జూపాక సుభద్ర
శ్రీ కృష్ణ కమిటీ తెలంగాణ రాత మారుస్తది గీత చెరుపుతదని తెలంగాణ వాల్లు అనుకోలే. అసలు కమిటీ వేసుడే దండుగ మారి పని అని అనుకున్నరు. కొంతమంది కమిటీ పట్ల నిరసనలు కూడా తెలిపిండ్రు.కాలయాపన కోసం వేసుకున్దని దుయ్యబట్టిండ్రు. కమిటీనేసి అట్టిట్ల దేకించి డిసంబర్ 31.10 నాటికల్లా రిపోర్టు యిచ్చి చేతులు దులిపేసుకుంది శ్రీకృష్ణకమిటీ. డిసంబర్ 31 వస్తుంది. ఆ రోజు చుక్కల్ని చూయిస్తం. సూర్యున్ని ఆర్పేస్తాం అని జనం గుండెల్లో విమానాల్ని పరిగెత్తించిండ్రు. ఇంతకి డిసంబరు 31/10న ఏమైంది? ఏంగాలె. జనాన్ని టెన్షన్‌ల ముంచెత్తిండ్రు. వూదుగాలలే పప్పు వుడకలే. మల్లా అదే మోసం తిరిగి తిరిగొచ్చింది మరణం లేకుండ.యింత ఉధృతిలో కూడా బలహీన పడకపోవడం ఆశ్చర్యం.
తెలంగాణ యూనివర్సిటీలన్నీ తెలంగాణ పోరుకు అడ్డాలైతే ఉస్మానియా కేంద్ర బిందువుగా మండుతోంది. ఒక్క యాడాదిలనే నాలుగు వందల మంది తెలంగాణ బిడ్డలు ప్రాణత్యాగం జేసిండ్రు. ఆ త్యాగాల వెలలు ప్రత్యామ్నాయాల్ని ప్రశ్నిస్తుంది తెలంగాణ. తెలంగాణ నిత్యం ధర్నాలుగా, బంద్‌లుగా, నిరాహార దీక్షలుగా, దిగ్భంధనంగా, గర్జనలుగా, చర్చలుగా నిత్యం నినాదాల హోరై మండుతూనే వుంది. అయినా యీ ప్రజల ఆకాంక్ష యింత తీవ్రంగా ప్రతిధ్వని స్తూంటే శ్రీకృష్ణ కమిటీ సమైక్యాంధ్ర కోసమే సిఫార్సులన్ని చేసి ఒక్క (5) సిఫార్సు మాత్రం విభజనకనుకూలంగా ప్రస్థావించింది. కమిటీ తెలంగాణని యింకా గాయాల గుండం జేసింది.
నిజానికి శ్రీకృష్ణ కమిటీ మీద ఎలాంటి నమ్మకాలు లేకపోయింది. అన్ని కులాల నుంచి వర్గాల నుంచి, రచయితలు, విద్యార్ధులు, ఉద్యోగులు, స్త్రీలు, దళిత స్త్రీలు, కార్మికులు, రైతులు, కూలీలు కొన్ని వందల నివేదికలు తమ తెలంగాణ ఆకాంక్షను బలంగా చెబుతూ నివేదికలిచ్చారు. యివేవి కమిటీ చెవి మీద పేను పారలేదు కుట్టలేదు. సీమాంధ్ర కొమ్ము కాసే బూరనే అయింది. ఒక ఎంపి చెప్పినట్లు శ్రీ కృష్ణ కమిటీకి సీమాంధ్రులు బాగానే సల్వతి చేసి వుండొచ్చు.
నివేదికలో అసలు సిసలైన సామాజిక న్యాయాల లెక్కలు చూయించకుండా సీమాధ్ర పాలకులే ఆంధ్రప్రదేశ్ పాలన చేశారని తెలంగాణ వాల్లు చాలా తక్కువ సమయం తక్కువ మంది పాలించారని లెక్కలు చూయిస్తూ చెప్పింది. స్వాతంత్య్రమొచ్చిన 42 ఏండ్లల్లో రెడ్లు, బ్రాహ్మలు, కమ్మవాల్లు ఎక్కువమంది ఎక్కువ కాలం పాలించారు. మధ్యలో ఒక్క దామోదరం సంజీవయ్య, అదీ సీమాంధ్ర దళిత మాల ముఖ్యమంత్రిగా వున్నా గట్టిగా రెండేంండ్లు కూడా నెగలనియ్యలే. 60 దళిత కులాల్నించి, స్త్రీల నుంచి, దళిత స్త్రీల నుంచి, బీసీ కులాల నుంచి కూడా 63 ఏండ్లు స్వాతంత్య్ర చరిత్రలో ఒక్కరంటే ఒక్కరు కూడా ముఖ్యమంత్రి కాని దౌర్భాగ్య సామాజికం. పాలకుల్లో స్థానం లేని వాల్లు, ఉద్యమ నిర్ధేశకుల్లో స్థానం లేని వాల్లు అంతా యీ అణచబడిన సమూహాలే.
ఉద్యమాల్లో కూడా కారు, డబ్బు, దస్కం వున్నవాల్లే హల్‌చల్. అదీ ఆధిపత్య సమూహాల గుత్త సొమ్ముగా జరుగుతంది. తెలంగాణ లాయర్లు తెలంగాణ వాటా కోసం పోరాడితే దాని ఫలితాలు దక్కింది రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ లాంటి పెద్ద కులాలకే. ఎస్‌సి, ఎస్‌టి, బిసి కులాల లాయర్స్‌కి ఆ ఫలితాలే అందని పరిస్థితి చూస్తున్నాం. ఏంటిది అని నిలదీస్తే ఉద్యమ సందర్భంగా కులం, మతం జెండర్ ప్రస్థావనలు తేవద్దు ‘చిచ్చు’లు తేవద్దు అంటున్నరు. సామాజిక న్యాయాల ప్రశ్నలు కనబడొద్దు, వినబడొద్దు ‘ష్ గప్‌చిప్’.
శ్రీ కృష్ణ కమిటీ చాలా అంశాలు అప్రస్తుతం చేసింది. తెలంగాణ బిడ్డల ప్రాణత్యాగాల మీద చర్చ రాలేదు. కానీ ఎస్‌సిఎస్‌టిబిసి యువతను ప్రాంతీయ వివక్ష వల్లకాదు నైపుణ్యం లేకపోవడంవల్ల ఉద్యోగాలు రాలేదని చెప్పడం పెద్ద అబద్ధం. నైపుణ్యాలకు అడ్డుపడిన శక్తుల్ని, కారణాల్ని మరుగుపరిచింది కమిటీ. శ్రీ కృష్ణ కమిటీ రెండు వాల్యూమ్‌లు 700 పేజీలుగా యిచ్చినా సామాజిక న్యాయాలు పాలనాపరంగా విద్య, ఉపాధి, వనరుల పంపకం తీరు తెన్నుల విశ్లేషణలే లేవు. సామాజిక న్యాయాలకు ఒక్క పేజీ కాదు గదా ఒక్క పేరా, ఒక్క అక్షరంకు కూడా స్థానం కల్పించినట్లు కనబడదు.
ఆదివాసీ స్త్రీలు పోగొట్టుకున్న అటవీ భూములు, బిడ్డల్ని అమ్ముకున్న దారిద్య్రాలు దళిత స్త్రీల వలసలు, అసంఘిత రంగాల్లో వారు చదువుల్లేక, ఉపాధుల్లేక సమాన వేతనంలేక ఆకలికి అలమటిస్తున్న పరిస్థితులు నివేదికలో శూన్యం. కూలి రైతులు దళిత, బహుజన, ఆదివాసీ మైనారిటీల దుర్భిక్షాలు వాటిక్కారణాలు ఎక్కడా చెప్పబడలేదు.
హైద్రాబాద్ చుట్టు పక్కల జరిగిన అభివృద్ధినే తెలంగాణ అభివృద్ధిరేటుగా చూపించడంను చాలా పగడ్భందిగా చేసింది శ్రీకృష్ణ కమిటీ. బాధపడాల్సిందేంటంటే యిన్ని మహిళ సంగాలు, ఫెమినిస్టు ఉద్యమాలు మహిళా ఎన్.జి.ఓలు పనిచేస్తున్నా తెలంగాణ మహిళల అభివృద్ధి ఎక్కడ, అభివృద్ధిలో వాటా గురించిన సందర్భాలే లేకపోవడం ఆశ్చర్యం కలిగిం చింది. విషాదమేంటంటే మాతృస్వామిక మహిళల భాగస్వామ్యం అప్రధానం చేయ బడడం.
తెలంగాణ పిల్లాది మారకాంచి తెలంగాణను కోరుకుంటున్న వాళ్లే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా సీమాంధ్ర పెత్తనాలు లేక స్వేచ్చా గాలులు పీల్చుకోవాలనే ఆకాంక్షలున్న వాళ్లే. ఉద్యమాల్లో వివక్షలుండడం ఉద్యమాలకే చేటు. వివక్షలు అసమానతల వూసు ఎత్తడమే నేరం. కన్నెర్రలు.
లెక్క ప్రకారంగానైతే ఉద్యమం రోడ్డెక్కినంక అందరు సమానమే. కుల, మత జెండర్‌లకు తావుండొద్దు. కాని రోడ్ల మీద ఆడవాళ్లే వంట లు చేస్తరు. మాదిగోల్లే బూట్లు తూడుస్తరు. చాకలోల్లే బట్టలుత్కుతరు నిరసనగా. యీ అన్యాయాలేంటి అని యిప్పుడడగొద్దు. ష్ గప్‌చుప్.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags