదు. ఈయన గారికి ఆఫీసులో ఆడ పరిచయాలే ఎక్కువ. ఎందుకైనా మంచిది మీకు ముందే చెప్తున్నాను. అతనికి ‘ఆడపిచ్చి’ అని అందరూ అనుకుంటుంటారు. కాస్త జాగ్రత్తగా ఉండండి.
సౌమ్య మౌనంగా ఉండిపోయింది.
సాయంత్రం ఇల్లు చేరిన సౌమ్యకి కాఫీ కప్పు అందిస్తే.
”సౌమీ! అతను కనిపించాడా?” ఆతృతగా అడిగింది రమ్య.
”ఆఁ! కనిపించాడక్కా! కానీ నేనెవరో అతనికి తెలిసినట్టు లేదు,” సాలోచనగా అంది సౌమ్య.
”కొంపదీసి నువ్వు తొందరపాటుగా ఏం మాట్లాడలేదు కదా?” ఆదుర్దాగా అడిగింది రమ్య.
”అబ్బ! లేదులే! నీకు అన్నిటికీ భయమే!” విసుక్కుంది సౌమ్య.
”పేరుకి సౌమ్యవే కానీ ప్రభావం భాస్వరం కదా! అందుకే భయం. జాగ్రత్త!” చెల్లికి కేసి అభిమానంగా చూస్తూ హెచ్చ రించింది రమ్య.
”కొంప ముంచే పనులేం చెయ్యను. ఇదే నీకు నా అభయం.” నవ్వుతూ అభయముద్ర పట్టింది సౌమ్య.
”నా డెలివరీ అయ్యి, నేను మా ఊరు వెళ్ళేదాకా నీ బాధ్యత నాదేగా!”
”అమ్మా! సోదరీ! కడుపులో బరువుతో పాటు నా బాధ్యత కూడా బాగానే మోస్తున్నావు కానీ, నాకు ఆకలి దంచేస్తోంది. పద!” అంటూ సౌమ్య వంటింటికేసి నడిచింది.
జ జ జ
రోజులు గడుస్తున్నాయి. ఆఫీసులో సౌమ్యకి కమలతో తప్ప ఇంకెవరితోను పరిచాలు పెద్దగా పెరగలేదు. ప్రకాష్ మాత్రం ప్రతిరోజు ఒక్కసారైనా వచ్చి పలకరించి పోతుంటాడు. అతని ప్రవర్తనలో ఆమెకి తప్పు పట్టాల్సిందేమీ కనిపించలేదు.
ఆరోజు బస్టాపులో అతన్ని చూసి,
”ఏమిటి ఇక్కడున్నారు?” అంది సౌమ్య.
”బావుందండోయ్! ఇక్కడికి మేం రాకూడదా? నేను ఇల్లు మారాను లెండి. ఇప్పుడు మీదారే నాదారి కూడా!” అతను సన్నగా నవ్వాడు.
అతని మాటల్లో శ్లేష ధ్వనించినట్టనిపించి, సౌమ్య అతనికేసి అవమానంగా చూసింది. వాల్‌పోస్టర్ చూస్తున్న అతని ముఖంలో భావం ఆమెకి తెలీలేదు. అలా ప్రతిరోజు ఇద్దరూ కలిసి ఒకే బస్‌లో ప్రయాణించడం మొదలైంది కాని అతను మర్యాద సరిహద్దు దాటలేదు. ఆమె తెలివిని, అందాన్ని ఎప్పుడూ పొగడలేదు.
రోజూలాగే ఆరోజు కూడా బస్టాప్‌లో కలిశారు.
”సౌమ్యా! మనం ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాం. కలిసి ప్రయాణం చేస్తున్నాం. కలిసి కాఫీ తాగడానికి మీకేమన్నా అభ్యంతరమా? అహ! మన ఈ 20 రోజుల స్నేహాన్ని కాఫీతో సెలిబ్రేట్ చేసుకుందా మని…” నవ్వుతూ అన్నాడు ప్రకాష్. సౌమ్యలో అనుమానం ఒళ్ళు విరుచుకుంది. ఒక్క క్షణం ఆలోచించి,
”పదండి!” అంది ముందుకు నడుస్తూ. ఇద్దరూ తాజ్ హోటల్‌కేసి నడిచారు. అది మొదలు ఆమెని హోటల్‌కి ఆహ్వానించడానికి అతనికి ఏవో కారణాలు దొరుకుతుండేవి. అలా వాళ్ళ పరిచయం చిక్కబడింది. ఇప్పుడు వాళ్ళ మాటల్లో వ్యక్తిగత విషయాలు కూడా కొద్దిగా చోటుచేసుకుంటున్నాయి. ఐతే ఎక్కువగా సౌమ్య శ్రోతలాగానే ఉండేది.
జరిగిన ప్రతి విషయం రమ్యకి చెప్పడం సౌమ్యకి అలవాటే!
”సౌమ్యా! ఎందుకే నువ్వింత రిస్క్ తీసుకోవడం? అనవసరమైన గొడవల్లో ఇరుక్కుంటావేమోనని నాకు భయంగా ఉంది. నాన్నగారితో ఒక్కమాట చెప్తే సరిపోదూ?”
”అన్నిటికి ఇలా భయపడుతుండడం వల్లే మన ఆడవాళ్ళ బ్రతుకులు ఇలా తగలబడుతున్నాయి. అరిటాకు, ముల్లు, దూది, దీపం అంటూ పాత చింతకాయపచ్చడి కబుర్లు చెప్పకు. నాకు ఒళ్ళు మండుతుంది. అక్కా! ఇప్పుడే నాన్నగారితో నువ్వేమీ చెప్పకు. అవసరమైనప్పుడు నేనే చెప్తాను.” రమ్య మొహంలోని దిగులు గమనించి
”అక్కా! భయపడకు నా జాగ్రత్తలో నేనుంటానులే! నీ దగ్గర నేనేం దాచలేదు. ఇప్పుడిప్పుడే కథ కాస్త ముదురుపాకాన పడుతోంది. తెర దించడానికి ఇంక ఎక్కువకాలం పట్టదులే!” అంటూ చిరునవ్వుతో రమ్య చెయ్యి భరోసాగా నొక్కింది సౌమ్య.
జ జ జ
ఆ రోజూ యథాప్రకారం సౌమ్య, ప్రకాష్ బస్ కోసం ఎదురుచూస్తున్నారు. ”ఇప్పుడు మీరు నాతో మా ఇంటికొస్తున్నారు” హఠాత్తుగా అన్నాడు ప్రకాష్.
”ఎందుకు?” ఆశ్చర్యాన్ని అణుచు కుంటూ అడిగింది సౌమ్య.
”ఇవాళ నా పుట్టినరోజు. మీకు చిన్న ట్రీట్ ఇద్దామని….అదీ మీకు అభ్యంతరం లేకపోతేనే! నేను మంచి వంటవాడినే లెండి!” చిన్నగా నవ్వుతూ అన్నాడు.
మీకు నా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇప్పుడే ఆరు గంటలైంది. మరి మీ ఇంటికి వెళ్తే నేను ఇంటికి చేరేసరికి బాగా లేటవుతుందేమో!” సంశయంగా అంది సౌమ్య.
”ఎక్కువసేపు ఉంచను లెండి. ఆటోలో మా ఇంటి నుండి మీ ఇంటికి 10 ని|| కంటే ఎక్కువ సమయం పట్టదు. పుట్టినరోజు ప్రతిరోజు రాదు కదా! ఈ ఒక్కరోజు నా కోరిక మన్నించచ్చు కదా!” బ్రతిమిలాటలో నిష్ఠూరం మేళవించి అన్నాడు.
అతని అసలు రంగు చూడచ్చని ఆమెకి ఆశ కలిగింది. ఆమె మౌనం అతనికి అంగీకారంగా తోచింది.
”బస్ కోసం ఎదురుచూస్తూ అనవసరంగా సమయం వృధా చేసుకోవడం ఎందుకు? ఆటోలో వెళ్ళిపోదాం.”
ఆమె ఆమోదం కోసం ఎదురు చూడ కుండా ఆటో పిల్చి, అడ్రస్ చెప్పి ఆమె ఎక్కేవరకు ఆగి అతను కూడా ఆటో ఎక్కాడు. 15 నిముషాల తర్వాత ఆటో ఒక చిన్న ఇంటి ముందు ఆగింది. చీకట్లు కమ్ముకుంటున్న వేళ మిగతా ఇళ్ళకు కొంచెం పెడగా ఉన్న ఆ ఇంటికి వచ్చి తప్పు చేశానా అని ఆమెకి ఒక్కక్షణం సంశయం కలిగింది.
అతను గేటు తీసుకుని లోపలికి వెళ్ళి తలుపు తాళం తీశాడు. గుండె దిటవు చేసుకుని అతని వెనకే నడిచింది ఇంట్లోకి.
ముందు గదిలోని సోఫాకేసి నడవబోతున్న సౌమ్యని చూసి
”నేనేదో విలన్‌ని అయినట్టు అలా భయపడుతున్నారేమిటి? అదుగో ఎదురు డాబా మీద మనుషులు తిరుగుతున్నారు. గ్రిల్స్‌లోనుండి మనం వాళ్ళకి బాగానే కనబడతాం. ఇప్పుడు వాళ్ళకి మన పట్ల కుతూహలం కలిగించడం అవసరమా? రండి! నా గదిలో కూర్చుందాం!” ఆమెకి మరో మాట మాట్లాడే అవకాశం లేకుండా పక్క గదిలోకి వెళ్ళి లైటు వేశాడు. మరీ మంకుపట్టు పట్టినట్టుంటుదేమోని సౌమ్య అతని కూడా వెళ్ళింది. అతని ధోరణిలో మార్పుని ఆమె గమనించింది.
ఆ గది చిన్నదే అయినే పొందికగా శుభ్రంగా ఉంది. ఒక పక్కగా ఉన్న మంచం మీది ఫోమ్‌బెడ్ మీద చక్కటి దుప్పటి పరిచి ఉంది. దాని మీద రెండు దిళ్ళు, మరోవేపు చిన్న బల్ల దాని ముందు రివాల్వింగ్ ఛెయిర్. గోడకి ఉన్న అద్దాల అలమరలో బొమ్మలు, పుస్తకాలు. అందమైన అమ్మాయిల కాలెండర్లు రెండు గోడలకి వ్రేలాడుతున్నాయి. ఒక దానిలో అందమైన అమ్మాయి అర్ధనగ్నంగా ఉంది. బట్టలు కట్టుకోబోతోందో, ఉన్నవాటిని వదిలేస్తోందో చూసేవారి ఊహకే వదిలేశాడు చిత్రకారుడు. రెండోదాంట్లో నిండా బట్ట లున్నా, జలపాతంలో తడిసి, అందాలన్ని ఆర బోసిన అందాలభామ.
సౌమ్య పరిశీలనను గమనిస్తున్న ప్రకాష్,
”కూర్చోండి ఇప్పుడే వస్తాను” అంటూ లోపలికి వెళ్ళాడు.
సౌమ్యకి ఇబ్బందిగా ఉంది. ఇలా రావడం పొరపాటు కాదు కదా! అని ఆమెకి మరోసారి అనిపించింది. ”ఇంతవరకు వచ్చిన తర్వాత ఇప్పుడు వెనుకంజ వేయడం ఎందుకు? కమాన్, సౌమ్యా! బి బ్రేవ్” ఒక లక్ష్యంతో వచ్చినప్పుడు దాన్ని సాధించాల్సిందే! తనకి తనే ధైర్యం చెప్పుకుంది.
”అదేమిటి నేలకి అతుక్కుపోయినట్టు అలా నిలబడ్డారేం? ఇలా కూర్చోండి.” ఎప్పుడొచ్చాడో ప్రకాష్, తెల్లని బట్టల్లో మల్లెపూవులా మెరిసిపోతున్నాడు. చేతుల్లోని టిఫిన్ ప్లేట్, కోక్ టిన్ బల్ల మీద పెట్టి ఆమెను మరోమారు హెచ్చరించాడు. తన పరధ్యాసను కప్పిపుచ్చుకుంటూ, ఆమె కుర్చీలో కూర్చుంది. అతని నుండి ఏదో పరిమళం గాలిలో తేలివచ్చి ఆమెని ముట్టడించింది. బల్ల మీద దొరికిన పుస్తకాన్ని తిరగేస్తోంది సౌమ్య.
కొన్ని క్షణాలు నిశ్శబ్దం ఆవరించింది. హఠాత్తుగా ఆమె తలెత్తి అతనికేసి చూసింది. ఆమెకి ఎదురుగా మంచం మీద కూర్చుని ఆమెకేసే చూస్తున్న ప్రకాష్ సన్నగా నవ్వాడు. ఆమెకి తన గుండె చప్పుడు స్పష్టంగా వినిపిస్తోంది.
”మీరు చాలా అందంగా ఉంటారు. అమాయకమైన మీ చూపులు మీకు పెద్ద ఎస్సెట్.” మొదటిసారి అతను ఆమె అందం ప్రస్థావన తెచ్చాడు. సౌమ్య తర్వాత జరగబోయేది ఊహించడానికి ప్రయత్ని స్తోంది. ఆమె మౌనం అతనికి మరింత ధైర్యం ఇచ్చినట్లుంది, లేచి ఆమె దగ్గరగా వచ్చాడు.
”తినకుండా అలాగే కూర్చున్నారు. తినిపించనా?” నవ్వుతూనే బాదుషా ప్లేటులో నుండి తీసి ఆమె నోటికి అందించబోయాడు.
”మీరు హద్దులు చెరిపేస్తున్నారు” అంటూ సౌమ్య సున్నితంగానే అతని చేతిని నెట్టేసింది.
”హద్దులన్ని మనం పెట్టుకున్నవే! అయినా మీలాంటి చదువుకున్న అమ్మాయి కూడా ఇలా ఆలోచించడమేమిటి? ఐ లవ్ యూ!” ఆమె భుజం మీద అతని చేయి. గొంగళి పురుగు ఒంటిమీద ప్రాకుతున్న భావన. కంపరంగా ఉన్న అతని స్పర్శను పళ్ళ బిగువున భరిస్తూ కదలకుండా కూర్చుంది సౌమ్య.
”ఈ గొలుసుకు ఏం లాకెట్ ఉంది? ఎప్పుడూ లోపలే ఉంటుందేం?” జాకెట్ లోపల ఉన్న గొలుసుని చొరవగా బయటికి లాగాడు. సౌమ్య అతని చెంప పగలకొట్టాలనే కోరికను అతిప్రయత్నం మీద నిగ్రహించు కుంది. అతని చెయ్యి ఆమెని చుట్టేసింది. అతని మొహం ఆమె మొహానికి దగ్గరగా జరిగింది. ఆమె చటుక్కున తల పక్కకి తిప్పుకుంది.
‘డీఫ్లవరింగ్….!” మత్తుగా గొణిగాడు.
”ఏమిటీ?”
”ఇలాంటి అనుభవం ఇంతవరకు లేదు కదూ?” హస్కీగా అడిగాడు.
”మీకుందా?” పదునుగా అడిగింది.
”అబ్బ! ఈ అందం పిచ్చెక్కిస్తోంది.” ప్రకాష్ ఆమెలో ప్రేరణ కలిగించే ప్రయత్నం చేయసాగాడు. ఆమె ఎలాంటి ప్రతిస్పందనా లేకుండా అలాగే కూర్చుంది. ఐదు నిముషాలు గడిచాయి.
”ఈ రోజుల్లో ఇలాంటివి మామూలే! వెస్ట్రన్ కంట్రీస్‌లో ఇలాంటివి లేకుండా పెళ్ళిళ్ళే కావు. ఒకరికొకరు అన్ని రకాలుగా తెలియడం మంచిది కదా!” అంటూ అతను లేచి వెళ్ళి అలమారలోనుంచి చిన్న మాత్రల స్ట్రిప్ తెచ్చి ఆమెకి ఇవ్వబోయాడు.
”ఏమిటది?” ఆమె గొంతులోని తీవ్రతని పట్టించుకోకుండా,
”మీలాంటి అమ్మాయిలు ఆఫ్టరెఫెక్ట్స్ గురించి భయపడడం సహజమే! ఇవి వాడితే ఎలాంటి భయం అక్కర్లేదు. అసలు ఈ కాలం అమ్మాయిలకు ఇలాంటివన్ని మామూలేగా!” ‘నీచత్వానికి పరాకాష్ఠ’ అనుకుంది సౌమ్య. ఆమె వెన్నులో చిన్న జలదరింపు. ఆమె వీపు మీద అతని చెయ్యి. జుగుప్సగా ఉన్న అతని స్పర్శ పళ్ళబిగువున భరించింది సౌమ్య.
రాయిలా ఉన్న ఆమెని చూసి అతని అహం దెబ్బతింది. రెండు క్షణాలు ఏం చేయాలో పాలుబోనట్టు కూర్చున్నాడు.
”అయిందా?” మెల్లగా అడిగింది సౌమ్య.
”అంటే…!” అతను దెబ్బతిన్నట్టు చూశాడు.
”అంటే మీరు ఇలా చేయగానే ఆడపిల్ల మీకు పడిపోతుందనుకున్నారా?” నెమ్మదిగా అడిగింది.
”మీ ఉద్దేశ్యమేమిటి?” కోపంగా ఉంది ప్రకాష్ స్వరం.
”నా ఉద్దేశ్యం సంగతి తర్వాత. ఆడపిల్లను ఎక్కడెక్కడో తడిమేయగానే మీకు దాసోహం అంటుందనుకుంటున్నట్టున్నారు. మనం జంతువులం కాదుగా! మనిషిలో సెక్స్ అధికభాగం మానసికమే! శరీరం ఒక పరికరం మాత్రమే! మనసు స్పందిస్తే ఆ శరీరం సహకరించి పవిత్రమైన సృష్టికార్యం జరుగు తుంది. రద్దీగా ఉన్నచోట్ల మీలాంటివారు ఆడవాళ్ళని ఎక్కడపడితే అక్కడ తాకుతుంటే వాళ్ళంతా మీ వెనకాల పడి ఎందుకు రావట్లేదో తెలుసా? అలాంటి స్పర్శ అసహ్యం, జుగుప్స కలిగించగా మనసు స్పందించదు. ఎవరో కొందరు ఏవో కారణాల వలన మీకు లొంగి నంత మాత్రాన అందరూ అలాంటి వాళ్ళే అనుకుని ఇలాంటి వెధవ ప్రయత్నం చేయడం నీ బుద్ధిలేనితనమే! నీకు జీవితంలో ఆశయం ఇదొక్కటే. పాతికేళ్ళ తర్వాత నీ బ్రతుకేమిటో! అయినా అది నీ సమస్య. మేక తోలు కప్పుకున్న నీలాంటివారు రోడ్ రోమి యోల కన్నా ప్రమాదం. ఇప్పుడు నా ఉద్దేశ్యం నీకు బాగా అర్థమైందనుకుంటా. ఇంకెప్పుడు నన్ను పలకరించే ప్రయత్నం కూడా చేయకు.”
సౌమ్య అతనికేసి కూడా చూడకుండా నింపాదిగా లేచి, వేసిన తలుపులు తీసుకుని నిటారుగా, హుందాగా బయటికి నడిచింది.
”షిట్! తను తొందరపడ్డాడు. ఇంకా కొంతకాలం ఆగి పెళ్ళి మంత్రం జపిస్తే పని తేలిగ్గా అయిపోయేది. పెళ్ళికి పడని ఆడది ఎవరూ?”… అవమానంతో మొహం కందగడ్డలా చేసుకుని, ఆమె వెళ్ళిన వేపే చూస్తూ గొణుక్కున్నాడు ప్రకాష్.
జ జ జ
రెండురోజుల తర్వాత ప్రకాష్‌కి తండ్రి దగ్గర్నించి ఉత్తరం వచ్చింది.
”………………నెల రోజుల క్రితం నీకు హైదరాబాద్ నుండి ఒక సంబంధం వచ్చింది. ఆ అమ్మాయికీ మీ ఆఫీసులోనే ఉద్యోగం వచ్చిందిట. ఈపాటికి ఉద్యోగంలో చేరే ఉంటుంది. ఫోటోలో పేరుకు తగ్గట్టుగా సౌమ్యంగా ఉంది. ఈ సంబంధం మనకి అన్ని విధాలా తగినది. పిల్ల నీకు తప్పకుండా నచ్చుతుంది అని మూఢం వెళ్ళగానే, అక్కడికి వచ్చి నీకూ చెప్పి లాంఛనంగా పెళ్ళిచూపులు కానిద్దాం అనుకున్నాం. నీ ఫోటో, జాతకం వాళ్ళకి పంపించాను. జాతకాలు బాగా కుదిరాయి. ఇప్పటికైనా నీకు కల్యాణయోగం పట్టబోతోందని మీ అమ్మ తెగ సంబరపడింది. కానీ నిన్న వాళ్ళు ఫోన్ చేసి మన సంబంధం వదులుకుంటున్నట్టు చెప్పారు. ఇంకా నీకు పెళ్ళి ఘడియ రాలేదని మీ అమ్మ బాధపడు తోంది కానీ ఆ ఘడియ నీకు ఈ జన్మలో రాదని నేననుకుంటున్నాను. నీ మామూలు వెధవ్వేషాలు ఆ అమ్మాయి దగ్గర కూడా వేసే ఉంటావని నా ఘట్టి నమ్మకం. పుట్టుకతో వచ్చిన నీ తింగరి బుద్ధులు పోవు, నీకు ఈ జన్మకి పెళ్ళే కాదు…..
ఆ తర్వాత అతనికి చదవాలని పించలేదు. హక్కుగా అనుభవించాల్సిన అందం చేజారి పోయినందుకు ప్రకాష్ మ్రాన్పడి పోయాడు.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags