కందుకూరి వెంకట మహాలక్ష్మి కథలు – స్త్రీ వ్యక్తిత్వ చిత్రణ

ఎం. శ్యామల
”కథలు కాలక్షేపానికి కాదు. అవి ప్రతీక్షణం ఎన్నో జీవిత సమస్యలని సూచిస్తూ, వాటిని విపులీకరించి పరిష్కారమార్గాన్ని సూచించే విధంగా రచయితలు రాయాలని, అందువలన ఆయా సమస్యలకు కారకులైన వారిలో ఏ ఒక్కరు మారినా, స్పందించినా ఆ రచయిత చేసిన రచన సఫలమైనట్లేనని” పేర్కొన్న రచయిత్రి కందుకూరి వెంకట మహాలక్ష్మి గారు.
వీరు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో తాళ్ళూరి భాస్కరనారాయణమూర్తి, ఛాయా మహాలక్ష్మి దంపతులకు జన్మించారు. పద్దెనిమిదేళ్ళపాటు జంషెడ్‌పూర్‌ టాటానగర్‌లో ప్రవాసాంధ్రుల మధ్య పెరిగారు.
కందుకూరి సూర్యనారాయణ పేరు వినగానే ఢిల్లీ ఆకాశవాణికి కేంద్రంలో వార్తలు చదివే కంచుకంఠం గుర్తుకు వస్తుంది. వారితో వెంకటమహాలక్ష్మికి వివాహబంధం కుదిరి ఆమె చిరునామా ఢిల్లీకి మారడమే కాక ఆమె ప్రతిభావికాసానికి విశాలవేదిక తయారైంది. చిన్ననాడు మనసులో కువకువలాడుతూ తనని విస్మయానికి గురిచేసిన కళలన్నీ ఎదిగే కొద్దీ తన వశమయ్యాయి.
వీరు శతాధిక కథారచయిత్రి వివిధ పత్రికలలో 136 కథలు అచ్చయ్యాయి. ఇంకా పదకొండు నాటికలు, ఎనభై వ్యాసాలు, పలు కవితలు వ్రాసారు. వీరి కథల్లో మూడు సంకలనాలు కూడా అచ్చయ్యాయి. అవి 1. ఉష నిర్ణయం, 2. రష్యన్‌ సీత, 3. నాణానికి మరోవైపు.
అంతేగాక వీరు ప్రసిద్ధులను ఇంటర్వ్యూ చేయడం, ఢిల్లీ ఆకాశవాణి, మాస్కో రేడియోలో ఉద్యోగం, నటన, దర్శకత్వం, సంగీత దర్శకత్వం, గానం, వీటన్నింటితోపాటు దేశంలో తొలి మహిళా మెజీషియన్‌గా స్వయంగా సీనియర్‌ పి.సి. సర్కార్‌చే ప్రశంసలు పొందారు. వివిధ పత్రికలతో అనుబంధం, న్యాయవాణి పత్రిక సంపాదకత్వం మొదలైనవన్నీ వీరిని బహుముఖ ప్రజ్ఞాశాలిగా మార్చాయి.
నాటకాలు రాయడమే కాకుండా నటించి దర్శకత్వం కూడా వహించి, దక్షిణ భారత నటీనట సమాఖ్య కమిటీ సభ్యురాలిగా కూడా వ్యవహరించారు. సంగీత రంగంలోనూ కృషిచేసారు. పదేళ్ళకు పైగా కర్ణాటక సంగీతాన్ని అభ్యసించిన వీరు ఏకంగా మాస్కోలో జరిగిన సంగీతపోటీలలో ప్రథమ బహుమతి సాధించడం విశేషం. ఢిల్లీ ఆలిండియా రేడియోలో వీరు పాడిన ఎంకి పాటలను పద్నాలుగు దేశాలకు పంపించారు. రేడియోలో పాడే లలితగీతాలకు స్వీయ స్వరకల్పన చేసుకొనే మహాలక్ష్మి గారు దేశవిదేశాలలో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
భర్తతోపాటు మాస్కో వెళ్ళిన వీరు అక్కడి రేడియోస్టేషన్‌లో ప్రారంభించిన తెలుగు విభాగంలో మూడేళ్ళకు పైగా అనౌన్సర్‌గా పనిచేశారు. ఈమె సంగీత ప్రతిభను గుర్తించిన రష్యన్లు సోఫియాలో జరిగే ఉత్సవాలకు వీరిని ప్రతినిధిగా పంపి ’26’ రోజులపాటు సాగిన ఆ పర్యటన ఖర్చుల్ని భరించారు. వీరు ప్రవాసాంధ్ర రచయిత్రి అయినప్పటికీ మంచి కథకురాలిగా ప్రసిద్ధులే. వీరి కథలలో భిన్న వ్యక్తిత్వాలు, వైరుధ్యాలు, మనం ఎరిగిన సమాజం, విశ్వజనీనమైన పద్ధతిలో కనిపిస్తుంది. వీరి కథలు చదువుతుంటే జీవితంలో నుండి నడిచి వెళుతున్నట్లుగా ఉంటుంది. వింతవింత మనుషులు తారసిల్లుతారు. వాళ్ళు మనం నిత్యం చూసే, మనకు తెలిసినవారిలాగే కనబడతారు. వీరి కథలు సజీవ మానవ వ్యక్తి అనుభవాలతో జిజ్ఞాసతో ముడిపడి సహజంగా ఉంటాయి. ముఖ్యంగా వీరు స్త్రీల నుద్దేశించి ఈ విధంగా అంటారు. ”స్త్రీ తనని తాను అశక్తురాలినని ఎపుడూ అనుకోకూడదు. అలాగని పురుషునితో పోటీపడి ఏ పనైనా చేయడం కూడా తప్పే. తను ఓ లక్ష్యాన్ని మనసులో పెట్టుకొని నేనిది చెయ్యగలను, ఎందుకు చెయ్యలేను? అన్న దృఢసంకల్పం, పట్టుదలతో ఏ పని ప్రారంభించినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా విజయాన్ని సాధించి తీరుతుంది. అంతేగాని ఎవరోవచ్చి తనను లేవనెత్తి అందలం ఎక్కించాలని కోరుకోవడం పొరపాటు. తన కాళ్ళమీద తాను నిలబడగలను అనుకొని అలా తనని తాను మలచుకొని స్వశక్తి మీద నమ్మకంతో ధైర్యంగా ఎప్పుడూ ముందుకు పోవాలి. ఆ ధైర్యం లేని తోటి స్త్రీలకి చేయూతనిచ్చి ధైర్యం కలిగించాలి” అని అనడమే కాదు అలాంటి సంస్కరణ శీలతని వీరు ప్రదర్శించారు కూడా. వీరు రాసిన కథలలో నేను మూడు కథలని మాత్రమే విశ్లేషిస్తున్నాను.
నా బ్రతుకు నీకు వద్దమ్మా!
స్త్రీజాతి పట్ల సమాజవైఖరిలో ఎంతో మార్పు వచ్చిందని మనం గర్వపడుతున్నాం. కాని నిజానికి స్త్రీల అభ్యుదయం గురించి, సంక్షేమం గురించి ఉపన్యాసాలు ఇవ్వడం వలన, రచనల వలన, చట్టాలు రూపొందించడం వలన మారేవారు ఎక్కువగా ఉన్నతభావాలు కలవారే. అభ్యుదయ భావాలు లేని కొన్ని కుటుంబాలలో ఎటువంటి మార్పు రావడం లేదు. వారి సనాతన సంప్రదాయ భావాలు బూజుపట్టి అలాగే ఉండిపోతున్నాయి. వాటిని దులుపుకోవాలని ప్రయత్నించడం లేదు.
ఆ తరం వారిని ఈ తరం వారు ధిక్కరిస్తున్నారు. దాంతో కొన్ని కుటుంబాలలో కలతలు రేగుతున్నాయి. పెద్దలు పూర్తిగా ఎదగలేక, పిన్నలు క్రిందకి దిగలేక త్రిశంకుస్వర్గంలో వ్రేలాడుతున్నారు. అటు పెద్దవారిది పూర్వాచారం, ఇటు చిన్నవారిది ఆధునిక యుగం. ఎవరి పద్ధతులు వారికి సమంజసంగా తోస్తాయి. పెద్దవాళ్ళకి భయపడి చిన్నవాళ్ళు తమ కోరికలని చంపుకుంటున్నారు. అయినాసరే పెద్దలు తమ అధికారాన్ని చలాయించుకుంటున్నారు. ఒకవేళ పిల్లలు తిరగబడితే దానిని పొగరుబోతుతనం, రౌడీతనం అని అంటారు. అంతేగాని కాలంతోపాటు మారలేకపోతున్నారు పెద్దలు.  మారుతున్న కాలంతోపాటు మనము మారాలి అని చెప్పే కథ ”నా బ్రతుకు నీకు వద్దమ్మా”.
కాపరానికి వెళ్ళకముందే భర్తను పోగొట్టుకొని పాతకాలపు ఆచారం వలన తన బ్రతుకులో సుఖశాంతి, సౌభాగ్యాలని కోల్పోయిన మేనత్త, అదే దుస్థితి దాపురించి, తలచెడి పుట్టింటికి వచ్చిన మేనకోడలికి అండగా నిలబడుతుంది. మేనత్త కూడా అన్నావదినల తరం మనిషే అయినప్పటికీ మేనకోడలి ఆధునిక యుగపు భావాలలో ఏకీభవించడానికి కారణం స్వానుభవం అవుతుందేమో?
మేనకోడలి జీవితం తన జీవితంలా కాకూడదని అన్నని ఎదిరించి, ఆమెని చదివించి, ఉద్యోగంలో చేర్పించి, పాత పద్ధతులని ధిక్కరించి, మేనకోడలి మొహం కళకళలాడేలా పసుపు, కుంకుమ, కాటుక పెట్టి, గాజులు తొడిగింది.
మేనకోడలిని మగరాయుడిలా తయారుచేసిందని, తల్లిదండ్రుల మాటలను ఖాతరు చెయ్యకుండా పాడుచేసిందని అనే ఇరుగుపొరుగు మాటలని, కూసే కూతలని ఆ చెవితో విని ఈ చెవితో వదిలేసేది. తన వెనుక బంధువర్గం అంతా అనే మాటలని లక్ష్యపెట్టలేదు. ఒక్కోసారి వదిన కూడా తనని అనరాని మాటలు అనేది, అన్నీ సహించి ఊరుకునేది. తన బ్రతుకులాగా మేనకోడలి జీవితం మోడు పారిపోకూడదని సంప్రదాయమే ప్రధానమనుకునే అన్నతో మాట్లాడి, అతని మనసు మార్చి, కళ్ళు తెరిపించి పెళ్ళి చేయిస్తుంది.
కాలంలో వచ్చిన మార్పు మేనత్త జీవితాన్ని చిగురింప జేయకపోయినా రచయిత్రి కలం ప్రగతి మార్గాన నడువమని సమాజానికి ఇచ్చిన సందేశం మాత్రం చక్కగా అందుతుంది.
రష్యన్‌ సీత :
రాష్ట్రంలో ఒక పరిమిత ప్రదేశంలో ఉంటూ చేసిన రచనలు బాగానే ఉంటాయి. కాని ఇక్కడ పుట్టి పెరిగి వృత్తిరీత్యాగానీ, జీవిత భాగస్వామి ఉద్యోగ రీత్యాగానీ దూరప్రదేశాలకు, ఇతర దేశాలకు తరలిపోయి భిన్న భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక నేపథ్యాన్ని కథావస్తువుగా చేసిన రచనలు పాఠకులకు క్రొత్తదనాన్ని అనుభవంలోనికి తెస్తాయి. రచయిత్రి కందుకూరి వెంకటమహాలక్ష్మి వ్రాసిన ఈ కథ మనకు అలాంటి అనుభవాన్ని కలిగిస్తుంది.
భర్త కందుకూరి సూర్యనారాయణ ఉద్యోగరీత్యా రష్యా రేడియోలో కూడా పనిచేశారు. ఆ సందర్భంలో రచయిత్రి రష్యన్‌ సామాజిక పరిస్థితులని సన్నిహితంగా గమనించారు. ఆ అనుభవంతో రాసిన ‘రష్యన్‌ సీత’ కథ, అటు రష్యా, ఇటు భారతీయ సామాజిక పరిస్థితులను తులనాత్మకంగా చిత్రించింది. రష్యాలో నాలుగేళ్ళు ఉన్న రచయిత్రి అక్కడకు చదువుల నిమిత్తం వెళ్ళిన మన విద్యార్థుల ప్రవర్తన ఎలా ఉండేదనే విషయాన్ని నిశితంగా పరిశీలించింది.
భారతీయ సంస్కృతిలో జన్మించిన కథానాయకుడు చదువుకొనేందుకు రష్యా వెళతాడు. ఒక రష్యా యువతి యూనివర్సిటీలో పరిచయమైన ఇతనితో ప్రేమలో పడుతుంది. మనదేశంలోని కుటుంబ విలువలు, సంప్రదాయాలు, భారతీయ స్త్రీల అభిప్రాయాలను గురించి తెలుసుకున్న ఆ యువతి సీతాదేవిలా ఒకే భర్త, ఒకే ప్రేమ అన్నట్లు కొత్త సంస్కృతిని ఒంటబట్టించుకుంటుంది. నువ్వు రాముడివి నేను సీతను అంటూ… తనని పెళ్ళిచేసుకొమ్మని ఆ యువకున్ని కోరుతుంది.
అయితే కుటుంబ విలువలపట్ల పట్టింపులేని ఆ దేశ సామాజిక పరిస్థితులని తనకు అనువుగా మార్చుకొని అక్కడి ఆడపిల్లలతో సంబంధం పెట్టుకొని, వారిని కాలక్షేపానికి వాడుకొని మోజు తీరగానే స్వదేశం వచ్చి తల్లిదండ్రులు కుదిర్చే అమ్మాయిలను పెళ్ళి చేసుకోవడం మనవారికి అలవాటే. ఇలాగే చేద్దామనుకున్న ఆ కథానాయకుడు భంగపాటుతో చివరకు తన తప్పు తెలుసుకుంటాడు.
దుర్బుద్ధి గల మనసున్న వాన్ని కూడా రష్యన్‌ యువతి తన స్వచ్ఛమైన ప్రేమతో మార్చగలుగుతుంది. దీనివలన ఒక వ్యక్తి చేసే పనిలో, చెప్పే మాటలలో, నడిచే తీరులో చిత్తశుద్ధి కనబడితే అది మనసుని ప్రభావితం చేస్తుంది అనే విషయం తెలుస్తుంది. కథానాయకునికి పెళ్ళి కుదిరిందని తెలిసిన సమయంలో రష్యా యువతి పడిన బాధ, దానిని దిగమింగుకొని అతన్ని క్షమించిన వైనాన్ని, రచయిత్రి రాసిన తీరు ఆకట్టుకునేలా ఉంది.
మచ్చుకి ఒక వాక్యం – ”భారతదేశంలోని స్త్రీలల్లా నీతో కాపురం చెయ్యాలని నా మనస్సు కోరుకుంది. ఎంతో ఆశపడ్డాను. సరదా పడ్డాను. నన్ను దగా చేశావు. కానీ అది నా ఒక్కర్తికే తెలుసు, మా దేశీయులకి నా మానసిక వేదన చెప్పినా అర్థం కాదు. పైగా నవ్వుతారు హేళన చేస్తారు.”
ఈ విధంగా రష్యన్‌ సీత కథ ద్వారా భారతీయ సంప్రదాయాలను గౌరవించే విదేశీ అమ్మాయిలను, వారిని సునాయాసంగా మోసగించే ప్రవాస పెళ్ళికొడుకుల నిజస్వరూపాలను, స్వార్థపూరిత మనస్తత్వాలను రచయిత్రి వెలుగులోనికి తెచ్చారు.
”భారతీయ సంస్కృతి మీది మోజుతో ”రష్యన్‌ సీతలు” తయారైతే, భారతీయులు మాత్రం విదేశీ సంస్కృతి మీది మోజుతో స్త్రీ వ్యామోహానికి గురయిన రావణాసురుల్లా మారుతున్నారని రచయిత్రి తెలియజేసిన విధానం మనలని ఆకట్టుకుంటుంది.
ఉష నిర్ణయం :
జీవితంలో తప్పులు చేయడం మానవ సహజం, చేసిన తప్పును సరిదిద్దుకోవడంలోనే ఉంది మానవత్వం. ఉష తను స్వయంగా తప్పు చేయకపోయినా తన భర్త వలన జరిగిన తప్పుని సరిదిద్ది, నలుగురి జీవితాలను అల్లకల్లోలం కాకుండా కాపాడేందుకు చేసిన నిర్ణయం మానవత్వపు భావజాలాన్నే మించిపోతుంది.
ఎన్నో ఆశలతో, ఊహలతో వైవాహిక జీవితంలోనికి అడుగుపెట్టిన ఉషకు పెళ్ళైన మర్నాడే తన చిన్ననాటి స్నేహితురాలి నుండి ఉత్తరం అందుతుంది. స్నేహితురాలి జీవితాన్ని పాడుచేసి నతనినే వివాహమాడింది. భర్త ఏమాత్రం తొందరపడకుండా భర్తనడిగి నిజానిజాలు తెలుసుకుంటుంది. యువరక్తంలో పగ ప్రతీకారం వలన ఆనాడు భర్త ఆ తప్పు పని చేసాడని అతన్ని క్షమిస్తుంది. తన భర్త వలన పాడయిన స్నేహితురాలి జీవితం బాగుచేయడం కోసం భర్తతో కలిసి వాళ్ళింటికి వెళుతుంది.
విడాకులు తీసుకోడానికి సిద్ధంగా ఉన్న స్నేహితురాలి భర్తకు జరిగిన విషయాన్ని భర్తచేత చెప్పిస్తుంది. జరిగినదానిలో తన స్నేహితురాలి తప్పు ఏమి లేదని అంటుంది. అతను ఒప్పుకోకపోయేసరికి తన భర్తను స్నేహితురాలితో కలిసి పంచుకోడానికి సిద్ధపడుతుంది. ఈ నిర్ణయం స్నేహితురాలి భర్త మనసుని మార్చి, అతనిలో స్నేహితురాలి పట్ల సద్భావాన్ని కలుగజేస్తుంది.
ఉష స్థిరంగా ఆలోచించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని తన జీవితాన్నే కాకుండా స్నేహితురాలి జీవితాన్ని చక్కదిద్దగలిగింది. ఈ కథ వలన మనిషి తొందరపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, కార్యకారణ సంబంధాలను విశ్లేషించి చూడాలనే విషయం మనకు అర్థమవుతుంది.
రచయిత్రి రచనలలో సర్దుబాటు ధోరణికి ప్రాముఖ్యతనిస్తుందని చెప్పేటందుకు ఈ కథ ఒక మంచి ఉదాహరణ. నేటి సమాజంలో ఇటువంటి సమస్యలని ఎందరో ఎదుర్కొంటున్నారు. ఒక విషయం తెలియగానే దాని పూర్వాపరాలు తెలుసుకోకుండానే లేనిపోని గొడవలు పడి సంసారాలు నాశనం చేసుకొని విడాకులు తీసుకుంటున్నారు. అందువలన పిల్లల భవిష్యత్తు కూడా నాశనమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా సమస్య వచ్చినపుడు అది ఎందుకు వచ్చిందా? అని ఆలోచించి పరిష్కారమార్గం గూర్చి కృషిచేసే సమాజమంతా బాగుంటుంది. కుటుంబాలు చిన్నాభిన్నం కావు.
ఈ కథలో ఉష ప్రవర్తన ఈ విధంగా ఉండటానికి కారణం ఆమె చదువుతో పాటు, సంసారం, జీవితం పట్ల అవగాహన, పరోపకారగుణం.
రచయిత్రి ఈ మూడు కథలలో ఆధునిక స్త్రీ జీవితావగాహనను సామాజిక, నైతిక విలువల పట్ల నిబద్ధతను చిత్రించారు. అంతేగాక, ఏ ప్రాంతానికి ఏ దేశానికి చెందిన స్త్రీ అయిన మానవ సంబంధాల పట్ల కనబరిచే ఉన్నతమైన ఆకాంక్షను ప్రతిబింబిస్తాయి వీరి కథలు. ఏ వాదాల ప్రస్తావన లేకుండానే మానవీయ ఆప్తితో కూడిన అనుబంధాలను సృజిస్తూ సున్నితమైన బాంధవ్యాలను ఆవిష్కరిస్తాయి.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.