సులభ్ ఇండియా సెప్టెంబరు 2010 సంచికలో ప్రచురించిన ఒక ఫోటో నన్ను నలభై అయిదు సంవత్సరా వెనక్కి, తీసుకెళ్ళింది. నీలిరంగు చీరలు, కుర్తా, షల్వార్‌లలో వున్న ఒక స్త్రీల సమూహం భారతదేశ అత్యున్నత శాసనసభ లోక్‌సభలోకి ఠీవిగా నడుచుకుంటూ వెళ్ళిన దృశ్యం ఆ ఫోటో. ఈ మహిళలందరూ ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు. గతంలో వాళ్ళంతా ఏమి చేసేవాళ్ళు?
నీలం రంగు దుస్తుల్లో వున్న వీళ్ళంతా రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాకు చెందినవాళ్ళు. వీళ్ళంతా తలల మీద మానవ మలాన్ని మోసే పాకీపనిలోంచి బయటపడి, వివిధ వృత్తుల్లో స్ధిరపడినవాళ్ళు. ఆగష్టు 17, 2010 నాడు వీళ్ళంతా పార్లమెంటులో అడుగుపెట్టినపుడు ఎం.పిలంతా కళ్ళప్పగించి చూసారు. ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా పాకీపనిలాంటి పరమ నికృష్టమైన పనిని కొనసాగిస్తున్న రాజకీయ వ్యవస్థ నిజానికి సిగ్గుతో తలదించుకోవాలి.
రాజకీయ నాయకులే కాదు తెలిసో తెలియకో మనం కూడా ఈ దారుణంలో భాగస్వాములమే. పైన పేర్కొన్న వ్యాసం చదువుతుంటే నా కళ్ళు ధారగా వర్షించసాగాయి. వీళ్ళతో నాకేమీ సంబంధం వుందని నాకింత దు:ఖం పొంగివస్తోంది? ఈ కన్నీటి ప్రవాహం నా గత స్మృతుల్ని, ఆ స్మృతుల్లో వున్న మకిలిని కడిగేస్తాయా? ఏమో!!!
నేను ఆరవ తరగతి చదువు తున్నపుడు మా నాన్న కొబ్బరి కాయల వ్యాపార నిమిత్తం మా సీతారామ పురం నుండి వచ్చి నర్సాపురంలో మకాం పెట్టాడు. 25 రూపాయలకు ఓ పెంకుటిల్లు అద్దెకు తీసుకున్నాడు. అయితే ఈ ఇంట్లో టాయ్‌లెట్ వుండేదికాదు. మరుగుదొడ్డి వుండేది. మాకు ఈ మరుగు దొడ్ల అలవాటు అస్సలు లేదు. గ్రామాల్లో బహిరంగ ప్రదే శాలే టాయ్‌లెట్‌లు కాబట్టి వీటి విషయం మాకు తెలియదు. అయితే నర్సాపురం వచ్చాక మరుగుదొడ్ల వాడకం అలవాట య్యింది. ఆ దొడ్లో పది ఇటుకల పరిచి వుండేవి. అదే మా లెట్రిన్ అన్న మాట.
ప్రతి రోజూ ఉదయమే పంజాబీ డ్రెస్ వేసుకున్న ఒకామె తట్ట తలమీద పెట్టుకుని వచ్చి మలాన్ని ఓ చిన్న రేకు ముక్క సాయంతో చేతులతో ఎత్తి తట్టలో వేసుకుని వెళ్ళిపోయేది. ఆమె పేరేమిటో, ఆ ముఖమెలా వుంటుందో మాకు పట్టేది కాదు. ‘పాకీది’ లేదా మరీ కోపం వస్తే ‘పాకీముండ’ ఇదే ఆమె పేరుగా స్థిర పడింది.
ఆమె పట్ల మేము ఎంత ఘోరంగా ప్రవర్తించే వాళ్ళమో తలుచుకుంటే నా మీద నాకెంత అసహ్యం వేస్తోందో? ఆమె రాక ముందే తలుపు తీసి పెట్టేవాళ్ళం. ఆమె ముఖం ఎక్కడ చూడాల్సి వస్తుందోనని పెరటి తలుపు తీసి లోపలికి పరుగు పెట్టే వాళ్ళం. ఒక్క రోజు ఆమె రాకపోతే ఎన్ని శాపనార్ధాలో! ఎన్ని తిట్ల దండకాలో! నిజానికి ఆమె ఒక్క రోజు రాకపోయినా మా బతుకు ఘోరం. ఆమె ఒక్క రోజు శుభ్రం చెయ్యకపోతే మా పరిస్థితి అధ్వాన్నం. ఆమె వస్తే ముఖం చూడకపొయ్యేది. రాకపోతే తిట్ల దండకం అందుకునేది. ఎందుకు రాలేక పోయింది? ఆమెకేమైనా సమస్య వచ్చిందా? అనారోగ్యం కల్గిందా? అబ్బే! ఇంత మానవీయతతో ఆమె గురించి ఆలోచించడమా? ఆమెను మనిషిగా, తోటి మనిషిగా భావించినపుడు కదా మానవీయ కోణం ముందుకొస్తుంది?
ఈ మధ్య కాలంలో సఫాయి కర్మచారుల ఆందోళనల గురించి, నీలిరంగు దుస్తుల్ని ధరించిన స్త్రీల నేపధ్యాల గురించి చదువుతున్నపుడు, వింటున్నపుడు నాలో నా చిన్ననాటి అనుభవాల అమానుషత్వం ఆవిష్కృతమౌతూనే వుంది. ఎప్పటికైనా నాలోపలి ఈ చీకటికోణం గురించి రాయగలనా అని మధనపడుతూనే వున్నాను.తెలిసో తెలియకో నేనూ ఈ అమానవీయ కార్యంలో భాగస్వామినైనందుకు సిగ్గుపడుతూ, దు:ఖపడుతూ, వేదన పడుతూ చిన్నప్పుడు నేను విసర్జించిన మలాన్ని తలమీద మోసిన ఆ తల్లికి పాదాభివందనం చేస్తూ ఈ ఉద్యమంలో నా వంతు కృషి చెయ్యడానికి బద్దురాలనౌతున్నాను.
చేతులతో శుభ్రం చేసే పాకీ దొడ్లు ఉండరాదనే ఉద్యమానికి మద్దతు పలుకుతూ, నా తప్పును సరిదిద్దుకునే ఏ పనికైనా సరే నేను రడీ అవుతున్నాను. ఇలాంటి అమానవీయ , అమానుష ఆచారాలకు పాతర వేద్దాం రండి.
చేతులతో మలాన్ని ఎత్తే మహాపచార పనికి వ్యతిరేకంగా మీ గళాన్ని విప్పండి.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
మా ఊరిలొ ఇంత దారుణం ఎప్పుడూ లేదు
నేను కాకినాడలో పుట్టి పెరిగిన పదిహేడేళ్ళూ ఈ పద్ధతి వుంది. హైదరాబాదు వచ్చాకే, ఈ పద్ధతి పోయింది. ప్రతీ మరుగు దొడ్డికీ, వీధి లోంచే వేరే చిన్న తలుపు వుండేది. వారు ఆ చిన్న ద్వారం లోంచి దూరి వెళ్ళి, శుభ్రం చెయ్యాలి. ఆ పని చేసే వారిలో ఆడవాళ్ళు బొట్టు పెట్టుకోరు. ఇక రోడ్డు మీద వారెదురు పడితే, ముక్కు మూసుకోవడం, ఆసింటా తప్పుకుని వెళ్ళడం అందరికీ అలవాటే. వారు పండగ రోజుల్లో ప్రతీ ఇంటికీ వెళితే, ఏ అర్థ రూపాయో, పావలాయో ఇచ్చేవారు ఇళ్ళ వాళ్ళు. వారంతా మునిసిపల్ కార్మికులు. ప్రైవేటు కార్మికులు కారు. కాబట్టి ఎప్పుడో ఒకసారి, ఏదో సమ్మె జరగడం, మరుగు దొడ్లు మురిగి పోయి, పురుగులతో నిండి పోవడం కూడా జరిగేది. అవును, ఇది చదవడానికి చాలా అసహ్యంగానే వుంటుంది. కానీ, సమ్మె అయ్యాక, ఆ పురుగులతో మురిగి పోయిన మరుగు దొడ్లని శుభ్రం చేసే, ఆ కార్మికుల గురించి ఆలోచించండి. అప్పుడు మనకి కలిగే అసహ్యం తగ్గుతుంది.
మా స్కూళ్ళో ముగ్గురు హిందీ టీచర్లు వుండేవారు. అందులోఒకరు బ్రాహ్మణ పురుషుడు. ఇంకొకాయన క్షత్రియ పురుషుడు. ఒకావిడ మాల స్త్రీ. ఆ విషయం మాకు తెలియదు అప్పుడు. ఆవిడ బొట్టు పెట్టుకునేది కాదు. ఆ పురుష టీచర్లు ఆవిడని తక్కువగా చేసేవారు. అది చిన్న పిల్లల మయిన మాకు కూడా స్పష్టంగా అర్థం అయ్యేది. ఎందుకో మాత్రం తెలిసేది కాదు. ఆవిడ వారంటే కోపంగా వుండేది. ఒక రోజు, ఆవిడ క్లాసులో పాఠం చెబుతూ, భర్త పోయిన స్త్రీలు బొట్టు పెట్టుకోరు అని చెప్పిందావిడ. అందరూ, ఆవిడ వేపు అదోలా చూస్తే, అప్పుడు ఆవిడ, “మేము మాల వాళ్ళం, మేము బొట్టు పెట్టుకోము” అని చెప్పింది. వినేసి వూరుకోవడమే తప్ప, మరేమీ తెలియని వయసు. ఇళ్ళలో అటువంటి వారందరికీ దూరంగా వుండాలని చెప్పే సంస్కృతి. ఆ హిందీ టీచరుకి నేనంటే ఇష్టం. నాకూ ఆవిడంటే ఇష్టంగానే వుండేది గానీ, ఆవిడంటే చాలా భయం. నాకే కాదు చాలా మందికి భయం. ఆవిడ చాలా స్ట్రిక్టుగా వుండేదావిడ.
వారి జీవితాలు తలుచుకుంటే, చాలా బాధ కలుగుతుంది.
చాలా చాలా ఘోరం.తప్పకుండా ఉద్యమించాల్సిన విషయం. పాదాభివందనం చేసే సదుద్దేశం మీకున్నా దానివల్ల వచ్చే ప్రయోజనం కన్నా మీరన్నట్లు ఇలాంటి అమానవీయ,అమానుష ఆచారాలకు పాతర వేయడమే సరైన మార్గం . మేమందరం మీ వెంటే ఉంటాం . మన తోటి మనుషుల పట్ల సమాజం నిర్దేశించిన ఇంత జుగుప్సాకరమైన అన్యాయమైన విషయం పట్ల బాద్యత తో స్పందించి అందరికీ తెలియజెప్పినందుకు ధన్యవాదాలు !