శివరాణీదేవి ప్రేమ్‌చంద్
అనువాదం : ఆర్. శాంతసుందరి
”అయితే వీళ్లనెలా బాగుచెయ్యటం?”
”ఆ భగవంతుడికే తెలియాలి! ఈ విభేదాలు సమసిపోతే తప్ప మనకి స్వరాజ్యం రాదు, ఊరికే ఆశపడి ఏం ప్రయోజనం? ఇక ఇద్దరూ పోట్లాడుకుంటూనే ఉంటే ఆ స్వరాజ్యం దేనికి, దండగ? గాంధీ ఈ యుగంలో పుట్టిన అతి గొప్ప మేధావి. ఆయన మనసులో ఇద్దరూ సమానమే. ఆయన మొట్టమొదట చూసేది మానవత్వాన్ని. మనిషి మనిషిగా లేనప్పుడు ఇక మతమేమిటి? ఎవరి కోసం?”
”కానీ గాంధీని అందరూ ఇష్టపడ తారు!”
”నీకు తెలీదు. ఆయన్ని నానా మాటలూ అనేవాళ్లు కూడా ఉన్నారు. గాంధీగారి కన్నకొడుకు ముస్లిమ్‌గా మారాడు. దాన్ని గురించి కస్తూరిబాయి ఏడ్చి మొత్తుకుంది. గాంధీ ఆమెకి ఎంతో నచ్చచెప్పటానికి ప్రయత్నించారు. మతం మారినంత మాత్రాన వాడిలో ఏం మార్పు వచ్చిందని ఆమెని అడిగారు. ఆయన అందర్నీ సమానంగా చూస్తారు. పాకీవాడి కూతుర్ని తన కూతురికన్నా ఎక్కువగా చూసి, ప్రేమగా తన కంచంలో తినిపించి, పెంచారు.”
”అయితే మీరు గాంధీ అవుదామను కుంటున్నారా?”
”గాంధీ కూడా మనిషే. ప్రయత్నిస్తే అందరూ గాంధీలవచ్చు. ఆయనలో శక్తులున్నాయి. మొదట్లో ఆయన జీవితం ఇంత ఉన్నతంగా ఉండేది కాదు. అప్పుడాయన్ని ఎవరూ మహాత్ముడు అని అనలేదు. తను స్వయంగా ప్రయత్నించి ఆయన మహాత్ము డయాడు. ఎవరూ ఆయన్ని అలా తయారు చెయ్యలేదు.”
”మీరు కూడా మహాత్ముడిలా అవటం కోసమే రోజూ ఏదో ఒక గొడవ లేవదీస్తు న్నారా? ఈ గొడవల వల్లే ఎవరైనా మహాత్ముడై పోగలడా?”
”నేను నా పని చేస్తాను. గాంధీగారు కూడా తనపని చేస్తారు. ఆయనకి కూడా కష్టాలు ఎదురవుతాయి; కానీ ఆయనెప్పుడూ వాటిని పట్టించుకోలేదు. అదే జీవితమంటే!”
”గాంధీగారికి ఒంట్లో బావుండకపోతే అందరూ గగ్గోలు పెడతారు. మీ విషయంలో అలా కాదే! మీకు ప్రాణాలమీదికి వచ్చినా ఎవరూ ఏమీ అనరు!”
”దానికి కారణం, నా పరిధి చాలా చిన్నది. గాంధీ గారు ప్రపంచమంతటికీ కావల్సిన మనిషి. అందుకే అందరూ ఆయన్ని ప్రేమిస్తారు.”
”అయితే మీరు కూడా ఇల్లూ వాకిలీ వదిలేసి మహాత్ముడైపోకూడదూ?”
”నేనలా జనం కోసం ఇల్లొదిలిపోతే ఇక మనకి చెడ్డరోజులొచ్చినట్టే!”
”పెద్ద తేడా ఏముంది? ఇప్పుడు మాత్రం తెల్లారేదాకా రాస్తూ కూర్చోటంలే?”
”రాయటం కూలిపని. రాయకపోతే ఏం తింటాం, గడ్డి! మహాత్మా గాంధీ మాత్రం తిండి తినటం లేదూ?”
జ జ జ
”స్త్రీల స్వాతంత్య్రం గురించి మీ అభిప్రాయం ఏమిటి?” అని అడిగాను.
”స్త్రీ పురుషులిద్దరూ సమానంగా ఉండాలనే కోరుకుంటాను,” అన్నారు.
”మరి దానికోసం మీరెందుకుపోరా డరు?”
”ఆ శక్తిని సాహిత్యంలో ఉపయోగించా లని అనుకుంటాను, నేను.”
”జనం మీరు రాసేది చదువు తున్నారా?”
”అయితే జనానికి చదువు సంధ్యలు లేవని ఈ విషయాలు ప్రస్తావించకుండా ఉంటామా? నెమ్మది మీద అందరూ దారి కొస్తారు. నీకు తెలుసో లేదో కానీ, రష్యాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి గురించి అక్కడి రచయితలు రెండువందల ఏళ్ల క్రితమే రాసేశారు!”
”అయితే నేను దాన్ని చూడలేనన్న మాట!”
”నీకు వెంటనే ఫలితం కావా లంటావు! బహుశా మనం ఆ మార్పుని చూడ గలమేమో! ఇక్కడ పాతిక సంవత్సరాలలోనే దేశం చాలా ముందుకి పోయింది.”
”కానీ సమాజం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగానే ఉంది.”
”అలా ఎలా అంటావు? మీ అమ్మకి ఎప్పుడైనా జైలుకెళ్లాలన్న ఆలోచన వచ్చిందా? నువ్వెందుకు జైలుకెళ్లావు మరి? నువ్వే కాదు, ఇరవై వేల మంది స్త్రీలు జైలుకెళ్లారు. సమాజం ఇంతకన్నా పురోగతి సాధించేదేముంది? స్త్రీలలో చాలా చైతన్యం కనిపిస్తోంది, నాకు. సమాజానికి ఇది చాలా మంచిది.”
”ఇంకా ఇప్పటికీ చాలామంది మగాళ్లు స్త్రీలని ఘోషాలో ఉంచటమే మంచిదని అనుకుంటున్నారు.”
”ఎంతో కాలంగా ఉన్న అలవాటు ఒక్కరోజులో ఎలా పోతుంది?”
”మన దేశంలో ఎక్కువమంది పల్లెల్లో ఉంటారు. వాళ్ల ఆచారాలన్నీ ఇంకా పాతవే,” అన్నాను.
”వాటిని నిర్మూలించటం మీ బాధ్యతే,” అన్నారాయన.
”మా సంఖ్య అంత పెద్దది కాదు కదా?”
”ఒక్క చిన్న నిప్పురవ్వ అడవిని మొత్తం కాల్చి బూడిద చేసేస్తుంది. ఏ దేశం ఎప్పుడు ప్రగతి సాధించినా దానికి వెనక కొద్దిమంది ప్రయత్నమే పనిచేసింది. ఇక్కడ కూడా జరిగే సంస్కరణలన్నీ కొద్దిమంది ప్రయత్నాలవల్లే జరుగుతున్నాయి.”
”కాంగ్రెస్ కోసం చందా అడిగేందుకు మేం వెళ్తే ఆ గ్రామస్తులు మమ్మల్ని నోటికొచ్చినట్టు తిడతారు,” అన్నాను.
”ప్రజలని ఉద్ధరించేవాడు తన గురించి పూర్తిగా మర్చిపోవాలి. అప్పుడే అతన్ని అందరూ గౌరవిస్తారు. ఎవరో స్త్రీలు నిన్ను తిడితే నువ్వెందుకు బాధపడాలి? ఆ తిట్లని మెచ్చుకోలుగా భావించినప్పుడే మీరు గొప్పవాళ్లనిపించుకోగలరు. వాళ్లు మీతో ప్రేమగా మాట్లాడుతున్నారని అనుకుంటూ వాళ్లలో ఒకళ్లుగా కలిసిపోవటానికి ప్రయత్నించాలి,” అన్నారాయన.
”మీరు చందాలు పోగుచెయ్యగలరా?”
”ఊఁ! ప్రయత్నించాను, కానీ సాధ్యం కాలేదు.”
”మేం నెలకి పదేసి వేలు పోగు చేశాం.”
”అందులో ఆశ్చర్యమేముంది? స్త్రీలెప్పుడూ తాము చేసే పనిలో విజయం సాధిస్తూనే ఉన్నారు. అవతలి వాళ్లని ఆకట్టుకోవటం వాళ్లకి బాగా చాతవును.”
”చాలామంది మగవాళ్లు కూడా లక్షల రూపాయలు చందా పోగుచేశారు.”
”వాళ్లకి అడగటం చాతయి ఉంటుంది. అది చాలా మంచి కళ. నేను చూస్తూనే ఉన్నాగా, నువ్వు రోజూ ఎంత చక్కగా ఉపన్యాసాలిస్తావో! నాకలా ఉపన్యాసం ఇవ్వటం రాదు!”
”ఉపన్యాసం ఏమిటి లెండి! వాళ్ల బాధ పడలేక ఏదో ఒకటి మాట్లాడి బాధ్యత తీర్చుకున్నాననుకుంటాను.”
”కానీ నీకు కావల్సినది జరిగిపోతుంది కదా!”
అక్టోబర్ 1925
అప్పుడు మేం బేనియా అనేచోట ఉన్నాం. దీపావళికి ఇంకా మూడు రోజులుంది. ఆ రోజు లక్ష్మీపూజ చేసే ధన్‌తేరస్. ‘జాగరణ్’ పత్రిక రెడీ అవుతోంది. అందులో మునిగిపోయిన ఈయనకి దీపావళి దగ్గరపడిందని కూడా గుర్తులేదు. ధన్‌తేరస్ రోజున మధ్యాన్నం మూడుగంటల ప్రాంతంలో ప్రెస్‌నించి ఇంటికొచ్చారు. వస్తూనే, ”ఎల్లుండే కదా దీపావళి?” అన్నారు.
”ఆహా! మీకీరోజు గుర్తొచ్చిందా?” అన్నాను.
”ఇవాళ దుకాణాలన్నీ లక్ష్మీపూజకోసం అలంకరించి ఉన్నాయి. జనం ఇళ్లకి వెల్లలు వేయించుకుంటున్నారు. మరి నీ ఇల్లు చెత్తగా ఉంటుందా?”
”మీకు ‘జాగరణ్’, ‘హంస్’ పనులనించి తీరిక దొరికితేకదా వేరే పనులు చేయించేం దుకు?”
ఆయన నవ్వుతూ, ”నీకు నామీద కోపం వచ్చినట్టుందే? ఎలా మర్చిపోయానో? అసలు గుర్తేలేదంటే నమ్ము! ఇంక ఇప్పుడు నువ్వేమో అలిగావు!” అన్నారు.
”నేనలిగితే మాత్రం మీకేమిటిట? ఎన్నో రోజుల క్రితమే దీపావళి దగ్గర పడుతోందని మీకు చెప్పాను. అప్పుడు, అసలు తీరికలేదు, అన్నారు. ‘జాగరణ్’ త్వరగా అచ్చువేయించాలని అన్నారు.”
”ఆ తరవాత నేను దాన్ని పూర్తిగా మర్చిపోయాను. నువ్వైనా గుర్తుచెయ్యచ్చు కదా!”
”ఒకసారి చెప్పాకదా? మళ్లీ మళ్లీ ఏం చెప్తాను?”
”పనిలోపడి మర్చిపోయాను. ఇవాళ దుకాణాల సందడి చూస్తే గుర్తొచ్చింది. పొరపాటు జరిగిపోయింది. ఇంటికి సున్నాలు వేయించి ఉండాల్సింది. సరే, ఇప్పుడిక ఏమిటి ఆలస్యం? డబ్బియ్యి, సున్నం అవీ తెప్పిస్తాను. ఇవాళ కొత్త గిన్నెలు కూడా కొనాలి. ఎక్కా తెప్పిస్తాను, పద వెళ్దాం. ఒక్కరోజులో పనైపోతుందిలే, పనివాళ్లు ఆ సంగతి చూసుకుంటారు. సాయంత్రం మనింట్లోనే చక్కగా దీపావళి చేసుకుందాం. ఇంకెవరింట్లోనో దీపాలు వెలిగిస్తావా నువ్వు?” అన్నారు.
”ఒక్క రోజులో మీరీ పనులన్నీ చేసేస్తారా?” అన్నాను.
”ఏం పరవాలేదు. నువ్వలా చూస్తూ ఉండు, అన్ని పనులూ సవ్యంగా ముగుస్తాయి. ఆలస్యం చెయ్యక, పొద్దుగూకుతోంది. అన్నీ సర్దు, హడావిడి పడితే లాభంలేదు.”
మేమిద్దరం ఇలా మాట్లాడు కుంటూండగా మా అక్క కొడుకు వచ్చాడు. వాడు కాశీ విశ్వవిద్యాలయంలో చదువు కుంటున్నాడు. ఇంటికెళ్లేందుకు సిద్ధమవు తున్నామని విని, ”పిన్నీ, బాబాయి చెప్పేది సబబే కదా! వస్తువుల లిస్టు నాకియ్యి, నేనూ, ధున్నూ సామాన్లు కొనుక్కొస్తాం,” అన్నాడు.
ఆయన నవ్వుతూ, ”పరవాలేదే, వీళ్లు కూడా నా పక్షమే ఉన్నారు! సరే నువ్వు త్వరగా తెములు. వాళ్లకి లిస్టు ఇచ్చెయ్యి,” అన్నారు.
వాళ్లకి సామాన్ల లిస్టు ఇచ్చి, మేమిద్దరం ఎక్కాలో చీకటి పడకముందే ఇల్లు చేరాం. పిల్లలిద్దరూ మార్కెట్‌కి వెళ్లారు. నేను ఇంటి తలుపులు తెరిచి, శుభ్రం చేయించాను. మర్నాడు పొద్దున్నే ఒక పదిహేనుమంది కూలీలు ఇంటికొచ్చారు. ముందురోజు రాత్రే సున్నం నీళ్లల్లో వేసి ఉంచాం. కూలీలు వచ్చీ రాగానే సున్నాలు వెయ్యటం మొదలుపెట్టారు. కొందరు కిటికీ రెక్కలకీ, తలుపులకీ రంగులు వేశారు. మా ఆయన కూడా రోజంతా వాళ్లవెంటే ఉండి సాయం చేశారు. తనుకూడా రంగులు వేశారు. సాయంత్రం పిల్లలవెంట దీపాలు కొనేందుకు వెళ్లారు. ప్రమిదలన్నీ వెలిగించేసరికల్లా బోలెడుమంది రైతులూ, ఇంకొందరూ, గుమ్మం దగ్గర కూర్చున్నారు. అప్పుడు ఈయన దీపావళి పండగ ఎందుకు చేసుకుంటారో వాళ్లందరికీ చెప్పారు. దీన్ని జరుపుకోవటంవల్ల ఏమిటి లాభం? లాంటి ఎన్నో విషయాలని వాళ్లకి అర్థం అయే భాషలో వివరించారు. ఇలాటి ఉత్సాహాన్ని సాధారణమైన విషయంగా ఎవరైనా తీసిపారెయ్యగలరా?
…ఆ రోజులు నా జీవితాన్ని ఎంత సుఖంతో నింపేశాయి! నేనొక గృహిణిగా, అదృష్టవంతురాలిగా బతికాను. నాకు దేనికీ కొరత ఉండేది కాదు. ఆయన పోయాక ఆ వస్తువులన్నీ అలాగే ఉన్నాయి, కానీ ఆయన లేరు అందుకే ఇప్పుడు నాకు అంతా కొరతే. ఆయనే లేకపోయాక, ఇంకేం చెప్పను? ఇంకేం మిగిలి ఉందని అనను? ఈ విషయాలు మనసులో మెదిలినప్పుడల్లా ఒక నిట్టూర్పు విడిచి ఊరుకుంటాను…!
…ఆయన పరిగెత్తి దీపాలు వెలిగిస్తూంటే నాకు నవ్వొచ్చేది. చిన్నపిల్లవాడిలా కనిపించేవారు నా కళ్లకి.
”ఇవాళేమిటి, చిన్నపిల్లలకన్నా ఉత్సాహంగా పరుగులు పెడుతున్నారు?” అన్నాను.
”సర్లే, ఈ రోజుల్లో కుర్రాళ్లలో అసలు ఉత్సాహం ఉందా?”
”అంటే ఈ రోజుల్లో కుర్రాళ్లకి చదువుతోనే సరిపోతోందాయె! ఈ పండగల్లో ఏముందిలే అనుకుంటారు వాళ్లు.”
”అదేం కాదు! వాళ్ళకి దేన్లోనూ ఉత్సాహం లేదు. పండగలూ పబ్బాలూ వచ్చినప్పుడు ఆనందంగా గడపటం జీవించి ఉన్నవాళ్ల లక్షణం; ఎవరిలో ఎంత జీవం ఉంటే, వాళ్లు అంత సంతోషంగా ఉంటారు,” అన్నారు.
1932-33
హోలీకి ఒకరోజు ముందు భోజనం చేశాక, మర్నాటికి పిండివంటలు చెయ్యటం కూడా పూర్తయింది. హఠాత్తుగా, ”రేపు ఊరెళ్దాం!” అన్నారు.
”అరె, ముందుగా చెప్పాల్సింది! రేపు హోలీ పండగ, ఇంత హఠాత్తుగా చెబితే సామాన్లెలా సర్దుతాను చెప్పండి?” అన్నాను.
”అదేమంత పెద్దపని? పిండివంటలు ఎలాగూ నువ్వే చేస్తావు. వాటిని మనతో కూడా అక్కడికి తీసుకెళ్తే సరి! పల్లెటూరు ఎంత హాయిగా ఉంటుంది! అమ్మాయి ఆరోగ్యం అక్కడికెళ్లాకే చక్కబడింది. పద మనం కూడా వెళ్దాం. పొద్దున్నే ఎక్కాబళ్లు పిలుచుకుని, అందరం హాయిగా ప్రయాణమవుదాం. మనిల్లు ఊళ్లోనే ఉంది కదా? జనం ఎంతో దూరాలనించి కూడా పండగలకి ఇళ్లకి చేరుకుంటారు.”
”సరిగ్గా హోలిరోజు ప్రయాణం, దారంతా ఇబ్బందులుంటాయి.”
”ఏమైందిట? రంగంటే భయమా నీకు?”
”ఉత్తరంగులే కాదు కదా? అపభ్రంశపు మాటలు కూడా వినాలి!”
”ఒక్క గంటసేపు ముసుగు వేసుకుంటే సరి.”
”అంటే వెళ్లటం తప్పదంటారు!”
చివరికి నేను ఒప్పుకున్నాను. మర్నాడు పొద్దున్న ఆయన ఐదుగంటలకల్లా లేచేశారు. కాలకృత్యాలు తీర్చుకుని వెంటనే వెళ్లి బళ్లు పిలుచుకొచ్చారు.
”సామానంతా సర్దేశావు లాగుందే?”
”ఇంకా పరుపులు చుట్టాలి.”
నేనా పనిచెయ్యటం చూసి, ”లే, నీవల్లకాదు, నేను చేస్తానీపని!” అన్నారు.
”ఏం? ఎందుకని?”
”నీ చేతులు చూడు, ఎంత చిన్నవో!”
”ఆహాఁ! మీవి మాత్రం మహాపెద్దవా?”
ఆయన నా చేతుల్లోంచి పరుపు లాక్కుని తనే దాన్ని బిగించారు. ఇంటికి తాళం వేసి, సామానుతో బైలుదేరాం. ఎనిమిది గంటల్లోపల ఇల్లు చేరాం. ఇంటికి వెళ్లగానే వంట మొదలుపెట్టాను. ఆయన వాకిట్లో కూర్చుని రాత్రి విదూషకుల నృత్యానికి ఏర్పాట్లు చూస్తున్నారు. సాయంకాలం ఊళ్లోని జనం వాకిట్లో గుమిగూడటం చూశాను. జనం విదూషకుల నృత్యాన్ని ఎగబడి చూశారు. వాళ్లకి భంగు కూడా తయారుచేయించారు. అక్కడి ఉత్సాహాన్ని ఏమని వర్ణించను! (కుమారి కొడుకుని) మనవణ్ణి ఎత్తుకుని ఆయన పచార్లు చెయ్యసాగారు. లోపలికొచ్చి, ”నువ్వెందుకు వచ్చి చూడటంలేదు? నిజంగా, బలే బాగా నవ్విస్తున్నాడు!” అన్నారు.
”నాకేం నచ్చటంలేదు, ఏం చెయ్యను?”
”ఊళ్లోని ఆడవాళ్లందరూ చూస్తున్నారు, నీకొక్కదానికే నచ్చటంలేదు!”
ఆయన మొండితనం చూసి, ఇక నాకు వెళ్లక తప్పలేదు. ఆయనా, మనవడూ రంగుల్లో మునిగిపోయారు. ”పిల్లవాడికి కూడా అలా రంగులు పులమనిచ్చారేమిటి?” అన్నాను.
ఆయన నవ్వుతూ, ”మరి హోలీ పండగలో మజా అదే కదా!” అన్నారు.
రోజంతా అలాగే గడిచింది. రాత్రికూడా హడావిడి తగ్గేసరికి పన్నెండయింది.
…ఆ జీవితం ఎలా ఉండేది! ఇప్పుడైతే అంతా చీకటే. రాత్రి గడవనే గడవదు. ఆ రోజుల్లోని ఆనందాన్ని నెమరువేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాను. ఆ ఆనందం మళ్లీ ఎలా వస్తుంది? మనసు విలవిల్లాడుతుంది. ప్రస్తుతం అదే పరిస్థితి కొనసాగుతోంది. దేవుడు కూడా దీన్ని మార్చలేడు!
ప్రెస్‌లో సమ్మె జరిగింది. ఆయన ఇంటికొచ్చి ఉసూరుమంటూ కూలబడ ిపోయారు. ”ఏమైంది? ఒంట్లో బాగాలేదా?” అని అడిగాను.
”ఒంట్లో చక్కగా ఉంది!” అన్నారు.
”అయితే అలా డీలాపడిపోయారేం?”
”ఈ ప్రెస్సువల్ల నాకు చాలా చిక్కులొచ్చిపడ్డాయి.”
”ఏం జరిగింది? చెప్పండీ!”
”ఏం చెప్పమంటావు? మేనేజర్‌కీ పనివాళ్లకీ చుక్కెదురు.”
”వాళ్లు పని సరిగ్గా చెయ్యరేమో! పాపం మేనేజరేం చేస్తాడు?”
”అదికాదు, మేనేజర్ కూడా తనేదో భగవంతుణ్ణనుకుంటాడు.”
”అలా ఎందుకనుకుంటాడు? అతను పని సరిగ్గా చేయించకపోతే మీరతన్ని కోప్పడరూ?”
”చిన్న చిన్న విషయాలకే పనిలోంచి పంపించేసి, డబ్బులు ఇవ్వనంటాడు.”
”అందులో అతని తప్పేముంది?”
”లేదు, ఇదంతా అతను చేసే పనే. ఒక్కోసారి పని నెమ్మదిగా చెయ్యాలంటాడు, హఠాత్తుగా వేగం పెంచమంటాడు. నేను స్వయంగా అతన్ని విడిగా పిలిచి, అలా చెయ్యకు నాయనా అని ఎన్నోసార్లు చెప్పాను, వింటే కదా? ఇక ప్రెస్సు నష్టాల్లో ఉంది. ఈ పనివాళ్లమీద చర్య తీసుకుంటే ఆ లోటు భర్తీ అయిపోతుందా? మనకి ఇంత డబ్బొస్తోంది, అయినా సరిపోవటం లేదు. మరి ఇక ఆ బీదవాళ్లు ఎలా బతకాలి? వాళ్లకి ఎప్పుడూ డబ్బు కష్టాలేకదా! మిగతావాళ్లూ వారాలకి వారాలు పనిలోకి రాకపోయినా జీతంలో కోత ఉండదు, మరి ఈ కూలివాళ్లకి మాత్రం అలాటి రూలెందుకు? నాలుగు నిమిషాలు ఆలస్యం అయితే జీతం తగ్గించటం ఏం భావ్యం? చిన్న తప్పు జరిగితే చాలు, పనివాడిని ఉద్యోగంలోంచి తీసేసి ఇంకొకణ్ణి పెడతారు. మనదేశంలో చదువుసంధ్యలున్న వాళ్లు స్వార్థపరులుగా తయారయారు.”
”ఎవరో ఒకడు అలా ఉన్నాడని మీరు అందర్నీ అనటం సరికాదు.”
”నేననేది నిజం, నమ్ము!”
”అయితే నేరం మీదే, మేనేజర్ తప్పేముంది దీన్లో?”
”నేను నాకన్నా చిన్నవాళ్లతో కూడా ఘర్షణ పడను. కానీ వీళ్లు తమకింద పనిచేసేవాళ్లని తమతో సమానంగా చూస్తే అసలీ సమ్మెలూ అవీ ఉండనే ఉండవు. మేనేజర్ చేసే పనులవల్ల హర్తాళ్ జరిగితే, నింద నామీదికొస్తుంది, నష్టం జరిగేది కూడా నాకే. ఈ సమ్మె ముగిసేదాకా పనులన్నీ ఆగిపోయాయి.”
”మీలాగే మేనేజర్ కూడా పనిలేకుండా కూర్చునుంటాడు. అయినా ఈ పనివాళ్లు కూడా తక్కువేం తినలేదు లెండి!”
”లేదు, వీళ్లూ కేవలం ప్రెస్‌లో కూలీలు కారు. చాలాకాలంగా నష్టాల్లో నడుస్తోంది ప్రెస్సు. అంతా చూస్తున్నాను కానీ నోరు మెదపటం లేదు. పనివాళ్లచేత పని చేయించుకోవటం కూడా తెలియాలి.”
”అయితే ఆ పనేదో మీరే చెయ్యచ్చు కదా?”
”వీళ్లు పనీపాటా చెయ్యకుండా కూర్చున్నారని కాదు నేననేది. పని సరిగ్గా జరగాలి.”
”అసలు ఈ ప్రెస్సెందుకు పెట్టు కున్నారు. డబ్బంతా అందులోనే పెట్టారు, కానీ పైసా లాభం కనిపించటం లేదు. పైగా గొడవలొకటి! పై సంపాదనంతా ఈ ప్రెస్స్ మింగేస్తోంది.”
”నా రాతని నువ్వెలా చెరిపెయ్యగలవు? నువ్వు నీ డబ్బులోంచి పైసా కూడా ఎవరికీ ఇవ్వవు. అందుకేగా ఎప్పుడూ ఇరవై-ముప్ఫై రూపాయలు ఇంట్లో ఉంటున్నాయి!”
”బావుంది లెండి, మీరొక అల్పసంతోషి! అయితే ఎందుకు విసుక్కోవటం?”
”నా బాధల్లా ఆ కూలీలు ఎలా బతుకుతారా, అనే.”
”అది మీకెందుకు? ఎలాగోలాగ బతుకుతారు.”
”నాకెందుకేమిటి? ఎంత బాధ వేస్తుంది! పొద్దున్నే హర్తాళ్ చేశారు. దానివల్ల నష్టపోయేది వాళ్లు మాత్రమేనా? ఒక్కొక్కరికీ పెద్ద పెద్ద కుటుంబాలున్నాయి. వాళ్లందరూ కష్టాల పాలయినట్టే కదా?”
”అయితే అందరి బాధలూ మీ నెత్తికెత్తుకుంటారా? అలా అయితే వాళ్లని పిలిపించి మీరే నచ్చచెప్పకపోయారా?”
”ప్రస్తుతం వాళ్లు చాలా ఉద్రేకంలో ఉన్నారు. ఎవరి మాటా వినేట్టు లేరు!”
”వాళ్లే సర్దుకుంటారు. మీరెందుకు ఊరికే హైరానా పడతారు?”
”నాకా మేనేజర్‌ని చూస్తే మండిపోతోంది. అంత అన్యాయం ఎలా చెయ్యగలుగుతున్నాడు? నేను వెళ్లి కూలీలతో మాట్లాడితే అతన్ని అవమానించినట్టవదూ?”
”అయితే ఏదో ఒక దారి వెతకండి.”
”ఏం చెయ్యను?”
”సరే, ముందు మొహం, కాళ్లూ, చేతులూ శుభ్రంగా కడుక్కుని, మంచినీళ్లు తాగండి.”
”అరె, ఇవాళ నేనేమీ తీసుకురానే లేదు. సంచీ కూడా ప్రెస్సులోనే మర్చిపోయి వచ్చాను.”
”ఇంట్లో అన్నీ ఉన్నాయి.”
”నేనలా షికారుగా వెళ్లి సామాన్లు తెస్తాను. కాస్త నడిచే పని కూడా అయి పోతుంది.”
”ఏమీ అక్కర్లేదు. మీరెక్కడికీ వెళ్లనవసరం లేదు.” (ఇంకా ఉంది)
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags