ఇంట్లో ప్రేమ్‌చంద్‌-23

అనువాదం : ఆర్‌. శాంతసుందరి
మునుపు ఏ పనులనైతే విమర్శించేదాన్నో వాటినే ప్రస్తుతం నేను ఇష్టపడసాగాను. ఆయన హృదయం చాలా ఉన్నతమైనది, గొప్ప మనసు. కూలి వాళ్లని తనతో సమానంగా చూసేవారు. వాళ్ల కష్ట సుఖాలని పట్టించుకునేవారు. అసలు తనే ఒక కూలీనని తరచు నాతో అంటూ ఉండేవారు. మనిషికీ సైతానుకీ ఉన్న తేడా అదే. ఆయన మాటల్లోని అంతరార్థం ఇప్పుడు నాకు అర్థం అవుతోంది. లోకం పరిస్థితి ఎలా ఉండబోతోందో ఆ రోజుల్లోనే ఆయన గ్రహించారు. ఒక్కోసారి ఆయన గొప్ప సాధువో, మహాత్ముడో అనే భావం నాకు కలుగుతూ ఉంటుంది!
జ్యేష్ఠ మాసం. ఎండలు విపరీతంగా కాస్తున్నాయి. ఆ యేడాది ఎండ మరీ తీవ్రంగా ఉందనిపించింది. ఎండ బాధ భరించలేక నేను రుమాలుని తడిపి తలకి చుట్టుకునేదాన్ని. ఆయన ఒకరోజు ఎక్కడికో వెళ్లి ఇంటి కొచ్చారు. నేను నీరసంగా పడుకుని ఉండటం చూసి, ”ఒంట్లో బాగాలేదా?” అని అడిగారు.
”ఒంట్లో ఏం కాలేదు, కానీ ఎండ భరించలేకపోతున్నాను,” అన్నాను.
”అవును, ఈ యేడాది కొంచెం ఎక్కువే ఉంది. కొండ ప్రాంతానికి పంపిస్తానని ఎంత చెప్పినా వినవు! ఒక రెణ్ణెల్లు అక్కడ ఉండి రాకూడదూ? ఏర్పాట్లు చెయ్యనా?”
”మీరూ వస్తారా?”
”నేనెలా రాగలను? నేను వస్తే మరి నా సంపాదన ఆగిపోదూ?”
”అక్కడే ఈ పని చేసుకుందురుగాని. పనేం ఆగిపోనక్కర్లేదుగా? బహుశా అక్కడే ఇంకా ఎక్కువ పని చేసుకోగలుగుతారేమో! మీరూ వస్తేనే నేను వెళ్లేది.”
”అక్కడెలా కుదురుతుంది? నా మాట విని పిల్లలూ, నువ్వూ వెళ్లండి.”
”ఏం అన్ని సౌకర్యాలూ కావలసింది నాకేనా? అవన్నీ డబ్బున్నవాళ్ల షోకులు. బీదవాళ్లకి సిమ్లా అయినా మసూరీ అయినా వాళ్ల ఇల్లే. ఇంట్లోనే చల్లదనానికి వీలైనంత ఏర్పాటు చేసుకోవలసిందే!”
”నువ్వూ మహా మొండిదానివి!”
”ఇక్కడున్నది ఇద్దరమే… మీరూ, నేనూ. మరి మనిద్దరిలో ఎవరెక్కువ మొండి వాళ్లని నిర్ణయించేందుకు మూడో మనిషి ఏడీ?”
”నా మాట విను!”
”నేను ఒంటరిగా వెళ్లను.”
”అయితే ఇలాగే తువ్వాళ్లూ, రుమాళ్లూ తడిపి తలకి చుట్టుకుంటూ ఉండు.”
”మీలాంటి వాళ్లే, సుఖాలకి నోచుకోని వాళ్లే, ఎక్కువ మంది ఉన్నారు మరి! నేను మాత్రం వేరే రకంగా ఎందుకుండాలి? అలా ఉండమని ఎందుకంటారు?”
జ          జ          జ          జ
ఎంత గొప్ప మనసు ఆయనది! తను ఎన్ని కష్టాలు పడ్డా పరవాలేదు! అవతలి వ్యక్తి సుఖమే ఆయనకి ముఖ్యం. తన కర్తవ్యాన్నీ ఎప్పుడూ పాటించేవారు. పరిస్థితులకి తల ఒగ్గేవారు. అయినా ఎప్పుడూ ఫిర్యాదనేది ఆయన నోటంట వచ్చేది కాదు. చివరికి మొహం మీద కూడా విసుగు అనేది కనిపించేది కాదు. ఎన్ని కష్టాలొచ్చినా, గుండె నిబ్బరంతో, చేతులు చాచి, వాటిని జయించే ప్రయత్నం చేసేవారు. ఇవి ఒక మహాత్ముడి లక్షణాలు కావూ?
ఢిల్లీలో ఒక సాహిత్య సమావేశానికి ఏర్పాట్లు జరిగాయి. ఆయన వెళ్లాలను కున్నారు. సాయంకాలం నాలుగ్గంటలకి ప్రెస్‌నించి వచ్చి, ”ఇదుగో, ఈరోజు ఐదుగంటల బండికి ఢిల్లీ వెళ్లాలి. నా సామాన్లు సర్దించి ఉంచు,” అన్నారు.
”అంత తొందరేం? అమ్మాయి ఎలాగూ రేపో ఎల్లుండో వెళ్లి పోతోందిగా?”
”అది అప్పుడే వెళ్లటం ఎందుకు?”
”సరే, ఇప్పుడంత అర్జంటుగా ఎందుకెళ్తున్నారు?”
”జైనేంద్ర్‌ దగ్గర్నించి రమ్మని ఉత్తరం వచ్చింది.”
”మళ్లీ ఎప్పుడొస్తారు?”
”మూడు నాలుగు రోజులు పట్టచ్చు. పైగా ఢిల్లీ వెళ్లటం నాకిదే మొదటిసారి.”
”వెళ్లకపోతే నష్టమేమిటి?”
”జైనేంద్ర్‌ చాలా నొచ్చుకుంటాడు.”
నేను ఆయన సామాను సర్దాను. మూడు నాలుగు రోజుల్లో వస్తానని చెప్పి వెళ్లిన మనిషి ఏడో రోజుకి వచ్చారు. నాకు కంగారు పుట్టింది. ఎందుకంటే ఎక్కడా అన్నేసి రోజులుండటం ఆయనకిష్టం ఉండదు. జబ్బు పడలేదుకదా అని బాగా కంగారు పడ్డాను. మేనేజర్ని పిలిచి టెలిగ్రామ్‌ ఇమ్మని చెప్పాను.
”ఎందుకమ్మా అంత కంగారు? రేపు ఆయన వచ్చెయ్యరూ?” అన్నాడు మేనేజర్‌.
మొదటిసారి కొత్త ఊరికి వెళ్లారు, ఆలస్యం అయి ఉంటుందిలే, అనుకుని నాకునేను సర్దిచెప్పుకున్నాను. టెలిగ్రామైతే ఇవ్వలేదు, కానీ నా ఆందోళన మాత్రం పెరిగిపోయింది.
ఏడో రోజున ఆయన రాగానే మండి పడ్డాను, ”మీకసలు ఏమీ గుర్తుండదా? ఇంట్లో వాళ్లు ఏమనుకుంటారనే ఆలోచన అసలు కాస్తంతైనా ఉందా, లేదా? నాలుగురోజులని చెప్పి ఇన్నాళ్లకి వస్తారా?” అన్నాను.
”ముందు కూర్చుని, స్థిమితంగా ఏం జరిగిందో విను. నేను మాటిచ్చి ఎందుకు నిలబెట్టుకోలేకపోయానో అప్పుడర్ధమవుతుంది. నువ్వే నా స్థానంలో ఉంటే నేను చేసినట్టే చేసుండేదానివి, తెలుసా?”
”అవును, పగలనక రాత్రనక మీరు చేసేది కథలు రాయటమేగా? ఇంకో కథ అల్లండి, వింటాను!”
”నువ్వు చాలా పొరబడుతున్నావు. నీ గురించి నేను ఆలోచించటం లేదని అంటు న్నావా?”
”కనిపిస్తూనే ఉందిగా?” అన్నాను.
ఆయన నవ్వి, ”ముందు నేను చెప్పేది విని ఆ తరవాత మాట్లాడు,” అన్నారు.
”ఊఁ, చెప్పండి!”
నా పక్కన కూర్చుని చేతిలోకి నా చేతిని తీసుకుని, ”నేనిక్కణ్ణించి వెళ్లాక చాలా సులభంగా జైనేంద్ర్‌గారింటికి చేరుకున్నాను. ఆ సరికే సుందర్‌లాల్‌గారు అక్కడికి వచ్చి ఉన్నారు. నేను వెళ్లిన రోజు సాయంత్రమే మీటింగ్‌ జరిగింది. మూడ్రోజులు దాంతోనే సరిపోయింది. ఒక పంజాబీ పెద్ద మనిషి తమ ఇంటికి నన్ను తీసుకెళ్లాలని పట్టుపట్టాడు. నన్ను కలుసుకునేందుకనే ఆయన రెండు సార్లు లక్నోకీ, ఒకసారి బెనారస్‌కీ మునుపు వచ్చాడు, కానీ కలవలేకపోయాడు. నన్ను కలుసుకోవాలని చాలా ఉబలాటపడి, నేను కనబడగానే వెంట తీసుకెళ్లి ఆతిథ్యం ఇవ్వాలని చాలా తహతహలాడాడు. ఆయన మట్టుకేకాదు, ఆయన భార్యకూడా చాలా కాలంగా నన్ను చూడాలనుకుంటోందని చెప్పాడు. ఎంత వదిలించుకుందామన్నా సాధ్యం కాలేదు. అందుకే వాళ్లింట్లో ఉండిపోవలసి వచ్చింది. మొండిగా రానని భీష్మించుకోవటం ఏం బావుంటుంది? నువ్వే చెప్పు! ఇక ఆలస్యానికి నువ్వే శిక్ష వేసినా భరిస్తాను. నేరం చేశాను, శిక్ష విధించు!” అన్నారు.
”ఆయన పేరేమిటి?”
”తెలిస్తేగా చెప్పటానికి? నేనాయన్ని మొదటిసారి చూశాను. ‘మంతం’ అనే నాకథ చదివాక, శ్రద్ధగా, తను చేసే పనిలో పూర్తిగా నిమగ్నమైపోవాలన్న ప్రేరణ కలిగిందని అన్నాడు. అప్పట్నించీ నన్ను కలవాలని ప్రయత్నిస్తున్నాడట. కనిపిస్తే సులభంగా వదులుతాడా? నాకోసమని మీటింగ్‌కి వచ్చిన వాళ్లందరికీ విందు భోజనం కూడా పెట్టాడు!”
”అయితే మీకు బాగా సరదాగా గడిచిందన్నమాట. నేనేమో ఇక్కడ ఊరికే కంగారు పడిపోయాను. మీరు ఒళ్లు బాగా లేదేమో అని మొన్న టెలిగ్రామ్‌ కూడా ఇవ్వాలనుకున్నాను. మేనేజర్‌ తటపటాయించ టంతో ఇవ్వలేదు. రూపాయిన్నర ఖర్చవటమే కాక, నేను నవ్వులపాలయేదాన్ని!”
”నువ్వు గాభరాపడతావని నాకు తెలుసు. ప్రతిక్షణం మనసులో అదే ఆలోచన బాధించింది. కానీ ఏం చేస్తాను? నా తప్పే ముంది?”
అప్పటికి నాకోపం చల్లారిపోయింది, ”అవును మీ తప్పేమీ లేదు,” అన్నాను.
”నిజం, ఆయన నాకోసం పిచ్చివాడై పోయాడు. నా దగ్గరకొచ్చి మాట్లాడే ధైర్యం కూడా మొదట్లో చెయ్యలేకపోయాడు. మీటింగ్‌ జరుగుతూండగానే ఎలాగో ఒక్క క్షణం మధ్యలో కల్పించుకుని తను నన్ను ఇంటికి తీసుకెళ్తానని వాళ్ల అనుమతి కోరాడు. అలాంటి మనిషిని కాదని ఎలా అనటం? అన్నట్టు ఆయన భార్య అనారోగ్యంతో మంచం పట్టింది, నన్ను ఎంత చూడాలని ఉన్నా మీటింగ్‌కి రాలేకపోయింది. అందుకే ఇష్టం లేకపోయినా వెళ్లాల్సి వచ్చింది.”
”రచయితల పెళ్లాలకి ఈ పాట్లు తప్పవు లెండి. వాళ్ల భర్తలు పూర్తిగా వాళ్లకి చెందరు!”
”ఏమో, ఉన్న విషయం నీకు చెప్పేశాను.”
”ఇంకెప్పుడూ ఇలా ఇంత ఆలస్యం చెయ్యకండి, సరేనా?”
”కాదు, అసలు నువ్వు కూడా నా వెంట వస్తే మంచిది. ఇంట్లో ఒక్కత్తివీ ఉండి, ఎదురుచూస్తేనే కంగారు. అప్పుడు నా గురించి నీకూ, నీ గురించి నాకూ ఎటువంటి ఆందోళనా ఉండదు!”
”మరి పిల్లలెక్కడుంటారు?”
”ఇలా ప్రతిదానికీ సంకెళ్లు వేసుకుంటూ పోతే ఏమీ చెయ్యలేం. నీకు మనశ్శాంతి దొరికేదెలా?”
”అవును, నాకు అన్నీ ఇబ్బందులే.”
నా భర్త నాముందు అపరాధిలా నిలబడిన రోజులూ ఉన్నాయి. ఇలాంటి చిన్న చిన్న కారణాలే అలకలకీ, వాదోప వాదాలకీ దారితీసేవి. ఎప్పుడూ నాకు ఆయన ఆరోగ్యం గురించిన చింతే – ముఖ్యంగా నా ఎదురుగా, నా దగ్గర లేని సమయాల్లో. మరి ఇప్పుడు… అందర్నీ ప్రేమించే ఆ వ్యక్తి మొహం తిప్పేసుకుని, నానుంచి దూరంగా ఎలా వెళ్లిపోయారు? ఇప్పుడు నేను కంగారుపడటం లేదు, టెలిగ్రాములు ఇవ్వాలన్న ఆందోళన లేదు. నేనెంత గుడ్డిగా, పిచ్చిదానిలా ప్రవర్తించేదాన్ని! బతికుండగా ఆయన్ని అర్థం చేసుకోలేకపోయాను. దేవుడిలా ఆయన అందరివాడు. నా ఒక్కదానికే చెందాలని నేను అనుకున్నాను, ఎంత మూర్ఖురాలిని! నేను బతికున్నంతకాలం ఈ లోటు భర్తీ కాదు. మనశ్శాంతి దొరకదు. ఈ ఆలోచనలు ఇరవైనాలుగ్గంటలూ బుర్రని తొలిచేస్తూనే ఉంటాయి.
జ          జ          జ          జ
బెనారస్‌
మే, 1932
ప్రియమైన రాణీ,
నీ ఉత్తరం అందింది.  ఈరోజే దశరథ్‌లాల్‌ రాసిన ఉత్తరం కూడా అందింది. అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చెయ్యమని నీకు ఇంతకు మునుపే రాశాను, మళ్లీ రాస్తున్నాను. నువ్వెళ్లి వెంటపెట్టుకుని రాగలిగితే తీసుకురా. కానీ అమ్మాయికి అనారోగ్యంగా ఉందన్న మాట మాత్రం గుర్తుంచుకో. అంత దూరప్రయాణం, దారి కూడా సాఫీగా ఉండదు. మరి ఏర్పాట్లు ఎలా చేస్తావు? ఇంకో విషయం, బెనారస్‌కి తీసుకొస్తే అమ్మాయి జబ్బు నయమై పోతుందని ఎలా అనుకుంటున్నావు. బెనారస్‌ లో అటువంటి వైద్యసదుపాయాలేవీ లేవే? ఇద్దరు ముగ్గురు హోమియోపతీ డాక్టర్లున్న మాట నిజమే, కానీ అలాటివాళ్లు సాగర్‌లో కూడా చాలామందే ఉంటారు కదా? లక్నో తీసుకెళ్లి వైద్యం చేయించాలనుకుంటే పరవాలేదు, కానీ ప్రయాణం చెయ్యటం అనేదే పెద్ద సమస్య. ప్రయాణం మధ్యలో అమ్మాయి రోగం వికటిస్తే ఏం చెయ్యాలి? అది మరీ బాధాకరం, అత్తగారూ వాళ్లముందు తలెత్తుకోలేం. అందుకని అక్కడేదో వైద్యం జరుగుతోందిగా, జరగనీ. అదేదో ప్రసూతి జ్వరం అయుంటుంది. అది అంత సులువుగా తగ్గదు. మనం దేవుణ్ణి నమ్ముకోవల్సిందే. ఇక్కడ బాగా వేడిగా కూడా ఉంది. వాతావరణం ఇక్కడి కన్నా సాగర్‌లోనే బావుంటుంది. అందుకే ఊరికే భయపడి ఏమీ లాభం లేదు. ఎలా జరగాల్సిఉంటే అలా జరుగుతుంది. ప్రస్తుతం ఆరోగ్యం మునుపటిలాగే ఉంది, ఇంకా పాడవలేదు కదా?
సరే ఇక ఇక్కడి సంగతులు విను. నాకు విరోచనాలవుతున్నాయి. పెరుగన్నం మాత్రమే తింటున్నాను. ధున్నూ ఖిచ్‌డీయో, రొట్టెలో చేస్తాడు. మిగతా అందరూ అవే తింటారు. మా అక్కయ్య అత్తారింటికి వెళ్లింది. వదిన పుట్టింటికెళ్లింది. వంటమనిషి ఇంతవరకూ దొరకలేదు. మా తమ్ముడి భార్యా, పిల్లలు వచ్చారు, కానీ రెండుమూడు గంటలు మాత్రమే మాతో గడిపి లమహీకి వెళ్లి పోయారు. అయినా వాళ్లనించి మనం ఆశించేదేముందిలే! కష్టాల్లో తోడుండే రకం కాదు వాళ్లు. ఈ మధ్యన ధున్నూకి కూడా చెవిపోటు వచ్చింది. డాక్టర్‌ దగ్గరకెళ్లి మందు తెచ్చుకుంటున్నాడు.
నీ ధన్‌పత్‌రాయ్‌
శారదా బిల్లు
ఇంతవరకూ చదివిన విషయాలు స్త్రీలపట్ల ఆయన అభిప్రాయాలని పాఠకులకి తెలియజేసే ఉంటాయని అనుకుంటాను.
ఏడెనిమిదేళ్ల క్రితం ‘జాగరణ్‌’లో మా ఆయన ఒక వ్యాసం రాశారు. హర్‌విలాస్‌ శారద ప్రస్తావించిన సమానహక్కుల గురించి ఆయన్ని పొగుడుతూ, ‘మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను! స్త్రీలు ఎప్పటికీ శారదకి కృతజ్ఞులై ఉంటారనీ, ఎందుకంటే స్త్రీపురుషులిద్దరూ కలిసి సంపాదించిన ధనాన్ని, భర్త పోగానే కడుపున పుట్టిన బిడ్డలే తల్లికి దక్కకుండా తామే దోచుకుంటారు. ఈ బిల్లు పాసైన రోజున కొన్ని కోట్లమంది మహిళలు మిమ్మల్ని మనసారా ఆశీర్వదిస్తారు. వాళ్లేకాదు, నేను కూడా మీకు కృతజ్ఞుడినే. హిందూ ‘లా’లో స్త్రీలని అంత పనికిమాలిన మనుషులుగా భావించి, చెత్తాచెదారంలా బైట పారెయ్యమని ఉందా? ఈ చట్టం ఎవరికోసం, ఎందుకు తయారుచెయ్యబడిందో ఆ దేవుడికే తెలియాలి. బుద్ధున్న ప్రతి వ్యక్తీ మీరు లేవనెత్తిన ఈ సమస్యకి సుముఖంగా ప్రతిస్పందిస్తాడనే ఆశిస్తున్నాను.’ అని ఆ వ్యాసంలో రాశారు.
నేను దాన్ని చదివి ఆయన్ని అభినందించాను.
”నన్నెందుకు అభినందించటం? హర్‌విలాస్‌గారిని అభినందిం చాలి!” అన్నారు.
”మీరు ఆయన్న సమర్థించారు, అందుకే అభినందిస్తున్నాను.”
అందరూ అన్నాలు తిని పడుకున్నాక. ఆ వ్యాసం గురించి మళ్లీ ఆయనతో ఇలా అన్నాను, ”మీరు ఆయన్ని చాలా ఎక్కువగా పొగిడారు.”
”అదేం కాదు! ఆయన స్త్రీకోసం ఈ ప్రయత్నం చేస్తున్నందుకు నాకు ఆనందంగా ఉంది, అందుకే రాశాను. నువ్వే చెప్పు, స్త్రీలమీద ఏ లీడర్‌కైనా, మేధావికైనా ఇంతకుముందు జాలి కలిగిందా?”
”మనువు రాశాడు కదా?”
”రాస్తే ఏమవుతుంది? ఈనాటి చట్టాలు ఈ కాలానికే పరిమితం. గవర్నమెంటుకేమీ పట్టలేదే?”
”అయితే చట్టం చేస్తే మాత్రం ఏమైనా జరుగుతుందని ఏమిటి హామీ?”
”నువ్వు చెప్పేది తప్పు. చట్టం చేతిలో లాఠీ చాలా బలమైనది. దాని ముందు అందరూ తల వంచాల్సిందే. చట్టమంటూ వస్తే ఒప్పుకోవటం, ఒప్పుకోకపోవటం అనే ప్రశ్నే ఉండదు. ప్రస్తుతం ఈ బిల్లు పాసైతే చాలా మంచి జరుగుతుంది. మతానికి ఏ విషయంలోనైనా అధికారం ఇస్తే, ఆ విషయం ఇంక శవంగా మారినట్టే! అది ఉన్నా, లేకపోయినా ఒకటే.”
”ప్రపంచంలో ఉండే మగాళ్లందరూ చెడ్డవాళ్లేనా?”
”అవును, అలాటివాళ్లని బాగు చేసేందుకే ఇలాటివి అవసరం. ఇంకా గొడవ చేస్తూనే ఉన్నారు. ఈ పోప్‌ అనుయాయుల నోళ్లు మూయించి దాన్ని పాసు చేయించి నప్పటిమాట కదా!”
”కానీ మీవరకూ మీరు దాన్ని పాసు చేసేశారు!”
”అసలు అందరికన్నా ఎక్కువ అబి నందనలు మీకే అందాలి!”
”మనుస్మృతిలో ఏనాడో రాశాడాయన.”
”అది పాత సంగతి. దాన్నొక ధార్మిక గ్రంథంగా స్వీకరించినా, పాటించేవాళ్లు లేరు!”
”అయినా అందరూ మీరన్నంత చెడ్డవాళ్లు కాదులెండి!”
”ఒకవేళ అయితే ఏం చేస్తావు?”
”మీ నాన్న ఏం వదిలి వెళ్లారు? మీకు సొంత తల్లి కూడా లేదు, సవతి తల్లి పెంచింది. ఆవిడ ఎంత అధికారం చెలాయించేదో మర్చిపోయారా?”
”నా సంగతి వదిలెయ్‌. నీ పిల్లల్నే చూడు. నీ పెత్తనం వాళ్ల మంచికోసమే అయినప్పటికీ, వాళ్లు నీ మాట వినిపించుకోరు. నాకు వాళ్లని చూస్తే ఒళ్లు మండిపోతుంది. నీకెన్నోసార్లు చెప్పాను, నీ మాట వాళ్లు విననప్పుడు, ఎందుకలా అధికారం చెలాయిస్తావు? ఎంత ప్రేమగా పెంచుతున్నామో వాళ్లకి తెలుసు. తల్లులు అలాటి పిల్లలమీద ఆధారపడాల్సి రావటం ఎంత ఘోరం? నీకు గుర్తుండే ఉంటుంది, ‘కొడుకులున్న వితంతువు’ అనే ఒక కథ రాశాను. అది కల్పన కాదు. వాస్తవ సంఘటనే. దాన్ని మళ్లీ ఒకసారి చదువు. లేక చదివే ఉంటావేమోలే!”
”పోనిద్దురూ! అయినా నా భర్త మీరా, నా పిల్లలా?” అన్నాను.
”సరే, అయితే నా ఫీజిలా పారెయ్యి. నీకెన్ని విషయాలు చెప్పాను! రెండు తమలపాకుల బీడాలిలా అందించు!” అన్నారు నవ్వుతూ.
అలా పన్నెండు దాటేదాకా కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నాం ఇద్దరం.
(ఇంకా ఉంది)

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.