డా. హజారీ గిరిజారాణి, డా. కొలిపాక శ్రీదేవి
ఏడెల్లి కవిత
మా కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం ఆడ్మిషన్స్ పూర్తయ్యాక సీనియర్ విద్యార్థినులు ‘వెల్‌కమ్’ పార్టీ ఇచ్చారు. పార్టీలో ఫస్ట్ ఇయర్ అమ్మాయి.
అపురూపమైన దమ్మ ఆడజన్మ
ఆజన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ
మగవాడి బతుకులో సగపాలు తనదిగా
జీవితం అంకితం చేయగా
పసుపు తాడు ఒకటే మహభాగ్యమై
బ్రతుకుతుంది పడతి అదే లోకమై
అనే పాట పాడింది. అది విన్నాక ఇంటర్ పూర్తి చేసుకొని ఉన్నత విద్య అంటే డిగ్రీ చదువుతున్న అమ్మాయిలలో స్త్రీల గురించిన ఎలాంటి ఆలోచనలు అవగాహన ఉన్నాయి. అనేది తెలుసుకోవడం అవసరం అనిపించింది. సాధారణంగా సమాజంలో స్త్రీల పట్ల సాంప్రదాయిక పితృస్వామ్య భావజాలమే ఇప్పటికి ఉనికిలో ఉందనేది తెలుసు. అయితే చదువుకుంటున్న అమ్మాయిల అవగాహన స్థాయి విభిన్నంగా ఉండాలని ఆశిస్తాము. అయితే వారి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవటానికి ఒక చిన్న ప్రశ్నావళిని తయారుచేసుకొని మా కళాశాల ఉమెన్స్‌సెల్ కార్యక్రమాలలో భాగంగా 200 మంది అమ్మాయిల నుండి సమాచారాన్ని సేకరించాము. ప్రతిసంవత్సరము విద్యార్థినులలో జెండర్ స్పృహ కల్పించటానికి విస్తరణ ఉపన్యాసాలు వర్క్‌షాపులు నిర్వహిస్తుంటాము. అయితే అవి నిర్వహించక ముందే ఈ అధ్యయనం చేయటం జరిగింది. ఆడపిల్ల ఎలా ఉండాలి అనేదానికి డిగ్రీ విద్యార్థినులు వెలిబుచ్చిన అభిప్రాయలను ఈ వ్యాసంలో పొందుపరచాం. ఆడపిల్ల అందంగా, నాజుకుగా ఉండాలా, అలంకరణకు ప్రాధాన్యత ఇవ్వాలా అనే దానికి 80 శాతం మంది అవుననే సమాధానం ఇచ్చారు. ఆడపిల్ల అణుకువగా ఉండాలి అనే దానికి 97 శాతం, వినయ విధేయతలతో ఉండాల అనే దానికి 100 శాతం మంది అవుననే జవాబు ఇచ్చారు, 52 శాతం మంది ఉద్దేశంలో పెళ్ళి ముఖ్యమైనది, ప్రేమ వివాహం సరి అయినదికాదు అన్నవారు 85 శాతం, ఎటువంటి భర్త కావాలి అనేదానికి మంచి వ్యక్తిత్వం కలవాడు కావలన్నవారు 76 శాతం. ఆడపిల్ల జీవితంలో తల్లిగా, భార్యగా, వృత్తిపరంగా నిర్వహించే పాత్రల ప్రాధాన్యతను గురించి అడగగా మొదటి ప్రాధాన్యత తల్లిగా నిర్వహించే పాత్రకు, రెండవది భార్య పాత్రకు, మూడవది వృత్తిపరంగా నిర్వహించే పాత్రకు ఇచ్చారు. సమస్యలు ఎదురైనప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలా ఆత్మహత్య చేసుకోవాలా అదే దానికి 98 శాతం ఎదుర్కోవాలని, ఇద్దరు ఆత్మహత్య చేసుకోవాలని జవాబిచ్చారు. ఆడపిల్లలపై దాడులకు ఆడపిల్లలు కూడా కొంత వరకు కారణమన్న వారు 60 శాతం ఆడపిల్లలదే పూర్తి బాధ్యత అన్నవారు 30 శాతం. ఆడపిల్ల ఆ పాటలో చెప్పినట్లుగా ఉండాలా? అనే ప్రశ్నకు అవునని సమాధానమిచ్చిన వారు 81 శాతం. పుట్టింట్లో తండ్రి, మెట్టింట్లో భర్త, వృద్ధాప్యంలో కొడుకు అదుపాజ్ఞలలో ఉండాల అనే దానికి అవునని అభిప్రాయ పడినవారు 74 శాతం, పిల్లల పట్ల తల్లి బాధ్యతే ఎక్కువ అని 91 శాతం మంది అనగా మిగతావారు మాత్రమే సమానమన్నారు. ఇంటి పని ఎవరు చేస్తారు. అంటే ఆడవాళ్ళే చేస్తారు. అన్నవాళ్ళు 81 శాతం ఎవరు చేస్తే బాగుంటుంది. అంటే ఇద్దరు చేస్తే బాగుంటుంది అన్నవాళ్ళు 97 శాతం. భోజనం విషయంలో ఇంట్లో స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసం ఉందా అన్నదానికి ఉందన్నవారు 20 శాతం కాగా మగవాళ్ళు భోజనం చేశాకే ఆడవాళ్ళు భోజనం చేయాలి. అనే నియమాన్ని ఒప్పుకొంటారా అంటే లేదు అన్నవాళ్ళే ఎక్కువ అంటే 85 శాతం.
ఊ.ఙ. యాడ్‌లలో స్త్రీలను కించపరిచేవి ఏమైన ఉన్నాయా? ఉంటే ఒక ఉదాహరణను ఇమ్మని అడిగిన ప్రశ్నకు దాదాపు 90 శాతం మంది స్త్రీల డ్రెస్సింగ్ గౌరవప్రదంగా లేదని, ఫ్యాషన్ చానల్ బాగులేదని, విస్ఫర్ లాంటి యాడ్‌లు స్త్రీలను కించపరిచేవిగా ఉన్నాయని సబ్బుల యాడ్‌లలో స్త్రీలు స్నానం చేస్తున్నట్లు చూపటం బాగా లేదని వ్రాశారు. వీరందరు స్త్రీల శరీరాన్ని ప్రదర్శనకు పెట్టటం, స్త్రీలకు అవమానకరంగా, స్త్రీలను కించపరిచే విధంగా ఉందని భావించారు. వ్యాపారం కొరకు స్త్రీ శరీరాన్ని అర్థనగ్నంగా ప్రదర్శించటం సరైంది కానప్పటికి అమ్మాయిల భావాలను పరిశీలిస్తే వీరంతా పితృస్వామ్య భావజాల ప్రభావంతో యాడ్‌లలో స్త్రీలు ధరించే దుస్తులే స్త్రీలను కించపరిచేవిగా ఉన్నాయనుకొన్నారు. కాని స్త్రీల వ్యక్తిత్వాన్ని (కారెక్టరును) యాడ్స్ ఏ విధంగా కించపరుస్తు చూపిస్తున్నాయో గుర్తించలేకపోయారు. కాని 10 శాతం మంది అమ్మాయిలు మాత్రం అమ్మాయిల వ్యక్తిత్వాన్ని యాడ్స్ వక్రంగా చిత్రిస్తున్నాయనే అవగాహన కలిగి ఉన్నారు. వాళ్ళు వ్రాసిన ఉదాహరణలు. ఒక యువకుడు ఒక స్ప్రే చేసుకోవడం వలన చాక్లెటుగా మారతాడు అమ్మాయిలందరు అతనిని తెంపుకొని తింటుంటారు, ఒక స్త్రీ కండక్టర్ ఒక యువకుడిని టికెట్ అడిగి అతను కోల్గేట్ పేస్ట్ వాడటం వలన పని మానేసి బస్ దిగి అతనిని తీసుకొని వెళ్ళి పోతుంది, ఒక యువకుడు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుండగా అమ్మాయి తన తాళిని కొంగు చాటుకు దాచు కుంటుంది, ఒక అమ్మాయి మింటోఫ్రెష్ తిన్నవాడితో వెళ్ళిపోతుంది. ఇవన్నీ అమ్మాయి వ్యక్తిత్వాన్ని కించపరిచి చూపుతున్నాయని భావించారు. అంతే కాక వంటసామాను అమ్మటానికి అమ్మాయిలనే చూపటం అమ్మాయిలను వంటింటికే పరిమితం కావాలనే విధంగా ఉందని భావించారు.
జీవితాశయం ఏమిటి అన్నదానికి ఉన్నత విద్య. మంచి ఉద్యోగం చేయాలని చాలా మంది చెప్పగా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని ఇతరులపై ఆధారపడకుండ బ్రతకాలని కొంత మంది చెప్పారు. ఇది అమ్మాయిల ఆత్మాభిమానాన్ని తెలుపుతుంది.
అత్యధికశాతం విద్యార్థినులు వెలిబుచ్చిన భావాలు పితృస్వామ్యానికి అనుకూలంగా ఉన్నాయి. అంటే పితృస్వామ్య మాయాజాలాన్ని ఛేదించటానికి విద్య ఏ మాత్రం ఉపయోగపడటం లేదనేది స్పష్టమవుతుంది. అందుకే ఉన్నత విద్య అభ్యసించిన వాళ్ళు, ఉద్యోగాలు చేస్తూ ఆర్థిక స్వాతంత్య్రం ఉన్నవాళ్లు కూడా సరి అయిన నిర్ణయాలు తీసుకోలేకపోవటం తద్వారా మోసపోవటం ఆత్మహత్యలు చేసుకోవటం కన్పిస్తుంటుంది. పితృస్వామ్యంలో ఆమోదించబడిన స్త్రీ నమూనానే సరి అయినదిగా భావిస్తున్నారు. ప్రేమోన్మాదుల చేతిలో బలయిన అమ్మాయిల పట్ల సానుభూతి ఉన్నా, వారి తప్పిదం కూడ ఉందని భావిస్తున్నారు. స్త్రీలకు ఏ కీడు జరిగినా దానికి ఆమెనే బాధ్యురాలిని చేయటం అనాదిగా జరుగుతున్నదే.
ఏ భావజాలమైతే మొత్తం సమాజం అందులో భాగంగా స్త్రీల ఆలోచనా పరిధిని నియంత్రిస్తున్నదో దానిని ఛేదించే ప్రయత్నం ఏమాత్రం జరగటం లేదు. దాడి చేసేవాడి ఆలోచనలలోనే కాదు దాడికి గురయ్యే వారి ఆలోచననలో కూడ ఏమాత్రం మార్పులేదు. అందంగా, అణుకువగా, విధేయంగా ఉండటమే సహజమని. సరి అయినదని భావిస్తున్నారు. వ్యతిరేక పరిస్థితులను ఎదుర్కొనే శక్తి, సామర్థ్యాలను ఎలా సమకూర్చుకోవాలనే దానిని గురించి అవగాహన కాని, ఆలోచన కాని కనిపించడం లేదు. అలాంటి ఆలోచనలు కల్పించే పరిస్థితులు అసలే లేవు. ఇంకా దానికి బదులుగా అమ్మాయిలను వ్యక్తిత్వం లేని మూసలోకి తోసే ప్రయత్నాలే జరుగుతున్నాయి. దీనికి భిన్నంగా వారు ఆత్మగౌరవంతో బ్రతకటానికి సమాయత్త మయ్యేటట్టు ప్రయత్నాలు జరగాలి. ఈ సమాయత్త పరచటం అనేది విద్యా ఉపాధి కల్పించినంత సులభం కాదు. విద్య ఉపాధి అవసరమే కాని నిర్భీతిగా, స్వేచ్ఛగా, ఆత్మగౌరవంతో బ్రతకటానికి ఇవి మాత్రమే సరిపోవని అనుభవం తెలుపుతున్నది. దానికై ఇంటబయట పోరాడవలసి ఉంటుంది. భాషా, పాఠ్యాంశాలు, ప్రకటనలు, ప్రసార సాధనాలు, సాహిత్యాంశాలు, చట్టాలు ఎన్నో మారవలసి ఉంటుంది. వాటి మార్పుకై దీర్ఘకాలం నిరంతరంగా తీవ్ర కృషి సలుపవలసి ఉంటుంది. ఆడపిల్లను అవమానపరిచే చిన్నచూపు చూసే ఏ చిన్న అంశాన్నయినా ఖండించవలసి ఉంటుంది. ప్రభుత్వంతో పాటు, జండర్ స్పృహ కలిగిన చైతన్యవంతులైన ప్రతివారు సంఘటితంగాను, వ్యక్తిగతంగాను మార్పుకై నిబద్ధతతో ప్రయత్నించవలసి ఉంటుంది. అపుడే ఆడపిల్ల అంటే అందంగా, నాజుకుగా, అణుకువగా ఉండేది కాదు, శారీరకంగా, మానసికంగా, దృఢంగా ఉండేది, ఎటువంటి విపత్కర పరిస్థితులలోనైనా ధైర్యంగా పోరాడగలిగేదే ఆడపిల్ల అనే నమూనా రూపొందుతుంది. ఆత్మవిశ్వాసమే స్త్రీల విజయపతాకమవుతుంది. మానసిక దృఢత్వమే పరిష్కార సూచిక అవుతుంది.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
బాగా చెప్పారు. ఈ చదువులు ఎందుకూ పనికి రాకుండా పోతున్నాయి. అవే చదువులు అబ్బాయిలు కూడా చదువుతారు కదా? అమ్మాయిలకు చైతన్యం బోధించే చదువులు, అబ్బాయిలకు పనికి రాకుండా పోతాయి కాబట్టి, అలాంటి మంచి విషయాలు చదువుల్లో వుండవన్న మాట. రాసిన విధానం అభివృద్ధి చేసుకుంటే, ఇంకా బాగుంటుంది.
చాలా బాగా చెప్పారు. ప్రస్తుతతమున్న చదువులు మంచి వ్యక్తిత్వాన్ని ఇచ్హె విధంగ లెవు. కెవలమ ఉద్యొగ పరంగ తప్పితె , మంచి విషయాలు నెర్చుకొవతానికి ఉపొయొగపదవు. పురుషాదిక్య ప్రపంచంలొ అమ్మయిలకు ఉపయొగపదెవిదంగ చదువులని తీర్చి దిద్దరు…..స్త్రీలు, అలగె సమానాత్వమ కొరుకునె వాల్లు ఇతువంతి విషయాలపి పొరాదాలి . ప్రభుత్వము పి వత్తిది తెవాలి.