డా|| ‘జీయల్’
ముగ్గురు మహిళలు. ఒకరు రంగారెడ్డి మేడ్చల్‌లో, మరొకరు ఖమ్మంలో, ఇంకొకరు నిజామాబాద్‌లో. మూడు ప్రదేశాలవారైనా వారిని కలిపింది వారి ప్రవృత్తి. ఒక మహత్తర కార్యసాధనను చేయించింది రగులుతున్న తరతరాల ఓ సమస్య. కవిత్వం రాయడం, రచనలు చేయడం వారి ప్రవృత్తి అయితే, రగులుతున్న తెలంగాణా సమస్య వారికి వస్తువైంది. వారే రాజీవ, జ్వలిత, అమృతలత. నేపథ్యం – ఉవ్వెత్తున జరుగుచున్న చివరిదశ తెలంగాణా పోరాటం. మనుషులుగా, మనసున్న వారుగా, కీర్తి కండూతిని దరిరానీయని మానవీయ మూర్తులుగా, తాముసైతం తెలంగాణ పాటకు పల్లవై, చరణమై గొంతు కలిపారు. భుజం కలిపి ఓసాహసం చేసారు.
ఇంకేముంది తెలంగాణా ప్రాంతంలోని కవయిత్రులను, రచయిత్రులను, కవిత్వం రాయాలనే తపనగల వర్థమాన మహిళలను వెతికారు, గుర్తించారు. నాలుగు దశాబ్దాలుగా నలుగుతున్న తెలంగాణా సమస్యపై, తెలంగాణా ఉద్యమంలో సమిధలౌతున్న యువతీ, యువకుల్ని చూసి చలించారు. తమతమ బాధల్ని గుర్తించడమే కాకుండా కవయిత్రుల బాధ్యతల్ని గుర్తింపజేశారు. ఆ విధంగా తెలంగాణాలోని వివిధ జిల్లాలకు చెందిన కవయిత్రులచే కలాల్ని పట్టించారు. ఇందులో దాదాపు 20 మంది కొత్తవారు కాగా, మిగతా వారంతా సాహితీ క్షేత్రంలో సృజన చేస్తున్నవారే! కొంతమందైతే తెలుగు సాహితీ ప్రియులకు చిరపరిచితులే!
తెలంగాణా సాధనలో డిసెంబర్-09, 2009 ఓ మరపురాని రోజైతే, జనవరి 23, 2010 ఓ దుర్దినం లాంటిది. ఈ మధ్య కాలంలో గుండె రగిలిన రాజీవ ఏదో చేయాలనే తపనతో కనిపించిన వారందరినీ అడిగింది. సలహాల్ని కోరింది. ఆరాటపడింది. అడగని వారంటూ లేరు. ఎందరో! మరెందరో!! కానీ ఆమెతో కదిలింది మాత్రం ఇద్దరే ఇద్దరు. జ్వలిత, అమృతలత. వీరిద్దరి పేర్లలోనూ వైవిధ్యం. అయినా రాజీవ పట్టిన హలానికి కాడెద్దులయ్యారు. ఆ శ్రమఫలమే ‘గాయాలే…. గేయాలు’ తెలంగాణా కవయిత్రుల కవితా సంకలనం.
ఇందులో అరవై కవితల్లో ముప్పై అయిదు కవితలు తెలంగాణ వాదాన్ని, ఆకాంక్షను, సాధనను బలంగా వినిపించగా, తెలంగాణకు మద్దతుగా రెండు కవితలున్నాయి. తెలంగాణా సంస్కృతిపై, వీరత్వంపై ఆరు కవితలుండగా మహిళా శక్తి దేనికి తీసిపోదని చెప్పే కవితలు, పాటలు తొమ్మిది వున్నాయి. ఇవి పోగా సెజ్ (ఐజూఎ) పై, పట్టణీకరణపై, రైతుల దీనావస్థపై, మూఢనమ్మకాలపై, సాధారణ అంశంపై ఒక్కొక్క కవిత, పాట వుండగా, సమ్మక్క సారక్కలపై రెండు కవితలున్నాయి.
అన్ని సంకలనాలకు ప్రోలోగ్ గా ముందుమాటుంటుంది. ఈ సంకలనానికి కూడా ప్రముఖ రచయిత్రి ముదిగంటి సుజాతారెడ్డి గారు, ‘తెలంగాణ అస్థిత్వ వేదనలో స్త్రీల గొంతులు’ అనే శీర్షికన ఈ సంకలన విశిష్ఠ తను, కవయిత్రుల కవితలను ఉటంకిస్తూ, చక్కని పరిచయాన్ని చేయడం చెప్పుకోతగ్గ విషయం. సహజంగా పుస్తక పరిచయం చేసేవారు ఆసాంతం చదవకుండా, ఒకటి రెండు అంశాలకు మాత్రం పరిమితంగా రాసేసి, చేతులు దులుపుకోవడం, రాసిన పరిచయం కూడా పూర్తిగా పుస్తకానికి సంబంధించి కాకుండా వుండడం జరుగుతూ వుంటుంది. కాని దీనికి భిన్నంగా అరవై కవితల్ని, పాటల్ని ఓపికతో చదివి, జీర్ణించుకొని, పేరు పేరునా పరిచయం చేసి సకాలంలో సంకలన కర్తలకు అందించడం అభినందనీయం.
ఇక ఈ మహాప్రస్థానాన్ని ముందేసుకున్న కవయిత్రి త్రయంలోని ప్రధాన భూమిక పోషించిన రాజీవగారు తెలంగాణా తరుణులు, ప్రేమ, అనురాగం, ఆప్యాయతలకు ప్రతీకలని, అణుకువ, ఆదరణ, అమాయకత్వం వారి ఆభరణాలని, ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం వారి సహజత్వాలని, అలాంటి ప్రతిభా పాటవాలున్న కవయిత్రుల కవితల్ని సంకలన రూపంలో తీసుకురావడానికి పడిన దైన్యస్థితిని తన ‘ప్రక్షాళనం’లో వివరిస్తూ, ఇందులోని కవితలు స్త్రీల భావస్వాతంత్య్రానికి, తెలంగాణ పట్ల తమ ఆవేదన, ఆక్రందనలను, నిరాశ నిస్పృహలను, జరుగుతున్న మోసాలను, చేయాల్సిన, చేపట్టాల్సిన పోరాటాలను స్వేచ్ఛగా, నిర్భయంగా వ్యక్తం చేసారని, ఈ కవితలు తెలంగాణాకు జరుగుతున్న అన్యాయాల్ని ప్రక్షాళన చేస్తాయని తన ప్రగాఢ కాంక్షను తెలిపారు.
రాజీవ ఆలోచనకు కార్యరూపాన్నిచ్చి, కవితల్ని అచ్చుతప్పుల్లేకుండా చూసి, డిటిపి చేయించి, చూస్తూనే ఆకట్టుకునేలా పుస్తకాన్ని తీర్చిదిద్దిన కవయిత్రి త్రయంలోని మరో మహా వ్యక్తి అమృతలత. పేరుకు తగ్గట్టుగా మరొకరి ఆలోచనను తన ఆలోచనగా, బాధ్యతగా గుర్తించి, శ్రమకోర్చి, పుస్తకప్రచురణ పురిటినొప్పుల్ని నిజంగా భరించి, వితరణ మనస్తత్వంతో ఆర్థికసహాయాన్ని అందించి, మొత్తం భారాన్ని మోసి, తెలంగాణా కార్యసాధనకు తనవంతు కర్తవ్యాన్ని, ధర్మాన్ని నిజాయితీతో నిర్వర్తించిన వ్యక్తిగా ఈ పుస్తకం ప్రతి పేజీలో అమృతలత కనిపిస్తారు. తెలంగాణ మహిళలు రాయలేరని ఎవరంటారో ఈ సంకలనాన్ని చూడాలని సవాలు విసిరారు. పోటీ పెట్టి నగదు బహుమతులిస్తే తప్ప స్పందించని కవులు, కవయిత్రులు తెలంగాణ వస్తువుగా కవితల్ని రాయమని ఫోన్ మెసేజ్ పంపడంతోనే, 20 రోజుల్లో 60 కవితల్ని / పాటల్ని పంపించడం ఒకింత ఆశ్చర్యమైనా దీన్ని వాస్తవం చేశారు. తెలంగాణ ఉద్యమం ఊహించని రీతిలో రూపుదిద్దుకోవడం, చిన్నా, పెద్దా, ముసలీ, ముతక, ఆడామగా తేడా లేకుండా రోడ్లపైకి రావడం, ఉద్యమ శంఖారావం ఊదడం ఒకింత ఈ కార్యసాధనకు కారణమైనా, ఇంతమంది కవయిత్రులను ఒక తాటిపైకి తేవడం గొప్ప విషయమే! ఈ పార్టీ, ఆ పార్టీ అనే తేడా లేకుండా అన్ని రాజకీయ పార్టీలకు ‘యూజ్ అండ్ త్రో’ మన తెలంగాణ!, ‘ఈ పార్టీ తంతే ఆ పార్టీ, ఆ పార్టీ తంతే ఈ పార్టీ కోర్టులో పడ్తూ…. ఎడా పెడా దెబ్బలు తింటోన్న ఫుట్‌బాల్ – మన తెలంగాణ!!’ అంటూ తెలంగాణ పట్ల దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయాన్ని ఈ సందర్భంగా ప్రశ్నించడం రాజకీయ నాయకులకు కనునిప్పు కలిగించేలా వుంది.
దర్శకత్వం ఒకరిదైతే, కథాకథనం మరొకరిదికాగా, ఈ సంకలనానికి జవసత్వాలనందించి, సంధాన కర్తగా వ్యవహరించిన మూడో కవయిత్రి జ్వలితగారు. ఊహించని రీతిలో ఊపందుకున్న తెలంగాణ ఉద్యమం కేవలం అస్తిత్వం కోసం చేస్తున్నది కాదని, హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం చేస్తున్న లడాయని, ఈ సందర్భంగానే తెలంగాణ స్త్రీల కలాలు పదునెక్కాయని, సిరాచుక్కలు రక్తాశ్రువులయ్యాయని తన ముందు మాటలో పేర్కొనడమే కాకుండా, ఆర్థిక దోపిడీని సహించినా, సాంస్కృతిక దోపిడీని మాత్రం సహించ జాలమని, ఇంకా ఆ దాస్యబంధనాలలో వుండాల్సిన అవసరం లేదని తెలుపుతూ, ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా, ప్రతివారు సామాజిక బాధ్యతను గుర్తించడమే కాకుండా, ఆయా రంగాలలో విధిగా తెలంగాణ వాదులు నెరవేర్చాలని, ఈ సందర్భంగా ఓ చిరుకథను సందర్భోచితంగా ప్రస్తావించిన జ్వలితగారు రచయిత్రుల బాధ్యతలను గుర్తింపచేసారు.
ప్రాచీన పాశ్చాత్య సాహిత్యంలో కనపడే ఎపిలాగ్ శీర్షికను ఈసంకలనములో కూడా పొందుపరిచి, కవయిత్రుల పరిచయం చేయడంతో పాటు సాహితీ క్షేత్రంలో ఆయా రచయిత్రులు, కవయిత్రులు చేస్తున్న కృషిని పాఠకలోకానికి అందించడం ద్వారా, 60 మంది రచయిత్రుల వ్యక్తిత్వాలు తెలుసుకునేలా చేసారు. దీనికి జ్వలితగారు పడిన శ్రమ, సంకలనం చూస్తేగాని ఆర్థం కాదు.
సంకలనం చివరి పేజీలో ‘బోయీలెవ్వరు?’ శీర్షికన కవయిత్రి త్రయాన్ని పరిచయం చేయడం ఒక కొత్త ఒరవడిలాగా వున్నది. అయితే పల్లకినీ మోయడానికి కావాల్సిన నలుగురిలో ముగ్గురి పరిచయమైనా, నాల్గో వ్యక్తిగా ప్రతి పేజీలో కనపడే ‘బాబు’ వివరాలు ప్రస్తావిస్తే పల్లకి మోత సరిగా సాగేది. సహజంగా పుస్తకాలకు, సంకలనాలకు ఒక్క కవరు పేజిని చిత్రకారునికి వదిలివేయడం జరుగుతుంది. కాని ఈ సంకలనంలోని ప్రతి కవితకు, అర్థవంతమైన రేఖాచిత్రాలను వేసి, చిత్రకారుడు ఏలె లక్ష్మణ్‌ను మరిపింపచేయడమే కాక, ‘బాబు’ అయినా తెలంగాణా ‘బాపు’గా మురిపించాడు ప్రతి పేజీలో చిత్రకారుడు బాబు. కవితలు, కవయిత్రి త్రయం ఒక ఎత్తు అయితే, ‘బాబు’ బొమ్మలు మరో ఎత్తుగా సంకలనం రూపుదిద్దుకోవడం ముదావహం. కవరు ముందు, వెనక వేసిన చిత్రాలు చిద్రమౌతున్న తెలంగాణా బతుకుల్నీ, వలసవాదుల, ప్రభుత్వాల దాష్టీకాన్ని ప్రతిబింబించేలా చిత్రాలు వేసి సంకలనానికి మరింత వన్నెతెచ్చారు చిత్రకారుడు బాబు.
ఆయుధానికి అర్థవంతమైన చక్కని వ్యాఖ్యానాన్ని చేస్తూ చివరి అట్టపై తెలంగాణా గుండెగాయాలు – ఏ విధంగా గేయాలుగా మారాయో తెలపడం మొత్తం సంకలనానికి హైలెట్.
ఈ సంకలనాన్ని చదువుతుంటే, 1934వ సంవత్సరంలో గోలకొండ పత్రిక సంపాదకులైన సురవరం ప్రతాప రెడ్డి గారు 354 మంది నైజాం (తెలంగాణ) కవులచే వెలవరించిన ‘గోలకొండ కవుల సంచిక’ జ్ఞప్తికి వస్తుంది. ఇందులో 272 మంది తెలుగు కవుల, 82 మంది సంస్కృత కవుల పద్యాలు-శ్లోకాలు వున్నట్లు ఆచార్య ఎస్వీ రామారావు ప్రస్తావించారు. అలాగే 1953లో పట్టికోట ఆళ్వారుస్వామి స్థాపించిన దేశోద్ధారక గ్రంథమాల పక్షాన తెలంగాణ రచయితల సంఘం సంపాదకత్వంలో ‘ఉదయ ఘంటలు’ ప్రచురితమైంది. అయితే ఇందులో 56 మంది కవులలో 16 మంది తెలంగాణా ప్రాంతం వారు కాగా, మిగతావారు తెలంగాణేతరులు కావడం విశేషం. తెలంగాణ వారి వితరణ మనస్తత్వానికి ఇదో నిదర్శనం. ఇదే వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న కవయిత్రి త్రయం తెలంగాణేతరులకు కూడా అవకాశం ఇవ్వడం అభినందనీయం. ఇలాంటి సంకలనాలు ఆడపాదడపా వస్తూనే వున్నాయి. డెబ్బై, ఎనభయ్యవ దశకంలో తెలంగాణ మొత్తంగా సాహితీ వనాలు విరాజిల్లాయి. బహుశ వీటికి అరసం, విరసం లాంటి సంస్థలు కారణం కావచ్చు! లేదా ఎమర్జెన్సీ లాంటి చీకటి రోజులు కావచ్చు! నిజామాబాద్ జిల్లాలో ‘ఇందూరు భారతి’, కామారెడ్డిలో ‘ఆదర్శ కళాసమితి’ లాంటి సంస్థలు ఎందరో రచయిత్రులకు, రచయితలకు జన్మనిచ్చాయంటే అతిశయోక్తి కావచ్చు! కానీ ఇది నిజం. ఈ సంస్థలు వివిధ సందర్భాలలో వెలువరించిన కవితా సంకలనాలు వస్తువు రీత్యా వేరువేరుగా వుండేవి. ఆనాటి సంకలనాలలో కూడా రాజీవ గారి కృషి మరువలేనిది.
వీటికి భిన్నంగా ఏక వస్తువు నేపథ్యంలో కవితల్ని రాయించి ‘గాయాలే… గేయాలై’ సంకలనాన్ని తేవడం, ఆ వస్తువు రగులుతున్న ఒక ప్రాంత ప్రజల ప్రధాన సమస్య కావడం గొప్ప విషయం.
ముందే ప్రస్తావించినట్లు కవితలన్నీ అత్యధికంగా తెలంగాణ నేపథ్యంలో వుండడమే కాకుండా, సీనియర్ కవయిత్రులతో పాటు, వర్థమాన రచయిత్రులు కూడా తామేమి తీసిపోమని, తమతమ కవితల ద్వారా సత్తాను చాటుకున్నారు. తెలంగాణ అంశం పట్ల, వలసవాదుల కుట్రపూరిత విధానాల పట్ల, వనరుల దోపిడీ పట్ల, పతనమౌతున్న సాంస్కృతిక విలువల పట్ల, తెలంగాణ పౌరుషం పట్ల, మహిళల సాధికారిత పట్ల అభిప్రాయాల్ని, నిర్ణయాన్ని వెలువరించారు.
ఈ సంకలనంలోని కవితలు వాడి, వేడిగా తెలంగాణ ఆకాంక్షను, కావాలనే డిమాండును తెలు)పుతూ రాయడం జరిగింది.
‘మా బతకమ్మ ఆటలు –
పూటకోమాట మార్చే వారి పాలిట ఎకె 47 లుగా మారుతాయని’
ఇంకా అప్పటికీ కదలక పోతే ముల్లుగర్రలతో పొడుస్తామని, ముందుగా మా కలం పోట్లని చూడండి’ అని కవయిత్రులంతా ముక్తకంఠంతో తమతమ కవితల్లో వినిపించడం జరిగింది.
ఇలాంటి చైతన్య పూరిత కవితలతో పాటు, ఈ సంకలనంలో తెలంగాణా సంస్కృతిని గూర్చి, కళలగూర్చి, మహిళా శక్తిని గూర్చి మంచి మంచి కవితలున్నాయి… ఇదే కాకుండా, కనిపించని దేవుడెలావున్నా, జన్మనిచ్చిన తల్లి, పిల్లల్ని తన కడుపును కాల్చుకొని కూడా ఎలా ప్రేమించి, పెద్ద చేస్తుందో వివరించే దీర్ఘ పాటతో పాటు, సమ్మక్క, సారలమ్మల వీరత్వం గూర్చిన కవితలు, పట్టణీకరణ ప్రభావంపైన, ఎకనామిక్ జోనుల (ఐజూఎ) ప్రభావంపైన కూడా కవితలున్నాయి. రగిలిన గుండెలు, లాఠీ తూటాలతో ఏర్పడిన గాయాలు – మండిన కవయిత్రుల గుండెలు గేయాలుగా ఈ సంకలనంలో రూపుదిద్దుకోవడం, కవరు పేజీని చూడడంతోటే పుస్తకంలోని అంశాలన్నీ అర్థమయ్యే విధంగా, మహిళల భావోద్వేగాలు సజీవంగా కనపడేలా చిత్రకారుడు బాబు చక్కని ముఖచిత్రాన్ని వేయడం అభినందనీయం.
(‘గాయాలే…. గేయాలై…’ కవితల సంకలనం – వేల : రూ|| 80/- పేజీలు : 164 దొరుకు స్థలం : అన్ని ప్రముఖ పుస్తకాల దుకాణములలో)
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
నాకు ఒక 100 కాపీలు కావాలి. ఎక్కడ ప్రయత్నించమంటారు?
రాకేష్ గారు
మీరు అడ్రెస్ ఇవ్వండి పోష్ట్ చేస్తాము.
భూమిక ఆఫీసు బాగలింగంపల్లి లో ఉంది ఇక్కడి నుండి కూడా తీసుకోవచ్చు.
ఆఫీస్ ఫోన్ నంబర్ 040 27660173 కి కాల్ చెయ్యండి.